attandance
-
డుమ్మా టీచర్లకు చెక్!
సూర్యాపేట: పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల హాజరుపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. చాలా మంది ఉపాధ్యాయులు సెలవు కోసం దరఖాస్తు చేయకుండా అనధికారికంగా దీర్ఘకాలం విధులకు గైర్హాజరవుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో హాజరుపై ప్రత్యేక నిఘా పెట్టాలని పాఠశాల విద్యా శాఖ సంచాలకురాలు దేవసేన ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అనధికారికంగా విధులకు డుమ్మా కొడుతున్న వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్జేడీలు, డీఈఓలకు ఆదేశాలు ఇచ్చారు. అనుమతిపై విదేశాలకు వెళ్లిన వారు గడువు ముగిసినా విధుల్లో చేరకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇలాంటి వారి విషయంలో ప్రధానోపాధ్యాయుల నుంచి ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం అందడం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనధికారిక గైర్హాజరుతో విద్యార్థులకు ఎంతో నష్టం జరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి సెలవుల వివరాలను వెంటనే ఆనన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యా శాఖ ముందుకెళ్తోంది. 950 స్కూళ్లు.. 3,900 మంది టీచర్లు.. జిల్లా వ్యాప్తంగా 950 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 70వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 3,900 మంది వరకు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అయితే మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో కొంత మంది ఉపాధ్యాయులు ఎలాంటి సమాచారం లేకుండా సెలవు పెట్టి వెళ్తున్నట్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని విద్యా శాఖ సెలవుల కంప్యూటీకరణకు కసరత్తు చేపట్టింది. కాంప్లెక్స్ హెచ్ఎంలకు బాధ్యతలు.. ఉపాధ్యాయుల సెలవుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసే బాధ్యతలను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. ప్రతి హెచ్ఎం 10 నుంచి 15 పాఠశాలలను పర్యవేక్షించనున్నారు. కాంప్లెక్స్ పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సెలవుల వివరాలను ప్రధానోపాధ్యాయుల నుంచి తీసుకొని ప్రతినెలా 5వ తేదీలోగా ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. సెలవుల రిజిస్టర్‌ను పాఠశాల హెచ్ఎం మాత్రమే ఆనన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు. ప్రతి ఉపాధ్యాయుడు ఏ నెలలో ఎన్ని సీఎల్‌లు, ఓసీఎల్లు వినియోగించుకున్నారో ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసేలా చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉపాధ్యాయుల అనధికారిక గైర్హాజరుకు బ్రేక్ పడనుంది. అనుమతి లేకుండా విధులకు డుమ్మా కొడితే సీసీఏ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పారదర్శకత పెరుగుతుంది ఉపాధ్యాయుల హాజరును ఇప్పటికే బయోమెట్రిక్ ద్వారా నమోదు చేస్తున్నాం. దీనికి తోడు సెలవుల కంప్యూటరీకరణ వల్ల పారదర్శకత మరింత పెరుగుతుంది. స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్లర్లు కంప్యూటరీకరణ బాధ్యతలను నిర్వర్తించడం వల్ల పకడ్భందీగా రికార్డులను నిర్వహించే అవకాశాలుంటాయి. ఉపాధ్యాయుల డుమ్మా ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ఇది దోహదపడుతుంది. – అశోక్, డీఈఓ, సూర్యాపేట -
బయోమెట్రిక్ బెంగ
పనొకచోట.. హాజరు మరోచోట కిలో మీటర్ల దూరం ప్రయాణం వారానికి రెండు రోజులు గైర్హాజరుగా నమోదు గ్రంథపాలకులకు అదనపు విధులు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు.. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం అవి సమస్యలతో సతమతమవుతున్నాయి. సిబ్బంది కొరత వెంటాడుతోంది. బయోమెట్రిక్ హాజరు తప్పని సరి చేయడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి సమయాన్ని వృథా చేసుకోవాల్సి వస్తోంది. కిలో మీటర్ల దూరం వెళ్లి హాజరు వేయాల్సివస్తోంది. ఇతర శాఖల పనివేళలు, గ్రంథాలయాల పనివేళల్లో వ్యత్యాసం కారణంగా సిబ్బంది హాజరు వేసినా నమోదు కాని పరిస్థితి ఉంది. రోజుకు నాలుగుసార్లు హాజరు వేయాల్సి రావడం, మెషీన్లు లేకపోవడం తదితర సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండడంలేదని గ్రంథపాలకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కొరత జిల్లాలో గ్రేడ్1 లైబ్రరీలు 5, గ్రేడ్2 లైబ్రరీలు2, గ్రేడ్3 లైబ్రరీలు 65 ఉన్నాయి. వీటిలో పనిచేయడానికి 129 మంది సిబ్బంది అవసరంకాగా ప్రస్తుతం 78 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలో గ్రేడ్1 లైబ్రేరియన్లు నలుగురు, గ్రేడ్2 లైబ్రేరియ¯న్ ఒకరు, గ్రేడ్3 లైబ్రేరియన్లు 42 మంది ఉన్నారు. వీరిలో 15 మంది వరకూ మహిళా లైబ్రేరియన్లు ఉన్నారు. హాజరుకు అవస్థలు బయోమెట్రిక్ హాజరు అమలుతో గ్రంథాలయాల సిబ్బంది తీవ్ర పనిఒత్తిడికి గురవుతున్నారు. గ్రంథాలయాలు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాయి. దీంతో వీరు నాలుగు సార్లు బయోమెట్రిక్ వేయాల్సి వస్తోంది. ఇతర ఉద్యోగులయితే ఉదయం 10 గంటలకు, సాయంత్రం 4 గంటలకు బయోమెట్రిక్ వేస్తే సరిపోతుంది. గ్రంథపాలకులు మాత్రం 8 గంటలకు పాఠకులకు దినపత్రికలు, ఇతర పత్రికలు పఠనానికి అనువుగా సిద్ధం చేయాలి. దీనికి కనీసం అరగంట ముందొస్తే గానీ సాధ్యం కాదు. బయోమెట్రిక్ హాజరు వేయాలంటే ఇంకో అరగంట ముందే రావాల్సి వస్తోంది. జిల్లా కేంద్ర గ్రంథాలయం మినహా ఏ గ్రంథాలయంలోనూ బయోమెట్రిక్ మెషీన్లు ఏర్పాటు చేయలేదు. దీంతో ఆయా గ్రంథాలయాల సిబ్బంది పంచాయతీ కార్యాలయం లేదా తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో హాజరు వేయాల్సివస్తోంది. ఈ కార్యాలయాలు గ్రంథాలయాలకు సుమారు 5 కిలో మీటర్ల దూరం ఉంటుంది. రోజుకు నాలుగు సార్లు బయోమెట్రిక్ వేయాలంటే గ్రంథపాలకులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. విధుల్లో ఉన్నా లేనట్టే జిల్లాలోని పలువురు గ్రంథపాలకులు రెండు గ్రంథాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఒక పూట ఒక గ్రంథాలయం, మరో పూట మరో గ్రంథాలయంలో విధులు నిర్వహిస్తువారు బయోమెట్రిక్ హాజరు వేయడానికి నానా హైరానా పడుతున్నారు. ఒక్కోసారి ఆయా కార్యాలయాలు తెరిచి ఉండకపోవడం, బయోమెట్రిక్ మెషీన్ అందుబాటులో లేకపోవడం, మరికొన్ని సందర్భాల్లో కార్యాలయాలు తెరిచి ఉన్నా విద్యుత్ సరఫరా లేకపోవడం వంటి సమస్యలతో హాజరు వేయలేకపోతున్నారు. ఆదివారాలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. లైబ్రరీలకు పనిదినం కావడంతో ఆదివారాల్లో హాజరు వేయలేకపోతున్నారు. శుక్రవారం లైబ్రెరీలకు సెలవు కావడంతో గ్రంథపాలకులు హాజరు వేయరు. ఈ నేపథ్యంలో వారు విధుల్లో ఉన్నా వారానికి రెండు రోజులు గైర్హాజరైనట్లు నమోదవుతోంది. దీంతో వారు లబోదిబోమంటున్నారు. 15 రోజుల్లో మెషీన్ల ఏర్పాటు జయ్యవరపు శ్రీరామ్మూర్తి, చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ బయోమెట్రిక్ హాజరుకు గ్రంథపాలకులు ఇబ్బందులు పడడం వాస్తవమే. త్వరలోనే పర్చేజింగ్ కమిటీ సమావేశం నిర్వహించి మెషీన్ల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంటాం. సుమారు రూ.15 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. మరో 15 రోజుల్లో జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో బయోమెట్రిక్ మెషీన్లు ఏర్పాటు చేస్తాం. -
గ్రూప్–2లో మరింత తగ్గిన హాజరు
♦ 63.02 శాతానికి పరిమితం ♦ పేపర్–3, పేపర్–4 పరీక్షలూ ప్రశాంతం ♦ పరీక్షల నిర్వహణలో సహకరించిన ♦అందరికీ కృతజ్ఞతలు: ఘంటా చక్రపాణి సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,032 పోస్టుల భర్తీకి చేపట్టిన గ్రూప్–2 పరీక్షల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన పేపర్–3, పేపర్–4 రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థుల సంఖ్య మరింత తగ్గింది. శుక్రవారం జరిగిన పేపర్–1, పేపర్–2 పరీక్షలకు 65.60 శాతం మంది హాజరవగా ఆదివారం నిర్వహించిన పరీక్షలకు 63.02 శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. కొన్ని కేంద్రాల్లో ఒకే బార్‌కోడ్‌గల ప్రశ్నపత్రం, ఓఎంఆర్ జవాబుపత్రాల జారీలో పొరబాట్లు దొర్లగా పలు చోట్ల బయోమెట్రిక్ మెషిన్లు మొరాయించాయి. అయితే పేపర్–1, పేపర్–2 పరీక్షలతో పోలిస్తే పెద్దగా గందరగోళం లేకుండానే మొత్తంమీద పేపర్–3, పేపర్–4 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షల తొలిరోజు (శుక్రవారం) ఎదురైన అనుభవాలతో అభ్యర్థులు జాగ్రత్తపడ్డారు. పరీక్షలకు చాలా చోట్ల వారు సకాలంలో హాజరయ్యారు. ఉదయం నుంచే ఆయా పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరి కనిపించారు. దక్షిణ తెలంగాణ జిల్లాల పరిధిలో దాదాపు పది మంది అభ్యర్థులు నిమిషం ఆలస్యం నిబంధన, సరైన ధ్రువపత్రాలు చూపకపోవడం వంటి కారణాల వల్ల పరీక్షలు రాసే అవకాశాన్ని కోల్పోయారు. జనగామ జిల్లా కేంద్రంలో ఏకశిల పబ్లిక్ స్కూల్లో కేంద్రంలో 14 మంది విద్యార్థులకు ఓఎంఆర్ షీట్, ప్రశ్నపత్రం ఒకే నంబర్‌కు బదులు వేర్వేరు నంబర్లతో ఇవ్వడంతో గందరగోళం నెలకొంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగులో మూడు పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ మిషన్లు మొరాయించాయి. మొదటి రోజు పరీక్షల సందర్భంగా నెట్వర్క్ సమస్య కారణంగా అభ్యర్థులందరి బయోమెట్రిక్ సమాచారం సేకరణ సాధ్యం కాలేదని, కానీ ఆదివారం పరీక్షలకు హాజరైన అభ్యర్థులందరి బయోమెట్రిక్ డేటాను సేకరించామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రమణ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణను చీఫ్ సూపరింటెండెంట్లు పరిశీలించారని, వారి అనుమానాలను కమిషన్ ఎప్పటికప్పుడు నివృత్తి చేసిందన్నారు. కమిషన్ సభ్యులతో కూడిన మూడు బృందాలు హైదరాబాద్‌లోని పరీక్ష కేంద్రాల్లో పరిశీలన జరిపినట్లు వివరించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు కమిషన్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, చీఫ్ సూపరింటెండెంట్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుందన్నారు. టీఎస్పీఎస్సీ సిబ్బందితోపాటు 350 స్పెషల్ స్క్వాడ్లు పరీక్ష కేంద్రాలకు వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలన జరిపాయన్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, ఆర్టీసీ, విద్యుత్ శాఖ అధికారులకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి కృతజ్ఞతలు తెలిపారు. గర్భిణికి పరీక్ష... సిరిసిల్లలోని వికాస్ డిగ్రీ కళాశాలలో గ్రూప్–2 పరీక్షలు రాసేందుకు వచ్చిన వేములవాడకు చెందిన నంభీ నాగరాణి అనే ఏడు నెలల గర్భిణి రెండో అంతస్తులోని పరీక్ష హాల్లోకి వెళ్లలేక ఇబ్బంది పడింది. ఆమె విన్నపం మేరకు పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్ జేసీ యాస్మిన్ బాషాకు సమాచారం అందించగా ఆమె ఆదేశాల మేరకు తహసీల్దార్ రాజు పరీక్ష కేంద్రానికి చేరుకొని సహాయకుల ద్వారా నాగరాణిని మెట్లపై ఉన్న గదికి పంపించడానికి ప్రయత్నించారు. ఆమె ఎక్కలేకపోవడంతో ప్రిన్సిపాల్ ప్రాంగణంలో ప్రత్యేక పర్యవేక్షణ మధ్య పరీక్ష రాయించారు. అభ్యర్థి బిడ్డకు మహిళా కానిస్టేబుల్ స్తన్యం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో ఉన్న జీఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజీ కేంద్రంలో చోటుచేసుకున్న సంఘటన మాతృత్వపు మమకారానికి నిదర్శనంగా నిలిచింది. ఐదు నెలల బిడ్డతో కలసి గ్రూప్–2 పరీక్షలు రాసేందుకు వచ్చిన ఓ తల్లి... పరీక్ష కేంద్రం బయట తన బంధువుకు బిడ్డను అప్పగించి పరీక్ష రాస్తుండగా ఆ చిన్నారి పాల కోసం గుక్కపెట్టింది. దీంతో అక్కడే డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ స్వర్ణలతారెడ్డి ఆ పాపకు పాలిచ్చి బిడ్డ ఆకలి తీర్చింది.