నీటి వనరులకు.. మత్స్యశోభ | The mechanism for preparing fish seeds | Sakshi
Sakshi News home page

నీటి వనరులకు.. మత్స్యశోభ

Published Sun, Jul 2 2017 11:46 PM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM

నీటి వనరులకు.. మత్స్యశోభ

నీటి వనరులకు.. మత్స్యశోభ

చేప విత్తనాలను సిద్ధం చేస్తున్న యంత్రాంగం   
ఈ ఏడాది1.45 కోట్ల పిల్లలు వేయాలన్నది లక్ష్యం
దాదాపు 1,200 చెరువులు, కుంటల్లో చేపల పెంపకం  
ఈ నెలాఖరులో మొదలు కానున్న ప్రక్రియ
మత్స్యకార సొసైటీల్లో కొత్త సభ్యులకు అవకాశమిచ్చే యోచన


నీటి వనరులకు మత్స్యశోభ పట్టనుంది. జిల్లాలోని చెరువులు, కుంటల్లో చేపవిత్తనాలు వేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే విత్తనాల సరఫరా కోసం టెండర్లు పూర్తి చేసిన యంత్రాంగం.. ఇక వారి నుంచి అగ్రిమెంట్‌ కుదుర్చుకునే పనిలో ఉంది. పెద్దమొత్తంలో నీరొచ్చి చేరే చెరువుల వారీగా విత్తనాలను చల్లేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గతం కంటే ఘనంగా ఈసారి మత్స్య సంపదను సృష్టించి.. మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి పరిచేలా సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా కోటిన్నర చేప పిల్లలను వదలాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.  

రంగారెడ్డి జిల్లా: ఈ సీజన్‌లో 1.45 కోట్ల చేప పిల్లల విత్తనాలను జిల్లా చెరువుల్లో వేయాలని మత్స్యశాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. విత్తనాలన్నింటినీ ఆ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగానే సమకూర్చనున్నారు. ఇందుకు మత్స్యకార సంఘాల్లోని  సభ్యులు ఒక్క పైసా చెల్లించనక్కర్లేదు. విత్తనాలను చెరువుల్లోకి విజయవంతంగా వదిలేందుకు నెల రోజుల నుంచి అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో
పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని 1,200 చెరువుల్లో  విత్తనాలను వదలాలని యోచిస్తున్నారు. ఇందులో 114 చెరువులు మత్స్యశాఖ పరిధిలోవి. కొన్ని రోజుల కిందటి వరకు వర్షాలు బాగా కురిసినప్పటికీ.. ఆశించిన స్థాయిలో చెరువులు, కుంటల్లోకి నీటి వరద వచ్చి చేరలేదు. కొన్ని మాత్రమే జలకళ సంతరించుకున్నాయి.

త్వరలో వర్షాలు బాగా కురవచ్చని అధికార యంత్రాంగం ఆశాభావంతో ఉంది. పెద్ద మొత్తంలో నీరు చేరుకున్న చెరువుల్లో విత్తనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం 6 నెలలపాటు నీళ్లు నిల్వ ఉంటేనే చేపల సైజు గణనీయంగా పెరుగుతుంది. అంతకన్నా ముందే నీళ్లు తగ్గుముఖం పడితే.. దీని ప్రభావం చేపల ఎదుగుదలపై పడుతుందని అధికారులు చెబుతున్నారు. తద్వారా దిగుబడి క్షీణించడంతో.. పెద్దగా ప్రయోజనం ఉండదు. తప్పకుండా 6 నెలలపాటు నీళ్లు నిల్వ ఉంటాయని గుర్తించిన చెరువులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంటున్నారు. ఈ జాబితాలోకి వెయ్యికిపైగా చెరువులు చేరతాయని.. వీటిల్లో కనీసం 70 లక్షల విత్తనాలను చల్లుతామన్న విశ్వాసాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అన్ని చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉంటే.. లక్ష్యం మేరకు విత్తనాలను వదులుతామంటున్నారు.

అత్యంత పారదర్శకంగా..
గతేడాది చేప విత్తనాల అందజేత ప్రక్రియ అభాసుపాలైంది. యంత్రాంగం చెప్పిన సంఖ్యకు.. నీటి వనరుల్లో వదిలిన విత్తనాలకు సంఖ్యలో చాలా వ్యత్యాసం ఉందని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. పైగా విత్తనాలు చల్లడంలోనూ తీవ్ర ఆలస్యం చోటుచేసుకుంది. అక్టోబర్‌ నెల వరకు ఆ తంతు కొనసాగడం.. తీవ్ర విమర్శలకు దారితీసింది. అంతచేసినా.. చెరువుల్లో వేసిన విత్తనాలు 16 లక్షలే. ఈ నేపథ్యంలో ఇటువంటి అపవాదులు, పొరపాట్లు.. ఈ సీజన్‌లో దరిచేరకుండా మత్స్యశాఖ అత్యంత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. చెరువుల్లో విత్తనాలు వదిలే తంతును పూర్తిగా వీడియో చిత్రీకరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అంతేగాక ప్రజాప్రతినిధులు, మత్య్స సంఘాల సభ్యులు, అధికారుల ఎదుట చేపల సంఖ్య, రకం, సైజు తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. నిర్దేశించిన ప్రమాణాల మేరకే విత్తనాలు ఉన్నాయని వీరందరూ సంతృప్తి వ్యక్తం చేస్తేనే.. విత్తనాలను నీటి వనరుల్లో వదులుతారు. ప్రభావవంతంగా, పారదర్శకంగా విత్తనాలు వేసేందుకు అధికారులు తమ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

టెండర్లు పూర్తి.. త్వరలో పంపిణీ
చేప విత్తనాలు పంపిణీదారుల కోసం ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. టెండర్లు దక్కించుకున్న వారితో మరో వారం రోజుల్లో అగ్రిమెంటు కుదుర్చుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ కూడా పూర్తికాగానే ఈ నెల మూడో వారంలో విత్తనాల సరఫరా మొదలు కానుంది. చెరువులు, కుంటల్లో 35 నుంచి 40 మిల్లీమీటర్ల సైజులో ఉండే చేప విత్తనాలను వదులుతారు. అలాగే అబ్దుల్లాపూర్‌మెంట్‌ మండలం అనాజ్‌పూర్‌లోని రిజర్వాయర్‌లోనూ చేపల పెంపకం జరగనుంది. ఇందులో 80 నుంచి 100 మి.మీ సైజు విత్తనాలను చల్లాలని అధికారులు నిర్ణయించారు.

కొత్త సభ్యత్వాలకు అవకాశం..
జిల్లాలో మత్స్యకార ప్రాథమిక సంఘాలు 79 ఉండగా.. వీటిలో సుమారు 3,500 మందికి సభ్యత్వాలున్నాయి. అయితే వీరిలో చాలామంది మరణించారని సమాచారం. అలాగే కొందరు వృత్తికి దూరంగా ఉంటున్నారు. ఇటువంటి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించే యోచనలో మత్స్యశాఖ ఉంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి వివరాలు తెప్పించుకునే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. ఇది పూర్తికాగానే కొత్త సభ్యత్వాల కోసం అవకాశం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement