సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్‌లో వివిధ పంటలకు సంబంధించి 7.12 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ఈ నెల 17వ తేదీ నుంచి రైతులకు సరఫరా చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ పనులు, సరుకుల రవాణాకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉన్నందున పూర్తి జాగ్రత్తలతో చేసుకోవాలని సూచించారు. ఖరీఫ్‌కు పూర్తి సన్నద్ధంగా ఉండాలని, రైతులకు ఇచ్చే విత్తనంతో పాటు ప్రతి ఒక్కటీ నాణ్యతగా ఉండాలని, ఇది మనం వారికి ఇచ్చిన హామీ అని స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో ఉపాధి హామీ పథకం కింద జూన్ చివరిలోగా ప్రతి జిల్లాల్లో తప్పనిసరిగా కోటి పని దినాలు పూర్తి చేయాలని ఆదేశించారు. స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు అంశాలపై అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం చేశారు. సీఎం సమీక్ష వివరాలు ఇవీ..
చెక్ చేయండి...
గ్రామాల్లో రైతులకు అండగా ఉండేలా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కలెక్టర్లు, జేసీలు ఆర్బీకేలను ఓన్ చేసుకుని రైతులకు సేవలందించాలి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, స్టాక్ పాయింట్స్ ఒకసారి చెక్ చేసుకోండి.
వ్యవసాయ సలహా కమిటీలు...
ప్రతి జిల్లాలో నీటి పారుదల సలహా బోర్డుల సమావేశాలు నిర్వహించాలి. వ్యవసాయ సలహా కమిటీలు వెంటనే అన్ని చోట్ల ఏర్పాటు కావాలి. పంటల ప్లానింగ్ మొదలు ప్రతి అడుగులో ఈ కమిటీలు రైతులతో కలిసి పని చేయాలి. అవసరమైతే రైతులకు ప్రత్యామ్నాయ పంటలు కూడా ఆ కమిటీలు చూపాలి. రూ.1.13 లక్షల కోట్ల పంట రుణాలు టార్గెట్. అది సాధించాలంటే జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలు జరగాలి. అప్పుడే పంటల రుణాల పంపిణీ పక్కాగా ఉంటుంది.
ప్రతి జిల్లాలో కోటి పనిదినాలు
కోవిడ్ సమయంలో ఉపాధి హామీ పనులు చాలా ముఖ్యం. మనకు ఈ ఏడాది 20 కోట్ల పని దినాలు మంజూరయ్యాయి. వచ్చే నెల చివరిలోగా 16 కోట్ల పని దినాలు పూర్తి చేయాలన్నది మన లక్ష్యం. ఇప్పటి వరకు 4.57 కోట్ల పని దినాల కల్పన మాత్రమే జరిగింది. జూన్ చివరిలోగా ప్రతి జిల్లాలో తప్పనిసరిగా కోటి పని దినాలు పూర్తి చేయాలి.
తొలి విడతలో 15.60 లక్షల ఇళ్లు..
వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఎట్టి పరిస్థితులలోనూ ఇళ్ల నిర్మాణ పనులు జూన్ 1న ప్రారంభం కావాలి. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా తొలి విడతలో 15.60 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. తొలి విడత ఇళ్లలో 14.89 లక్షల ఇళ్లకు సంబంధించి ఇప్పటికే మంజూరు పత్రాలు జారీ చేశాం. మిగిలినవి కోర్టు వివాదాల్లో ఉన్నందున ప్రత్యామ్నాయ నివేదికలను పీఎంఏవైకి పంపించాం. వాటికి సంబంధించి వచ్చే నెలలోగా అనుమతి వచ్చే వీలుంది. ఇళ్ల నిర్మాణాల సన్నాహక పనులను ఈనెల 25వ తేదీలోగా కలెక్టర్లు తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక పురోగతి (ఎకానమీ బూస్టప్) మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అన్ని రంగాలు, వృత్తుల వారికి ఉపాధి దొరుకుతుంది. 8,679 లేఅవుట్లలో నీటి సదుపాయాన్ని డిస్కమ్‌లు, గ్రామీణ నీటి సరఫరా విభాగాలతో సమన్వయం చేసుకుని ఈనెల 31లోగా పూర్తి చేయాలి. ఎక్కడైనా నోడల్ అధికారుల నియామకం జరగకపోతే ఈనెల 15లోగా పూర్తి చేయాలి. నిరాటంకంగా ఇళ్ల నిర్మాణం జరిగేందుకు తగినంత ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలి.
ఇళ్ల స్థలాలు..
ఇళ్ల స్థలాలకు సంబంధించి కొత్తగా 1,19,053 అర్హులైన లబ్ధిదారులను గుర్తించాం. ఇంకా 98,834 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వారిలో కూడా అర్హులను గుర్తించండి. 10,752 మందికి ఇప్పటికే ఉన్న లేఅవుట్లలో, మరో 1,520 మందికి కొత్త లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు ఇచ్చే వీలుంది. ఇక మిగిలిన 1,06,781 మందికి సంబంధించి భూసేకరణ జరగాలి. వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చొరవ చూపండి.
వేగంగా భవన నిర్మాణాలు..
గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, వైఎస్సార్ గ్రామీణ, పట్టణ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాలు, ఏఎంసీయూ, బీఎంసీయూల నిర్మాణాలను, నాడు–నేడు కింద అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణాలను, ఆధునీకరణ పనులను పూర్తి చేయడంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలి.
ఈ నెలలో అందించే సాయం
► మే 13న వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు రూ.7,500 చొప్పున ఖాతాల్లో జమ. ఖరీఫ్‌లో సాగు పెట్టుబడి కింద సాయం.
► మే 25న ఖరీఫ్–2020కి సంబంధించిన రైతులకు క్రాప్ ఇన్సూరెన్సు చెల్లింపు.
► మే 18న వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున సహాయం (చేపలవేట నిషేధ సాయం)
ఆ ఏడు.. చాలా ముఖ్యం
స్పందన కార్యక్రమం ద్వారా సమస్యలు, ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి. లేకపోతే మనం ఆ సమయం నిర్దేశించుకుని ఏం ప్రయోజనం? గత ఏడాది జూన్ 9 నుంచి ఈనెల 10వ తేదీ వరకు స్పందనలో 2,25,43,894 ఫిర్యాదులు, అర్జీలు రాగా 85 శాతం సకాలంలో పరిష్కరించగలిగాం. ఆరోగ్యశ్రీ కార్డులు, బియ్యం కార్డులు, పెన్షన్ కార్డులు. శానిటేషన్, వీధి దీపాలు, తాగు నీటితో పాటు ఇంటి స్థలం.. ఈ ఏడు మనకు చాలా ముఖ్యం.
Comments
Please login to add a commentAdd a comment