కాడి, మేడి సిద్ధం.. ఖరీఫ్‌కు సన్నద్ధం  | YSR Rythu Bharosa assistance before the season | Sakshi
Sakshi News home page

కాడి, మేడి సిద్ధం.. ఖరీఫ్‌కు సన్నద్ధం 

Published Thu, Jun 24 2021 5:16 AM | Last Updated on Thu, Jun 24 2021 5:16 AM

YSR Rythu Bharosa assistance before the season - Sakshi

నేడు ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఖరీఫ్‌ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. తొలకరి పలకరిస్తున్న వేళ.. పుడమితల్లి పులకిస్తుండగా.. కొండంత ఆశతో ఖరీఫ్‌ సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. పొలాలనన్నీ హలాల దున్నేందుకు కాడి, మేడి సిద్ధం చేసుకుంటున్నారు. ఏరువాక పౌర్ణమి రోజు వ్యవసాయ పనిముట్లను శుభ్రం చేసి, ఎడ్లను అలంకరించి పొలం పనులకు శ్రీకారం చుట్టడం రైతులకు ఆనవాయితీగా వస్తోంది. 

సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహానికి తోడు వాతావరణం కాస్త అనుకూలంగా ఉండడంతో రెట్టించిన రైతులు ఉత్సాహంతో సాగుకు సమాయత్తమవుతున్నారు. ఖరీఫ్‌ సాగుకు ముందే వైఎస్సార్‌ రైతుభరోసా కింద అన్నదాతలకు ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించింది. వర్షాకాలానికి ముందే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను రైతుభరోసా కేంద్రాల (ఆర్‌బీకేల) ద్వారా రైతన్నల ముంగిటకు తీసుకెళ్లింది. గతం కంటే మిన్నగా పంటరుణాల మంజూరుకు కార్యాచరణ సిద్ధం చేసింది. 2019 ఖరీఫ్‌లో 90.38 లక్షల ఎకరాల్లోను, 2020లో 90.20 లక్షల ఎకరాల్లోను పంటలు సాగయ్యాయి. ఈ ఖరీఫ్‌లో 94.84 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. గోదావరి, కృష్ణా డెల్టాల్లో నారుమళ్లు పోసేందుకు పనులు చేస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సకాలంలో మంచి వర్షాలు కురుస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది.
 
7.40 లక్షలమందికి 4.21 లక్షల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ 
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి సబ్సిడీ, నాన్‌సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుమందుల్ని కూడా ఆర్‌బీకేల ద్వారా సరఫరా చేస్తున్నారు. సాగుకుముందే 4,78,829 క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు 5,09,762 క్వింటాళ్ల విత్తనాల కోసం 9,35,905 మంది రైతులు ఆర్‌బీకేల్లో నమోదు చేసుకున్నారు. వీరిలో 7,40,885 మందికి రూ.129.88 కోట్ల సబ్సిడీతో 4,21,245 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. తొలిసారిగా గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద 4.48 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని సిద్ధం చేశారు. ఆర్‌బీకేల ద్వారా 4,44,960 మంది రైతులకు రూ.111.09 కోట్ల సబ్సిడీతో 3,19,960 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని సరఫరా చేశారు. ఖరీఫ్‌లో 2.37 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం చేయగా, ఇప్పటివరకు 1,46,976 మందికి రూ.5.89 కోట్ల సబ్సిడీతో 62,184 క్వింటాళ్లు అందజేశారు. 

ఆర్‌బీకేల ద్వారానే నాన్‌సబ్సిడీ విత్తనాలు 
నాన్‌సబ్సిడీ విత్తనాలకు సంబంధించి తొలిసారిగా 45,412 ప్యాకెట్ల మిరప విత్తనం కోసం ఇండెంట్‌ పెట్టగా, ఇప్పటివరకు 23,047 ప్యాకెట్లు పంపిణీ చేశారు. మొక్కజొన్న, పత్తి, వరి విత్తనాలకు సంబంధించి 28,144 ప్యాకెట్ల విత్తనాల కోసం ఇండెంట్‌ పెట్టగా ఇప్పటివరకు 5,936 ప్యాకెట్ల విత్తనాలు సరఫరా చేశారు. మరోపక్క తొలిసారిగా ఆర్‌బీకే స్థాయిలో ఎరువులను కూడా నిల్వచేశారు. 88,930 టన్నుల ఎరువుల కోసం ఇండెంట్‌ పెట్టారు. 70,256 టన్నుల ఎరువుల్ని ఆర్‌బీకేల్లో నిల్వ చేయగా.. 16,477 మంది రైతులు 7,779 టన్నుల్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆర్‌బీకేల్లో 62,477 టన్నుల ఎరువులున్నాయి. మరోవైపు తొలిసారిగా సర్టిఫై చేసిన 900 టన్నుల పురుగుమందులను ఆర్‌బీకేల్లో నిల్వ చేస్తున్నారు. ఖరీఫ్‌లో 8,604 పొలంబడులు నిర్వహిస్తుండగా, తొలిసారిగా రైతు భరోసా–యూనిఫైడ్‌ డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ (ఆర్‌బీ–యూడీపీ) యాప్‌ ద్వారా ఈ–క్రాప్‌ బుకింగ్‌కు శ్రీకారం చుడుతున్నారు. పంటరుణాలు రూ.65,149 కోట్లు, టర్మ్‌ రుణాలు రూ.19,039 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. సన్న, చిన్నకారు రైతులకు ఆర్‌బీకేల వద్ద అద్దెకు సాగుయంత్రాలను సమకూర్చే లక్ష్యంతో తొలివిడతగా ఒక్కొక్కటి రూ.15 లక్షలతో 3,250 సీహెచ్‌సీలతో పాటు రూ.210 కోట్లతో నియోజకవర్గస్థాయిలో నిర్మించిన 162 ఇంటిగ్రేటెడ్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 

ఖరీఫ్‌లో ఎన్నో ప్రయోగాలు 
ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో ఎన్నో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. చరిత్రలో తొలిసారి సర్టిఫై చేసిన సబ్సిడీ, నాన్‌ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుమందులను కూడా ఆర్‌బీకేల ద్వారా డోర్‌ డెలివరీ చేస్తున్నాం. మిరప, మొక్కజొన్న తదితర విత్తనాలను కూడా ఆర్‌బీకేల్లో ఉంచడం వల్ల బ్లాక్‌మార్కెట్‌ను నిరోధించగలిగాం. ఇన్‌పుట్స్‌లో ఏ ఒక్కటి ఎమ్మార్పీకి మించి విక్రయాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. 
– హెచ్‌.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement