భావనపాడు పోర్టు ఏర్పాటుతో రోడ్డునపడుతున్న బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. వారి పోరాటానికి వెన్నుదన్నుగా నిలుస్తామని భరోసానిచ్చింది. మత్స్యకారుల జీవనానికి విఘాతం కలిగిస్తే ఊరుకోమని హెచ్చరించింది. కడదాకా వెంటనిలిచి... విజయం సాధించేదాకా ఉద్యమం చేపడతామని స్పష్టంచేసింది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : మత్సకారుల ఇష్టానికి వ్యతిరేకంగా బావనపాడులో పోర్టు నిర్మాణం చేపడితే ఊరుకునేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు. శనివారం బావనపాడులో చేపట్టిన ర్యాలీ, గ్రామసభల్లో నాయకులు పాల్గొని గ్రామస్తులకు మద్దతు ప్రకటించారు. పచ్చని తమ బతుకుల్లో అగ్గిరాజేసే ప్రయత్నం చేస్తే టీడీపీ నేతల్ని తరిమి తరిపి కొడతామని తీర్మానించుకున్న గ్రామస్తులు పిల్లా పాపలతో ఆడ, మగ తేడా లేకుండా భారీ వర్షంలోనూ నినాదాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో తెలుగుదేశం నాయకులు కూడా ఉండటం విశేషం.
అంతులేని బాబు భూదాహం: తమ్మినేని
సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ చంద్రబాబు భూ దాహానికి అంతేలేకుండా పోతోందని ఆరోపించారు. రాజధాని నిర్మాణం పేరిట గుంటూరులో, విమానాశ్రయం పేరిట భోగాపురంలో భూములు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని, పేదల బతుకులపై బుగ్గిపడే విధంగా మంత్రులు, ఎమ్మెలు సహా ముఖ్యమంత్రే ప్రయత్నిస్తుంటే గ్రామస్తులె వరికి ఫిర్యాదివ్వాలని ప్రశ్నించారు. పోర్టు పేరిట 12వేలు కాదు, 33వేల ఎకరాలు సేకరిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. రాజకీయాల కోసం కాదు, జీవించే హక్కు కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. వడ్డితాండ్ర , సోంపేటల్లో ఐదేళ్ల నుంచి పోరాటం చేస్తున్నామని, మంత్రి అచ్చెన్నాయుడి కుటుంబసభ్యుల కోసం చట్టాల్ని ఉల్లంఘించి భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గాలీ, నీరు స్వచ్చంగా ఉన్న చోట బీడు భూములని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పోలాకి, సోంపేట, కొవ్వాడ పరిశ్రమలకు బొగ్గు రవాణాకోసమే పోర్టు నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు.
మత్స్యకారుల పొట్టగొడతారా: ధర్మాన కృష్ణదాస్
ఎప్పటినుంచో ఇక్కడి మత్స్యకారులు జెట్టీ, ఫిషింగ్ హార్బర్ కావాలని కోరితే పట్టించుకోని ముఖ్యమంత్రి పోర్టు నిర్మాణం ఎలా చేపడతారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణధాస్ నిలదీశా రు. మత్య్సకారుల అభివృద్ధి కో సం వైఎస్ ఎంతో చేశారని గుర్తిం చారు. ఆయన వారసుడిగా జగన్‌మోహన్‌రెడ్డి కూడా బావనపాడు పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారని అభయమిచ్చారు.
అమాయకుల్ని ఎలా మోసగిస్తారు: రెడ్డి శాంతి
అమాయకులైన మత్స్యకారులను ఎలా మోసగించాలని ఆలోచిస్తున్నారని తెలుగుదేశం నాయకులను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ప్రశ్నించారు. పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారందరికీ అభినందనలు తెలియజేస్తూ పోరాటానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
రేపటి నుంచి పోరాటం ఉధృతం
పోరాటాన్ని సోమవారం నుంచి ఉధృతం చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ప్రతి కుటుంబం నుంచి ఓ వ్యక్తి సంతకం పెట్టి జిల్లా కలెక్టర్ సహా రెవెన్యూ యంత్రాంగానికి విజ్ఞాపన పత్రాలు అందజేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం నేతలు సహా వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు జుత్తు జగన్నాయకులు, దువ్వాడ శ్రీనివాస్, గొర్లె కిరణ్‌కుమార్‌తోపాటు పార్టీ నేతలు పేరాడ తిలక్, బాబాజీ, కె.వి.సత్యనారాయణ, రొక్కం సూర్యప్రకాశరావు, రైతు కూలీ సంఘం నేతలు హాజర య్యారు.
పోరాటానికి అండ
Published Sat, Sep 12 2015 11:58 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement