అటు నీళ్లు.. ఇటు కన్నీళ్లు.. దశాబ్దాలుగా సిక్కోలు మత్స్యకారుల బతుకు చిత్రమిది. కంటి ముందు అనంతమైన సముద్ర సంపద ఉన్నా పొట్ట చేత పట్టుకుని పారాదీప్ నుంచి వీరావల్ వరకు వలస వెళ్లేవారు. ఉన్న చోట బతుకు లేక, కుటుంబంతో బతకలేక కాసింత అదనపు సంపాదన కోసం అయిన వారందరినీ వదిలి ఎక్కడో అజ్ఞాతవాసం చేసేవారు. పండక్కో పబ్బానికో ఇంటికి వచ్చి కన్నవారిని, కట్టుకున్న వారిని చూసుకునేవారు. పొరపాటున అక్కడేదైనా జరిగితే ఆఖరి చూపు కూడా ఉండదు. జిల్లాలో ఒక్క పోర్టు ఉన్నా, ఒక్క ఫిషింగ్ జెట్టీ నిర్మించి ఉన్నా ఇలాంటి యాతన ఉండేది కాదు. ఇంతకాలానికి సిక్కోలు తీరానికి మణిహారంలా ఓ పోర్టు రాబోతోంది. ఇన్నాళ్లకు గంగపుత్రుల బెంగ తీరేలా జెట్టీలు కట్టబోతున్నారు. ఈ ఆలోచన వెనుక ఉన్న పేరు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. కడలి బిడ్డల బతుకులు మార్చేందుకు ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దశాబ్దాలుగా ఉపన్యాసాలు మాత్రమే వింటున్న సిక్కోలు మత్స్యకారులకు ఇప్పుడు పని కనిపిస్తోంది. హామీలు మాత్రమే తెలిసిన గంగపుత్రులకు నాయకుడి పనితనం అర్థమవుతోంది. భావనపాడు పోర్టు, మంచినీళ్ల పేటలో ఫిషింగ్ జెట్టీ, జిల్లాలో ఫిషింగ్ హార్బర్ వంటి ప్రాజెక్టులు ఇన్నాళ్లూ హామీలుగానే ఉండేవి. సీఎం వైఎస్ జగన్ చొరవతో వీటి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఇవి పూర్తయితే మన గంగపుత్రులు వలస వెళ్లి బతకాల్సిన అగత్యం ఇక ఉండదు.
జాతీయ స్థాయిలో 40 శాతం విదేశీ మారక ద్రవ్యం మెరైన్ సెక్టార్ నుంచే వస్తోంది. అందులో సిక్కోలు మత్స్యకారుల వాటా ఎక్కువే. కానీ మౌలిక వసతులు లేకపోవడంతో 193 కిలోమీటర్ల తీర ప్రాంతం అభివృద్ధి చెందలేదు. జిల్లాలో 11 మండలాల పరిధిలో 145మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. స్థానికంగా వేటకు అనుకూలత లేక పొట్ట చేత పట్టుకుని వేరే రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఈ పరిస్థితి లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది. జెట్టీలు, ఫిషింగ్ హార్బర్, పోర్టు నిర్మాణంతో మత్స్యకారుల బతుకుల్లో సరికొత్త వెలుగులు తీసుకురావాలని భావిస్తోంది.
పోర్టుకు ఫుల్ సపోర్టు
జిల్లా ప్రజల దశాబ్దాల కల భావనపాడు పోర్టు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. పోర్టుకు అవసరమైన భూములను మూలపేట గ్రామంలో ఎకరాకు రూ. 25లక్షలు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. వాటి ద్వారా నిర్వాసితులకు ప్రత్యేకంగా పునరావాస కాలనీ కోసం కె.నౌపడలో ఎకరా రూ.26లక్షలు వెచ్చించి అవసరమైన భూమిని కొనుగోలు చేసి సిద్ధం చేసింది. మొత్తంగా భావనపాడు పోర్టు కోసం 675.60ఎకరాలను సేకరించింది. ఇందులో ప్రైవేటు భూములు 433.71ఎకరాలు కాగా, ప్రభుత్వ భూమి, కోస్టల్ తీరం కలిపి 241.89ఎకరాలు ఉన్నాయి. రూ.3200కోట్లతో నిర్మాణం చేపట్టబోతున్న భావనపాడుకు త్వరలోనే శంకుస్థాపన చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.
తూర్పు తీరంలో ఉత్తరాంధ్రలో ప్రస్తుతం విశాఖపట్టణం పోర్టు ఒక్కటి మాత్రమే జల మార్గంలో వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా ఉంది. టెక్కలిలో ప్రపంచ ప్రఖ్యాత నీలి గ్రానైట్ తదితర ఖనిజాలు లభ్యమవుతున్నాయి. ఈ గ్రానైట్‌ను అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేసేందుకు భావనపాడు పోర్టు ఉపయోగపడుతుంది. అదే విధంగా జిల్లాలో విస్తారమైన 193 కిలోమీటర్ల తీర ప్రాంతంలో సరాసరి లక్షా 95వేల మెట్రిక్ టన్నుల మత్స్య సంపద లభిస్తోంది. ఈ విధంగా ఒకవైపు మత్స్య సంపదకు మంచి మార్కెట్ కల్పించేందుకు పోర్టు ఉపయోగపడుతుంది. ఉక్కు తయారీ కంపెనీలకు కావాల్సిన బొగ్గు, ముడి ఇనుము ఎగుమతి, దిగుమతులకు, మత్స్య ఎగుమతులకు భావనపాడు ఓడరేవు వినియోగమవుతోంది.
అడుగడుగునా అడ్డంకులు..
భావనపాడు పోర్టుకు మూలపేట, విష్ణుచక్రం గ్రామస్తులు అనుకూలంగా ఉన్నారు. భూ సర్వేకు, ఇళ్ల కొలతలన్నీ గ్రామస్తుల అభిప్రాయం మేరకే జరిగాయి. పోర్టుకు అందరు అనుకూలమని చెప్పినప్పటికీ అచ్చెన్నాయుడు డైరెక్షన్‌లో కొందరు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. జిల్లాకు మేలు జరిగి, అభివృద్ధికి దోహదపడే భావనపాడు పోర్టు పూర్తయితే తమకెక్కడ పుట్టగతులుండవని కుట్రపూరితంగా వ్యవహరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వారి కుట్రలను చేధించి, పన్నాగాలను తిప్పికొట్టి భూసేకరణ పూర్తి చేసింది.
మంచినీళ్లపేట జెట్టీకి శ్రీకారం..
అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మత్స్యకార సమస్యలతో పాటు వలసలపై ప్రత్యేక దృష్టిసారించారు. అందులో భాగంగా స్థానికంగా వనరులు, ఉపాధి పరిస్థితులు సమకూర్చాలని ప్రణాళిక రూపొందించారు. దానిలో భాగంగానే వజ్రపుకొత్తూరు మండలంలోని మంచినీళ్లపేటలో రూ.11.95కోట్లతో జెట్టీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఫిషింగ్ హార్బర్లు కూడా నిర్మిస్తుండగా.. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో కూడా రూ. 365 కోట్లతో హార్బర్ నిర్మించనున్నారు. దీని కోసం 42 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. మరికొంత భూమిని కూడా సేకరిస్తోంది. త్వరలోనే దీనికి కూడా శంకుస్థాపన చేయనుంది.
జరిగిన మేలు..
2018 నవంబర్ 27న పాకిస్తాన్ భద్రతా దళాలకు వీరావల్‌లో సముద్ర వేటలో ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారులు పట్టుబడ్డారు. వీరు 13 నెలలు పాకిస్తాన్ కరాచీ జైలులో గడిపారు. పాక్ జైల్లో ఉన్న 20మంది మత్స్యకారుల విడుదల కోసం గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక మార్లు కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జై శంకర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. ఈ మంతనాలు ఫలించి 2020 జనవరి 6న 20మంది విడుదలయ్యారు.
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం కేంద్రం లాక్‌డౌన్ అమలు చేసినప్పుడు జిల్లాకు చెందిన మత్స్యకారులు గుజరాత్‌లో చిక్కుకున్నారు. రూ.3కోట్లు ఖర్చు పెట్టి జిల్లాకు చెందిన 3064 మంది మత్స్యకారులను 46 బస్సుల ద్వారా తీసుకొచ్చారు. (క్లిక్ చేయండి: కన్నీటి ఉద్దానంపై పన్నీటి జల్లు..)
Comments
Please login to add a commentAdd a comment