నకిలీ మిరప విత్తన పరిహార బిల్లుకు సీఎం ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతు ఫిర్యాదుల పరిష్కార విధాన (నకిలీ మిరప విత్తన సరఫరాతో పంట నష్టం జరిగినప్పుడు) చట్టం–2016 బిల్లుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. ఈ బిల్లు వచ్చే కేబినెట్ సమావేశంలో ఆమోదానికి రానుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. గతంలోనే ఈ బిల్లును అసెంబ్లీ ముందు ఉంచడానికి ప్రయత్నాలు జరిగినా సాంకేతిక కారణాలతో అది సాధ్యపడలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ప్రైవేటు విత్తన కంపెనీలు మిరప విత్తనాలను డీలర్లకు చేరవేసే పనిలో ఉన్నాయి.
ఇలాంటి కీలక సమయంలో నకిలీ విత్తనాలను అడ్డుకునే అధికారం వ్యవసాయశాఖకు ఇవ్వాల్సిన అవసరం దృష్ట్యా దీన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే నకిలీ విత్తనాల బెడద నుంచి రైతులను కాపాడటానికి వీలుకలుగుతుంది. గతేడాది నకిలీ మిరప విత్తనాలతో ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో వేలాది మంది రైతులు నష్టపోయిన సంగతి తెలిసిందే. కానీ తగిన చట్టం లేకపోవడంతో వారికి నష్టపరిహారం ఇప్పించే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే ఈ చట్టం అవసరమైందని అధికారులు చెబుతున్నారు.