నెల్లూరులో రైతులకు 80శాతం సబ్సిడీపై విత్తనాలు ఇస్తున్న అధికారులు
ఈ చిత్రంలోని వ్యక్తి పేరు.. కొప్పూరి జనార్దనరెడ్డి. ఊరు.. వైఎస్సార్ జిల్లా విభరాపురం. ఈయన రబీలో 25 ఎకరాలు శనగ వేశారు. వరదలతో మొత్తం కొట్టుకుపోయింది. రూ.2.50 లక్షల పెట్టుబడి నష్టపోయారు. దీంతో మళ్లీ విత్తనం వేయకూడదనుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు అండగా నిలిచి 80 శాతం సబ్సిడీపై విత్తనం సరఫరా చేశారు. దీంతో క్వింటాల్ విత్తనం రూ.1,380లకే వచ్చింది. 80 శాతం సబ్సిడీపై విత్తనం ఇచ్చిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవని జనార్దనరెడ్డి చెబుతున్నారు. అంతేకాకుండా పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ఆర్బీకే సిబ్బంది వచ్చి భరోసా కల్పించారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
.... ఇలా వర్షాలు, వరదలతో నాటిన విత్తనం కొట్టుకుపోయి.. ఎదిగొస్తున్న పంట మునిగిపోయి కుదేలైన రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 80 శాతం సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేస్తోంది. రైతులు అడిగిందే తడవుగా ఏ విత్తనం కావాలంటే ఆ విత్తనాన్ని సాగు విస్తీర్ణాన్ని బట్టి గరిష్టంగా 5 బస్తాల వరకు అందిస్తోంది. ఇటీవల అకాల వర్షాలు, వరదలతో పంట దెబ్బతిన్న రైతులకు అండగా నిలవాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా అధికారులు విత్తనాన్ని పంపిణీ చేస్తున్నారు. డిమాండ్ ఉన్న బీపీటీ–5204, ఎన్‌ఎల్‌ఆర్–34449, ఆర్‌ఎన్‌ఆర్– 15048, ఎన్‌ఎల్‌ఆర్–33892 రకాలకు సంబంధించి 20 వేల క్వింటాళ్ల వరి విత్తనాలతోపాటు జేజీ–11, కేఏకే–2 రకాలకు చెందిన 2 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాన్ని సిద్ధం చేశారు.
ఆర్బీకేల ద్వారా విత్తన పంపిణీ
ఆర్బీకేల ద్వారా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వరి విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. అలాగే నెల్లూరుతో సహా వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో శనగ విత్తనాన్ని ఇస్తున్నారు. ఆర్బీకేల ద్వారా 1,01,110 క్వింటాళ్ల శనగ, 10,048 క్వింటాళ్ల వరి విత్తనాల కోసం వ్యవసాయ శాఖ ఇండెంట్ పెట్టింది. ఇప్పటివరకు 68,810 క్వింటాళ్ల శనగ విత్తనం కోసం 75,738 మంది, 10,800 క్వింటాళ్ల వరి విత్తనం కోసం 3,500 మంది రైతులు ఆర్బీకేల్లో నమోదు చేసుకున్నారు. వీరిలో 72 వేల మంది రైతులకు 44 వేల క్వింటాళ్ల శనగ, 3 వేల మంది రైతులకు 9,100 క్వింటాళ్ల వరి విత్తనాన్ని సబ్సిడీపై పంపిణీ చేశారు.
– సాక్షి, అమరావతి
ప్రభుత్వం ఊరటనిచ్చింది..
రూ.20 వేల పెట్టుబడితో 20 ఎకరాల్లో జీలకర్ర సన్నాలు నారు వేశా. వరదలతో మొత్తం కొట్టుకుపోయింది. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం 80 శాతం సబ్సిడీపై విత్తన సరఫరా చేయడం ఊరటనిచ్చింది. బస్తా రూ.198 చొప్పున 15 బస్తాల విత్తనం తీసుకున్నా. రెండ్రోజుల్లో మళ్లీ నారు పోస్తా.
– పామల విశ్వనాథ్, చిట్టమూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
విత్తనాలు సిద్ధం
వరదలు, వర్షాలతో దెబ్బతిన్న ప్రతి రైతుకు అండగా నిలవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 80 శాతం సబ్సిడీపై వరి, శనగ విత్తనాలను సరఫరా చేస్తున్నాం. 2.20 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధంగా ఉంచాం. 1.11 లక్షల క్వింటాళ్ల విత్తనం కోసం ఇండెంట్ పెట్టారు. ప్రతి ఒక్కరికీ కావాల్సినంత విత్తనాన్ని సరఫరా చేస్తాం.
– గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ
Comments
Please login to add a commentAdd a comment