Bhavanapadu port
-
భావనపాడు పోర్టుకు మూలపేట పోర్టుగా నామకరణం
సాక్షి, విజయవాడ: శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్టుకు మూలపేట పోర్టుగా నామకరణం చేస్తూ రాష్ట్ర పెట్టుబడులు మరియు మౌలిక వసతుల (పోర్టులు) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పోర్టుకు భూసమీకరణ నిమిత్తం జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు సంబంధించిన రైతులతో సమావేశం నిర్వహించినప్పుడు గ్రామస్థులు పోర్టు సంబంధింత భూములన్నీ మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లోనే ఉన్నాయని, పోర్టు ప్రతిపాదిత ప్రాంతంలో భావనపాడు లేనందున పోర్టుకు మూలపేట పోర్టుగా పేరు పెట్టాలని కోరినట్లు జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి విన్నవించారన్నారు. పోర్టు నిర్మాణ ప్రాంతంలోని భూములు, నిర్వాసిత కుటుంబాలన్నీ మూలపేట, విష్ణుచక్రం గ్రామాల పరిధిలో ఉన్నందున గ్రామస్థుల కోరిక మేరకు భావనపాడు పోర్టు పేరును మూలపేట పోర్టుగా మార్చాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. గతంలో భావనపాడు పోర్టుగా నోటిఫై చేసిన ప్రాంతాన్ని ఇకపై మూలపేట పోర్టుగా పరిగణించాలని, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సదరు మూలపేట పోర్టుకు ఏప్రిల్ 19వ తేదీన భూమిపూజ చేయనున్నారని పెట్టుబడులు మరియు మౌలిక వసతుల (పోర్టులు) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ. కరికాల్ వలవన్ తెలిపారు. -
శ్రీకాకుళం జిల్లాలో పోర్టు నిర్మాణంతో మారనున్న ముఖచిత్రం
-
ఆంధ్రప్రదేశ్‌లో సమృద్ధిగా వనరులు
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వనరులు సమృద్ధిగా ఉన్నాయని పరిశ్రమల శాఖ, ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు అధికారులు విదేశీ ప్రతినిధులకు వివరించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో భాగంగా శుక్రవారం మ.3 గంటలు తరువాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్ దేశాల ప్రతినిధులతో ప్రత్యేక సెషన్ నిర్వహించారు. ఇందులో పరిశ్రమలు, మారిటైం బోర్డు అధికారులు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ఇక్కడ వర్క్‌ఫోర్స్, ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ప్రోత్సాహకాలను వారికి విశదీకరించారు. ముఖ్యంగా దేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో ఉందని.. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మూడు పోర్టులను సైతం నిర్మిస్తోందని వివరించారు. అలాగే, నెదర్లాండ్స్‌లో పోర్టుల నిర్మాణాలు, వాటి నిర్వహణకు గల అవకాశాలను ఆ దేశ ప్రతినిధులు ఇక్కడి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌తో పాటు అదాని, ఇతర ప్రైవేటు సంస్థ ప్రతినిధులకు వివరించారు. దీనిపై త్వరలోనే పూర్తిస్థాయిలో సమీక్ష జరిపి వ్యాపార అవకాశాలపై నిర్ణయం తీసుకుంటామని నెదర్లాండ్స్ ప్రతినిధులు తెలిపారు. -
శ్రీకాకుళం: సముద్ర తీరంలో విదేశీ డ్రోన్ జెట్ కలకలం
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని భావనపాడు సముద్ర తీరంలో విదేశీ డ్రోన్‌జెట్ ఒకటి కలకలం సృష్టించింది. కాగా, చేపలవేటకు వెళ్లిన మత్య్సకారులకు నీటిపై తేలియాడుతూ డ్రోన్ జెట్ కనిపించింది. దీంతో, వారు వెంటనే మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మెరైన్ పోలీసులు దీన్ని ఎవరు ప్రయోగించారు?, ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. కాగా, దానిపై ఉన్న అక్షరాలను బట్టి పోలీసులు కోడ్ చేస్తున్నారు. అయితే, ఇది విదేశాలకు చెందినదా?.. లేక స్వదేశంలో తయారైందా? అనే కోణంలో కూడా ఢిల్లీ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మరోవైపు, వాతావరణ శాఖకు చెందిన, అంతరిక్ష పరిశోధనాల్లో ఇలాంటి డ్రోన్ జెట్లను శాస్త్రవేత్తలు వాడుతుంటారని సమాచారం. ఇక, దీన్ని ఎవరి ప్రయోగించారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. డ్రోన్‌పై ఈస్ట్ కోస్ట్ నావల్ అధికారులు కూడా దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే, దీన్ని ఎలాంటి కెమెరాలు లేవు. కానీ.. రేడియో సిగ్నల్స్‌ను పంపే కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు మాత్రం ఉన్నట్టు సమాచారం. -
Srikakulam: జెట్టీలు, ఫిషింగ్ హార్బర్, పోర్టు నిర్మాణంతో సరికొత్త వెలుగులు
అటు నీళ్లు.. ఇటు కన్నీళ్లు.. దశాబ్దాలుగా సిక్కోలు మత్స్యకారుల బతుకు చిత్రమిది. కంటి ముందు అనంతమైన సముద్ర సంపద ఉన్నా పొట్ట చేత పట్టుకుని పారాదీప్ నుంచి వీరావల్ వరకు వలస వెళ్లేవారు. ఉన్న చోట బతుకు లేక, కుటుంబంతో బతకలేక కాసింత అదనపు సంపాదన కోసం అయిన వారందరినీ వదిలి ఎక్కడో అజ్ఞాతవాసం చేసేవారు. పండక్కో పబ్బానికో ఇంటికి వచ్చి కన్నవారిని, కట్టుకున్న వారిని చూసుకునేవారు. పొరపాటున అక్కడేదైనా జరిగితే ఆఖరి చూపు కూడా ఉండదు. జిల్లాలో ఒక్క పోర్టు ఉన్నా, ఒక్క ఫిషింగ్ జెట్టీ నిర్మించి ఉన్నా ఇలాంటి యాతన ఉండేది కాదు. ఇంతకాలానికి సిక్కోలు తీరానికి మణిహారంలా ఓ పోర్టు రాబోతోంది. ఇన్నాళ్లకు గంగపుత్రుల బెంగ తీరేలా జెట్టీలు కట్టబోతున్నారు. ఈ ఆలోచన వెనుక ఉన్న పేరు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కడలి బిడ్డల బతుకులు మార్చేందుకు ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దశాబ్దాలుగా ఉపన్యాసాలు మాత్రమే వింటున్న సిక్కోలు మత్స్యకారులకు ఇప్పుడు పని కనిపిస్తోంది. హామీలు మాత్రమే తెలిసిన గంగపుత్రులకు నాయకుడి పనితనం అర్థమవుతోంది. భావనపాడు పోర్టు, మంచినీళ్ల పేటలో ఫిషింగ్ జెట్టీ, జిల్లాలో ఫిషింగ్ హార్బర్ వంటి ప్రాజెక్టులు ఇన్నాళ్లూ హామీలుగానే ఉండేవి. సీఎం వైఎస్ జగన్ చొరవతో వీటి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఇవి పూర్తయితే మన గంగపుత్రులు వలస వెళ్లి బతకాల్సిన అగత్యం ఇక ఉండదు. జాతీయ స్థాయిలో 40 శాతం విదేశీ మారక ద్రవ్యం మెరైన్ సెక్టార్ నుంచే వస్తోంది. అందులో సిక్కోలు మత్స్యకారుల వాటా ఎక్కువే. కానీ మౌలిక వసతులు లేకపోవడంతో 193 కిలోమీటర్ల తీర ప్రాంతం అభివృద్ధి చెందలేదు. జిల్లాలో 11 మండలాల పరిధిలో 145మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. స్థానికంగా వేటకు అనుకూలత లేక పొట్ట చేత పట్టుకుని వేరే రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఈ పరిస్థితి లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది. జెట్టీలు, ఫిషింగ్ హార్బర్, పోర్టు నిర్మాణంతో మత్స్యకారుల బతుకుల్లో సరికొత్త వెలుగులు తీసుకురావాలని భావిస్తోంది. పోర్టుకు ఫుల్ సపోర్టు జిల్లా ప్రజల దశాబ్దాల కల భావనపాడు పోర్టు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. పోర్టుకు అవసరమైన భూములను మూలపేట గ్రామంలో ఎకరాకు రూ. 25లక్షలు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. వాటి ద్వారా నిర్వాసితులకు ప్రత్యేకంగా పునరావాస కాలనీ కోసం కె.నౌపడలో ఎకరా రూ.26లక్షలు వెచ్చించి అవసరమైన భూమిని కొనుగోలు చేసి సిద్ధం చేసింది. మొత్తంగా భావనపాడు పోర్టు కోసం 675.60ఎకరాలను సేకరించింది. ఇందులో ప్రైవేటు భూములు 433.71ఎకరాలు కాగా, ప్రభుత్వ భూమి, కోస్టల్ తీరం కలిపి 241.89ఎకరాలు ఉన్నాయి. రూ.3200కోట్లతో నిర్మాణం చేపట్టబోతున్న భావనపాడుకు త్వరలోనే శంకుస్థాపన చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. తూర్పు తీరంలో ఉత్తరాంధ్రలో ప్రస్తుతం విశాఖపట్టణం పోర్టు ఒక్కటి మాత్రమే జల మార్గంలో వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా ఉంది. టెక్కలిలో ప్రపంచ ప్రఖ్యాత నీలి గ్రానైట్ తదితర ఖనిజాలు లభ్యమవుతున్నాయి. ఈ గ్రానైట్‌ను అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేసేందుకు భావనపాడు పోర్టు ఉపయోగపడుతుంది. అదే విధంగా జిల్లాలో విస్తారమైన 193 కిలోమీటర్ల తీర ప్రాంతంలో సరాసరి లక్షా 95వేల మెట్రిక్ టన్నుల మత్స్య సంపద లభిస్తోంది. ఈ విధంగా ఒకవైపు మత్స్య సంపదకు మంచి మార్కెట్ కల్పించేందుకు పోర్టు ఉపయోగపడుతుంది. ఉక్కు తయారీ కంపెనీలకు కావాల్సిన బొగ్గు, ముడి ఇనుము ఎగుమతి, దిగుమతులకు, మత్స్య ఎగుమతులకు భావనపాడు ఓడరేవు వినియోగమవుతోంది. అడుగడుగునా అడ్డంకులు.. భావనపాడు పోర్టుకు మూలపేట, విష్ణుచక్రం గ్రామస్తులు అనుకూలంగా ఉన్నారు. భూ సర్వేకు, ఇళ్ల కొలతలన్నీ గ్రామస్తుల అభిప్రాయం మేరకే జరిగాయి. పోర్టుకు అందరు అనుకూలమని చెప్పినప్పటికీ అచ్చెన్నాయుడు డైరెక్షన్లో కొందరు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. జిల్లాకు మేలు జరిగి, అభివృద్ధికి దోహదపడే భావనపాడు పోర్టు పూర్తయితే తమకెక్కడ పుట్టగతులుండవని కుట్రపూరితంగా వ్యవహరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వారి కుట్రలను చేధించి, పన్నాగాలను తిప్పికొట్టి భూసేకరణ పూర్తి చేసింది. మంచినీళ్లపేట జెట్టీకి శ్రీకారం.. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకార సమస్యలతో పాటు వలసలపై ప్రత్యేక దృష్టిసారించారు. అందులో భాగంగా స్థానికంగా వనరులు, ఉపాధి పరిస్థితులు సమకూర్చాలని ప్రణాళిక రూపొందించారు. దానిలో భాగంగానే వజ్రపుకొత్తూరు మండలంలోని మంచినీళ్లపేటలో రూ.11.95కోట్లతో జెట్టీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఫిషింగ్ హార్బర్లు కూడా నిర్మిస్తుండగా.. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో కూడా రూ. 365 కోట్లతో హార్బర్ నిర్మించనున్నారు. దీని కోసం 42 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. మరికొంత భూమిని కూడా సేకరిస్తోంది. త్వరలోనే దీనికి కూడా శంకుస్థాపన చేయనుంది. జరిగిన మేలు.. 2018 నవంబర్ 27న పాకిస్తాన్ భద్రతా దళాలకు వీరావల్‌లో సముద్ర వేటలో ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారులు పట్టుబడ్డారు. వీరు 13 నెలలు పాకిస్తాన్ కరాచీ జైలులో గడిపారు. పాక్ జైల్లో ఉన్న 20మంది మత్స్యకారుల విడుదల కోసం గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక మార్లు కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జై శంకర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. ఈ మంతనాలు ఫలించి 2020 జనవరి 6న 20మంది విడుదలయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం కేంద్రం లాక్డౌన్ అమలు చేసినప్పుడు జిల్లాకు చెందిన మత్స్యకారులు గుజరాత్లో చిక్కుకున్నారు. రూ.3కోట్లు ఖర్చు పెట్టి జిల్లాకు చెందిన 3064 మంది మత్స్యకారులను 46 బస్సుల ద్వారా తీసుకొచ్చారు. (క్లిక్ చేయండి: కన్నీటి ఉద్దానంపై పన్నీటి జల్లు..) -
భావనపాడు కలపై.. అచ్చెన్న కుయుక్తులు!
సాక్షి, శ్రీకాకుళం: జిల్లా అభివృద్ధికి టీడీపీ నేతలు అడ్డంకిగా మారుతున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు డైరెక్షన్లో ప్రగతిని అడ్డుకుంటున్నారు. వారే మరోవైపు అభివృద్ధి జరగడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ మధ్య పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చేందుకు ప్రయత్నిస్తే న్యాయస్థానాలకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వం వాటిన్నింటిని అధిగమించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఇటీవల పరిపాలన వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం ప్రకటిస్తే.. విశాఖ రాజధాని వద్దంటూ తమ రియల్ ఎస్టేట్ భూముల కోసం అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలన్న కుట్రలతో ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తున్నారు. తాజాగా భావనపాడు పోర్టు నిర్మాణం కోసం ప్రభుత్వం సిద్ధమై భూసేకరణ చేస్తుంటే కుట్రలకు దిగుతున్నారు. తమ అనుయాయులను రెచ్చగొట్టి, గలాటా సృష్టించి రాజకీయ ముసుగులో చలి కాచుకుంటున్నారు. పోర్టు వద్దనే నినాదంతో కొందర్ని వెనకుండి నడిపిస్తున్నారు. దశాబ్దాల నాటి కల.. జిల్లా ప్రజల దశాబ్దాల కల భావనపాడు పోర్టు ని ర్మాణానికి అడుగులు పడుతున్నాయి. జిల్లాకు మేలు జరిగే ప్రాజెక్టు ఇది. తూర్పు తీరంలో ఉత్తరాంధ్రలో ప్రస్తుతం విశాఖపట్టణం పోర్టు ఒక్కటి మాత్రమే జల మార్గంలో వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా ఉంది. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా నుంచి ఒడి శా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లకు జల మా ర్గంలో అతి తక్కువ దూరం కలిగిన పోర్టు మరొకటి లేదు. ►టెక్కలి ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నీలి గ్రానైట్ తదితర ఖనిజాలు లభ్యమవుతున్నా యి. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి ఉన్న గ్రానైట్‌కు సంబంధించి 65 గ్రానైట్ క్వారీలు, వందకు పైగా పాలిషింగ్ యూనిట్లు ఇక్కడే ఉన్నాయి. ఈ గ్రానైట్‌ను అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేసేందుకు పోర్టు ఉపయోగపడుతుంది. ►జిల్లాలో విస్తారమైన 193 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. 11 మండలాల పరిధిలో 145 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది చేపల వేట సాగిస్తున్నారు. జాతీయ స్థాయి లో 40 శాతం విదేశీ మారక ద్రవ్యం మెరైన్ సెక్టార్ నుంచే వస్తోంది. అందులో సిక్కోలు మత్స్యకారుల వాటానే ఎక్కువ. శ్రీకాకుళం జిల్లాలో ఒక్క 2020– 21లో లక్షా 95వేల 230 మెట్రిక్ టన్నుల మత్స్య సంపద లభించింది. ఇలాంటి సంపదకు మంచి మార్కెట్ కల్పించేందుకు పోర్టు ఉపయోగపడుతుంది. ►ఉక్కు తయారీ కంపెనీలకు కావాల్సిన బొగ్గు, ముడి ఇనుము ఎగుమతి, దిగుమతులకు, మత్స్య ఎగుమతులకు భావనపాడు ఓడరేవు అనుకూల మని ఇప్పటికే నిపుణులు సూచించారు. ముఖ్యంగా సముద్ర ఆధారిత ఆదాయం పెంచుకునేందుకు భావనపాడు పోర్టు ఉపయోగపడుతుంది. భూసేకరణలో నిమగ్నం.. పోర్టు నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఫేజ్ 1 పనులను చేపట్టేందుకు విశ్వ సముద్ర గ్రూప్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ప్రస్తుతం భూసేకరణలో యంత్రాంగం నిమగ్నమైంది. 675.60 ఎకరాలను సేకరిస్తోంది. ఇందులో ప్రైవేటు భూములు 433.71 ఎకరాలు కాగా, ప్రభుత్వ భూమి, కోస్టల్ తీరం కలిపి 241.89 ఎకరాలు ఉన్నాయి. టెక్కలి మండలం బూరగాంలో 32.78ఎకరాలు, పాత నౌపడలో 5.50 ఎకరాలు, కొండ భీంపురంలో 5.69 ఎకరాలు, నందిగాం మండలంలోని డిమ్మిలాడలో 21.17 ఎకరాలు, నర్సీపురంలో 12.15 ఎకరాలు, దేవలబద్రలో 3.56 ఎకరాలు, సంతబొమ్మాళి మండలం మర్రిపాడులో 27.38 ఎకరాలు, కస్పా నౌపడలో 5.17 ఎకరాలు, రాజపురంలో 320.31 ఎకరాల సేకరణ కోసం ఇప్పటికే రైతులతో సంప్రదింపులు చేసింది. సేకరించిన భూముల్లో రోడ్డు కనెక్టవిటీ కోసం 327.75 ఎకరాలు, రైల్వే కనెక్టవిటీ కోసం 100.27ఎకరాలు, మిగతాది పోర్టు కోసం వినియోగించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించారు. రైతులంతా సానుకూలత వ్యక్తం చేశారు. మెరుగైన పరిహారం టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన రైతుల భూములను సేకరిస్తుండగా, మరోవైపు పోర్టు కో సం మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లోని 420 కట్టడాలు ప్రభావితమవుతున్నాయి. వీరికి పునరావా సం కల్పిస్తున్నారు. విష్ణు చక్రం గ్రామానికి చెందిన వారికి కె.లింగుడు, సంతబొమ్మాళి, మూలపేటకు చెందిన వారికి కె.లింగుడు, ఇజ్జుపురంలో ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణం చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ. 20లక్షలు పరిహారం ప్రకటించారు. ఇళ్లు కోల్పోయిన వారి ఇంటిలో ఉన్న 18 ఏళ్ల పైబడిన వయసు కలిగిన 590 మందికి రూ.10లక్షలు చొప్పున పీడీఎఫ్ ప్యాకేజీ ఇస్తున్నారు. 434 మందికి ఇంటి నిర్మాణం కోసం ఐదు సెంట్ల భూమి ఇచ్చి మోడల్ ఆర్ఆండ్ఆర్ కాలనీగా తీర్చిదిద్దనున్నారు. ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తున్నారు. దీంతో అక్కడి రైతు లు, ఇళ్లు కోల్పోతున్న వారు అంగీకారం తెలిపారు. రెచ్చగొట్టే పనిలో అచ్చెన్న అండ్‌కో.. భావనపాడు పోర్టుకు మూలపేట, విష్ణుచక్రం గ్రామస్తులు అనుకూలంగా ఉన్నారు. భూ సర్వే, ఇళ్ల కొలతలన్నీ గ్రామస్తుల అభిప్రాయం మేరకే జరిగాయి. పోర్టుకు అందరు అనుకూలమని చెప్పినప్పటికీ అచ్చెన్నాయుడు డైరెక్షన్లో కొందరు గలాటా సృష్టిస్తున్నారు. పోర్టుకు వ్యతిరేకంగా కేకలు వేయడం, పోర్టు వద్దని నినాదాలు చేయడం వంటివి చేస్తున్నారు. భావనపాడు నిర్మాణం జరిగితే టీడీపీకి ప్రజలు ముఖం చాటేస్తారన్న భయం ఆ పార్టీ నేతలకు పట్టుకుంది. ఆ ప్రాంతం అభివృద్ధి జరిగితే అక్కడి ప్రజలకు మేలు జరిగితే తమ చెప్పు చేతుల్లో ఉండరనే అభద్రతా భావం అచ్చెన్న అండ్‌కోకు వెంటాడుతోంది. జిల్లాకు మేలు జరిగి, అభివృద్ధికి దోహదపడే భావనపాడు పోర్టును కుట్రపూరితంగా అడ్డుకునే పనిలో పడ్డారు. తమ మాటలను నమ్మే కొందరిని రెచ్చగొట్టి పోర్టు వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారు. జిల్లా చిరకాల కల ను భగ్నం చేసే పనిలో పడ్డారు. గతంలో ఇళ్ల స్థలాల విషయంలో ఇదే రకంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వారి కుట్రలను చేధించి, పన్నాగాలను తిప్పి కొట్టి ప్రభు త్వం పేదలకు మేలు చేసింది. ప్రస్తుతం విశాఖ రాజధాని విషయంలో అదే రకంగా అడ్డు తగిలే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రాజధాని వస్తే తమ రాజకీయాలు చెల్లవని, అమరావతిలో ఉ న్న భూములకు విలువ తగ్గి నష్టపోతామన్న భ యంతో విషం చిమ్ముతున్నారు. ఇప్పుడా జాబి తాలోకి భావనపాడు పోర్టును చేర్చారు. -
రూ.4,361.91 కోట్లతో భావనపాడు తొలిదశ పనులు
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు ఓడరేవును తొలి దశలో రూ.4,361.91 కోట్లతో నిర్మాణం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. మొత్తం 6,410 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ లార్డ్ విధానం (తొలుత ప్రభుత్వం అభివృద్ధి చేసి తర్వాత లీజు లేదా విక్రయిస్తారు)లో అభివృద్ధి చేయనున్నారు. భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.527.22 కోట్లు సమకూర్చనున్నట్లు పెట్టుబడులు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. రైట్స్ సంస్థ సవరించిన ప్రాజెక్టు నివేదికకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపడంతో ఆ మేరకు ప్రభుత్వం భావనపాడు పోర్టు నిర్మాణానికి అనుమతులిచ్చింది. భావనపాడు పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ పోర్టును అభివృద్ధి చేయనుండగా, ఏపీ మారిటైమ్ బోర్డు పర్యవేక్షిస్తుంది. ఈ పోర్టు అభివృద్ధి కోసం ఏపీ మారిటైమ్ బోర్డు రూ.3,053.34 కోట్ల రుణం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. -
త్వరలో భావనపాడు పోర్టు టెండర్లు
సాక్షి, అమరావతి: సముద్ర ఆధారిత వాణిజ్యం అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 4 ఫిషింగ్ హార్బర్లు, రెండు పోర్టుల నిర్మాణానికి టెండర్లు పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం మరో పోర్టు, నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి టెండర్లు పిలవడానికి రంగం సిద్ధంచేసింది. ఇందులో శ్రీకాకుళం జిల్లా భావనపాడు వద్ద సుమారు రూ.3,670 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పోర్టుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారైందని, ఆర్థికశాఖ నుంచి అనుమతి రాగానే టెండర్లు పిలవనున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓ కే మురళీధరన్ తెలిపారు. అదే విధంగా మరో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులకు ఆర్థిక శాఖ ఆమోదానికి పంపామని, అవి రాగానే పోర్టు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలకు ఆగస్టులో టెండర్లు పిలవనున్నామన్నారు. ఇప్పటికే సుమారు రూ.1,500 కోట్ల వ్యయంతో జువ్వలదిన్నె(నెల్లూరు), ఉప్పాడ (తూర్పు గోదావరి), నిజాంపట్నం(గుంటూరు), మచిలీపట్నం(కృష్ణా) ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇప్పుడు బుడగట్లపాలెం (శ్రీకాకుళం జిల్లా), పూడిమడక (విశాఖ), కొత్తపట్నం (ప్రకాశం), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి) ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు. ప్రకాశం జిల్లా రామాయపట్నం ఓడరేవు పనులను సెప్టెంబర్ నుంచి శ్రీకారం చుట్టేందుకు మారిటైమ్ బోర్డు ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. ఈలోగా పోర్టుకు సంబంధించి అన్ని అనుమతులు సాధించడంపై దృష్టి పెట్టింది. అత్యంత కీలకమైన పర్యావరణ అనుమతుల కోసం ఈ నెల 28న రామాయపట్నంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ పోర్టు నిర్మాణ పనుల కాంట్రాక్టును నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్, అరబిందో రియాల్టీ కలిసి దక్కించుకున్న సంగతి తెలిసిందే. పోర్టు నిర్మాణానికి కావాల్సిన నిధులను ఏపీ మారిటైమ్ బోర్డు రుణాల ద్వారా సమకూర్చుకోనుంది. సెప్టెంబర్‌లో పోర్టు నిర్మాణ పనులను సీఎం జగన్ చేతులు మీదుగా ప్రారంభించనున్నట్లు మురళీధరన్ తెలిపారు. మచిలీపట్నం పోర్టుకు టెండర్లు ఖరారయ్యేలోగా పర్యావరణ అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
ఉద్దానానికి మణిహారం..
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మారిపోయిన ఉద్దానం దశ తిరగబోతోంది. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు ఉద్దానానికి మణిహారం కాబోతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నారు. చేయని వాగ్దానాలను సైతం అమలు చేస్తూ ఉద్దానం వెనుకబాటు, అక్కడున్న సమస్యలను పారదోలేందుకు నడుం బిగించారు. ఒకవైపు కిడ్నీ రీసెర్చ్ సెంటర్, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తుండగా, మరోవైపు రూ.700 కోట్లతో భారీ మంచినీటి ప్రాజెక్టును నిర్మి స్తున్నారు. ఇంకోవైపు మత్స్యకారుల అవసరాలు, సంపదను రవాణా చేసేందుకు రూ. 3665.90 కోట్లతో భావనపాడు పోర్టు ను నిర్మించేందుకు లైన్ క్లియర్ చేశారు. కొన్ని రోజుల కిందట పోర్టు ప్రాజెక్టుకు ఆమోదం తెలపగా, తాజాగా రైట్ సంస్థ రూపొందించిన డీపీఆర్‌ను ఆమోదించారు. 36 నెలల్లో తొలి దశ ప్రాజెక్టు పూర్తి చేసేలా లక్ష్యంగా చేసుకుని పనులు ప్రా రంభిస్తున్నారు. ఇప్పటికే మంచినీళ్ల పేట వద్ద జెట్టీ నిర్మాణా న్ని చేపడుతున్నారు. అటు కిడ్నీ రోగుల బాధలు, ఇటు మంచినీటి సమస్య, మరోవైపు మత్స్యకారుల వలసలు నియంత్రించే త్రిముఖ లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యాచరణ అమలు చేస్తున్నారు. దశాబ్దాల సమస్యలకు పరిష్కారం.. ఉద్దానం ఏరియాలో కిడ్నీ సమస్య దశాబ్దాలుగా ఉంది. ప్రభుత్వాలెన్ని వచ్చినా కిడ్నీ రోగుల సమస్య పరిష్కారం కాలేదు. అధికారంలోకి రాకముందే కిడ్నీ సమస్యకు మూలాలను అన్వేషించారు. అధికారంలోకి వచ్చాక అమలు చేశారు. ఇప్పటికీ కిడ్నీ వ్యా«ధుల నియంత్రణ కోసం రీసెర్చ్ సెంటర్‌తో పాటు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. రూ.50 కోట్ల వరకు నిధులు కూడా మంజూరు చేశారు. ఇప్పుడా పనులు జరుగుతున్నాయి. అంతటితో ఆగకుండా ఈ వ్యాధి ప్రధాన కారణం తాగునీరే కావొచ్చనే ఉద్దేశంతో రూ. 700కోట్లతో భారీ మంచినీటి ప్రాజెక్టును నిర్మించేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించనున్నారు. మరోవైపు కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ సెంటర్లు ఎక్కడిక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఖరీధైన మందులను అందుబాటులోకి తెచ్చారు. నిపుణులైన వైద్యులను నియమిస్తున్నారు. తాజాగా భావనపాడు పోర్టు నిర్మాణానికి అంతా సిద్ధం చేశారు. ఆ పోర్టుకు సంబంధించి రైట్ సంస్థ రూపొందించిన డీపీఆర్‌ను ప్రభుత్వం ఆమోదించింది. కార్గో రవాణాకు ఎంతో అనుకూలంగా ఉన్న భావనపాడు తీరంలో పోర్టు నిర్మాణంతో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు రానుంది. దీంతో మత్స్యకారుల వలసల సమస్యకు చెక్ పడనుంది. కార్గోకు అనుకూలంగా భావనపాడు జిల్లాలో జల మార్గం ద్వారా కార్గో రవాణాకు ఎంతో అనుకూలంగా ఉన్న సంతబొమ్మాళి మండలం భావనపాడు తీరంలో ఓడరేవు నిర్మాణం దశాబ్దాల నాటి కల. ప్రభుత్వా లు మారుతున్నప్పుడల్లా భావనపాడు ఓడరేవు నిర్మాణానికి ఈ ప్రాంతంలో మత్స్యకారులకు ఆశలు కల్పించి ఆ తర్వాత గాలికొదిలేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం దశాబ్దాల కలగా ఉన్న భావనపాడు పోర్టు నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేశారు. తూర్పు తీరంలో ఉత్తరాంధ్రకు ఆనుకుని ప్రస్తుతం విశాఖపట్టణం పోర్టు ఒక్కటి మాత్రమే జల మార్గంలో వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా ఉంది. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా నుంచి ఒడిశా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లకు జల మార్గంలో అతి తక్కువ దూరం కలిగిన పోర్టు మరొకటి లేదు. దీంతో ఉక్కు తయారీ కంపెనీలకు కావాల్సిన బొగ్గు, ముడి ఇనుము ఎగుమతి, దిగుమతులకు భావనపాడు ఓ డరేవు అనుకూలంగా చెప్పవచ్చు. టెక్కలి ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గ్రానైట్ పరిశ్రమలు మెండుగా ఉన్నాయి. దీంతో భావనపాడు ప్రాంతంలో కార్గో( లగేజీ రవాణా)కు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. ఇక జాతీయ స్థాయిలో 40శాతం విదేశీ మారక ద్రవ్యం మెరైన్ సెక్టార్ నుంచే వస్తోంది. అందులో సిక్కోలు మత్స్యకారుల వాటానే ఎక్కువ. జిల్లాలో విస్తారమైన 193 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నా మౌలిక సదుపాయాలు లేక వలస పోతున్న పరిస్థితి నెలకుంటోంది. జిల్లాలో 11 మండలాల పరిధిలో 145 మత్స్యకార గ్రామా లు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి చేపల వేట ఆధారపడి ఉన్నారు. అయితే ప్రధానంగా ఆక్వా ఎగుమతులతో రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచన చేస్తోంది. ప్రభుత్వ ఆలోచన మేరకు సము ద్ర ఆధారిత ఆదాయం పెంచుకునే క్రమంలో భావనపాడు తీరంలో ఓడరేవు ఏర్పాటు చేస్తే ఒక వైపు మత్స్య సంపద, మరో వైపు ఇతర ఖనిజ సంపదను ఎగుమతి, దిగుమతి చేసుకుంటూ రాష్ట్రానికి ఆదాయం పెంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే, మత్స్యకారుల వలసలు ని యంత్రించేందుకు అవకాశం ఉంటుంది. 36 నెలల్లో అందుబాటులోకి భావనపాడు పోర్టు మొదటి దశ పనులు 36 నెలల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. మొదటి విడత పనుల్లో మూడు సా«ధారణ కార్గో బెర్తులు, ఒక బల్క్ కార్గో బెర్త్, 500 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించను న్నారు. దీని కోసం ఏపి మారిటైమ్ బోర్డు రూ. 2,123 కోట్లు వరకు రుణం పొందేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఉత్తర్వులు ఇచ్చింది. 2024–25 నాటికి 12.18 ఎంటీపీఏ సామర్థ్యం కలిగిన కార్గో రవాణా కు వీలుగా లక్ష్యాన్ని నిర్దేశించారు. 2039–40 నాటికి 67.91 ఎంటీపీఏ కార్గో రవాణాకు వీలుగా పోర్టు నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఈ పోర్టు నిర్మాణ పనులను భావనపాడు పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టేలా ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. భూసేకరణకు రూ. 261కోట్లు మంజూరు భావనపాడు పోర్టు నిర్మాణానికి బడ్జెట్ కేటాయిస్తూ ఈ ఏడాది జూన్ నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో తక్షణమే ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై నెలలో 10 సర్వే బృందాలతో భావనపాడు, దేవునల్తాడ ప్రాంతాల్లో ఎంజాయ్మెంట్ సర్వే ప్రారంభించారు. పోర్టు నిర్మాణానికి మొత్తం 2320.29 ఎకరాలను సిద్ధం చేశారు. ఇందులో 642.76 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా 1677.53 ఎకరాలు జిరాయితీగా గుర్తించారు. అయితే గతంలో భూసేకరణ చేపట్టినప్పటికీ మరో సారి ఆయా భూముల్లో పరిస్థితులపై మరో సారి ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించడంతో పోర్టు నిర్మాణానికి వడి వడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే భూసేకరణకు సంబంధించి రూ. 261 కోట్ల మేర ప్రభుత్వం సమకూర్చింది. భావనపాడు ఓడరేవు నిర్మాణం కోసం అవసరమైన మౌలిక వసతుల కోసం మారీటైమ్ బోర్డు ద్వారా ప్రత్యేక వాహనాలు కొనుగోలు, ప్రత్యేక అధికారుల నియామకాలకు సంబంధించి రాష్ట్ర మౌలిక వసతుల, పెట్టుబడుల మారీ టైమ్ బోర్డు శాఖా నుంచి తాజాగా ఉత్తర్వులు సైతం జారీ చేశారు. మత్స్యకారులకు మహర్దశ స్థానికంగా వేటకు అనుకూలత లేక పొట్ట చేత పట్టుకుని మత్స్యకారులు వేరే రాష్ట్రాలకు వలసపోయి కుటుంబానికి దూరంగా దీనంగా బతుకుతున్నారు. పది, పదిహే ను వేల సంపాదన కోసం గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాలకు వెళ్తున్నారు. వెళ్లిన చోట ప్రతి సారి ఇబ్బందులు ఎదుర్కొంటున్న దుస్థితి నెలకుంటుంది. ఈ పరిస్థితి లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది. జెట్టీ లు, ఫిషింగ్ హార్బర్, పోర్టు నిర్మాణంతో మత్స్యకారుల బతుకుల్లో సరికొత్త వెలుగులు తీసుకురావాలని భావి స్తోంది. మత్స్యకారుల వలసలు తగ్గించేందుకు ఏడాది లోగా పనులు ప్రారంభించే లక్ష్యంగా వెళ్తోంది. ఎచ్చెర్ల మండలం బుగడుట్ల పాలెంలో రూ. 332 కోట్లతో ఫిషింగ్ హార్బర్, డి.మత్స్యలేశం పంచాయతీ రాళ్లపేటలో రూ. 21.92కోట్లతో జెట్టీలు (ఫిష్‌ల్యాండింగ్ కేంద్రా లు), కవిటి మండలం ఇద్దువానిపాలెంలో రూ. 12కోట్ల తో జెట్టీలు, వజ్రపుకొత్తూరు మండలంలోని నీళ్లపేటలో రూ. 11.95కోట్లతో జెట్టీలు వంటి నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే భావనపాడు తీరానికి కూత వేటు దూరంలో వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట వద్ద ఫిషింగ్ ల్యాండింగ్ కేంద్రం (జెట్టీ) నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత కొన్ని నెలల క్రితం శంకు స్థాపన చేశారు. తాజాగా జెట్టీ పనులు సైతం ప్రారంభమయ్యాయి. -
పోరాటానికి అండ
