Visiting card
-
ఇల్లు చూసేందుకు రూ. 2,500.. ఇదెక్కడి అరాచకం!
ఎక్కడైనా మీకు ఇల్లు అద్దెకు కావాలంటే ఏం చేస్తారు.. మొదట ఇల్లు చూసి అంతా నచ్చితే అడ్వాన్స్ ఇచ్చి ఇంట్లో చేరుతారు. కానీ అక్కడ మాత్రం మొదట ఇల్లు చూసేందుకే రూ.2,500 కట్టాలట. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వ్యవహారం గురించి విన్న నెటిజన్లు ఇదెక్కడి అరాచకంరా నాయనా.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఇల్లు అద్దెకు దొరకడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అత్యంత జనాభా ఉండే మెట్రో నగరాల్లో ఢిల్లీ కూడా ఒకటి. ఈ నగరంలో అద్దె ఇంటి కోసం వెతుకుతున్న ఓ వ్యక్తికి అసాధారణమైన పరిస్థితి ఎదురైంది. ఇంటి వేటలో భాగంగా ఒక బ్రోకర్‌ను సంప్రదించగా 'సొసైటీ విజిటింగ్ కార్డ్' పేరుతో అద్దె ఇంటిని చూసేందుకు రూ. 2,500 కట్టాల్సి ఉంటుందని సూచించాడు. సదరు వ్యక్తి తనకు ఎదురైన ఈ పరిస్థితి గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్ (Reddit)లో షేర్ చేశారు. ఇది చట్టబద్ధమైనదేనా లేదా స్కామా అని యూజర్లతో అనుమానం వ్యక్తం చేశారు. బ్రోకర్‌తో జరిగిన వాట్సాప్ సంభాషణ స్క్రీన్‌షాట్‌ను కూడా జత చేశారు. దీంట్లో బ్రోకర్ చెప్పినదాని ప్రకారం.. “ఇల్లు చూసేందుకు విజిటింగ్ ఫీజు రూ. 2500. మీకు ఫ్లాట్ నచ్చితే, అద్దె మొత్తంలో రూ. 2500 మినహాయిస్తారు. ఒకవేళ ఫ్లాట్ నచ్చకపోతే రూ. 2500 తిరిగిస్తారు.” జనవరి 13న చేసిన ఈ పోస్టుకు యూజర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. చాలా మంది యూజర్లు దీన్ని స్కామ్‌గా అభిప్రాయపడ్డారు. బెంగుళూరు వంటి నగరాల్లో కనింపించే స్కామ్ ఇప్పుడు ఢిల్లీలోనూ జరగుతోందంటూ ఓ యూజర్ బదులిచ్చారు. ఇల్లు చూసేందుకు విజిటింగ్ కార్డ్ ఎందుకు.. అదేమైనా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇల్లా అంటూ మరో యూజర్ వ్యాఖ్యానించారు. -
చిన్నగా.. మది దోచాయ్!
దైనందిన జీవితాన్ని సాఫీగా, సౌకర్యవంతంగా గడుపుతూ.. ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందేందుకు మనిషి ఎన్నో రకాల వస్తువులను ఉపయోగించుకుంటాడు. గుండు సూది దగ్గర నుంచి పెద్దపెద్ద విమానాల వరకు ప్రతీది తన సౌకర్యం కోసమే. అలాంటి వాటిల్లో చిన్నచిన్న వస్తువులు సైతం పెద్దపెద్ద అవసరాలు తీరుస్తూ మానవ జీవితాన్ని సుఖమయం చేస్తున్నాయి! వాటిల్లో నిత్యం మన కళ్లముందు మెదిలే కొన్ని వస్తువుల కథాకమామిషు ఏంటో తెలుసుకుందామా మరి! టెడ్డీబేర్.. పిల్లలందరికీ ఇష్టమైంది. ప్రతి ఇంటా కొలువైందీ.. టెడ్డీబేర్ బొమ్మ. అసలు టెడ్డీబేర్‌కు ఆ పేరు అమెరికా అధ్యక్షుని వల్ల వచ్చిందని మీకు తెలుసా? దాని వెనకాల ఓ కథ ఉంది. అమెరికా అధ్యక్షుడిగా థియోడర్ రూజ్వెల్ట్ ఉన్నప్పటి కథ ఇది. ఓ రోజు ఆయన వేటకు వెళ్లారు. తుపాకితో దేన్ని కాలుద్దామా అని చూస్తున్నంతలో అనుచరులు ఓ ఎలుగుబంటిని చూపించారు. తీరా గురిపెట్టి చూసేసరికి అదొక పిల్ల ఎలుగు పాపం. దాన్ని చూడగానే ఆయనకి జాలేసింది. కాల్చకుండా దాన్ని వదిలేశారు. ఈ సంఘటనపై ఆ మర్నాడు ఓ దినపత్రికలో కార్టూన్ వచ్చింది. అందరికీ తెగ నచ్చేసింది. దాంతో ఎన్నో పత్రికలు ప్రచురించాయి. అలా బోలెడు ప్రచారం జరిగింది. న్యూయార్క్‌లోని ఓ బొమ్మల దుకాణం నడిపే ఒకావిడ ఆ కార్టూన్లో వేసిన ఎలుగబంటిలాగే జాలి ముఖం ఉండేలా ఓ దూది బొమ్మను తయారు చేసింది. దాన్ని అధ్యక్షునికి పంపి దీనికి మీ పేరు పెట్టుకోవచ్చా? అని లేఖ రాసింది. దానికి ఆయన ‘సరే’ అని జవాబు పంపారు. ఆయనకి ‘టెడ్డీ’అనే మరో వాడుకపేరు ఉండేది. కాబట్టి ఆవిడ తన షాపులో ఈ బొమ్మలు తయారు చేసి ‘టెడ్డీబేర్’ అని పేరు పెట్టారు. అలా టెడ్డీబేర్ బారసాల జరిగిందన్నమాట. ఆపై టెడ్డీ బేర్ బొమ్మలు విపరీతంగా అమ్ముడయ్యాయి. అప్పటి నుంచి టెడ్డీబేర్ దేశవిదేశాల్లో పిల్లలకు ఎంతో ఇష్టమైపోయింది. టెడ్డీబేర్ మ్యూజియాలు కూడా అనేక దేశాల్లో ఉన్నాయి. కోకో కోలా.. మంచి నీళ్లు తాగడం మానేసి కోకో కోలా తాగుతున్నాం మనం. అంత పిచ్చి పట్టుకుంది మనకు కోకో కోలా మీద. ఈ కూల్‌డ్రింక్‌లో రసాయనాలు ఉన్నాయనీ అందువల్ల ఇది తాగితే ప్రమాదముందని ఒకప్పుడు పెద్దస్థాయిలో వార్తలొచ్చాయి. అయినప్పటికీ మనం దీనిని తాగడం మానలేదు. ప్రపంచం మొత్తాన్ని ఇంత తీవ్రంగా బానిసలుగా చేసుకున్న ఈ శీతలపానియాన్ని డాక్టర్ జాన్ పెంబరటన్ అనే ఆయన పెట్టారు. ఈయనది అమెరికాలోని అట్లాంటాలో ఉన్న జార్జియా పట్టణం. ఫార్మాసిస్ట్ అయిన ఆయన రకరకాల పానీయాలను తయారు చేసేవాడు. కోకా ఆకులను ఉపయోగించి ఆయన చేసిన ఫ్రెంచ్ వైన్ ఆ రోజుల్లో చాలా ఆదరణ పొందింది. అయితే 1885లో అట్లాంటాలో ఫ్రెంచ్ వైన్ వంటి మత్తు పానీయాలను నిషేధించారు. దాంతో పెంబర్టన్ రాబడిపోయింది. అప్పుడతడు మత్తుస్వభావం లేని కొత్త పానీయాన్ని కనిపెట్టాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత ఆయన కోకా ఆకులకు, కోల నట్ను కలిపి, దానికి చక్కెర, సిట్రిక్ యాసిడ్ మరికొన్ని సుగంధ ద్రవ్యాలను జతచేసి 1886, మే 8న కోకో కోలాను తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడు. ఈ పానీయాన్ని ఆయన ఫ్రాంక్ రాబిన్సన్, డేవిడ్‌రో అనే మిత్రులతో తయారుచేసి అమ్మడం మొదలుపెట్టాడు. ఆ తరువాత తన మిత్రులతో గొడవ రావటంతో జాన్ ఆ ఫార్ములాను వాళ్లకు అమ్మేశాడు. ఇప్పుడు మనం తాగుతున్న కోకో కోలాకు.. పెంబర్టన్ అసలు కోకో కోలాకు రుచిలో ఎంతో మార్పు వచ్చింది. కాలానుగుణంగా కోకో కోలా రుచి మార్చుకున్నా దాని ఫార్ములా ఇప్పటికీ సీక్రెట్‌గానే ఉంది. విజిటింగ్ కార్డ్.. విజిటింగ్ కార్డ్ సంప్రదాయం 15వ శతాబ్దంలో మొదలైందని చరిత్ర చెబుతోంది. ఆ రోజుల్లో జమిందారులు, రాజవంశీయులు తాము ఒక ప్రదేశానికి వెళ్లే ముందు తమ పేరు, హోదా, అడ్రసు...వగైరాలు రాసి ఉన్న పత్రం ఒకటి అక్కడకి దూతకిచ్చి పంపేవారు. అది చూసి అవతలి వారు..వస్తున్న వారి హోదాకి తగిన స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయాల్సి ఉండేది. అంటే ఉన్నత హోదాలో ఉన్నవారు తమ కిందిస్థాయి వారికి తమ రాకగురించి తెలియజెప్పేందుకు పుట్టిందీ కార్డు. ఎవరైతే వస్తున్నారో వారి సమాచారం తెచ్చే కార్డు కాబట్టే విజిటింగ్ కార్డ్ అన్నారు. తరువాత విజిటింగ్ కార్డ్ అందరికీ సంబంధించిన అవసర వస్తువుగా మారింది. అయితే దీనిని పెద్దలు చిన్నవారికి పంపడం ఆగిపోయి..కిందిస్థాయి వారు పైస్థాయి వారికి తాము వచ్చిన విషయం తెలియజెప్పే సందేశ సమాచార పత్రంగా మారింది. ప్రస్తుతం విజిటింగ్ కార్డు..చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎవరిని ఎవరు సందర్శించినా ఇచ్చి పుచ్చుకునే కాగితం ముక్క అయిపోయింది. అడ్రస్, ఫోన్ నంబర్‌ను ఇచ్చిపుచ్చుకునే కార్డ్ ముక్కయింది. ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఫౌంటెన్ పెన్.. ఇవాళ మనం క్లాస్‌రూంలో పెన్ను పట్టుకొని టకటకా నోట్స్ రాసుకుంటున్నాంగానీ.. ఇలా పెన్నును ఈ ఆకారంలో చూడటం వెనుక బోలెడంత కథ ఉంది. భారతదేశంలో పెన్ను, పేపరు రానంత వరకూ రాతకోతలన్నీ తాటాకుల మీద, ఘంటంతో సాగేవి. ఆ తర్వాత సిరాలో ముంచి రాసే పెన్నులు వచ్చాయి. అయితే నాలుగు పదాలు రాయగానే మళ్లీ పెన్నును సిరాలో ముంచి రాయాల్సి వచ్చేది. ఈ తలనొప్పిని పరిహరించిన వ్యక్తి ‘లూయిస్ ఇ. వాటర్‌మెన్’. అమెరికాలో ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పనిచేసేవాడు. ఒకసారి పాలసీ తీసుకోవడానికి వచ్చిన పెద్ద మనిషి సంతకం చేయడానికి కలంను సిరాలో ముంచగా అది కాస్తా ఒలికి పేపర్లు పాడయ్యాయి. అది అపశకునంగా భావించిన ఆ పెద్దమనిషి పాలసీ చేయకుండానే వెళ్లి పోయాడు. దాంతో కోపం తెచ్చుకున్న వాటర్‌మెన్ అసలు సిరాలో ముంచే అవసరం లేకుండా నిబ్ వెనుక ఇంక్ రిజర్వాయర్ ఉండేలా పెన్ తయారుచేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి ‘ఫౌంటెన్ పెన్’ను 1884లో తయారుచేశాడు. ఇతడిలాగే మరికొందరు కూడా పెన్నులు తయారు చేసినా ప్రపంచానికి ఫౌంటెన్‌పెన్ సృష్టికర్తగా పరిచయమైంది వాటర్‌మెన్ మాత్రమే. పెన్నును జేబులో పెట్టుకునే వీలుగా క్లిప్‌ను తయారుచేసింది కూడా ఇయనే. -
క్రియేటీవ్ కార్డ్స్
విజిటింగ్ కార్డేనని తేలికగా తీసిపారేయకండలా.. అంటున్నారు బిజినెస్ పీపుల్. విజిటింగ్ కార్డును.. క్రెడిట్ కార్డంత జాగ్రత్తగా చూసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. కామన్‌మ్యాన్ నాడి పట్టేయాలంటే కాస్త వెరైటీ ఉండాలని ఫిక్సయిన వ్యాపారవేత్తలు.. ఆ విజిటింగ్ కార్డునే తమ వ్యాపారాభివృద్ధికి బ్రహ్మాస్త్రంలా వాడుతున్నారు. కార్డ్‌ను డిఫరెంట్‌గా డిజైన్ చేసి బిజినెస్ కార్డుగా మార్చి నయా ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు. కరాటే మాస్టర్ విజిటింగ్ కార్డ్ ఇది. ఒక్క దెబ్బతో ఇటుకలు విరిచేయడం వీరికి మామూలే. తన కెరీర్‌కు ప్లస్ అయ్యే విధంగా విజిటింగ్ కార్డుకు ఈ రూపాన్నిచ్చాడాయన. ఇటుకలా కనిపిస్తున్న ఈ కార్డ్‌ను మధ్యలోకి విరిచేయవచ్చు. మళ్లీ ఒక్కటిగా చేర్చవచ్చు. ఈ డిఫరెంట్ కార్డ్ చూస్తే ఎవరైనా ఆయనకు శిష్యులుగా మారిపోవాల్సిందే. ఏమంటారు ! బిజినెస్ పీపుల్‌కు పరిచయాలు చాలా అవసరం. అందుకే వినియోగదారులు వచ్చే ఏ దారినీ వాళ్లు వదిలిపెట్టరు. తమ ప్రొఫెషన్ని విజిటింగ్ కార్డుతో పరిచయం చేయడం సహజమే. ఆ కార్డు ఆకారం చూడగానే వాళ్లు చేస్తున్న బిజినెస్ ఏంటో తెలుసుకునేలా డిజైన్ చేయించుకోవడం సిటీలో ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. వీటిని మామూలు కార్డుల్లా అలా చూసి ఇలా పారేయకుండా.. ‘ఎంత వెరైటీగా ఉన్నాయో..!’ అని దాచుకునేలా ఉంటున్నాయి. ఏదైనా పని పడితే సదరు వ్యక్తి వెరైటీ కార్డున్న సంస్థను సంప్రదించే అవకాశమూ బోలెడుంది. ఈ డిఫరెంట్ బిజినెస్ కార్డుల వ్యాపార రహస్యం కూడా అదే. కస్టమర్‌ను దువ్వాలిగా.. ఓ హెయిర్ స్టైలిస్ట్ తన బిజినెస్ కార్డు.. దువ్వెన ఆకారంలో డిజైన్ చేయించాడు. ఆ కార్డును తాకినప్పుడల్లా సంగీతం కూడా వినిపిస్తుంటుంది. కస్టమర్‌ను ఎలా దువ్వాలో తెలిసిన సదరు వ్యాపారి.. తన కార్డుకు ఇలా దువ్వెన రూపమిచ్చాడు. సింకు గొట్టానికి అడ్డుపడిన చెత్తను తొలగించేందుకు ఉపయోగపడే ప్లంబర్ కూడా కార్డే. ప్లంబర్‌తో పని పడినప్పుడు వీటి మీదున్న నంబర్‌కు ఫోన్ చేయొచ్చు. కొబ్బరి, క్యారెట్లు తురుముకోవడానికి అనువుగా ఓ బిజినెస్ కార్డుంది. చీజ్ స్టోర్స్ వ్యాపారి మెటల్‌తో ఈ బిజినెస్ కార్డు తయారు చేయించుకున్నాడు. ఓ ఫ్యాషన్ డిజైనర్ అయితే ఏకంగా డెనిమ్ క్లాత్‌తోనే తన బిజినెస్ కార్డుకు రూపాన్నిచ్చాడు. పానా కమ్ కార్డు ఓ బైక్ మెకానిక్ తన బిజినెస్ కార్డును చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు. తన విజిటింగ్ కార్డు కస్టమర్లకు కనీస అవసరాలు తీర్చేదై ఉండాలనుకున్నాడు. ఈ బిజినెస్ కార్డుతో మెకానిక్ షాప్ అడ్రస్ తెలుసుకోవడమే కాదు.. బైక్ నట్లు కూడా బిగించుకోవచ్చు. మరికొన్ని బిజినెస్ కార్డులను ఆఫీస్ టెబుల్స్‌పై షో ఐటమ్స్‌గా వాడుకోవచ్చు. ఇలాంటి క్రియేటివిటీ ఉన్న బిజినెస్ కార్డులను చూసిన వారు ఎవరైనా వావ్ అనకుండా ఉండలేరు. కాస్త ఖర్చుతో కూడుకున్నా.. తమ వ్యాపారానికి సాయమవుతోందని బిజినెస్ పీపుల్ ఈ కార్డులకే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి వైరైటీ కార్డులు మీరు చేయించుకోవాలనుకుంటే మీ ఆలోచనని గ్రాఫిక్ డిజైనర్కిచెప్పేయండి ఇంకెందుకు ఆలస్యం. - విజయారెడ్డి బిజినెస్‌కి తగ్గట్లు ఎలాంటి కార్డులనయినా మేము తయారు చేస్తాము. మెటల్ కార్డులకయితే ఖరీదు ఎక్కువగా ఉంటుంది. మినిమమ్ 15 రూపాయల నుంచి మొదలై.. డిజైన్, క్వాంటిటీ బట్టి చార్జ్ పెరుగుతూ పోతుంది. బిజినెస్ కార్డుల విషయంలో ఒకప్పటిలా కాకుండా కస్టమర్లు చాలా క్రియేటివిటీ కోరుకుంటున్నారు. కార్డుని ఎవరికైనా ఇస్తే ఒక్కసారి చూసి పడేయకుండా ఉండే విధంగా డిజైన్ చేయించుకుంటున్నారు -జి.వి.రమణ, గ్రాఫిక్ డిజైనర్స్ ఇది కన్స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్న ఓ కంపెనీకి చెందిన విజిటింగ్ కార్డ్. దీన్ని ఓపెన్ చేస్తే చాలు ఇలా కార్డ్‌లోనే వాళ్ల నిర్మాణ శైలి కనిపిస్తుంది. విభిన్న రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తున్న ఏఎంజీ కంపెనీ తన విజిటింగ్ కార్డ్‌ను ఇలా డిఫరెంట్‌గా డిజైన్ చేయించింది. మెటల్‌తో చేసిన ఈ కార్డు చాలా రిచ్‌గా ఉంది కదా ! ఇదో ఫ్యాషన్ డిజైనర్ విజిటింగ్ కార్డు. కొత్తపుంతలు తొక్కుతున్న ఫ్యాషన్ రంగాన్ని ప్రతిబింబించే విధంగా విజిటింగ్ కార్డు ప్రిపేర్ చేశారు.