దసరా తర్వాత ఏఈఈ ఇంటర్వ్యూలు!
నేడు ప్రాథమిక కీ విడుదల
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి దసరా తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశాలు పరిశీలిస్తున్నామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. హార్టికల్చర్, అగ్రికల్చర్ ఆఫీసర్, ఏఈఈ పోస్టులకు ఆదివారం ఏర్పాటు చేసిన రాత పరీక్ష జరుగుతున్న తీరును టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ సెంట్రల్ ద్వారా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఈఈ (మెకానికల్) ప్రాథమిక కీని ఈ నెల 19న (సోమవారం) విడుదల చేయనున్నట్లు తెలిపారు.
అలాగే అభ్యర్థులు తమ జవాబు పత్రాలను ప్రత్యేక లింకు ద్వారా పొందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్షకు సంబంధించి కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నందున వాటి కీ, జవాబు పత్రాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచడంలో కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్షకు 85%, అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్షకు 83%, ఏఈఈ రాత పరీక్షకు 63% మంది అభ్యర్థులు హాజరైనట్లు వివరించారు.
ఎడ్‌సెట్ సీట్ల కేటాయింపు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఎడ్‌సెట్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ఆదివారం ముగిసింది. సీట్ అలాట్‌మెంట్ కార్డులను సంబంధింత వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 28లోపు సంబంధిత కళాశాలల్లో అభ్యర్థులు రిపోర్ట్ చేయాలి. మొదటి, తుది దశ కౌన్సెలింగ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 202 కళాశాలల్లో కన్వీనర్ కోటాలో మొత్తం 15,365 సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. ఈ మేరకు ఎడ్‌సెట్-2015 కన్వీనర్ పి. ప్రసాద్ తెలిపారు. ప్రత్యేక ఫీజులతో కలిపి మొత్తం రూ. 16,500కు మించి ఒక్క పైసా కూడా కళాశాలల యాజమాన్యాలకు చెల్లించనవసరం లేదని కన్వీనర్ అభ్యర్థులకు సూచించారు. ఒకవేళ ఎవరైనా అదనంగా ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
ఓయూ ఇంజనీరింగ్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ రీవాల్యూయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్, జూన్ నెలల్లో జరిగిన పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు రీవాల్యూయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే. ఫలితాలను ఉస్మానియా వెబ్‌సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు.
292 ఎంఈడీ సీట్ల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఎంఈడీ కౌన్సెలింగ్‌లో భాగంగా 4 వర్సిటీల పరిధిలోని 292 మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఈడీ) సీట్లు భర్తీ అయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీలోని అడ్మిషన్స్ డెరైక్టర్ కార్యాలయంలో ఆదివారం జరిగిన కౌన్సెలింగ్‌లో దాదాపు 1,200 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. అప్పటికప్పుడే సీట్లు భర్తీ చేశారు. మొత్తం 340 సీట్లలో 292 భర్తీ అయ్యాయి. ఈ నెల 31న తుది కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అడ్మిషన్స్ డెరైక్టర్ గోపాల్ రెడ్డి తెలిపారు.
విద్య, ఉద్యోగ సమాచారం
Published Mon, Oct 19 2015 3:39 AM | Last Updated on Sun, Sep 3 2017 11:10 AM
Advertisement
Advertisement