శనగ, వేరుశనగకు 'ఇక సొంత విత్తనం'  | Peanut Seed For the first time in AP own seed production | Sakshi
Sakshi News home page

శనగ, వేరుశనగకు 'ఇక సొంత విత్తనం' 

Published Mon, Jan 25 2021 4:07 AM | Last Updated on Mon, Jan 25 2021 4:07 AM

Peanut Seed For the first time in AP own seed production - Sakshi

గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద వేరుశనగ, శనగ సాగు విత్తనోత్పత్తికి ఎంపిక చేసిన రైతులకు శిక్షణనిస్తున్న అధికారులు

సాక్షి, అమరావతి: శనగ, వేరుశనగ.. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా సాగయ్యే పంటలు. ఈ రెండింటి విత్తనాల తయారీ దశాబ్దాలుగా ప్రైవేటు కంపెనీల చేతుల్లో ఉండడంతో సకాలంలో నాణ్యమైన విత్తనం దొరక్క రైతులు ఏటా తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. రాయితీపై సరఫరా చేసే విత్తనం కోసం ప్రభుత్వం కూడా ఈ కంపెనీలపై ఆధారపడుతోంది. ఆ కంపెనీలు ఎప్పుడు సరఫరా చేస్తే అప్పుడు నాణ్యతతో సంబంధం లేకుండా అవి నిర్దేశించిన ధరలకే కొనుగోలు చేయాల్సి వస్తోంది. కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి ఉండటంతో సాగువేళ నాణ్యత పరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని సందర్భాల్లో నాసిరకం విత్తనాల బారినపడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మొలకశాతం లేక, ఆశించిన దిగుబడులు రాక అప్పులపాలవుతున్నారు. ప్రభుత్వాదేశాలతో సొంత విత్తన తయారీ ద్వారా ఈ పరిస్థితిని అధిగమించాలని వ్యవసాయశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. 

రాయితీ విత్తనం కోసం..  
వేరుశనగ ఖరీఫ్‌లో 7.03 లక్షల హెక్టార్లు, రబీలో 82,605 హెక్టార్లలో సాగవుతుండగా శనగ రబీలో 4.60 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. సాధారణంగా 30 శాతం విస్తీర్ణంలో సాగుకు అవసరమైన విత్తనాన్ని ఏపీ సీడ్స్‌ సరఫరా చేస్తోంది. గడిచిన ఖరీఫ్‌లో 4.39 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని 40 శాతం సబ్సిడీతో పంపిణీ చేశారు. దీన్లో 1.43 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌పీవో) నుంచి సేకరించగా మిగిలినది ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేశారు. ప్రస్తుత రబీలో శనగ రైతులకు 1.41 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని ప్రైవేటు కంపెనీల నుంచి సేకరించి 30 శాతం సబ్సిడీతో పంపిణీ చేశారు.

వచ్చే రబీలో మరింత విత్తనోత్పత్తి 
శనగ, వేరుశనగ విత్తనాల కోసం ఇన్నాళ్లు ఇటు రైతులు, రాయితీ మీద ఇచ్చేందుకు అటు ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు కంపెనీలపైనే ఆధారపడాల్సి వచ్చేది. ఈ పరిస్థితికి చెక్‌ పెట్టాలన్న సంకల్పంతో గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా సొంతంగా విత్తనం అభివృద్ధిపై దృష్టిపెట్టాం. ప్రస్తుత రబీ సీజన్‌లో తయారవుతున్న విత్తనం రానున్న ఖరీఫ్‌ సీజన్‌ అవసరాలను కొంతమేర తీరుస్తుంది. 2022–23 సీజన్‌ నాటికి రాయితీపై ఇచ్చే మొత్తం వేరుశనగ, శనగ విత్తనాన్ని సొంతంగా సమకూర్చుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. ఇందుకోసం వచ్చే రబీ సీజన్‌లో విత్తనోత్పత్తి కోసం నిర్దేశించే విస్తీర్ణాన్ని మరింత పెంచబోతున్నాం. 
– హెచ్‌.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ  

గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా.. 
ప్రతి సీజన్‌లోను ముందుగా పరీక్షించిన నాణ్యమైన విత్తనాన్ని రైతుభరోసా కేంద్రాల (ఆర్‌బీకేల) ద్వారా రైతుకు అందించాలన్న ప్రభుత్వాశయానికి అనుగుణంగా వ్యవసాయశాఖ సొంత విత్తనంపై దృష్టిపెట్టింది. ఇందుకోసం గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద ప్రస్తు్త రబీ సీజన్‌లో ఎంపికచేసిన గ్రామాల్లో 39 వేల ఎకరాల్లో వేరుశనగ, 4,687 ఎకరాల్లో శనగ విత్తన తయారీకి శ్రీకారం చుట్టారు. 10 హెక్టార్లు ఒక యూనిట్‌గా కనిష్టంగా 50 మంది రైతులు, గరిష్టంగా 150 మంది రైతులను ఎంపికచేసి విత్తన తయారీపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరికి 75 శాతం రాయితీపై మూల విత్తనాన్ని సరఫరా చేశారు. ప్రస్తుతం వేసిన పంట ద్వారా కనీసం 3 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 26 వేల క్వింటాళ్ల శనగ విత్తనం అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. 

పండించిన రైతుకు గిట్టుబాటు 
ఈ విత్తనాలను రైతుల నుంచి ఏపీసీడ్స్‌ ద్వారా సేకరించి వచ్చే ఖరీఫ్‌ నుంచి రాయితీపై సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ విధానం వల్ల విత్తనోత్పత్తి చేసే రైతుకు గిట్టుబాటు ధర లభించడంతోపాటు రాయితీపై పొందిన రైతుకు నాణ్యమైన విత్తనం లభిస్తుంది. సొంత విత్తన తయారీ వల్ల పోటీ పెరగడం ద్వారా ప్రైవేటు కంపెనీలు కూడా నాణ్యతపై దృష్టిపెడతాయి. గతంతో పోలిస్తే తక్కువ ధరకే ఆర్‌బీకేల ద్వారా రైతులకు విత్తనం  అందుబాటులోకి వస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement