ఉద్దానానికి మణిహారం.. | Government Doing Several Developement Projects In Uddanam | Sakshi
Sakshi News home page

ఉద్దానానికి మణిహారం..

Published Wed, Aug 26 2020 12:35 PM | Last Updated on Wed, Aug 26 2020 12:35 PM

Government Doing Several Developement Projects In Uddanam - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మారిపోయిన ఉద్దానం దశ తిరగబోతోంది. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు ఉద్దానానికి మణిహారం కాబోతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నారు. చేయని వాగ్దానాలను సైతం అమలు చేస్తూ ఉద్దానం వెనుకబాటు, అక్కడున్న సమస్యలను పారదోలేందుకు నడుం బిగించారు. ఒకవైపు కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తుండగా, మరోవైపు రూ.700 కోట్లతో భారీ మంచినీటి ప్రాజెక్టును నిర్మి స్తున్నారు. ఇంకోవైపు మత్స్యకారుల అవసరాలు, సంపదను రవాణా చేసేందుకు రూ. 3665.90 కోట్లతో భావనపాడు పోర్టు ను నిర్మించేందుకు లైన్‌ క్లియర్‌ చేశారు. కొన్ని రోజుల కిందట పోర్టు ప్రాజెక్టుకు ఆమోదం తెలపగా, తాజాగా రైట్‌ సంస్థ రూపొందించిన డీపీఆర్‌ను ఆమోదించారు. 36 నెలల్లో తొలి దశ ప్రాజెక్టు పూర్తి చేసేలా లక్ష్యంగా చేసుకుని పనులు ప్రా రంభిస్తున్నారు. ఇప్పటికే మంచినీళ్ల పేట వద్ద జెట్టీ నిర్మాణా న్ని చేపడుతున్నారు. అటు కిడ్నీ రోగుల బాధలు, ఇటు మంచినీటి సమస్య, మరోవైపు మత్స్యకారుల వలసలు నియంత్రించే త్రిముఖ లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్యాచరణ అమలు చేస్తున్నారు. 

దశాబ్దాల సమస్యలకు పరిష్కారం.. 
ఉద్దానం ఏరియాలో కిడ్నీ సమస్య దశాబ్దాలుగా ఉంది. ప్రభుత్వాలెన్ని వచ్చినా కిడ్నీ రోగుల సమస్య పరిష్కారం కాలేదు. అధికారంలోకి రాకముందే కిడ్నీ సమస్యకు మూలాలను అన్వేషించారు. అధికారంలోకి వచ్చాక అమలు చేశారు. ఇప్పటికీ కిడ్నీ వ్యా«ధుల నియంత్రణ కోసం రీసెర్చ్‌ సెంటర్‌తో పాటు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. రూ.50 కోట్ల వరకు నిధులు కూడా మంజూరు చేశారు. ఇప్పుడా పనులు జరుగుతున్నాయి. అంతటితో ఆగకుండా ఈ వ్యాధి ప్రధాన కారణం తాగునీరే కావొచ్చనే ఉద్దేశంతో రూ. 700కోట్లతో భారీ మంచినీటి ప్రాజెక్టును నిర్మించేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించనున్నారు. మరోవైపు కిడ్నీ రోగుల కోసం డయాలసిస్‌ సెంటర్లు ఎక్కడిక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఖరీధైన మందులను అందుబాటులోకి తెచ్చారు. నిపుణులైన వైద్యులను నియమిస్తున్నారు. తాజాగా భావనపాడు పోర్టు నిర్మాణానికి అంతా సిద్ధం చేశారు. ఆ పోర్టుకు సంబంధించి రైట్‌ సంస్థ రూపొందించిన డీపీఆర్‌ను ప్రభుత్వం ఆమోదించింది. కార్గో రవాణాకు ఎంతో అనుకూలంగా ఉన్న భావనపాడు తీరంలో పోర్టు నిర్మాణంతో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు రానుంది. దీంతో మత్స్యకారుల వలసల సమస్యకు చెక్‌ పడనుంది.  

కార్గోకు అనుకూలంగా భావనపాడు  
జిల్లాలో జల మార్గం ద్వారా కార్గో రవాణాకు ఎంతో అనుకూలంగా ఉన్న సంతబొమ్మాళి మండలం భావనపాడు తీరంలో ఓడరేవు నిర్మాణం దశాబ్దాల నాటి కల. ప్రభుత్వా లు మారుతున్నప్పుడల్లా భావనపాడు ఓడరేవు నిర్మాణానికి ఈ ప్రాంతంలో మత్స్యకారులకు ఆశలు కల్పించి ఆ తర్వాత గాలికొదిలేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం దశాబ్దాల కలగా ఉన్న భావనపాడు పోర్టు నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేశారు. తూర్పు తీరంలో ఉత్తరాంధ్రకు ఆనుకుని ప్రస్తుతం విశాఖపట్టణం పోర్టు ఒక్కటి మాత్రమే జల మార్గంలో వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా ఉంది. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా నుంచి ఒడిశా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లకు జల మార్గంలో అతి తక్కువ దూరం కలిగిన పోర్టు మరొకటి లేదు. దీంతో ఉక్కు తయారీ కంపెనీలకు కావాల్సిన బొగ్గు, ముడి ఇనుము ఎగుమతి, దిగుమతులకు భావనపాడు ఓ డరేవు అనుకూలంగా చెప్పవచ్చు.  టెక్కలి ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గ్రానైట్‌ పరిశ్రమలు మెండుగా ఉన్నాయి. దీంతో భావనపాడు ప్రాంతంలో కార్గో( లగేజీ రవాణా)కు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. ఇక జాతీయ స్థాయిలో 40శాతం విదేశీ మారక ద్రవ్యం మెరైన్‌ సెక్టార్‌ నుంచే వస్తోంది.

అందులో సిక్కోలు మత్స్యకారుల వాటానే ఎక్కువ.  జిల్లాలో విస్తారమైన 193 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నా మౌలిక సదుపాయాలు లేక వలస పోతున్న పరిస్థితి నెలకుంటోంది.  జిల్లాలో 11 మండలాల పరిధిలో 145 మత్స్యకార గ్రామా లు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి చేపల వేట ఆధారపడి ఉన్నారు. అయితే ప్రధానంగా ఆక్వా ఎగుమతులతో రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచన చేస్తోంది. ప్రభుత్వ ఆలోచన మేరకు సము ద్ర ఆధారిత ఆదాయం పెంచుకునే క్రమంలో భావనపాడు తీరంలో ఓడరేవు ఏర్పాటు చేస్తే ఒక వైపు మత్స్య సంపద, మరో వైపు ఇతర ఖనిజ సంపదను ఎగుమతి, దిగుమతి చేసుకుంటూ రాష్ట్రానికి ఆదాయం పెంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే, మత్స్యకారుల వలసలు ని యంత్రించేందుకు అవకాశం ఉంటుంది.   

36 నెలల్లో అందుబాటులోకి  
భావనపాడు పోర్టు మొదటి దశ పనులు 36 నెలల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. మొదటి విడత పనుల్లో మూడు సా«ధారణ కార్గో బెర్తులు, ఒక బల్క్‌ కార్గో బెర్త్, 500 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించను న్నారు. దీని కోసం ఏపి మారిటైమ్‌ బోర్డు రూ. 2,123 కోట్లు వరకు రుణం పొందేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఉత్తర్వులు ఇచ్చింది. 2024–25 నాటికి 12.18 ఎంటీపీఏ సామర్థ్యం కలిగిన కార్గో రవాణా కు వీలుగా లక్ష్యాన్ని నిర్దేశించారు. 2039–40 నాటికి 67.91 ఎంటీపీఏ కార్గో రవాణాకు వీలుగా పోర్టు నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఈ పోర్టు నిర్మాణ పనులను భావనపాడు పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చేపట్టేలా ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 

భూసేకరణకు రూ. 261కోట్లు మంజూరు  
భావనపాడు పోర్టు నిర్మాణానికి బడ్జెట్‌ కేటాయిస్తూ ఈ ఏడాది జూన్‌ నెలలో జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో తక్షణమే ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై నెలలో 10 సర్వే బృందాలతో భావనపాడు, దేవునల్తాడ ప్రాంతాల్లో ఎంజాయ్‌మెంట్‌ సర్వే ప్రారంభించారు. పోర్టు నిర్మాణానికి మొత్తం 2320.29 ఎకరాలను సిద్ధం చేశారు. ఇందులో 642.76 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా 1677.53 ఎకరాలు జిరాయితీగా గుర్తించారు. అయితే గతంలో భూసేకరణ చేపట్టినప్పటికీ మరో సారి ఆయా భూముల్లో పరిస్థితులపై మరో సారి ఎంజాయ్‌మెంట్‌ సర్వే నిర్వహించడంతో పోర్టు నిర్మాణానికి వడి వడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే భూసేకరణకు సంబంధించి రూ. 261 కోట్ల మేర ప్రభుత్వం సమకూర్చింది. భావనపాడు ఓడరేవు నిర్మాణం కోసం అవసరమైన మౌలిక వసతుల కోసం మారీటైమ్‌ బోర్డు ద్వారా ప్రత్యేక వాహనాలు కొనుగోలు, ప్రత్యేక అధికారుల నియామకాలకు సంబంధించి రాష్ట్ర మౌలిక వసతుల, పెట్టుబడుల మారీ టైమ్‌ బోర్డు శాఖా నుంచి తాజాగా  ఉత్తర్వులు సైతం జారీ చేశారు. 

మత్స్యకారులకు మహర్దశ 
స్థానికంగా వేటకు అనుకూలత లేక పొట్ట చేత పట్టుకుని మత్స్యకారులు వేరే రాష్ట్రాలకు వలసపోయి కుటుంబానికి దూరంగా దీనంగా బతుకుతున్నారు. పది, పదిహే ను వేల సంపాదన కోసం గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాలకు వెళ్తున్నారు. వెళ్లిన చోట ప్రతి సారి ఇబ్బందులు ఎదుర్కొంటున్న దుస్థితి నెలకుంటుంది. ఈ పరిస్థితి లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది. జెట్టీ లు, ఫిషింగ్‌ హార్బర్, పోర్టు నిర్మాణంతో మత్స్యకారుల బతుకుల్లో సరికొత్త వెలుగులు తీసుకురావాలని భావి స్తోంది. మత్స్యకారుల వలసలు తగ్గించేందుకు ఏడాది లోగా పనులు ప్రారంభించే లక్ష్యంగా వెళ్తోంది.

ఎచ్చెర్ల మండలం బుగడుట్ల పాలెంలో రూ. 332 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్, డి.మత్స్యలేశం పంచాయతీ రాళ్లపేటలో రూ. 21.92కోట్లతో జెట్టీలు (ఫిష్‌ల్యాండింగ్‌ కేంద్రా లు), కవిటి మండలం ఇద్దువానిపాలెంలో రూ. 12కోట్ల తో జెట్టీలు, వజ్రపుకొత్తూరు మండలంలోని నీళ్లపేటలో రూ. 11.95కోట్లతో జెట్టీలు వంటి నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే భావనపాడు తీరానికి కూత వేటు దూరంలో వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట వద్ద  ఫిషింగ్‌ ల్యాండింగ్‌ కేంద్రం (జెట్టీ) నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత కొన్ని నెలల క్రితం శంకు స్థాపన చేశారు. తాజాగా జెట్టీ పనులు సైతం ప్రారంభమయ్యాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement