బయోమెట్రిక్ బెంగ
Published Tue, Aug 29 2017 11:06 PM | Last Updated on Tue, Sep 12 2017 1:17 AM
పనొకచోట.. హాజరు మరోచోట
కిలో మీటర్ల దూరం ప్రయాణం
వారానికి రెండు రోజులు గైర్హాజరుగా నమోదు
గ్రంథపాలకులకు అదనపు విధులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) :
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు.. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం అవి సమస్యలతో సతమతమవుతున్నాయి. సిబ్బంది కొరత వెంటాడుతోంది. బయోమెట్రిక్ హాజరు తప్పని సరి చేయడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి సమయాన్ని వృథా చేసుకోవాల్సి వస్తోంది. కిలో మీటర్ల దూరం వెళ్లి హాజరు వేయాల్సివస్తోంది. ఇతర శాఖల పనివేళలు, గ్రంథాలయాల పనివేళల్లో వ్యత్యాసం కారణంగా సిబ్బంది హాజరు వేసినా నమోదు కాని పరిస్థితి ఉంది. రోజుకు నాలుగుసార్లు హాజరు వేయాల్సి రావడం, మెషీన్లు లేకపోవడం తదితర సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండడంలేదని గ్రంథపాలకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బంది కొరత
జిల్లాలో గ్రేడ్1 లైబ్రరీలు 5, గ్రేడ్2 లైబ్రరీలు2, గ్రేడ్3 లైబ్రరీలు 65 ఉన్నాయి. వీటిలో పనిచేయడానికి 129 మంది సిబ్బంది అవసరంకాగా ప్రస్తుతం 78 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలో గ్రేడ్1 లైబ్రేరియన్లు నలుగురు, గ్రేడ్2 లైబ్రేరియ¯న్ ఒకరు, గ్రేడ్3 లైబ్రేరియన్లు 42 మంది ఉన్నారు. వీరిలో 15 మంది వరకూ మహిళా లైబ్రేరియన్లు ఉన్నారు.
హాజరుకు అవస్థలు
బయోమెట్రిక్ హాజరు అమలుతో గ్రంథాలయాల సిబ్బంది తీవ్ర పనిఒత్తిడికి గురవుతున్నారు. గ్రంథాలయాలు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాయి. దీంతో వీరు నాలుగు సార్లు బయోమెట్రిక్ వేయాల్సి వస్తోంది. ఇతర ఉద్యోగులయితే ఉదయం 10 గంటలకు, సాయంత్రం 4 గంటలకు బయోమెట్రిక్ వేస్తే సరిపోతుంది. గ్రంథపాలకులు మాత్రం 8 గంటలకు పాఠకులకు దినపత్రికలు, ఇతర పత్రికలు పఠనానికి అనువుగా సిద్ధం చేయాలి. దీనికి కనీసం అరగంట ముందొస్తే గానీ సాధ్యం కాదు. బయోమెట్రిక్ హాజరు వేయాలంటే ఇంకో అరగంట ముందే రావాల్సి వస్తోంది. జిల్లా కేంద్ర గ్రంథాలయం మినహా ఏ గ్రంథాలయంలోనూ బయోమెట్రిక్ మెషీన్లు ఏర్పాటు చేయలేదు. దీంతో ఆయా గ్రంథాలయాల సిబ్బంది పంచాయతీ కార్యాలయం లేదా తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో హాజరు వేయాల్సివస్తోంది. ఈ కార్యాలయాలు గ్రంథాలయాలకు సుమారు 5 కిలో మీటర్ల దూరం ఉంటుంది. రోజుకు నాలుగు సార్లు బయోమెట్రిక్ వేయాలంటే గ్రంథపాలకులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.
విధుల్లో ఉన్నా లేనట్టే
జిల్లాలోని పలువురు గ్రంథపాలకులు రెండు గ్రంథాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఒక పూట ఒక గ్రంథాలయం, మరో పూట మరో గ్రంథాలయంలో విధులు నిర్వహిస్తువారు బయోమెట్రిక్ హాజరు వేయడానికి నానా హైరానా పడుతున్నారు. ఒక్కోసారి ఆయా కార్యాలయాలు తెరిచి ఉండకపోవడం, బయోమెట్రిక్ మెషీన్ అందుబాటులో లేకపోవడం, మరికొన్ని సందర్భాల్లో కార్యాలయాలు తెరిచి ఉన్నా విద్యుత్ సరఫరా లేకపోవడం వంటి సమస్యలతో హాజరు వేయలేకపోతున్నారు. ఆదివారాలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. లైబ్రరీలకు పనిదినం కావడంతో ఆదివారాల్లో హాజరు వేయలేకపోతున్నారు. శుక్రవారం లైబ్రెరీలకు సెలవు కావడంతో గ్రంథపాలకులు హాజరు వేయరు. ఈ నేపథ్యంలో వారు విధుల్లో ఉన్నా వారానికి రెండు రోజులు గైర్హాజరైనట్లు నమోదవుతోంది. దీంతో వారు లబోదిబోమంటున్నారు.
15 రోజుల్లో మెషీన్ల ఏర్పాటు
జయ్యవరపు శ్రీరామ్మూర్తి, చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ
బయోమెట్రిక్ హాజరుకు గ్రంథపాలకులు ఇబ్బందులు పడడం వాస్తవమే. త్వరలోనే పర్చేజింగ్ కమిటీ సమావేశం నిర్వహించి మెషీన్ల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంటాం. సుమారు రూ.15 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. మరో 15 రోజుల్లో జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో బయోమెట్రిక్ మెషీన్లు ఏర్పాటు చేస్తాం.
Advertisement
Advertisement