టీడీపీ వారి నుంచి రక్షణ కల్పించండి
శ్రీకాకుళం క్రైం: టీడీపీకి చెందిన మత్స్యకార సంఘ నాయకులు తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, వారి నుంచి తమకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని పెద్దగనగళ్లపేట పంచాయతీ నర్సయ్యపేటకు చెందిన మత్స్యకార సంఘ సభ్యులు ఎస్పీ నవీన్ గులాఠీని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఆయనను కలిసి, వినతిపత్రాన్ని అందజేశారు. సెప్టెం బర్ 2012నుంచి వివాదం ప్రారంభమైందన్నారు. మత్స్యకార సహకార సంఘ ఎన్నికలకు గత అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు మైలపల్లి నర్సింగరావు నామినేషన్ వేశారని..అయితే ఆయనకు నలుగురు సం తానం ఉన్న విషయాన్ని తాము.. అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా నామినేషన్‌ను రద్దు చేశారని వివరించారు. అప్పటి నుంచి తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ వస్తున్నాడని ఎస్పీకి వివరించారు. అలాగే..అతని కుమారుడు నరేష్‌కు సంఘం లో సభ్యత్వం లేకున్నా అధ్యక్షునిగా నియమించారని, ఉపాధ్యక్షునిగా ఉన్న కొమర ఆదినారాయణ పేరును రికార్డుల నుంచి తొలగించి..ఆయన స్థానంలో నరేష్ పేరు ఉంచి అధ్యక్షునిగా ఎంపిక చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అల్లరి చేసి, తప్పుడు కేసులు పెట్టి..
ఇదిలా ఉండగా.. సంఘంలో 90 మంది సభ్యులుండగా వారికి అనుకూలమైన పేర్లను మాత్రమే ఉం చి, మిగిలిన వారి పేర్లను తొలగించారని చివరకు సం ఘంలో 18 మందిని మాత్రమే ఉంచారని వివరిం చారు. పేరు తొలగింపుపై ఆదినారాయణ ప్రశ్నించినా.. అంతా మా ఇష్టం అంటూ.. నర్సింగరావు బెదిరింపులకు పాల్పడుతున్నారని వివరించారు. దీనిపై మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో..వారు ఈనెల 21న విచారణ చేపట్టారని..అక్కడ నర్సింగరావు కేకలు వేస్తూ..అల్లరి చేశాడని ఆరోపించారు. అక్కడితో ఆగకుండా..పోలీసులకు ఫోన్ చేసి..తాము దాడి చేసినట్లు తప్పుడు సమాచారం ఇచ్చాడని, దీంతో పోలీసులు తమపై అక్రమంగా కేసులు బనాయించి..భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై నమోదైన అక్రమ కేసులను ఎత్తివేసి, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీని కలిసిన వారిలో సంఘ సభ్యులు మైలిపల్లి పోలీసు, సీహెచ్ అమ్మోజీరావు, మైలపల్లి తేజేశ్వరి, కె.రేవతి, చీకటి గురుమూర్తి, పి. శ్రీరాములుతో పాటు అధిక సంఖ్యలో మహిళలు ఉన్నారు.