fishing community
-
గుట్టుచప్పుడు కాకుండా..
సూర్యపేట్: మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ పథకాన్ని చేపట్టింది. కానీ ఈ పథకం అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ల చిత్తశుద్ధిలోపంతో అభాసుపాలవుతోంది. వివిధ కారణాలు చూపుతూ ఇంతకాలం చేప పిల్లలు పోయనేలేదు. అదునుదాటిన తర్వాత ఇప్పుడు అధికారులు ఎన్నికల బిజీలో ఉండగా కాంట్రాక్టర్లు గుట్టుచప్పుడు కాకుండా లెక్కాపత్రంలేకుండా నాసిరకం, చనిపోయిన చేప పిల్లలు పోస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లక్ష్యం 3.50 కోట్ల చేప పిల్లలు జిల్లాలో 1340 నీటి వనరులు (చెరువులు, కుంటలు) ఉన్నాయి. 134 మత్స్య పారిశ్రామిక సంఘాలు, 3 మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాలు, 5 మత్స్య పారిశ్రామిక మార్కెటింగ్ సహకార సంఘాలు ఉండగా.. వీటిలో 15,736 మంది సభ్యులుగా ఉన్నారు. అయితే 2023వ సంవత్సరంలో జిల్లాలోని అన్ని నీటి వనరుల్లో కలిపి దాదాపు 3.50 కోట్ల చేపపిల్లలను వదలాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వాస్తవానికి ఆగస్టులోనే చేప పిల్లలను పోయాల్సి ఉంది. కానీ జూన్ 17న టెండర్ల ప్రక్రియ మొదలు కాగా మత్స్యశాఖ జిల్లా అధికారుల తీరుతో మూడు నెలల పాటు సాగింది. చివరకు సెప్టెంబర్ రెండోవారంలో టెండర్ల ప్రక్రియ ముగిసిందని, ఇద్దరు కాంట్రాక్టర్లు చేపపిల్లల పంపిణీకి ముందుకొచ్చినట్లు తెలిపి వారంలోనే పంపిణీని ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఇది గడిచి నెలరోజులు దాటింది. నాటినుంచి జిల్లాలో చేపపిల్లల పంపిణీ ఉసెత్తకుండా జిల్లా మత్స్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించినట్లు ముదిరాజ్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సమయం కావడంతో అధికారుల పర్యవేక్షణ ఉండదని, ఇష్టానుసారంగా చేపపిల్లలను చెరువుల్లోకి వదిలి సొమ్ము చేసుకోవచ్చన్న ఆలోచనతో కాంట్రాక్టర్లు ఉన్నట్లు మత్స్యకారులు అంటున్నారు. నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్నె, మఠంపల్లి మండలం యాతవాకిళ్లలో కొద్దిరోజుల క్రితం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆయా చోట్ల లెక్కాపత్రం లేకుండా చేప పిల్లలను వదిలారు. పులిచింతల ప్రాజెక్టులోనూ చేప పిల్లలను వదిలి పథకానికి శ్రీకారం చుట్టారు ఆ తర్వాత ఎక్కడా చేప పిల్లలు వదిలిన దాఖలాలు లేవు. వివరణ కోసం జిల్లా మత్స్యశాఖ అధికారికి ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. మండలంలో రెండురోజులుగా చేపపిల్లలను గుట్టుచప్పుడు కాకుండా చెరువుల్లోకి వదులుతున్నట్లు తెలుస్తోంది. మండలంలో 13.80 లక్షల చేపపిల్లలను వదలాల్సి ఉంది. నెమ్మికల్ చౌడచెరువులో 1.02లక్షల చేప పిల్లలకు గాను కాంట్రాక్లర్లు ఈనెల 17న 7వేలు మాత్రమే పోసినట్లు స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. వీటిలోనూ సగం వరకు మృతిచెంది ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై గ్రామ మత్స్యసొసైటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ.. చేప పిల్లల పంపిణీ పథకం అమలు తీరుకు నిదర్శనం. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కయారు తెలంగాణ ప్రభుత్వం ముదిరాజ్‌లను ఆదుకునేందుకు చేపట్టిన పథకం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. మత్స్య సొసైటీ సభ్యులకు ఎలాంటి లాభం లేకుండా పోతోంది. నెమ్మికల్ చౌడ చెరువులో లెక్కా పత్రం లేకుండా నాసిరకం చేపలను వదిలారు. చాలా పిల్లలు చనిపోయినవే ఉన్నాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ఏటా సకాలంలో పిల్లలను వదలాలి. – గంగరబోయిన శ్రీనివాస్, నెమ్మికల్, సొసైటీ సభ్యుడు -
Srikakulam: జెట్టీలు, ఫిషింగ్ హార్బర్, పోర్టు నిర్మాణంతో సరికొత్త వెలుగులు
అటు నీళ్లు.. ఇటు కన్నీళ్లు.. దశాబ్దాలుగా సిక్కోలు మత్స్యకారుల బతుకు చిత్రమిది. కంటి ముందు అనంతమైన సముద్ర సంపద ఉన్నా పొట్ట చేత పట్టుకుని పారాదీప్ నుంచి వీరావల్ వరకు వలస వెళ్లేవారు. ఉన్న చోట బతుకు లేక, కుటుంబంతో బతకలేక కాసింత అదనపు సంపాదన కోసం అయిన వారందరినీ వదిలి ఎక్కడో అజ్ఞాతవాసం చేసేవారు. పండక్కో పబ్బానికో ఇంటికి వచ్చి కన్నవారిని, కట్టుకున్న వారిని చూసుకునేవారు. పొరపాటున అక్కడేదైనా జరిగితే ఆఖరి చూపు కూడా ఉండదు. జిల్లాలో ఒక్క పోర్టు ఉన్నా, ఒక్క ఫిషింగ్ జెట్టీ నిర్మించి ఉన్నా ఇలాంటి యాతన ఉండేది కాదు. ఇంతకాలానికి సిక్కోలు తీరానికి మణిహారంలా ఓ పోర్టు రాబోతోంది. ఇన్నాళ్లకు గంగపుత్రుల బెంగ తీరేలా జెట్టీలు కట్టబోతున్నారు. ఈ ఆలోచన వెనుక ఉన్న పేరు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కడలి బిడ్డల బతుకులు మార్చేందుకు ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దశాబ్దాలుగా ఉపన్యాసాలు మాత్రమే వింటున్న సిక్కోలు మత్స్యకారులకు ఇప్పుడు పని కనిపిస్తోంది. హామీలు మాత్రమే తెలిసిన గంగపుత్రులకు నాయకుడి పనితనం అర్థమవుతోంది. భావనపాడు పోర్టు, మంచినీళ్ల పేటలో ఫిషింగ్ జెట్టీ, జిల్లాలో ఫిషింగ్ హార్బర్ వంటి ప్రాజెక్టులు ఇన్నాళ్లూ హామీలుగానే ఉండేవి. సీఎం వైఎస్ జగన్ చొరవతో వీటి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఇవి పూర్తయితే మన గంగపుత్రులు వలస వెళ్లి బతకాల్సిన అగత్యం ఇక ఉండదు. జాతీయ స్థాయిలో 40 శాతం విదేశీ మారక ద్రవ్యం మెరైన్ సెక్టార్ నుంచే వస్తోంది. అందులో సిక్కోలు మత్స్యకారుల వాటా ఎక్కువే. కానీ మౌలిక వసతులు లేకపోవడంతో 193 కిలోమీటర్ల తీర ప్రాంతం అభివృద్ధి చెందలేదు. జిల్లాలో 11 మండలాల పరిధిలో 145మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. స్థానికంగా వేటకు అనుకూలత లేక పొట్ట చేత పట్టుకుని వేరే రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఈ పరిస్థితి లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది. జెట్టీలు, ఫిషింగ్ హార్బర్, పోర్టు నిర్మాణంతో మత్స్యకారుల బతుకుల్లో సరికొత్త వెలుగులు తీసుకురావాలని భావిస్తోంది. పోర్టుకు ఫుల్ సపోర్టు జిల్లా ప్రజల దశాబ్దాల కల భావనపాడు పోర్టు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. పోర్టుకు అవసరమైన భూములను మూలపేట గ్రామంలో ఎకరాకు రూ. 25లక్షలు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. వాటి ద్వారా నిర్వాసితులకు ప్రత్యేకంగా పునరావాస కాలనీ కోసం కె.నౌపడలో ఎకరా రూ.26లక్షలు వెచ్చించి అవసరమైన భూమిని కొనుగోలు చేసి సిద్ధం చేసింది. మొత్తంగా భావనపాడు పోర్టు కోసం 675.60ఎకరాలను సేకరించింది. ఇందులో ప్రైవేటు భూములు 433.71ఎకరాలు కాగా, ప్రభుత్వ భూమి, కోస్టల్ తీరం కలిపి 241.89ఎకరాలు ఉన్నాయి. రూ.3200కోట్లతో నిర్మాణం చేపట్టబోతున్న భావనపాడుకు త్వరలోనే శంకుస్థాపన చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. తూర్పు తీరంలో ఉత్తరాంధ్రలో ప్రస్తుతం విశాఖపట్టణం పోర్టు ఒక్కటి మాత్రమే జల మార్గంలో వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా ఉంది. టెక్కలిలో ప్రపంచ ప్రఖ్యాత నీలి గ్రానైట్ తదితర ఖనిజాలు లభ్యమవుతున్నాయి. ఈ గ్రానైట్‌ను అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేసేందుకు భావనపాడు పోర్టు ఉపయోగపడుతుంది. అదే విధంగా జిల్లాలో విస్తారమైన 193 కిలోమీటర్ల తీర ప్రాంతంలో సరాసరి లక్షా 95వేల మెట్రిక్ టన్నుల మత్స్య సంపద లభిస్తోంది. ఈ విధంగా ఒకవైపు మత్స్య సంపదకు మంచి మార్కెట్ కల్పించేందుకు పోర్టు ఉపయోగపడుతుంది. ఉక్కు తయారీ కంపెనీలకు కావాల్సిన బొగ్గు, ముడి ఇనుము ఎగుమతి, దిగుమతులకు, మత్స్య ఎగుమతులకు భావనపాడు ఓడరేవు వినియోగమవుతోంది. అడుగడుగునా అడ్డంకులు.. భావనపాడు పోర్టుకు మూలపేట, విష్ణుచక్రం గ్రామస్తులు అనుకూలంగా ఉన్నారు. భూ సర్వేకు, ఇళ్ల కొలతలన్నీ గ్రామస్తుల అభిప్రాయం మేరకే జరిగాయి. పోర్టుకు అందరు అనుకూలమని చెప్పినప్పటికీ అచ్చెన్నాయుడు డైరెక్షన్లో కొందరు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. జిల్లాకు మేలు జరిగి, అభివృద్ధికి దోహదపడే భావనపాడు పోర్టు పూర్తయితే తమకెక్కడ పుట్టగతులుండవని కుట్రపూరితంగా వ్యవహరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వారి కుట్రలను చేధించి, పన్నాగాలను తిప్పికొట్టి భూసేకరణ పూర్తి చేసింది. మంచినీళ్లపేట జెట్టీకి శ్రీకారం.. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకార సమస్యలతో పాటు వలసలపై ప్రత్యేక దృష్టిసారించారు. అందులో భాగంగా స్థానికంగా వనరులు, ఉపాధి పరిస్థితులు సమకూర్చాలని ప్రణాళిక రూపొందించారు. దానిలో భాగంగానే వజ్రపుకొత్తూరు మండలంలోని మంచినీళ్లపేటలో రూ.11.95కోట్లతో జెట్టీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఫిషింగ్ హార్బర్లు కూడా నిర్మిస్తుండగా.. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో కూడా రూ. 365 కోట్లతో హార్బర్ నిర్మించనున్నారు. దీని కోసం 42 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. మరికొంత భూమిని కూడా సేకరిస్తోంది. త్వరలోనే దీనికి కూడా శంకుస్థాపన చేయనుంది. జరిగిన మేలు.. 2018 నవంబర్ 27న పాకిస్తాన్ భద్రతా దళాలకు వీరావల్‌లో సముద్ర వేటలో ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారులు పట్టుబడ్డారు. వీరు 13 నెలలు పాకిస్తాన్ కరాచీ జైలులో గడిపారు. పాక్ జైల్లో ఉన్న 20మంది మత్స్యకారుల విడుదల కోసం గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక మార్లు కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జై శంకర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. ఈ మంతనాలు ఫలించి 2020 జనవరి 6న 20మంది విడుదలయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం కేంద్రం లాక్డౌన్ అమలు చేసినప్పుడు జిల్లాకు చెందిన మత్స్యకారులు గుజరాత్లో చిక్కుకున్నారు. రూ.3కోట్లు ఖర్చు పెట్టి జిల్లాకు చెందిన 3064 మంది మత్స్యకారులను 46 బస్సుల ద్వారా తీసుకొచ్చారు. (క్లిక్ చేయండి: కన్నీటి ఉద్దానంపై పన్నీటి జల్లు..) -
నీటి వనరులకు.. మత్స్యశోభ
►చేప విత్తనాలను సిద్ధం చేస్తున్న యంత్రాంగం ►ఈ ఏడాది1.45 కోట్ల పిల్లలు వేయాలన్నది లక్ష్యం ►దాదాపు 1,200 చెరువులు, కుంటల్లో చేపల పెంపకం ►ఈ నెలాఖరులో మొదలు కానున్న ప్రక్రియ ►మత్స్యకార సొసైటీల్లో కొత్త సభ్యులకు అవకాశమిచ్చే యోచన నీటి వనరులకు మత్స్యశోభ పట్టనుంది. జిల్లాలోని చెరువులు, కుంటల్లో చేపవిత్తనాలు వేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే విత్తనాల సరఫరా కోసం టెండర్లు పూర్తి చేసిన యంత్రాంగం.. ఇక వారి నుంచి అగ్రిమెంట్ కుదుర్చుకునే పనిలో ఉంది. పెద్దమొత్తంలో నీరొచ్చి చేరే చెరువుల వారీగా విత్తనాలను చల్లేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గతం కంటే ఘనంగా ఈసారి మత్స్య సంపదను సృష్టించి.. మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి పరిచేలా సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా కోటిన్నర చేప పిల్లలను వదలాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రంగారెడ్డి జిల్లా: ఈ సీజన్లో 1.45 కోట్ల చేప పిల్లల విత్తనాలను జిల్లా చెరువుల్లో వేయాలని మత్స్యశాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. విత్తనాలన్నింటినీ ఆ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగానే సమకూర్చనున్నారు. ఇందుకు మత్స్యకార సంఘాల్లోని సభ్యులు ఒక్క పైసా చెల్లించనక్కర్లేదు. విత్తనాలను చెరువుల్లోకి విజయవంతంగా వదిలేందుకు నెల రోజుల నుంచి అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని 1,200 చెరువుల్లో విత్తనాలను వదలాలని యోచిస్తున్నారు. ఇందులో 114 చెరువులు మత్స్యశాఖ పరిధిలోవి. కొన్ని రోజుల కిందటి వరకు వర్షాలు బాగా కురిసినప్పటికీ.. ఆశించిన స్థాయిలో చెరువులు, కుంటల్లోకి నీటి వరద వచ్చి చేరలేదు. కొన్ని మాత్రమే జలకళ సంతరించుకున్నాయి. త్వరలో వర్షాలు బాగా కురవచ్చని అధికార యంత్రాంగం ఆశాభావంతో ఉంది. పెద్ద మొత్తంలో నీరు చేరుకున్న చెరువుల్లో విత్తనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం 6 నెలలపాటు నీళ్లు నిల్వ ఉంటేనే చేపల సైజు గణనీయంగా పెరుగుతుంది. అంతకన్నా ముందే నీళ్లు తగ్గుముఖం పడితే.. దీని ప్రభావం చేపల ఎదుగుదలపై పడుతుందని అధికారులు చెబుతున్నారు. తద్వారా దిగుబడి క్షీణించడంతో.. పెద్దగా ప్రయోజనం ఉండదు. తప్పకుండా 6 నెలలపాటు నీళ్లు నిల్వ ఉంటాయని గుర్తించిన చెరువులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంటున్నారు. ఈ జాబితాలోకి వెయ్యికిపైగా చెరువులు చేరతాయని.. వీటిల్లో కనీసం 70 లక్షల విత్తనాలను చల్లుతామన్న విశ్వాసాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అన్ని చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉంటే.. లక్ష్యం మేరకు విత్తనాలను వదులుతామంటున్నారు. అత్యంత పారదర్శకంగా.. గతేడాది చేప విత్తనాల అందజేత ప్రక్రియ అభాసుపాలైంది. యంత్రాంగం చెప్పిన సంఖ్యకు.. నీటి వనరుల్లో వదిలిన విత్తనాలకు సంఖ్యలో చాలా వ్యత్యాసం ఉందని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. పైగా విత్తనాలు చల్లడంలోనూ తీవ్ర ఆలస్యం చోటుచేసుకుంది. అక్టోబర్ నెల వరకు ఆ తంతు కొనసాగడం.. తీవ్ర విమర్శలకు దారితీసింది. అంతచేసినా.. చెరువుల్లో వేసిన విత్తనాలు 16 లక్షలే. ఈ నేపథ్యంలో ఇటువంటి అపవాదులు, పొరపాట్లు.. ఈ సీజన్లో దరిచేరకుండా మత్స్యశాఖ అత్యంత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. చెరువుల్లో విత్తనాలు వదిలే తంతును పూర్తిగా వీడియో చిత్రీకరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంతేగాక ప్రజాప్రతినిధులు, మత్య్స సంఘాల సభ్యులు, అధికారుల ఎదుట చేపల సంఖ్య, రకం, సైజు తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. నిర్దేశించిన ప్రమాణాల మేరకే విత్తనాలు ఉన్నాయని వీరందరూ సంతృప్తి వ్యక్తం చేస్తేనే.. విత్తనాలను నీటి వనరుల్లో వదులుతారు. ప్రభావవంతంగా, పారదర్శకంగా విత్తనాలు వేసేందుకు అధికారులు తమ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. టెండర్లు పూర్తి.. త్వరలో పంపిణీ చేప విత్తనాలు పంపిణీదారుల కోసం ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. టెండర్లు దక్కించుకున్న వారితో మరో వారం రోజుల్లో అగ్రిమెంటు కుదుర్చుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ కూడా పూర్తికాగానే ఈ నెల మూడో వారంలో విత్తనాల సరఫరా మొదలు కానుంది. చెరువులు, కుంటల్లో 35 నుంచి 40 మిల్లీమీటర్ల సైజులో ఉండే చేప విత్తనాలను వదులుతారు. అలాగే అబ్దుల్లాపూర్‌మెంట్ మండలం అనాజ్‌పూర్‌లోని రిజర్వాయర్‌లోనూ చేపల పెంపకం జరగనుంది. ఇందులో 80 నుంచి 100 మి.మీ సైజు విత్తనాలను చల్లాలని అధికారులు నిర్ణయించారు. కొత్త సభ్యత్వాలకు అవకాశం.. జిల్లాలో మత్స్యకార ప్రాథమిక సంఘాలు 79 ఉండగా.. వీటిలో సుమారు 3,500 మందికి సభ్యత్వాలున్నాయి. అయితే వీరిలో చాలామంది మరణించారని సమాచారం. అలాగే కొందరు వృత్తికి దూరంగా ఉంటున్నారు. ఇటువంటి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించే యోచనలో మత్స్యశాఖ ఉంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి వివరాలు తెప్పించుకునే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. ఇది పూర్తికాగానే కొత్త సభ్యత్వాల కోసం అవకాశం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. -
టీడీపీకి షాక్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : అధికారం అండతో బెదిరించి లబ్ధిపొందుదామనుకున్న టీడీపీకి మత్స్యకార సంఘ నాయకులిచ్చిన తీర్పు చెంప పెట్టు అయింది. రాజకీయాలకు అతీతంగా జరగవలసిన ఎన్నికల్లో తలదూర్చిచిన నే‘తల’కు బొప్పికట్టింది. జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో తమ మద్దతుదారులను గెలిపించుకోవాలని చివరి నిమిషం వరకు ఆ పార్టీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. పూర్తి స్థాయి మెజార్టీ లేకపోయినా కుట్ర పూరితంగా వ్యవహరించి ప్రలోభాలు, బెదిరింపులతో సొసైటీ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను ప్రతీ ఐదేళ్లకు నిర్వహిస్తారు. ఆ మేరకు గత ఏడాది జూన్ 28న నోటిఫికేషన్ విడుదల చేశారు. మత్స్యకార ప్రతినిధులుగా ఉన్న 11మంది డెరైక్టర్లు ఈ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఆ 11మంది తమలో ఇద్దర్ని అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవాలి. షెడ్యూల్లో భాగంగా విజయనగరం రైల్వే స్టేషన్ రోడ్డులో గల మత్స్య అభివృద్ధి కార్యాలయంలో గత ఏడాది జూలై 8న ఎన్నిక నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. జిల్లా సహకార అసిస్టెంట్ రిజిస్టార్ కె.దక్షిణామూర్తి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అధ్యక్ష పదవికి చింతపల్లికి చెందిన జలపుత్ర సాగర సహకార సంఘం అధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న, గరుగుబిల్లికి చెందిన షిర్డీ స్వదేశీ మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు దాసరి లక్ష్మణ నామినేషన్ వేశారు. అలాగే, ఉపాధ్యక్ష పదవికి విజయనగరానికి చెందిన గంగ పుత్ర స్వదేశీ మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు పైడిశెట్టి మోహన్ నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం జరిగింది. కాకపోతే, అధ్యక్ష పదవికి రెండు నామినేషన్లలో ఏ ఒక్కటీ ఉపసంహరణకు నోచుకోకపోవడంతో ఎన్నిక అనివార్యమయింది. అయితే, టీడీపీ మద్దతుదారునికి తగిన మెజార్టీ లేకపోవడంతో గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు రంగంలోకి దిగి హడావుడి చేశారు. ఈ సందర్భంలో బర్రి చిన్నప్పన్న, ఎమ్మెల్యే మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇదే సందర్భంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు తెరవెనుక ప్రయత్నాలు చేశారు. అప్పటి కలెక్టర్ కాంతిలాల్ దండేపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల అధికారిని గైర్హాజర్ చేయించారు. ఎంత హైడ్రామా నడిపారంటే అప్పటికప్పుడు ఎన్నికల అధికారి అనారోగ్యానికి గుయ్యారని, ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని, తప్పని పరిస్థితుల్లో ఎన్నికను నిలిపేస్తున్నట్టు మత్స్యశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ ప్రకటించారు. కానీ తర్వాత తేదీ ప్రకటించలేదు. దీంతో వైఎస్సార్సీపీ మద్దతు దారునిగా ఉన్న బర్రి చిన్నప్పన్న, ఆయన అనుచరులు పలు పర్యాయాలు జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌ను కలిసి తక్షణమే ఎన్నిక నిర్వహించాలని కోరారు. కానీ అధికారులు స్పందించలేదు. దీంతో బర్రి చిన్నప్పన్న హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలను నిర్వహించాలని పిటీషన్ చేశారు. దీంతో స్పందించిన హైకోర్టు ఎన్నికలను నిర్వహించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్ 19న మళ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఇద్దరు, ఉపాధ్యక్ష పదవికి ఒకరు నామినేషన్ వేశారు. కానీ పట్టు విడవని టీడీపీ నాయకులు ప్రతిష్టగా తీసుకుని సభ్యుల్ని తీవ్ర ప్రలోభాలకు గురి చేశారు. తమ అనుకూల అధ్యక్ష అభ్యర్థికి మద్దతివ్వాలని బెదిరింపులకు సైతం దిగారు. సభ్యులపైనే కాకుండా నామినేషన్లు వేసిన వారిని ఒత్తిళ్లకు గురి చేయడంతో భరించలేక అభ్యర్థులంతా వ్యూహాత్మకంగా నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో మళ్లీ ఎన్నిక నిలిచిపోయింది. తాజాగా సోమవారం ముచ్చటగా మూడోసారి ఎన్నిక చేపట్టారు. ఈ సారి విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత, జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ రంగంలోకి దిగారు. హైడ్రామా నడిచింది. ఎలాగైనా జిల్లా మత్స్యకార సహకార సంఘ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను తమ పార్టీ నేతలకే దక్కాలని తీవ్రంగా ప్రయత్నించారు. వీరి ఎత్తుగడలన్నీ గమనించిన మెజార్టీ సభ్యులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వ్యతిరేకంగా ఉన్నామని కనిపిస్తే ఇబ్బందులు పెడతారని, వాళ్లు చెప్పినట్టే వ్యవహరిస్తే ఏ ఇబ్బందీ ఉండదన్న ఆలోచనకొచ్చి రాజీ ఫార్మలాతో ముందుకెళ్లారు. ఆ పార్టీ నేతలు చెప్పినట్టే అధ్యక్ష పదవికి మురుముళ్లు నాయుడు, ఉపాధ్యక్ష పదవికి దాసరి లక్ష్మణ నామినేషన్ వేశారు. చివరి నిమిషంలో వైఎస్సార్సీపీ మద్దతుదారైన బర్రి చిన్నప్పన్న కూడా నామినేషన్ వేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు అవాక్కయ్యారు. నామినేషన్ ఉపసహరించుకోవాలని బర్రి చిన్నప్పన్నపై తీవ్రంగా ఒత్తిడి చేసినా లొంగలేదు. దీంతో ఓటు హక్కు గల 10మంది సభ్యుల్ని యుద్ధ ప్రాతిపదికన ఎన్నికల ప్రాంగణం నుంచి అశోక్ బంగ్లాకు తీసుకెళ్లి బలవంతంగా టీడీపీ కండువా వేయించేశారు. అయినా ఓటింగ్‌కు వచ్చేసరికి ఆంతరాత్మ ప్రభోదించినట్టు ఓటువేశారు. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికల్లో టీడీపీ పెత్తనమేంటని ఆగ్రహంతో ఉన్న సభ్యులు ఓటు హక్కు ద్వారా దానిని వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ మద్దతుదారుడికి ఆరు ఓట్లు పడగా, టీడీపీ మద్దతుదారుడికి ఐదు ఓట్లు పడ్డాయి. దీంతో ఒక్క ఓటు తేడాతో వైఎస్సార్ సీపీ మద్దతుదారుడు బర్రి చిన్నప్పన్న విజయం సాధించారు. దీంతో టీడీపీ నేతలు షాక్‌కు గురయ్యారు. -
టీడీపీ వారి నుంచి రక్షణ కల్పించండి
శ్రీకాకుళం క్రైం: టీడీపీకి చెందిన మత్స్యకార సంఘ నాయకులు తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, వారి నుంచి తమకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని పెద్దగనగళ్లపేట పంచాయతీ నర్సయ్యపేటకు చెందిన మత్స్యకార సంఘ సభ్యులు ఎస్పీ నవీన్ గులాఠీని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఆయనను కలిసి, వినతిపత్రాన్ని అందజేశారు. సెప్టెం బర్ 2012నుంచి వివాదం ప్రారంభమైందన్నారు. మత్స్యకార సహకార సంఘ ఎన్నికలకు గత అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు మైలపల్లి నర్సింగరావు నామినేషన్ వేశారని..అయితే ఆయనకు నలుగురు సం తానం ఉన్న విషయాన్ని తాము.. అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా నామినేషన్‌ను రద్దు చేశారని వివరించారు. అప్పటి నుంచి తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ వస్తున్నాడని ఎస్పీకి వివరించారు. అలాగే..అతని కుమారుడు నరేష్‌కు సంఘం లో సభ్యత్వం లేకున్నా అధ్యక్షునిగా నియమించారని, ఉపాధ్యక్షునిగా ఉన్న కొమర ఆదినారాయణ పేరును రికార్డుల నుంచి తొలగించి..ఆయన స్థానంలో నరేష్ పేరు ఉంచి అధ్యక్షునిగా ఎంపిక చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లరి చేసి, తప్పుడు కేసులు పెట్టి.. ఇదిలా ఉండగా.. సంఘంలో 90 మంది సభ్యులుండగా వారికి అనుకూలమైన పేర్లను మాత్రమే ఉం చి, మిగిలిన వారి పేర్లను తొలగించారని చివరకు సం ఘంలో 18 మందిని మాత్రమే ఉంచారని వివరిం చారు. పేరు తొలగింపుపై ఆదినారాయణ ప్రశ్నించినా.. అంతా మా ఇష్టం అంటూ.. నర్సింగరావు బెదిరింపులకు పాల్పడుతున్నారని వివరించారు. దీనిపై మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో..వారు ఈనెల 21న విచారణ చేపట్టారని..అక్కడ నర్సింగరావు కేకలు వేస్తూ..అల్లరి చేశాడని ఆరోపించారు. అక్కడితో ఆగకుండా..పోలీసులకు ఫోన్ చేసి..తాము దాడి చేసినట్లు తప్పుడు సమాచారం ఇచ్చాడని, దీంతో పోలీసులు తమపై అక్రమంగా కేసులు బనాయించి..భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై నమోదైన అక్రమ కేసులను ఎత్తివేసి, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీని కలిసిన వారిలో సంఘ సభ్యులు మైలిపల్లి పోలీసు, సీహెచ్ అమ్మోజీరావు, మైలపల్లి తేజేశ్వరి, కె.రేవతి, చీకటి గురుమూర్తి, పి. శ్రీరాములుతో పాటు అధిక సంఖ్యలో మహిళలు ఉన్నారు. -
‘ఏకగ్రీవమే..!
వంగర, న్యూస్‌లైన్: ఉత్కంఠ నెలకొన్నా.. కొట్టిశ మత్స్యకార సొసైటీ ఎన్నిక ప్రశాం తం గా జరిగింది. కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కొసమెరుపు. ఓ వర్గం చివరి నిమిషంలో పోటీ నుంచి విరమించుకుంది.కొట్టిశలోని శ్రీ సీతారామ ఫిషర్మెన్ సొసైటీ ఎన్నిక బుధవారం నిర్వహించారు. ఎన్నికల అధికారి మాచర్ల దివాకరరావు ఆధ్వర్యంలో తొమ్మిది మంది డెరైక్టర్లకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ, ఎన్నిక సాఫీగా సాగిపోయా యి. తొలుత తొమ్మిది స్థానాలకు 18 నామినేషన్లు దాఖలయ్యాయి. వారిలో ఒకరు ఉపసంహరించుకున్నారు. మిగిలిన 17 మందిలో ఒక వర్గానికి చెందిన తొమ్మిది మంది, మరో వర్గానికి చెందిన ఎనిమిది బరిలో నిలిచారు. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఓ వర్గానికి చెందిన ఎనిమిది మంది ఎన్నికల కేంద్రం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో బరిలో నిలిచిన తొమ్మిది మందికి గాను 8 మంది అభ్యర్థులను..చేతులెత్తే పద్ధతిన సభ్యులు ఎన్నుకున్నారు. కాస్త అయోమయం వంగర డెరైక్టర్ ఎన్నిక సమయంలో గ్రామస్తుల మధ్య కొంతసేపు అయోమయం నెలకొంది. తమ పేరేప్రతిపాదించాలంటూ..ఇద్దరు వ్యక్తులు ముందుకు రావడంతో..కాస్త ఇ బ్బందికర పరిస్థితి తలెత్తింది. దీంతో గ్రామస్తులంతా..ఒకే చోట కూర్చుని..అభ్యర్థిని నిర్ణయిం చుకోవడంతో సమస్య పరిష్కార మైంది. అయితే..ఆ డెరైక్టర్ పేరును ఇంకా ఖరారు చేయలేదు. 574 మంది ఓటర్లున్న ఈ సంఘంలో తొలుత ఎన్నికల్లో పాల్గొనేందుకు 329 మంది పేర్లు నమోదు చేసుకోగా..వారిలో 287 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారన్నారు. నూతన డెరైక్టర్లు వీరే... అధ్యక్షునిగా పెనుబోతు దుర్గారావు ఎన్నికయ్యారు. డెరైక్టర్లుగా మురగడాపు పోలిపల్లిదొర(పటువర్థనం), తాటిగూడ రామారావు(కొట్టిశ), పిల్లి సంజీవి(మరువాడ), బొండపల్లి సింహాచలం(గీతనాపల్లి), గుడివాడ సూరందొర(శ్రీహరిపురం) వంటల భూపతిదొర(కొండచాకరాపల్లి), సూరుమల్లి గురువులు(మగ్గూరు)లను ఏకగ్రీవంగా చేతులెత్తే పద్ధతి ద్వారా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది గోపీకృష్ణ, శాంతారావు, నాగరాజు, రాజాం, కొత్తూరు సీఐలు శ్రీనివాస చక్రవర్తి, ఎన్.సాయి, వంగర, సంతకవిటి, జి.సిగడాం ఎస్సైలు అప్పలరాజు, భీమారావు, తులసీరావులతోపాటు వివిధ పోలీస్ స్టేషన్లుకు చెందిన 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఫొటో: 11 ఆర్‌జెయం 61 చేతులెత్తి డెరైక్టర్లు,అధ్యక్షుడిని ఎన్నుకుంటున్న మత్స్యకార సంఘ సభ్యులు ఫొటో: 11 ఆర్‌జెయం 61(ఎ)(బి): పోలింగ్ కేంద్రం వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఫొటో: 11 ఆర్‌జెయం 61(సి) పెనుబోతు దుర్గారావు