సాక్షి, అమరావతి: రానున్న ఖరీఫ్ – 2021 సీజన్‌లో సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాన్ని వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతులకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్ డీసీఎల్) వ్యవసాయ శాఖతో కలిసి విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17 నుంచి వేరుశనగ, 30వ తేదీ నుంచి మిగిలిన విత్తనాలను పంపిణీ చేయబోతున్నారు. సీజన్ ఏదైనా సరే స్థానిక లభ్యతను బట్టి సాగు విస్తీర్ణంలో 30 శాతం విత్తనాన్ని సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తుంటారు. సకాలంలో సబ్సిడీ విత్తనం దొరక్క దళారీలు, ప్రైవేటు ఏజెన్సీల ఉచ్చులో పడి రైతులు ఏటా వందల వేల కోట్ల రూపాయల పెట్టుబడిని నష్టపోయేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. గత రెండేళ్లుగా సకాలంలో ప్రభుత్వం నాణ్యమైన విత్తనాన్ని అందించడమే కాకుండా ప్రైవేటు ఏజెన్సీలపై నిఘా ఉంచడంతో ‘నాసి రకం’ అనే మాట విన్పించలేదు. ఖరీఫ్ సీజన్‌లో 92.45 లక్షల ఎకరాలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ప్రధానంగా 41.20 లక్షల ఎకరాల్లో వరి, 18.02 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 7.60 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు చేయనున్నారు. సీజన్ కోసం 7,91,439 క్వింటాళ్ల విత్తనం అవసరం కాగా, లక్ష్యానికి మించి 7,98,125 క్వింటాళ్లు సిద్ధం చేశారు. ఇప్పటికే సిద్ధం చేసిన 85 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట (జనుము, పిల్లిపెసర, జీలుగు) విత్తనాలను 50 శాతం సబ్సిడీపై రైతులకు ఆర్‌బీకేల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టారు.
విత్తనోత్పత్తి, పంపిణీలో మరిన్ని సంస్కరణలు
2021–22 వ్యవసాయ సీజన్ నుంచి విత్తన పంపిణీలో మరిన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సీజన్ ప్రారంభం కాకుండానే కావాల్సిన విత్తనాన్ని సేకరించి ప్రాసెస్ చేసి, పరీక్షించి సర్టిఫై చేసి ఆర్‌బీకేల ద్వారా పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. గతంలో ఏటా 10 వేల వరకు శాంపిల్స్ పరీక్షించే వారు. కానీ ఈ ఏడాది ర్యాండమ్‌గా 20 వేల నుంచి 25 వేల శాంపిల్స్‌ను విజయవాడ, కర్నూలులోని సంస్థకు చెందిన ల్యాబ్స్‌లో పరీక్షించి సర్టిఫై చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విత్తన సేకరణ, ప్రాసెస్, పంపిణీ కోసం గతేడాది రూ.573 కోట్లు ఖర్చు చేస్తే, ఈ ఏడాది రూ.700 కోట్లు ఖర్చు చేస్తోంది. సబ్సిడీ కింద గతేడాది రూ.236 కోట్లు భరించగా, ఈ ఏడాది రూ.350 కోట్లు భరించేందుకు సిద్ధమైంది.
తొలిసారి సొంతంగా వేరుశనగ విత్తనం
చరిత్రలో తొలిసారిగా గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద క్వింటాల్‌కు రూ.6,500 చొప్పున చెల్లించి 25 వేల మంది రైతుల నుంచి 4.48 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని సేకరించారు. 40 శాతం సబ్సిడీపై ఈ నెల 17వ తేదీ నుంచి పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 73,449 మంది రైతులు ఆర్‌బీకేల్లో విత్తనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
వరిలో కొత్త వంగడాలు
వరి విషయానికి వస్తే డిమాండ్ ఎక్కువగా ఉన్న ఎంటీయూ 7029, 1121, 1064, 1061, బీపీటీ 5204, ఆర్‌జీఎల్ 2537 రకం విత్తనాలను విత్తనోత్పత్తి ద్వారా పంపిణీకి సిద్ధం చేశారు. అపరాలు 22,743 క్వింటాళ్లు, తృణ ధాన్యాలు 3,310 క్వింటాళ్లు సిద్ధం చేశారు. ఎన్‌జీ రంగా విశ్వ విద్యాలయం కొత్తగా అభివృద్ధి చేసిన ఎంటీయూ 1224, ఎంటీయూ 1210, రాగి వేగావతి, కదిలి లేపాక్షి (వేరుశనగ) రకాలకు చెందిన ఫౌండేషన్ సీడ్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు.
ఎకరాకు రూ.60 వేల ఆదాయం
విత్తనోత్పత్తి కోసం 18 ఎకరాల్లో ఎంటీయూ 1121 రకం సాగు చేశా. 255 క్వింటాళ్ల విత్తనాన్ని ఏపీ సీడ్స్‌కు అందించా. విత్తనోత్పత్తి ద్వారా ఎకరాకు రూ.60 వేల ఆదాయం వచ్చింది. బోనస్‌గా క్వింటాల్‌కు రూ.50 వరకు ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది.
– వాళ్లి సత్యం, కొండకరకం, విజయనగరం జిల్లా
గ్రామమంతా వేరుశనగ విత్తనోత్పత్తి
వేరుశనగ విత్తనోత్పత్తి కోసం 20 ఎకరాల్లో కే–6 రకం సాగు చేశా. ఏపీ సీడ్స్‌కు 280 క్వింటాళ్ల విత్తనాన్ని అందించా. ఎకరాకు 80 వేల ఆదాయం వచ్చింది. మా గ్రామంలో అందరూ విత్తనోత్పత్తి చేస్తారు. ఈ ఏడాది అందరం వేరుశనగ విత్తనాన్ని సాగు చేశాం.
– ఎన్.విష్ణువర్ధన్‌రెడ్డి, పులేటిపల్లి, అనంతపురం జిల్లా
సర్టిఫై చేసిన విత్తనాలు సిద్ధం
రాష్ట్ర ప్రభుత్వం నాణ్యతకు పెద్దపీట వేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సర్టిఫై చేసిన విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ సౌజన్యంతో ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేస్తున్నాం. మే 17 నుంచి వేరుశనగ, మే 30 నుంచి మిగిలిన విత్తనాలు పంపిణీ ప్రారంభిస్తాం.
– డి.శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ
Comments
Please login to add a commentAdd a comment