ఓటి బడ్జెట్
నిధుల నీళ్లు పారలే..
వ్యవసాయాధారమైన శ్రీకాకుళం జిల్లాకు నీటిపారుదల ప్రాజెక్టులే ప్రాణాధారం. అటువంటి ప్రాజెక్టులకు నామమాత్రపు నిధులే విదిల్చారు. ఇవి ఈ ప్రాజెక్టుల సిబ్బంది జీతభత్యాలకే సరిపోతాయి. ఫలితంగా ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ కష్టతరమవుతుంది. ఇక నిర్మాణంలో ఉన్న వంశధార, తోటపల్లి విస్తరణ, మడ్డువలస ప్రాజెక్టుల పనులు నిధుల లేమితో ముందుకు సాగే పరిస్థితి లేదు. దీనివల్ల అదనపు ఆయకట్టు స్థిరీకరణ, ఉన్న ఆ్డయకట్టుకు సక్రమంగా నీరందడం గగనమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాను అనాథను చేసింది. బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేక పర్యాటక కేంద్రం ఏర్పాటు చేస్తాం, కళింగపట్నం, భావనపాడు పోర్టులను అభివృద్ధి చేస్తామన్న శుష్క వాగ్దానాలు తప్ప .. ఈ బడ్జెట్‌లో జిల్లాకు మేలు చేసే అంశమేదీ కనిపించలేదు. లక్ష కోట్లకుపైగా ప్రతిపాదించిన బడ్జెట్‌లో జిల్లాకు వీసమెత్తు ప్రయోజనం చేకూర్చే అంశమే లేదని నిపుణులు సైతం పెదవి విరుస్తున్నారు. జిల్లాకు ప్రాణాధారమైన నీటిపారుదల ప్రాజెక్టులకూ దిక్కులేకుండాపోయింది. జిల్లాలోని బ్రిటీష్ కాలంనాటి పోర్టులను అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ఏదో కొత్తది ఇస్తున్నట్లు చెప్పారు. వాస్తవానికి 1980 దశకంలోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ పోర్టులను అభివృద్ధి చేయాలని నిర్ణయించగా అప్పటి గవర్నర్ కుముద్‌బెన్ జోషి శంకుస్థాపన కూడా చేశారు. అంతే ఆ తర్వాత అవన్నీ మూలన పడ్డాయి.
భావనపాడులో జెట్టీ నిర్మాణానికి అనుకూల పరిస్థితులు లేవని అప్పట్లో నిపుణుల కమిటీలు పేర్కొన్నాయంటూ ఆ ప్రతిపాదనను బుట్టదాఖలు చేశారు. అప్పుడు పనికిరాని భావనపాడు పోర్టు ఇప్పుడు ఎలా పనికి వస్తుందని జిల్లాలోని మేధావి వర్గం ప్రశ్నిస్తోంది. కళింగపట్నం పోర్టు బ్రిటీష్ కాలం నుంచి ఉంది. దానిపై తెలుగుదేశం ఏనాడూ దృష్టి సారించిన పాపాన పోలేదు. ప్రస్తుతం మత్స్యకారుల కోసం ఈ పోర్టులను అభివృద్ధి చేయాలని చెప్పడం కూడా వాస్తవానికి దూరంగా ఉంది. ఈ పోర్టుల వలన మత్స్యకారులకు పెద్దగా ప్రయోజనం చేకూరదు. ఫిషింగ్ జెట్టీలు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తేనే మత్స్యకారులకు ఉపయోగం.
అయితే ఆ విషయాన్ని బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. కాగా గతంలో గార మండలం బందరువానిపేట వద్ద ఫిషింగ్ జెట్టీకి, కవిటి మండలం నెలవంక వద్ద స్వీడన్ సహకారంతో రొయ్యల పరిశోధన కేంద్రానికి శంకుస్థాపనలు చేసిన టీడీపీ ప్రభుత్వాలు, ఆ తరువాత నిధులు కేటాయించకుండా వాటిని శిలాఫలకాలకే పరిమితం చేశాయి. జిల్లాలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్మితమవుతున్న థర్మల్ ప్లాంట్లకు బొగ్గు తదితర దిగుమతులకు పోర్టుల అవసరం ఎంతో ఉంది. అందుకే పోర్టుల అభివృద్ధి ప్రతిపాదనను ప్రభుత్వం తెరపైకి తెచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పేదలకు గూడు సౌకర్యం కల్పించే ఇందిరమ్మ పథకంపై వేటు వేయడం పేదలకు అన్యాయం చేయడమే. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల బకాయిలు రూ.14 కోట్ల వరకు ఉన్నాయి. బకాయిల చెల్లింపు గురించి ప్రస్తావించకుండా ఇళ్ల కేటాయింపుల్లో అవినీతి జరిగిందని అంటూ వాటిని రద్దు చేసి లబ్ధిదారుల నుంచి రికవరీ చేస్తామని ఆర్థిక మంత్రి చెప్పడం పేదలకు అన్యాయం చేయడమే అవుతుంది.
పర్యాటకానికి కాస్త ఊరట
శ్రీకాకుళం, గుంటూరుల్లో ప్రత్యేక పర్యాటక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించడం కాస్త ఊరట కలిగించే అంశం. అయితే గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బౌద్ధారామాలను అభివృద్ధి చేసి అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తామని, ఇందుకుగానూ దంతపురిలో * 100 కోట్లు, మిగిలిన చోట్ల మరో 100 కోట్లు వెచ్చిస్తామని చెప్పినా చేయి విదిల్చిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు కూడా ఈ పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చేయకుండా ప్రత్యేక పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం కంటితుడుపు చర్యేనంటున్నారు.
‘చక్కెర’ ఇంకా చేదే..
ఎన్నికల ముందు, ఆ తర్వాత.. ప్రస్తుత ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఆమదాలవలస చక్కెర ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని ఘనమైన హామీలు గుప్పిం చారు. దీంతో రైతులు, ఉద్యోగులు దీనిపై ఆశలు పెంచుకున్నారు. అయితే బడ్జెట్‌లో సుగర్ ఫ్యాక్టరీ ఊసే లేకపోవడంతో నిరాశ వ్యక్తమవుతోంది. ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలంటే కోట్లలో నిధులు అవసరమవుతాయి. బడ్జెట్‌లో ప్రస్తావన లేకుండా ఎలా తెరిపిస్తారన్న ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
పసలేని బడ్జెట్ : కృష్ణదాస్
నరసన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పసలేదని మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఎన్నికల మ్యాని ఫెస్టోలో టీడీపీ ఇచ్చిన హామీలకు అనుగుణంగా కేటాయింపులు లేవని విమర్శించారు. గృహనిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తామని ప్రకటిస్తూ బడ్జెట్‌లో నిధులు తగ్గించారన్నారు. పేద, మధ్య తరగతులవారికి మేలు చేసే కొత్త సంక్షేమ పథకాలు ఏవీ ప్రతిపాదించలేదని అన్నారు.