భావనపాడు పోర్టు ఏర్పాటుతో రోడ్డునపడుతున్న బాధితులకు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. వారి పోరాటానికి వెన్నుదన్నుగా నిలుస్తామని భరోసానిచ్చింది. మత్స్యకారుల జీవనానికి విఘాతం కలిగిస్తే ఊరుకోమని హెచ్చరించింది. కడదాకా వెంటనిలిచి... విజయం సాధించేదాకా ఉద్యమం చేపడతామని స్పష్టంచేసింది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : మత్సకారుల ఇష్టానికి వ్యతిరేకంగా బావనపాడులో పోర్టు నిర్మాణం చేపడితే ఊరుకునేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు. శనివారం బావనపాడులో చేపట్టిన ర్యాలీ, గ్రామసభల్లో నాయకులు పాల్గొని గ్రామస్తులకు మద్దతు ప్రకటించారు. పచ్చని తమ బతుకుల్లో అగ్గిరాజేసే ప్రయత్నం చేస్తే టీడీపీ నేతల్ని తరిమి తరిపి కొడతామని తీర్మానించుకున్న గ్రామస్తులు పిల్లా పాపలతో ఆడ, మగ తేడా లేకుండా భారీ వర్షంలోనూ నినాదాలు చేస్తూ వైఎస్సార్సీపీ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో తెలుగుదేశం నాయకులు కూడా ఉండటం విశేషం. అంతులేని బాబు భూదాహం: తమ్మినేని సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ చంద్రబాబు భూ దాహానికి అంతేలేకుండా పోతోందని ఆరోపించారు. రాజధాని నిర్మాణం పేరిట గుంటూరులో, విమానాశ్రయం పేరిట భోగాపురంలో భూములు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని, పేదల బతుకులపై బుగ్గిపడే విధంగా మంత్రులు, ఎమ్మెలు సహా ముఖ్యమంత్రే ప్రయత్నిస్తుంటే గ్రామస్తులె వరికి ఫిర్యాదివ్వాలని ప్రశ్నించారు. పోర్టు పేరిట 12వేలు కాదు, 33వేల ఎకరాలు సేకరిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. రాజకీయాల కోసం కాదు, జీవించే హక్కు కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. వడ్డితాండ్ర , సోంపేటల్లో ఐదేళ్ల నుంచి పోరాటం చేస్తున్నామని, మంత్రి అచ్చెన్నాయుడి కుటుంబసభ్యుల కోసం చట్టాల్ని ఉల్లంఘించి భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గాలీ, నీరు స్వచ్చంగా ఉన్న చోట బీడు భూములని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పోలాకి, సోంపేట, కొవ్వాడ పరిశ్రమలకు బొగ్గు రవాణాకోసమే పోర్టు నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. మత్స్యకారుల పొట్టగొడతారా: ధర్మాన కృష్ణదాస్ ఎప్పటినుంచో ఇక్కడి మత్స్యకారులు జెట్టీ, ఫిషింగ్ హార్బర్ కావాలని కోరితే పట్టించుకోని ముఖ్యమంత్రి పోర్టు నిర్మాణం ఎలా చేపడతారని వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణధాస్ నిలదీశా రు. మత్య్సకారుల అభివృద్ధి కో సం వైఎస్ ఎంతో చేశారని గుర్తిం చారు. ఆయన వారసుడిగా జగన్మోహన్రెడ్డి కూడా బావనపాడు పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారని అభయమిచ్చారు. అమాయకుల్ని ఎలా మోసగిస్తారు: రెడ్డి శాంతి అమాయకులైన మత్స్యకారులను ఎలా మోసగించాలని ఆలోచిస్తున్నారని తెలుగుదేశం నాయకులను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ప్రశ్నించారు. పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారందరికీ అభినందనలు తెలియజేస్తూ పోరాటానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రేపటి నుంచి పోరాటం ఉధృతం పోరాటాన్ని సోమవారం నుంచి ఉధృతం చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ప్రతి కుటుంబం నుంచి ఓ వ్యక్తి సంతకం పెట్టి జిల్లా కలెక్టర్ సహా రెవెన్యూ యంత్రాంగానికి విజ్ఞాపన పత్రాలు అందజేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం నేతలు సహా వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జిలు జుత్తు జగన్నాయకులు, దువ్వాడ శ్రీనివాస్, గొర్లె కిరణ్‌కుమార్‌తోపాటు పార్టీ నేతలు పేరాడ తిలక్, బాబాజీ, కె.వి.సత్యనారాయణ, రొక్కం సూర్యప్రకాశరావు, రైతు కూలీ సంఘం నేతలు హాజర య్యారు. -
సంతబొమ్మాళిలో రైతుల ఆందోళన
టెక్కలి: శ్రీకాకుళం జిల్లాలో నిర్మిస్తున్న భావనపాడు పోర్టును వ్యతిరేకిస్తూ బాధిత రైతులు ఆందోళనకు దిగారు. జిల్లాలోని సంతబొమ్మాళి మండలంలో శనివారం ఉదయం దాదాపు 500 మంది రైతులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. భావనపాడులో పోర్టు నిర్మించేందుకు 8 వేల ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించిందేకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న రైతులు ఈ రోజు బామనపాడులో ర్యాలీ నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఓటి బడ్జెట్
నిధుల నీళ్లు పారలే.. వ్యవసాయాధారమైన శ్రీకాకుళం జిల్లాకు నీటిపారుదల ప్రాజెక్టులే ప్రాణాధారం. అటువంటి ప్రాజెక్టులకు నామమాత్రపు నిధులే విదిల్చారు. ఇవి ఈ ప్రాజెక్టుల సిబ్బంది జీతభత్యాలకే సరిపోతాయి. ఫలితంగా ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ కష్టతరమవుతుంది. ఇక నిర్మాణంలో ఉన్న వంశధార, తోటపల్లి విస్తరణ, మడ్డువలస ప్రాజెక్టుల పనులు నిధుల లేమితో ముందుకు సాగే పరిస్థితి లేదు. దీనివల్ల అదనపు ఆయకట్టు స్థిరీకరణ, ఉన్న ఆ్డయకట్టుకు సక్రమంగా నీరందడం గగనమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాను అనాథను చేసింది. బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేక పర్యాటక కేంద్రం ఏర్పాటు చేస్తాం, కళింగపట్నం, భావనపాడు పోర్టులను అభివృద్ధి చేస్తామన్న శుష్క వాగ్దానాలు తప్ప .. ఈ బడ్జెట్లో జిల్లాకు మేలు చేసే అంశమేదీ కనిపించలేదు. లక్ష కోట్లకుపైగా ప్రతిపాదించిన బడ్జెట్లో జిల్లాకు వీసమెత్తు ప్రయోజనం చేకూర్చే అంశమే లేదని నిపుణులు సైతం పెదవి విరుస్తున్నారు. జిల్లాకు ప్రాణాధారమైన నీటిపారుదల ప్రాజెక్టులకూ దిక్కులేకుండాపోయింది. జిల్లాలోని బ్రిటీష్ కాలంనాటి పోర్టులను అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి బడ్జెట్లో ఏదో కొత్తది ఇస్తున్నట్లు చెప్పారు. వాస్తవానికి 1980 దశకంలోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ పోర్టులను అభివృద్ధి చేయాలని నిర్ణయించగా అప్పటి గవర్నర్ కుముద్‌బెన్ జోషి శంకుస్థాపన కూడా చేశారు. అంతే ఆ తర్వాత అవన్నీ మూలన పడ్డాయి. భావనపాడులో జెట్టీ నిర్మాణానికి అనుకూల పరిస్థితులు లేవని అప్పట్లో నిపుణుల కమిటీలు పేర్కొన్నాయంటూ ఆ ప్రతిపాదనను బుట్టదాఖలు చేశారు. అప్పుడు పనికిరాని భావనపాడు పోర్టు ఇప్పుడు ఎలా పనికి వస్తుందని జిల్లాలోని మేధావి వర్గం ప్రశ్నిస్తోంది. కళింగపట్నం పోర్టు బ్రిటీష్ కాలం నుంచి ఉంది. దానిపై తెలుగుదేశం ఏనాడూ దృష్టి సారించిన పాపాన పోలేదు. ప్రస్తుతం మత్స్యకారుల కోసం ఈ పోర్టులను అభివృద్ధి చేయాలని చెప్పడం కూడా వాస్తవానికి దూరంగా ఉంది. ఈ పోర్టుల వలన మత్స్యకారులకు పెద్దగా ప్రయోజనం చేకూరదు. ఫిషింగ్ జెట్టీలు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తేనే మత్స్యకారులకు ఉపయోగం. అయితే ఆ విషయాన్ని బడ్జెట్లో ప్రస్తావించలేదు. కాగా గతంలో గార మండలం బందరువానిపేట వద్ద ఫిషింగ్ జెట్టీకి, కవిటి మండలం నెలవంక వద్ద స్వీడన్ సహకారంతో రొయ్యల పరిశోధన కేంద్రానికి శంకుస్థాపనలు చేసిన టీడీపీ ప్రభుత్వాలు, ఆ తరువాత నిధులు కేటాయించకుండా వాటిని శిలాఫలకాలకే పరిమితం చేశాయి. జిల్లాలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్మితమవుతున్న థర్మల్ ప్లాంట్లకు బొగ్గు తదితర దిగుమతులకు పోర్టుల అవసరం ఎంతో ఉంది. అందుకే పోర్టుల అభివృద్ధి ప్రతిపాదనను ప్రభుత్వం తెరపైకి తెచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పేదలకు గూడు సౌకర్యం కల్పించే ఇందిరమ్మ పథకంపై వేటు వేయడం పేదలకు అన్యాయం చేయడమే. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల బకాయిలు రూ.14 కోట్ల వరకు ఉన్నాయి. బకాయిల చెల్లింపు గురించి ప్రస్తావించకుండా ఇళ్ల కేటాయింపుల్లో అవినీతి జరిగిందని అంటూ వాటిని రద్దు చేసి లబ్ధిదారుల నుంచి రికవరీ చేస్తామని ఆర్థిక మంత్రి చెప్పడం పేదలకు అన్యాయం చేయడమే అవుతుంది. పర్యాటకానికి కాస్త ఊరట శ్రీకాకుళం, గుంటూరుల్లో ప్రత్యేక పర్యాటక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించడం కాస్త ఊరట కలిగించే అంశం. అయితే గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బౌద్ధారామాలను అభివృద్ధి చేసి అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తామని, ఇందుకుగానూ దంతపురిలో * 100 కోట్లు, మిగిలిన చోట్ల మరో 100 కోట్లు వెచ్చిస్తామని చెప్పినా చేయి విదిల్చిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు కూడా ఈ పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చేయకుండా ప్రత్యేక పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం కంటితుడుపు చర్యేనంటున్నారు. ‘చక్కెర’ ఇంకా చేదే.. ఎన్నికల ముందు, ఆ తర్వాత.. ప్రస్తుత ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఆమదాలవలస చక్కెర ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని ఘనమైన హామీలు గుప్పిం చారు. దీంతో రైతులు, ఉద్యోగులు దీనిపై ఆశలు పెంచుకున్నారు. అయితే బడ్జెట్లో సుగర్ ఫ్యాక్టరీ ఊసే లేకపోవడంతో నిరాశ వ్యక్తమవుతోంది. ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలంటే కోట్లలో నిధులు అవసరమవుతాయి. బడ్జెట్లో ప్రస్తావన లేకుండా ఎలా తెరిపిస్తారన్న ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. పసలేని బడ్జెట్ : కృష్ణదాస్ నరసన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పసలేదని మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఎన్నికల మ్యాని ఫెస్టోలో టీడీపీ ఇచ్చిన హామీలకు అనుగుణంగా కేటాయింపులు లేవని విమర్శించారు. గృహనిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తామని ప్రకటిస్తూ బడ్జెట్లో నిధులు తగ్గించారన్నారు. పేద, మధ్య తరగతులవారికి మేలు చేసే కొత్త సంక్షేమ పథకాలు ఏవీ ప్రతిపాదించలేదని అన్నారు.