ప్యానెల్ ఇంటర్వ్యూలో నెగ్గండిలా.. | Can be faced the Panel interview like this | Sakshi
Sakshi News home page

ప్యానెల్ ఇంటర్వ్యూలో నెగ్గండిలా..

Published Sat, Aug 16 2014 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

ప్యానెల్ ఇంటర్వ్యూలో నెగ్గండిలా..

ప్యానెల్ ఇంటర్వ్యూలో నెగ్గండిలా..

జాబ్ స్కిల్స్:  జాబ్ ఇంటర్వ్యూను ఎదుర్కోవడం అనగానే.. కొంత సంశయం, బెరుకు సహజమే. ముందుగా సన్నద్ధమైతే ఇందులో విజయం సాధించడం సులువే. గతంలో సంస్థలు నియమిం చే ఇంటర్వ్యూ బోర్డులో ఒక్క సభ్యుడే ఉండేవారు. అయితే, ఇటీవలి కాలంలో ప్యానెల్ ఇంటర్వ్యూల సంఖ్య పెరుగుతోంది. అభ్యర్థిని రెండు మూడు సార్లు ఇంటర్వ్యూ చేసే పద్ధతికి కంపెనీలు స్వస్తి పలుకుతున్నాయి. సమయాభావం వల్ల ఈ నిర్ణయానికొచ్చాయి. ప్యానెల్ ఇంటర్వ్యూ బోర్డులో సాధారణంగా మూడు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉంటారు. వీరు తమతమ రంగాల్లో నిష్ణాతులై ఉంటారు. ప్యానెల్ ఇంటర్వ్యూలో ఎక్కువ మంది సభ్యులు ఉంటారు కాబట్టి దీన్ని ఎదుర్కోవడం కష్టమని అభ్యర్థులు భయపడుతుంటారు. వారంతా కలిసికట్టుగా తమపై దాడి చేయబోతున్నట్లు భీతిచెందుతుంటారు. కానీ, కొన్ని చిట్కాలను పాటిస్తే ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ప్యానెల్ ఇంటర్వ్యూ పూర్తిచేయొచ్చు.  
 
 ప్యానెల్‌లో ఉండేదెవరు?
 మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోయే ప్యానెల్‌లో సభ్యులుగా ఎవరెవరు ఉంటారో ముందుగానే తెలుసుకోవాలి. అవసరమైతే కంపెనీ మానవ వనరుల విభాగాన్ని సంప్రదించాలి. ఫేస్‌బుక్, లింక్డ్ ఇన్ లాంటి సామాజిక మాధ్యమాల్లో వారి వివరాలను పరిశీలించాలి. కంపెనీలో వారి హోదాలు, ప్రాముఖ్యత తెలుసుకోవాలి. దీనివల్ల మౌఖిక పరీక్షలో ప్యానెల్ సభ్యులతో వారి స్థాయి, హోదాను బట్టి మాట్లాడేందుకు ముందుగానే సిద్ధమవ్వొచ్చు.
 
 అందరినీ సమంగా..
 ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టిన తర్వాత ప్యానెల్ సభ్యులందరినీ వరుసగా విష్ చేయాలి. నేరుగా వారి కళ్లలోకి చూస్తూ మాట్లాడాలి. కేవలం ఒకే వ్యక్తిని చూస్తూ ఉండిపోవద్దు. ఒకరు ప్రశ్న వేసినా.. అందరి వైపు చూస్తూ సమాధానం చెప్పాలి. దీంతో మీపై సానుకూల ప్రభావం పడుతుంది. ప్యానె ల్‌తో సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది.
 
 సమాధానాలు మరోసారి వివరంగా...
 ప్యానెల్ సభ్యుల నేపథ్యాలు వేర్వేరుగా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో రంగంలో నిపుణులై ఉంటారు. వారు తమ రంగానికి సంబంధించిన ప్రశ్నలు వేస్తుంటారు. అభ్యర్థులు ఒకే సమాధానాన్ని మరోసారి విడమర్చి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక రంగానికి సంబంధించిన సమాధానం ప్యానెల్‌లో మరొకరికి అర్థం కాకపోవచ్చు. పూర్తిగా వివరించమని వారు కోరే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ముందుగానే ప్రిపేర్ కావాలి. ఇంటర్వ్యూ ప్యానెల్  అప్పుడప్పుడు సరదా ప్రశ్నలు వేసే అవకాశం కూడా ఉంటుంది. వాటికి అలాగే సరదాగానే సమాధానాలు చెప్పాలి.
 
 కృతజ్ఞతలు... మర్చిపోవద్దు
 ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత ప్యానెల్ సభ్యులందరికీ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలపాలి. వారి బిజినెస్ కార్డులను అడిగి తీసుకోవాలి. ఒక కాగితంపై ఇంటర్వ్యూ బోర్డు సభ్యులను ఉద్దేశించి ‘థాంక్యూ’ అని రాసి రిసెప్షన్‌లో ఇచ్చి వెళ్లాలి. అది వారికి చేరుతుంది. దీనివల్ల మీరు వారికి గుర్తుండిపోతారు. ఉద్యోగ సాధనలో ఇతరుల కంటే ముందంజలో నిలుస్తారు. కొలువులో చేరిన తర్వాత ప్యానెల్ సభ్యులే అక్కడ మీ సహచరులుగా, బాస్‌లుగా కనిపించొచ్చు. కనుక ప్యానెల్ ఇంటర్వ్యూ అంటే మిమ్మల్ని భయపెట్టే భూతం కాదని తెలుసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement