seed supply
-
ఏపీలో ఆర్బీకేల ద్వారా విత్తనాల పంపిణీ.. రైతుల్లో ఆనందం
-
రైతన్నకు ‘విత్తన’ దన్ను
ఈ చిత్రంలోని వ్యక్తి పేరు.. కొప్పూరి జనార్దనరెడ్డి. ఊరు.. వైఎస్సార్ జిల్లా విభరాపురం. ఈయన రబీలో 25 ఎకరాలు శనగ వేశారు. వరదలతో మొత్తం కొట్టుకుపోయింది. రూ.2.50 లక్షల పెట్టుబడి నష్టపోయారు. దీంతో మళ్లీ విత్తనం వేయకూడదనుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు అండగా నిలిచి 80 శాతం సబ్సిడీపై విత్తనం సరఫరా చేశారు. దీంతో క్వింటాల్ విత్తనం రూ.1,380లకే వచ్చింది. 80 శాతం సబ్సిడీపై విత్తనం ఇచ్చిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవని జనార్దనరెడ్డి చెబుతున్నారు. అంతేకాకుండా పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ఆర్బీకే సిబ్బంది వచ్చి భరోసా కల్పించారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. .... ఇలా వర్షాలు, వరదలతో నాటిన విత్తనం కొట్టుకుపోయి.. ఎదిగొస్తున్న పంట మునిగిపోయి కుదేలైన రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 80 శాతం సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేస్తోంది. రైతులు అడిగిందే తడవుగా ఏ విత్తనం కావాలంటే ఆ విత్తనాన్ని సాగు విస్తీర్ణాన్ని బట్టి గరిష్టంగా 5 బస్తాల వరకు అందిస్తోంది. ఇటీవల అకాల వర్షాలు, వరదలతో పంట దెబ్బతిన్న రైతులకు అండగా నిలవాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా అధికారులు విత్తనాన్ని పంపిణీ చేస్తున్నారు. డిమాండ్ ఉన్న బీపీటీ–5204, ఎన్‌ఎల్‌ఆర్–34449, ఆర్ఎన్ఆర్– 15048, ఎన్‌ఎల్‌ఆర్–33892 రకాలకు సంబంధించి 20 వేల క్వింటాళ్ల వరి విత్తనాలతోపాటు జేజీ–11, కేఏకే–2 రకాలకు చెందిన 2 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాన్ని సిద్ధం చేశారు. ఆర్బీకేల ద్వారా విత్తన పంపిణీ ఆర్బీకేల ద్వారా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వరి విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. అలాగే నెల్లూరుతో సహా వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో శనగ విత్తనాన్ని ఇస్తున్నారు. ఆర్బీకేల ద్వారా 1,01,110 క్వింటాళ్ల శనగ, 10,048 క్వింటాళ్ల వరి విత్తనాల కోసం వ్యవసాయ శాఖ ఇండెంట్ పెట్టింది. ఇప్పటివరకు 68,810 క్వింటాళ్ల శనగ విత్తనం కోసం 75,738 మంది, 10,800 క్వింటాళ్ల వరి విత్తనం కోసం 3,500 మంది రైతులు ఆర్బీకేల్లో నమోదు చేసుకున్నారు. వీరిలో 72 వేల మంది రైతులకు 44 వేల క్వింటాళ్ల శనగ, 3 వేల మంది రైతులకు 9,100 క్వింటాళ్ల వరి విత్తనాన్ని సబ్సిడీపై పంపిణీ చేశారు. – సాక్షి, అమరావతి ప్రభుత్వం ఊరటనిచ్చింది.. రూ.20 వేల పెట్టుబడితో 20 ఎకరాల్లో జీలకర్ర సన్నాలు నారు వేశా. వరదలతో మొత్తం కొట్టుకుపోయింది. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం 80 శాతం సబ్సిడీపై విత్తన సరఫరా చేయడం ఊరటనిచ్చింది. బస్తా రూ.198 చొప్పున 15 బస్తాల విత్తనం తీసుకున్నా. రెండ్రోజుల్లో మళ్లీ నారు పోస్తా. – పామల విశ్వనాథ్, చిట్టమూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విత్తనాలు సిద్ధం వరదలు, వర్షాలతో దెబ్బతిన్న ప్రతి రైతుకు అండగా నిలవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 80 శాతం సబ్సిడీపై వరి, శనగ విత్తనాలను సరఫరా చేస్తున్నాం. 2.20 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధంగా ఉంచాం. 1.11 లక్షల క్వింటాళ్ల విత్తనం కోసం ఇండెంట్ పెట్టారు. ప్రతి ఒక్కరికీ కావాల్సినంత విత్తనాన్ని సరఫరా చేస్తాం. – గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ -
పంపిణీకి సర్టిఫైడ్ విత్తనాలు రెడీ
సాక్షి, అమరావతి: రానున్న ఖరీఫ్ – 2021 సీజన్లో సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాన్ని వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతులకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్ డీసీఎల్) వ్యవసాయ శాఖతో కలిసి విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17 నుంచి వేరుశనగ, 30వ తేదీ నుంచి మిగిలిన విత్తనాలను పంపిణీ చేయబోతున్నారు. సీజన్ ఏదైనా సరే స్థానిక లభ్యతను బట్టి సాగు విస్తీర్ణంలో 30 శాతం విత్తనాన్ని సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తుంటారు. సకాలంలో సబ్సిడీ విత్తనం దొరక్క దళారీలు, ప్రైవేటు ఏజెన్సీల ఉచ్చులో పడి రైతులు ఏటా వందల వేల కోట్ల రూపాయల పెట్టుబడిని నష్టపోయేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. గత రెండేళ్లుగా సకాలంలో ప్రభుత్వం నాణ్యమైన విత్తనాన్ని అందించడమే కాకుండా ప్రైవేటు ఏజెన్సీలపై నిఘా ఉంచడంతో ‘నాసి రకం’ అనే మాట విన్పించలేదు. ఖరీఫ్ సీజన్లో 92.45 లక్షల ఎకరాలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ప్రధానంగా 41.20 లక్షల ఎకరాల్లో వరి, 18.02 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 7.60 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు చేయనున్నారు. సీజన్ కోసం 7,91,439 క్వింటాళ్ల విత్తనం అవసరం కాగా, లక్ష్యానికి మించి 7,98,125 క్వింటాళ్లు సిద్ధం చేశారు. ఇప్పటికే సిద్ధం చేసిన 85 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట (జనుము, పిల్లిపెసర, జీలుగు) విత్తనాలను 50 శాతం సబ్సిడీపై రైతులకు ఆర్బీకేల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టారు. విత్తనోత్పత్తి, పంపిణీలో మరిన్ని సంస్కరణలు 2021–22 వ్యవసాయ సీజన్ నుంచి విత్తన పంపిణీలో మరిన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సీజన్ ప్రారంభం కాకుండానే కావాల్సిన విత్తనాన్ని సేకరించి ప్రాసెస్ చేసి, పరీక్షించి సర్టిఫై చేసి ఆర్బీకేల ద్వారా పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. గతంలో ఏటా 10 వేల వరకు శాంపిల్స్ పరీక్షించే వారు. కానీ ఈ ఏడాది ర్యాండమ్‌గా 20 వేల నుంచి 25 వేల శాంపిల్స్‌ను విజయవాడ, కర్నూలులోని సంస్థకు చెందిన ల్యాబ్స్‌లో పరీక్షించి సర్టిఫై చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విత్తన సేకరణ, ప్రాసెస్, పంపిణీ కోసం గతేడాది రూ.573 కోట్లు ఖర్చు చేస్తే, ఈ ఏడాది రూ.700 కోట్లు ఖర్చు చేస్తోంది. సబ్సిడీ కింద గతేడాది రూ.236 కోట్లు భరించగా, ఈ ఏడాది రూ.350 కోట్లు భరించేందుకు సిద్ధమైంది. తొలిసారి సొంతంగా వేరుశనగ విత్తనం చరిత్రలో తొలిసారిగా గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద క్వింటాల్‌కు రూ.6,500 చొప్పున చెల్లించి 25 వేల మంది రైతుల నుంచి 4.48 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని సేకరించారు. 40 శాతం సబ్సిడీపై ఈ నెల 17వ తేదీ నుంచి పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 73,449 మంది రైతులు ఆర్బీకేల్లో విత్తనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వరిలో కొత్త వంగడాలు వరి విషయానికి వస్తే డిమాండ్ ఎక్కువగా ఉన్న ఎంటీయూ 7029, 1121, 1064, 1061, బీపీటీ 5204, ఆర్జీఎల్ 2537 రకం విత్తనాలను విత్తనోత్పత్తి ద్వారా పంపిణీకి సిద్ధం చేశారు. అపరాలు 22,743 క్వింటాళ్లు, తృణ ధాన్యాలు 3,310 క్వింటాళ్లు సిద్ధం చేశారు. ఎన్జీ రంగా విశ్వ విద్యాలయం కొత్తగా అభివృద్ధి చేసిన ఎంటీయూ 1224, ఎంటీయూ 1210, రాగి వేగావతి, కదిలి లేపాక్షి (వేరుశనగ) రకాలకు చెందిన ఫౌండేషన్ సీడ్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఎకరాకు రూ.60 వేల ఆదాయం విత్తనోత్పత్తి కోసం 18 ఎకరాల్లో ఎంటీయూ 1121 రకం సాగు చేశా. 255 క్వింటాళ్ల విత్తనాన్ని ఏపీ సీడ్స్‌కు అందించా. విత్తనోత్పత్తి ద్వారా ఎకరాకు రూ.60 వేల ఆదాయం వచ్చింది. బోనస్‌గా క్వింటాల్‌కు రూ.50 వరకు ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. – వాళ్లి సత్యం, కొండకరకం, విజయనగరం జిల్లా గ్రామమంతా వేరుశనగ విత్తనోత్పత్తి వేరుశనగ విత్తనోత్పత్తి కోసం 20 ఎకరాల్లో కే–6 రకం సాగు చేశా. ఏపీ సీడ్స్‌కు 280 క్వింటాళ్ల విత్తనాన్ని అందించా. ఎకరాకు 80 వేల ఆదాయం వచ్చింది. మా గ్రామంలో అందరూ విత్తనోత్పత్తి చేస్తారు. ఈ ఏడాది అందరం వేరుశనగ విత్తనాన్ని సాగు చేశాం. – ఎన్.విష్ణువర్ధన్‌రెడ్డి, పులేటిపల్లి, అనంతపురం జిల్లా సర్టిఫై చేసిన విత్తనాలు సిద్ధం రాష్ట్ర ప్రభుత్వం నాణ్యతకు పెద్దపీట వేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సర్టిఫై చేసిన విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ సౌజన్యంతో ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేస్తున్నాం. మే 17 నుంచి వేరుశనగ, మే 30 నుంచి మిగిలిన విత్తనాలు పంపిణీ ప్రారంభిస్తాం. – డి.శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ -
శనగ, వేరుశనగకు 'ఇక సొంత విత్తనం'
సాక్షి, అమరావతి: శనగ, వేరుశనగ.. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా సాగయ్యే పంటలు. ఈ రెండింటి విత్తనాల తయారీ దశాబ్దాలుగా ప్రైవేటు కంపెనీల చేతుల్లో ఉండడంతో సకాలంలో నాణ్యమైన విత్తనం దొరక్క రైతులు ఏటా తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. రాయితీపై సరఫరా చేసే విత్తనం కోసం ప్రభుత్వం కూడా ఈ కంపెనీలపై ఆధారపడుతోంది. ఆ కంపెనీలు ఎప్పుడు సరఫరా చేస్తే అప్పుడు నాణ్యతతో సంబంధం లేకుండా అవి నిర్దేశించిన ధరలకే కొనుగోలు చేయాల్సి వస్తోంది. కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి ఉండటంతో సాగువేళ నాణ్యత పరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని సందర్భాల్లో నాసిరకం విత్తనాల బారినపడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మొలకశాతం లేక, ఆశించిన దిగుబడులు రాక అప్పులపాలవుతున్నారు. ప్రభుత్వాదేశాలతో సొంత విత్తన తయారీ ద్వారా ఈ పరిస్థితిని అధిగమించాలని వ్యవసాయశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. రాయితీ విత్తనం కోసం.. వేరుశనగ ఖరీఫ్‌లో 7.03 లక్షల హెక్టార్లు, రబీలో 82,605 హెక్టార్లలో సాగవుతుండగా శనగ రబీలో 4.60 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. సాధారణంగా 30 శాతం విస్తీర్ణంలో సాగుకు అవసరమైన విత్తనాన్ని ఏపీ సీడ్స్ సరఫరా చేస్తోంది. గడిచిన ఖరీఫ్‌లో 4.39 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని 40 శాతం సబ్సిడీతో పంపిణీ చేశారు. దీన్లో 1.43 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీవో) నుంచి సేకరించగా మిగిలినది ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేశారు. ప్రస్తుత రబీలో శనగ రైతులకు 1.41 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని ప్రైవేటు కంపెనీల నుంచి సేకరించి 30 శాతం సబ్సిడీతో పంపిణీ చేశారు. వచ్చే రబీలో మరింత విత్తనోత్పత్తి శనగ, వేరుశనగ విత్తనాల కోసం ఇన్నాళ్లు ఇటు రైతులు, రాయితీ మీద ఇచ్చేందుకు అటు ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు కంపెనీలపైనే ఆధారపడాల్సి వచ్చేది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలన్న సంకల్పంతో గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా సొంతంగా విత్తనం అభివృద్ధిపై దృష్టిపెట్టాం. ప్రస్తుత రబీ సీజన్లో తయారవుతున్న విత్తనం రానున్న ఖరీఫ్ సీజన్ అవసరాలను కొంతమేర తీరుస్తుంది. 2022–23 సీజన్ నాటికి రాయితీపై ఇచ్చే మొత్తం వేరుశనగ, శనగ విత్తనాన్ని సొంతంగా సమకూర్చుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. ఇందుకోసం వచ్చే రబీ సీజన్లో విత్తనోత్పత్తి కోసం నిర్దేశించే విస్తీర్ణాన్ని మరింత పెంచబోతున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా.. ప్రతి సీజన్లోను ముందుగా పరీక్షించిన నాణ్యమైన విత్తనాన్ని రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా రైతుకు అందించాలన్న ప్రభుత్వాశయానికి అనుగుణంగా వ్యవసాయశాఖ సొంత విత్తనంపై దృష్టిపెట్టింది. ఇందుకోసం గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద ప్రస్తు్త రబీ సీజన్లో ఎంపికచేసిన గ్రామాల్లో 39 వేల ఎకరాల్లో వేరుశనగ, 4,687 ఎకరాల్లో శనగ విత్తన తయారీకి శ్రీకారం చుట్టారు. 10 హెక్టార్లు ఒక యూనిట్‌గా కనిష్టంగా 50 మంది రైతులు, గరిష్టంగా 150 మంది రైతులను ఎంపికచేసి విత్తన తయారీపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరికి 75 శాతం రాయితీపై మూల విత్తనాన్ని సరఫరా చేశారు. ప్రస్తుతం వేసిన పంట ద్వారా కనీసం 3 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 26 వేల క్వింటాళ్ల శనగ విత్తనం అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. పండించిన రైతుకు గిట్టుబాటు ఈ విత్తనాలను రైతుల నుంచి ఏపీసీడ్స్ ద్వారా సేకరించి వచ్చే ఖరీఫ్ నుంచి రాయితీపై సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ విధానం వల్ల విత్తనోత్పత్తి చేసే రైతుకు గిట్టుబాటు ధర లభించడంతోపాటు రాయితీపై పొందిన రైతుకు నాణ్యమైన విత్తనం లభిస్తుంది. సొంత విత్తన తయారీ వల్ల పోటీ పెరగడం ద్వారా ప్రైవేటు కంపెనీలు కూడా నాణ్యతపై దృష్టిపెడతాయి. గతంతో పోలిస్తే తక్కువ ధరకే ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనం అందుబాటులోకి వస్తుంది. -
వరద ప్రాంతాలకు ఉచితంగా విత్తనాలు
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి సహా వివిధ నదులకు వచ్చిన వరదలతో పంట దెబ్బతిన్న ప్రాంతాలకు పూర్తి సబ్సిడీపై ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేయనుంది. వరదలతో మొత్తం పది జిల్లాలకు నష్టం జరిగినప్పటికీ నాలుగు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 90 మండలాలు, 484 గ్రామాలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ లెక్క తేల్చింది. 1,777 హెక్టార్లలో నారుమళ్లు, 22,022 హెక్టార్లలో వరినాట్లు, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. 13,574 మంది రైతులు నష్టపోయారు. సుమారు 71,253 మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి నష్టం జరిగినట్టు తేలింది. ఫలితంగా రూ.95.23 కోట్ల ఆర్థిక నష్టం జరిగినట్టు అంచనా. వరద తాకిడికి గురైన ప్రాంతాలకు పూర్తి సబ్సిడీపై వరి, మినుము, పెసర, మొక్కజొన్న విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేయనుంది. ప్రస్తుతం వివిధ పంటలకు ఇస్తున్న పరిహారాన్ని 15 శాతం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యాన పంటలకు నష్టం: రూ.228 కోట్లు ఉద్యాన పంటలకు ఈ వరదల్లో భారీగా నష్టం వాటిల్లింది. కృష్ణా నది వరదలతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కంద, పసుపు, అరటి, చేమ, తమలపాకు తోటలతో పాటు పలు కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటి నష్టం రూ.228 కోట్లకు పైగా ఉండవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు మండలాలు కూడా ముంపునకు గురయ్యాయి. -
విత్తన సదస్సుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 26వ తేదీ నుంచి జులై మూడు వరకు హైదరాబాద్‌లో జరుగనున్న అంతర్జాతీయ విత్తన సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఘనంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం దానిపై ఏర్పాటైన కార్యనిర్వాహక కమిటీ తొలి సమావేశం జరిగింది. సాధ్యమైనంత త్వరలో పనులన్నీ పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ప్రతినిధులు హైదరాబాద్‌కు వస్తున్నందున భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తెలంగాణ విత్తన పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఇలాంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సదస్సులో భారతదేశం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు కూడా నిర్వహించాలన్నారు. ఎఫ్ఏవో సహకారంతో సదస్సుకు ముందు జూన్ 24, 25 తేదీలలో ఆఫ్రికా దేశాల విత్తన ప్రతినిధులతో విత్తనోత్పత్తిపై ప్రత్యేక సదస్సు ఉంటుందని, దీనికి తెలంగాణ విత్తన పరిశ్రమ నుంచి కూడా విత్తన ప్రతినిధులు పాల్గొంటున్నారని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. విత్తన ఎగుమతులు, దిగుమతులకు మంచి వేదిక కానున్నదన్నారు. జూన్ 27న విత్తన రైతుల ప్రత్యేక సమావేశానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విత్తనోత్పత్తి, విత్తన నాణ్యతపై రైతులకు మంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని, తెలంగాణ నుంచి 1500మంది విత్తన రైతులు, గుజరాత్, కర్ణాటకలకు చెందిన విత్తన రైతులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా తెలిపారు. అంతర్జాతీయ విత్తన సదస్సు ముఖ్యాంశాలు.. విశేషాలు - వేదిక – హెచ్ఐసీసీ, నోవాటెల్, హైదరాబాద్ - ప్రపంచంలో విత్తన నాణ్యత ఎలా ఉందనే అంశంపై చర్చలు - తెలంగాణ నుంచి మరిన్ని విత్తన ఎగుమతులకు ప్రోత్సాహకం - జూన్ 26 నుంచి 28 వరకు విత్తన ప్రదర్శన - జూన్ 27న తెలంగాణ విత్తన రైతుల ప్రత్యేక సమావేశం - 70 దేశాల నుంచి 800 మంది విత్తన ప్రముఖులు - ఆఫ్రికా ఖండపు దేశాల ప్రతినిధులతో తెలంగాణ విత్తన పరిశ్రమ ప్రతినిధుల ప్రత్యేక సమావేశం - 94 ఏళ్ల ఇస్టా చరిత్రలో తొలిసారిగా ఆసియా ఖండంలో హైదరాబాద్‌లోనే నిర్వహణ - సదస్సుకు నోడల్ ఆఫీసర్‌గా కేశవులు నియామకం. ఎస్ఎల్బీసీపై వివరణ కోరిన సీఎస్ ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో అవాంతరాలు, ఆగిన పనులకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి నీటి పారుదల శాఖ నుంచి వివరణ అడిగారు. ప్రాజెక్టుల పరిధిలో ఇప్పటివరకు జరిగిన పనులు, పెండింగ్ పనులపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కోరారు. టన్నెల్ పనులు ఏడాదిగా ఆగాయని, దీనికి తోడు కరెంట్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితుల్లో ప్రాజెక్టు అనేక అవాంతరాలు ఎదుర్కొంటున్న వైనంపై ‘సాక్షి’ప్రచురించిన కథనాలపై ఆయన స్పందించారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ఇంకా అవసరమైన నిధులు, ఏజెన్సీ ఇదివరకు అడ్వాన్సులు కోరుతూ పెట్టిన అర్జీల అంశాలతో నీటి పారుదల శాఖ నోట్ సిద్ధం చేస్తోంది. పనుల పూర్తికి కనీసం రూ.80కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలని ఏజెన్సీ కోరుతోంది. దీనిపై త్వరలోనే జరిగే కేబినెట్ భేటీలో ఓ నిర్ణయం చేసే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
నీటి వనరులకు.. మత్స్యశోభ
►చేప విత్తనాలను సిద్ధం చేస్తున్న యంత్రాంగం ►ఈ ఏడాది1.45 కోట్ల పిల్లలు వేయాలన్నది లక్ష్యం ►దాదాపు 1,200 చెరువులు, కుంటల్లో చేపల పెంపకం ►ఈ నెలాఖరులో మొదలు కానున్న ప్రక్రియ ►మత్స్యకార సొసైటీల్లో కొత్త సభ్యులకు అవకాశమిచ్చే యోచన నీటి వనరులకు మత్స్యశోభ పట్టనుంది. జిల్లాలోని చెరువులు, కుంటల్లో చేపవిత్తనాలు వేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే విత్తనాల సరఫరా కోసం టెండర్లు పూర్తి చేసిన యంత్రాంగం.. ఇక వారి నుంచి అగ్రిమెంట్ కుదుర్చుకునే పనిలో ఉంది. పెద్దమొత్తంలో నీరొచ్చి చేరే చెరువుల వారీగా విత్తనాలను చల్లేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గతం కంటే ఘనంగా ఈసారి మత్స్య సంపదను సృష్టించి.. మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి పరిచేలా సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా కోటిన్నర చేప పిల్లలను వదలాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రంగారెడ్డి జిల్లా: ఈ సీజన్లో 1.45 కోట్ల చేప పిల్లల విత్తనాలను జిల్లా చెరువుల్లో వేయాలని మత్స్యశాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. విత్తనాలన్నింటినీ ఆ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగానే సమకూర్చనున్నారు. ఇందుకు మత్స్యకార సంఘాల్లోని సభ్యులు ఒక్క పైసా చెల్లించనక్కర్లేదు. విత్తనాలను చెరువుల్లోకి విజయవంతంగా వదిలేందుకు నెల రోజుల నుంచి అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని 1,200 చెరువుల్లో విత్తనాలను వదలాలని యోచిస్తున్నారు. ఇందులో 114 చెరువులు మత్స్యశాఖ పరిధిలోవి. కొన్ని రోజుల కిందటి వరకు వర్షాలు బాగా కురిసినప్పటికీ.. ఆశించిన స్థాయిలో చెరువులు, కుంటల్లోకి నీటి వరద వచ్చి చేరలేదు. కొన్ని మాత్రమే జలకళ సంతరించుకున్నాయి. త్వరలో వర్షాలు బాగా కురవచ్చని అధికార యంత్రాంగం ఆశాభావంతో ఉంది. పెద్ద మొత్తంలో నీరు చేరుకున్న చెరువుల్లో విత్తనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం 6 నెలలపాటు నీళ్లు నిల్వ ఉంటేనే చేపల సైజు గణనీయంగా పెరుగుతుంది. అంతకన్నా ముందే నీళ్లు తగ్గుముఖం పడితే.. దీని ప్రభావం చేపల ఎదుగుదలపై పడుతుందని అధికారులు చెబుతున్నారు. తద్వారా దిగుబడి క్షీణించడంతో.. పెద్దగా ప్రయోజనం ఉండదు. తప్పకుండా 6 నెలలపాటు నీళ్లు నిల్వ ఉంటాయని గుర్తించిన చెరువులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంటున్నారు. ఈ జాబితాలోకి వెయ్యికిపైగా చెరువులు చేరతాయని.. వీటిల్లో కనీసం 70 లక్షల విత్తనాలను చల్లుతామన్న విశ్వాసాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అన్ని చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉంటే.. లక్ష్యం మేరకు విత్తనాలను వదులుతామంటున్నారు. అత్యంత పారదర్శకంగా.. గతేడాది చేప విత్తనాల అందజేత ప్రక్రియ అభాసుపాలైంది. యంత్రాంగం చెప్పిన సంఖ్యకు.. నీటి వనరుల్లో వదిలిన విత్తనాలకు సంఖ్యలో చాలా వ్యత్యాసం ఉందని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. పైగా విత్తనాలు చల్లడంలోనూ తీవ్ర ఆలస్యం చోటుచేసుకుంది. అక్టోబర్ నెల వరకు ఆ తంతు కొనసాగడం.. తీవ్ర విమర్శలకు దారితీసింది. అంతచేసినా.. చెరువుల్లో వేసిన విత్తనాలు 16 లక్షలే. ఈ నేపథ్యంలో ఇటువంటి అపవాదులు, పొరపాట్లు.. ఈ సీజన్లో దరిచేరకుండా మత్స్యశాఖ అత్యంత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. చెరువుల్లో విత్తనాలు వదిలే తంతును పూర్తిగా వీడియో చిత్రీకరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంతేగాక ప్రజాప్రతినిధులు, మత్య్స సంఘాల సభ్యులు, అధికారుల ఎదుట చేపల సంఖ్య, రకం, సైజు తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. నిర్దేశించిన ప్రమాణాల మేరకే విత్తనాలు ఉన్నాయని వీరందరూ సంతృప్తి వ్యక్తం చేస్తేనే.. విత్తనాలను నీటి వనరుల్లో వదులుతారు. ప్రభావవంతంగా, పారదర్శకంగా విత్తనాలు వేసేందుకు అధికారులు తమ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. టెండర్లు పూర్తి.. త్వరలో పంపిణీ చేప విత్తనాలు పంపిణీదారుల కోసం ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. టెండర్లు దక్కించుకున్న వారితో మరో వారం రోజుల్లో అగ్రిమెంటు కుదుర్చుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ కూడా పూర్తికాగానే ఈ నెల మూడో వారంలో విత్తనాల సరఫరా మొదలు కానుంది. చెరువులు, కుంటల్లో 35 నుంచి 40 మిల్లీమీటర్ల సైజులో ఉండే చేప విత్తనాలను వదులుతారు. అలాగే అబ్దుల్లాపూర్‌మెంట్ మండలం అనాజ్‌పూర్‌లోని రిజర్వాయర్‌లోనూ చేపల పెంపకం జరగనుంది. ఇందులో 80 నుంచి 100 మి.మీ సైజు విత్తనాలను చల్లాలని అధికారులు నిర్ణయించారు. కొత్త సభ్యత్వాలకు అవకాశం.. జిల్లాలో మత్స్యకార ప్రాథమిక సంఘాలు 79 ఉండగా.. వీటిలో సుమారు 3,500 మందికి సభ్యత్వాలున్నాయి. అయితే వీరిలో చాలామంది మరణించారని సమాచారం. అలాగే కొందరు వృత్తికి దూరంగా ఉంటున్నారు. ఇటువంటి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించే యోచనలో మత్స్యశాఖ ఉంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి వివరాలు తెప్పించుకునే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. ఇది పూర్తికాగానే కొత్త సభ్యత్వాల కోసం అవకాశం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. -
ఖరీఫ్ కళకళలాడాలి
1.08 కోట్ల ఎకరాల్లో సాగు లక్ష్యం - 2017–18 కార్యాచరణ ప్రణాళికలో వ్యవసాయ శాఖ - గతేడాది కంటే రెండున్నర లక్షల ఎకరాలు పెరగనున్న వరి - ఖరీఫ్, రబీ విత్తన సరఫరా లక్ష్యం 10 లక్షల క్వింటాళ్లు - గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమాఖ్యల ఏర్పాటుకు చర్యలు సాక్షి, హైదరాబాద్: గతేడాది కంటే ఖరీఫ్ పంటల విస్తీర్ణాన్ని పెంచాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు 2017–18 వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. వ్యవసాయ ప్రణాళికను ప్రభుత్వ అనుమతి కోసం పంపిం చారు. అక్కడ్నుంచి ఆమోదం రాగానే ప్రకటించనుంది. తాజా వ్యవసాయ ప్రణాళిక ప్రకారం 2017–18 ఖరీఫ్‌లో పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించారు. 2016–17లో ఖరీఫ్‌లో 1.02 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవ్వగా.. 2017–18 ఖరీఫ్‌లో 1.08 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ధారించారు. అంటే గతేడాది కంటే 6 లక్షల ఎకరాల్లో అదనంగా సాగు చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. అందులో వరి 2016–17 ఖరీఫ్‌లో 22.15 లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. ఈసారి ఖరీఫ్‌లో 24.65 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. అదనంగా రెండున్నర లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయించాలని, ఆ మేరకు రైతులను సన్నద్ధం చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. అలాగే 2017–18లో మొత్తం 90.6 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి రానుందని అంచనా వేసింది. గతేడాది అధిక వర్షాలు, మిషన్ కాకతీయతో చెరువులు నిండిపోవడం వంటి కారణాలతో భూగర్భ జలాలు పెరిగాయి. ఈసారి వర్షాలు అధికంగా కురుస్తాయన్న వాతావరణ శాఖ ముందస్తు అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరి సాగు విస్తీర్ణాన్ని ఏకంగా రెండున్నర లక్షల ఎకరాలకు పెం చారు. ఇక రబీ పంటల సాగు విస్తీర్ణాన్ని కూడా పెంచాలని నిర్ణయించారు. 2016–17లో రబీ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 30 లక్షల ఎకరాలు కాగా.. 2017–18 రబీలో 33.75 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రచారం కారణంగా గతేడాది పత్తి సాగు విస్తీర్ణం సాధారణం కంటే గణనీయంగా తగ్గింది. అయితే మార్కెట్లో పత్తికి భారీగా ధర పలికింది. దీంతో రైతులు అనేకమంది ఈసారి పత్తి వైపు మరలుతారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. దీంతో పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పడిపోతుందని భావిస్తున్నారు. 10 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ఈ ఏడాది ఖరీఫ్, రబీలకు 10 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యం గా నిర్దేశించుకుంది. అందులో ఖరీఫ్‌లో 6 లక్షల క్వింటాళ్లు, రబీలో 4 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయనున్నారు. 2016–17లో రెండు సీజన్లకు కలిపి 7.5 లక్షల క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేశారు. ఈసారి అదనంగా రెండున్నర లక్షల క్వింటాళ్ల విత్తనాలు రైతులకు అందజేయనున్నారు. అయితే ఎరువుల వాడకాన్ని ఈసారి కాస్తంత తగ్గించాలని నిర్ణయించారు. 2016–17 ఖరీఫ్‌లో 17.30 లక్షల టన్నులు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే, 2017–18 ఖరీఫ్‌లో 16.20 లక్షల టన్నులే సరఫరా చేయాలని నిర్ణయించారు. గత రబీలో 12.50 లక్షల టన్నుల ఎరువులను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఈసారి రబీలో 12 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఎరువులను గణనీయంగా తగ్గించడం వల్ల రైతులకు సాగు ఖర్చు తగ్గనుంది. దీనివల్ల రైతు ఆదాయం కూడా పెరుగుతుంది. ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఈ ఏడాదే సమాఖ్యల ఏర్పాటు వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు సీజన్లకు పెట్టుబడి ఖర్చులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లబ్ధిదారులను గుర్తించే పనిని ప్రభుత్వం గ్రామ రైతు సంఘాలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు రైతులు తాము పండించిన పంటకు సరైన ధర ఇప్పించే పని కూడా రైతు సంఘాలకే కల్పించారు. అందుకోసం ఈ ఏడాదిలోనే గ్రామ రైతు సంఘాలు, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమాఖ్యలను ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ తన ప్రణాళికలో ప్రస్తావించింది. అందుకు త్వరలో మార్గదర్శకాలు ఖరారు చేసి సమాఖ్యలను ఏర్పాటు చేస్తారు. -
నకిలీ మిరప విత్తన పరిహార బిల్లుకు సీఎం ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతు ఫిర్యాదుల పరిష్కార విధాన (నకిలీ మిరప విత్తన సరఫరాతో పంట నష్టం జరిగినప్పుడు) చట్టం–2016 బిల్లుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. ఈ బిల్లు వచ్చే కేబినెట్ సమావేశంలో ఆమోదానికి రానుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. గతంలోనే ఈ బిల్లును అసెంబ్లీ ముందు ఉంచడానికి ప్రయత్నాలు జరిగినా సాంకేతిక కారణాలతో అది సాధ్యపడలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ప్రైవేటు విత్తన కంపెనీలు మిరప విత్తనాలను డీలర్లకు చేరవేసే పనిలో ఉన్నాయి. ఇలాంటి కీలక సమయంలో నకిలీ విత్తనాలను అడ్డుకునే అధికారం వ్యవసాయశాఖకు ఇవ్వాల్సిన అవసరం దృష్ట్యా దీన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే నకిలీ విత్తనాల బెడద నుంచి రైతులను కాపాడటానికి వీలుకలుగుతుంది. గతేడాది నకిలీ మిరప విత్తనాలతో ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో వేలాది మంది రైతులు నష్టపోయిన సంగతి తెలిసిందే. కానీ తగిన చట్టం లేకపోవడంతో వారికి నష్టపరిహారం ఇప్పించే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే ఈ చట్టం అవసరమైందని అధికారులు చెబుతున్నారు. -
విత్తన సబ్సిడీకి ఆధార్ లింక్
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ విత్తన సరఫరాను ఆధార్‌తో అనుసంధానించా లని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఆన్లైన్లో ఆధార్ నంబర్ నమోదు చేస్తేనే సబ్సిడీ వర్తించేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొం దించినట్లు ఆ శాఖ కమిషనర్ జగన్ మోహన్ తెలిపారు. తద్వారా సబ్సిడీ అక్ర మార్కుల చేతికి వెళ్లకుండా అడ్డుకోగల మని వివరించారు. మండలాల్లోని సబ్సిడీ విత్తన విక్రయ కేంద్రాల్లో రైతులు.. విత్త నాల పరిమాణం, పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు వివరాలు తెలిపి సబ్సిడీ పోను మిగిలిన సొమ్ము చెల్లించాలని, రైతు వివరాలను ఆన్లైన్లో నమోదు చేశాకే విత్తనాలు అందజేస్తారన్నారు. గతంలో ఈ పద్ధతి లేక రైతుల పేరుతో అనేకమంది విత్తనాలను కొనుగోలు చేసి పక్కదారి పట్టించారని, ఆన్‌లైన్‌తో అవినీతికి అవ కాశం ఉండదన్నారు. ఈ ఏడాది వరి, సోయాబీన్, కంది, పెసర తదితర విత్తనా లను సబ్సిడీపై ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా, కొత్త విధానంతో ఆధార్ కార్డున్న రైతులకే విత్తన సబ్సిడీ లభించనుంది.