టీడీపీకి షాక్ | Shock to TDP in Vizianagaram | Sakshi
Sakshi News home page

టీడీపీకి షాక్

Published Tue, Jan 6 2015 3:06 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

టీడీపీకి షాక్ - Sakshi

టీడీపీకి షాక్

 సాక్షి ప్రతినిధి, విజయనగరం :  అధికారం అండతో బెదిరించి లబ్ధిపొందుదామనుకున్న టీడీపీకి  మత్స్యకార సంఘ నాయకులిచ్చిన తీర్పు  చెంప పెట్టు అయింది. రాజకీయాలకు అతీతంగా జరగవలసిన ఎన్నికల్లో తలదూర్చిచిన నే‘తల’కు బొప్పికట్టింది.    జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో   తమ మద్దతుదారులను గెలిపించుకోవాలని చివరి నిమిషం వరకు ఆ పార్టీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు.  పూర్తి స్థాయి మెజార్టీ లేకపోయినా  కుట్ర పూరితంగా  వ్యవహరించి  ప్రలోభాలు, బెదిరింపులతో సొసైటీ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.   జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను ప్రతీ ఐదేళ్లకు నిర్వహిస్తారు. ఆ మేరకు  గత ఏడాది జూన్  28న  నోటిఫికేషన్ విడుదల చేశారు. మత్స్యకార ప్రతినిధులుగా ఉన్న 11మంది డెరైక్టర్లు ఈ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఆ 11మంది తమలో ఇద్దర్ని అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవాలి.
 
 షెడ్యూల్‌లో భాగంగా  విజయనగరం రైల్వే స్టేషన్ రోడ్డులో గల  మత్స్య అభివృద్ధి కార్యాలయంలో  గత ఏడాది జూలై 8న ఎన్నిక నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.  జిల్లా సహకార అసిస్టెంట్ రిజిస్టార్ కె.దక్షిణామూర్తి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.   అధ్యక్ష పదవికి చింతపల్లికి చెందిన జలపుత్ర సాగర సహకార సంఘం అధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న, గరుగుబిల్లికి చెందిన షిర్డీ స్వదేశీ మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు దాసరి లక్ష్మణ   నామినేషన్ వేశారు. అలాగే, ఉపాధ్యక్ష పదవికి విజయనగరానికి చెందిన గంగ పుత్ర స్వదేశీ మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు పైడిశెట్టి మోహన్ నామినేషన్ వేశారు. నామినేషన్  పత్రాల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం జరిగింది.  కాకపోతే, అధ్యక్ష పదవికి  రెండు నామినేషన్లలో ఏ ఒక్కటీ ఉపసంహరణకు నోచుకోకపోవడంతో ఎన్నిక అనివార్యమయింది.
 
 అయితే, టీడీపీ మద్దతుదారునికి తగిన మెజార్టీ లేకపోవడంతో గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు రంగంలోకి దిగి హడావుడి చేశారు. ఈ సందర్భంలో బర్రి చిన్నప్పన్న, ఎమ్మెల్యే మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇదే సందర్భంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు తెరవెనుక ప్రయత్నాలు చేశారు.  అప్పటి కలెక్టర్ కాంతిలాల్ దండేపై ఒత్తిడి తెచ్చి  ఎన్నికల అధికారిని గైర్హాజర్ చేయించారు. ఎంత హైడ్రామా నడిపారంటే అప్పటికప్పుడు ఎన్నికల అధికారి అనారోగ్యానికి గుయ్యారని,  ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని, తప్పని పరిస్థితుల్లో ఎన్నికను నిలిపేస్తున్నట్టు మత్స్యశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ ప్రకటించారు. కానీ తర్వాత తేదీ ప్రకటించలేదు. దీంతో వైఎస్సార్‌సీపీ మద్దతు దారునిగా ఉన్న బర్రి చిన్నప్పన్న, ఆయన అనుచరులు పలు పర్యాయాలు జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌ను కలిసి తక్షణమే ఎన్నిక నిర్వహించాలని కోరారు. కానీ అధికారులు స్పందించలేదు. దీంతో బర్రి చిన్నప్పన్న హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలను నిర్వహించాలని పిటీషన్ చేశారు. దీంతో స్పందించిన హైకోర్టు ఎన్నికలను నిర్వహించాలని జిల్లా అధికారులను ఆదేశించింది.
 
   ఈ నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్ 19న మళ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఇద్దరు, ఉపాధ్యక్ష పదవికి ఒకరు నామినేషన్ వేశారు. కానీ పట్టు విడవని టీడీపీ నాయకులు ప్రతిష్టగా తీసుకుని సభ్యుల్ని తీవ్ర ప్రలోభాలకు గురి చేశారు.  తమ అనుకూల అధ్యక్ష అభ్యర్థికి మద్దతివ్వాలని  బెదిరింపులకు సైతం దిగారు. సభ్యులపైనే కాకుండా నామినేషన్లు వేసిన వారిని ఒత్తిళ్లకు గురి చేయడంతో భరించలేక అభ్యర్థులంతా వ్యూహాత్మకంగా నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో మళ్లీ ఎన్నిక నిలిచిపోయింది. తాజాగా సోమవారం ముచ్చటగా మూడోసారి ఎన్నిక చేపట్టారు. ఈ సారి విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత, జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ రంగంలోకి దిగారు.  హైడ్రామా నడిచింది. ఎలాగైనా జిల్లా మత్స్యకార సహకార సంఘ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను తమ పార్టీ నేతలకే దక్కాలని తీవ్రంగా ప్రయత్నించారు.

 వీరి ఎత్తుగడలన్నీ గమనించిన మెజార్టీ సభ్యులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వ్యతిరేకంగా ఉన్నామని కనిపిస్తే ఇబ్బందులు పెడతారని, వాళ్లు చెప్పినట్టే వ్యవహరిస్తే ఏ ఇబ్బందీ ఉండదన్న ఆలోచనకొచ్చి రాజీ ఫార్మలాతో  ముందుకెళ్లారు. ఆ పార్టీ నేతలు చెప్పినట్టే అధ్యక్ష పదవికి మురుముళ్లు నాయుడు, ఉపాధ్యక్ష పదవికి దాసరి లక్ష్మణ నామినేషన్ వేశారు. చివరి నిమిషంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారైన బర్రి చిన్నప్పన్న కూడా నామినేషన్ వేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు  అవాక్కయ్యారు. నామినేషన్  ఉపసహరించుకోవాలని  బర్రి చిన్నప్పన్నపై తీవ్రంగా ఒత్తిడి చేసినా లొంగలేదు.
 
  దీంతో ఓటు హక్కు గల 10మంది సభ్యుల్ని యుద్ధ ప్రాతిపదికన ఎన్నికల ప్రాంగణం నుంచి అశోక్ బంగ్లాకు తీసుకెళ్లి బలవంతంగా టీడీపీ కండువా వేయించేశారు.  అయినా   ఓటింగ్‌కు వచ్చేసరికి ఆంతరాత్మ ప్రభోదించినట్టు ఓటువేశారు. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికల్లో టీడీపీ పెత్తనమేంటని ఆగ్రహంతో ఉన్న సభ్యులు   ఓటు హక్కు ద్వారా దానిని వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడికి ఆరు ఓట్లు పడగా, టీడీపీ మద్దతుదారుడికి ఐదు ఓట్లు పడ్డాయి. దీంతో ఒక్క ఓటు తేడాతో వైఎస్సార్ సీపీ మద్దతుదారుడు  బర్రి చిన్నప్పన్న విజయం సాధించారు. దీంతో టీడీపీ నేతలు షాక్‌కు గురయ్యారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement