క్రియేటీవ్ కార్డ్స్
విజిటింగ్ కార్డేనని తేలికగా తీసిపారేయకండలా.. అంటున్నారు బిజినెస్ పీపుల్. విజిటింగ్ కార్డును.. క్రెడిట్ కార్డంత జాగ్రత్తగా చూసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. కామన్‌మ్యాన్ నాడి పట్టేయాలంటే కాస్త వెరైటీ ఉండాలని ఫిక్సయిన వ్యాపారవేత్తలు.. ఆ విజిటింగ్ కార్డునే తమ వ్యాపారాభివృద్ధికి బ్రహ్మాస్త్రంలా వాడుతున్నారు. కార్డ్‌ను డిఫరెంట్‌గా డిజైన్ చేసి బిజినెస్ కార్డుగా మార్చి నయా ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు.
కరాటే మాస్టర్ విజిటింగ్ కార్డ్ ఇది. ఒక్క దెబ్బతో ఇటుకలు విరిచేయడం వీరికి మామూలే. తన కెరీర్‌కు ప్లస్ అయ్యే విధంగా విజిటింగ్ కార్డుకు ఈ రూపాన్నిచ్చాడాయన. ఇటుకలా కనిపిస్తున్న ఈ కార్డ్‌ను మధ్యలోకి విరిచేయవచ్చు. మళ్లీ ఒక్కటిగా చేర్చవచ్చు. ఈ డిఫరెంట్ కార్డ్ చూస్తే ఎవరైనా ఆయనకు శిష్యులుగా మారిపోవాల్సిందే. ఏమంటారు !
బిజినెస్
పీపుల్‌కు పరిచయాలు చాలా అవసరం. అందుకే వినియోగదారులు వచ్చే ఏ దారినీ వాళ్లు వదిలిపెట్టరు. తమ ప్రొఫెషన్‌ని విజిటింగ్ కార్డుతో పరిచయం చేయడం సహజమే. ఆ కార్డు ఆకారం చూడగానే వాళ్లు చేస్తున్న బిజినెస్ ఏంటో తెలుసుకునేలా డిజైన్ చేయించుకోవడం సిటీలో ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. వీటిని మామూలు కార్డుల్లా అలా చూసి ఇలా పారేయకుండా.. ‘ఎంత వెరైటీగా ఉన్నాయో..!’ అని దాచుకునేలా ఉంటున్నాయి. ఏదైనా పని పడితే సదరు వ్యక్తి వెరైటీ కార్డున్న సంస్థను సంప్రదించే అవకాశమూ బోలెడుంది. ఈ డిఫరెంట్ బిజినెస్ కార్డుల వ్యాపార రహస్యం కూడా అదే.
కస్టమర్‌ను దువ్వాలిగా..
ఓ హెయిర్ స్టైలిస్ట్ తన బిజినెస్ కార్డు.. దువ్వెన ఆకారంలో డిజైన్ చేయించాడు. ఆ కార్డును తాకినప్పుడల్లా సంగీతం కూడా వినిపిస్తుంటుంది. కస్టమర్‌ను ఎలా దువ్వాలో తెలిసిన సదరు వ్యాపారి.. తన కార్డుకు ఇలా దువ్వెన రూపమిచ్చాడు. సింకు గొట్టానికి అడ్డుపడిన చెత్తను తొలగించేందుకు ఉపయోగపడే ప్లంబర్ కూడా కార్డే. ప్లంబర్‌తో పని పడినప్పుడు వీటి మీదున్న నంబర్‌కు ఫోన్ చేయొచ్చు. కొబ్బరి, క్యారెట్లు తురుముకోవడానికి అనువుగా ఓ బిజినెస్ కార్డుంది. చీజ్ స్టోర్స్ వ్యాపారి మెటల్‌తో ఈ బిజినెస్ కార్డు తయారు చేయించుకున్నాడు. ఓ ఫ్యాషన్ డిజైనర్ అయితే ఏకంగా డెనిమ్ క్లాత్‌తోనే తన బిజినెస్ కార్డుకు
రూపాన్నిచ్చాడు.
పానా కమ్ కార్డు
ఓ బైక్ మెకానిక్ తన బిజినెస్ కార్డును చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు. తన విజిటింగ్ కార్డు కస్టమర్లకు కనీస అవసరాలు తీర్చేదై ఉండాలనుకున్నాడు. ఈ బిజినెస్ కార్డుతో మెకానిక్ షాప్ అడ్రస్ తెలుసుకోవడమే కాదు.. బైక్ నట్లు కూడా బిగించుకోవచ్చు. మరికొన్ని బిజినెస్ కార్డులను ఆఫీస్ టెబుల్స్‌పై షో ఐటమ్స్‌గా వాడుకోవచ్చు. ఇలాంటి క్రియేటివిటీ ఉన్న బిజినెస్ కార్డులను చూసిన వారు ఎవరైనా వావ్ అనకుండా ఉండలేరు. కాస్త ఖర్చుతో కూడుకున్నా.. తమ వ్యాపారానికి సాయమవుతోందని బిజినెస్ పీపుల్ ఈ కార్డులకే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి వైరైటీ కార్డులు మీరు చేయించుకోవాలనుకుంటే మీ ఆలోచనని గ్రాఫిక్ డిజైనర్‌కిచెప్పేయండి ఇంకెందుకు ఆలస్యం.
- విజయారెడ్డి
బిజినెస్‌కి తగ్గట్లు ఎలాంటి కార్డులనయినా మేము తయారు చేస్తాము. మెటల్ కార్డులకయితే ఖరీదు ఎక్కువగా ఉంటుంది. మినిమమ్ 15 రూపాయల నుంచి మొదలై.. డిజైన్, క్వాంటిటీ బట్టి చార్జ్ పెరుగుతూ పోతుంది. బిజినెస్ కార్డుల విషయంలో ఒకప్పటిలా కాకుండా కస్టమర్లు చాలా క్రియేటివిటీ కోరుకుంటున్నారు. కార్డుని ఎవరికైనా ఇస్తే ఒక్కసారి చూసి పడేయకుండా ఉండే విధంగా డిజైన్ చేయించుకుంటున్నారు
-జి.వి.రమణ, గ్రాఫిక్ డిజైనర్స్
ఇది కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్న ఓ కంపెనీకి చెందిన విజిటింగ్ కార్డ్. దీన్ని ఓపెన్ చేస్తే చాలు ఇలా కార్డ్‌లోనే వాళ్ల నిర్మాణ శైలి కనిపిస్తుంది.
విభిన్న రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తున్న ఏఎంజీ కంపెనీ తన విజిటింగ్ కార్డ్‌ను ఇలా డిఫరెంట్‌గా డిజైన్ చేయించింది. మెటల్‌తో చేసిన ఈ కార్డు చాలా రిచ్‌గా ఉంది కదా ! ఇదో ఫ్యాషన్ డిజైనర్ విజిటింగ్ కార్డు. కొత్తపుంతలు తొక్కుతున్న ఫ్యాషన్ రంగాన్ని ప్రతిబింబించే విధంగా విజిటింగ్ కార్డు ప్రిపేర్ చేశారు.