చిన్నగా.. మది దోచాయ్! | Man needs so many things in their daily life | Sakshi
Sakshi News home page

చిన్నగా.. మది దోచాయ్!

Published Fri, Feb 19 2016 2:51 PM | Last Updated on Mon, Apr 8 2019 6:20 PM

Man needs so many things in their daily life

దైనందిన జీవితాన్ని సాఫీగా, సౌకర్యవంతంగా గడుపుతూ.. ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందేందుకు మనిషి ఎన్నో రకాల వస్తువులను ఉపయోగించుకుంటాడు. గుండు సూది దగ్గర నుంచి పెద్దపెద్ద విమానాల వరకు ప్రతీది తన సౌకర్యం కోసమే. అలాంటి వాటిల్లో చిన్నచిన్న వస్తువులు సైతం పెద్దపెద్ద అవసరాలు తీరుస్తూ మానవ జీవితాన్ని సుఖమయం చేస్తున్నాయి!  వాటిల్లో నిత్యం మన కళ్లముందు మెదిలే కొన్ని వస్తువుల కథాకమామిషు ఏంటో తెలుసుకుందామా మరి!

టెడ్డీబేర్..
పిల్లలందరికీ ఇష్టమైంది. ప్రతి ఇంటా కొలువైందీ.. టెడ్డీబేర్ బొమ్మ. అసలు టెడ్డీబేర్‌కు ఆ పేరు అమెరికా అధ్యక్షుని వల్ల వచ్చిందని మీకు తెలుసా? దాని వెనకాల ఓ కథ ఉంది. అమెరికా అధ్యక్షుడిగా థియోడర్ రూజ్‌వెల్ట్ ఉన్నప్పటి కథ ఇది. ఓ రోజు ఆయన వేటకు వెళ్లారు. తుపాకితో దేన్ని కాలుద్దామా అని చూస్తున్నంతలో అనుచరులు ఓ ఎలుగుబంటిని చూపించారు. తీరా గురిపెట్టి చూసేసరికి అదొక పిల్ల ఎలుగు పాపం. దాన్ని చూడగానే ఆయనకి జాలేసింది. కాల్చకుండా దాన్ని వదిలేశారు. ఈ సంఘటనపై ఆ మర్నాడు ఓ దినపత్రికలో కార్టూన్ వచ్చింది. అందరికీ తెగ నచ్చేసింది. దాంతో ఎన్నో పత్రికలు ప్రచురించాయి. అలా బోలెడు ప్రచారం జరిగింది.

న్యూయార్క్‌లోని ఓ బొమ్మల దుకాణం నడిపే ఒకావిడ ఆ కార్టూన్‌లో వేసిన ఎలుగబంటిలాగే జాలి ముఖం ఉండేలా ఓ దూది బొమ్మను తయారు చేసింది. దాన్ని అధ్యక్షునికి పంపి దీనికి మీ పేరు పెట్టుకోవచ్చా? అని లేఖ రాసింది. దానికి ఆయన ‘సరే’ అని జవాబు పంపారు. ఆయనకి ‘టెడ్డీ’అనే మరో వాడుకపేరు ఉండేది. కాబట్టి ఆవిడ తన షాపులో ఈ బొమ్మలు తయారు చేసి ‘టెడ్డీబేర్’ అని పేరు పెట్టారు. అలా టెడ్డీబేర్ బారసాల జరిగిందన్నమాట. ఆపై టెడ్డీ బేర్ బొమ్మలు  విపరీతంగా అమ్ముడయ్యాయి. అప్పటి నుంచి టెడ్డీబేర్  దేశవిదేశాల్లో పిల్లలకు ఎంతో ఇష్టమైపోయింది. టెడ్డీబేర్ మ్యూజియాలు కూడా అనేక దేశాల్లో ఉన్నాయి.

కోకో కోలా..
మంచి నీళ్లు తాగడం మానేసి కోకో కోలా తాగుతున్నాం మనం. అంత పిచ్చి పట్టుకుంది మనకు కోకో కోలా మీద. ఈ కూల్‌డ్రింక్‌లో రసాయనాలు ఉన్నాయనీ అందువల్ల ఇది తాగితే ప్రమాదముందని ఒకప్పుడు పెద్దస్థాయిలో వార్తలొచ్చాయి. అయినప్పటికీ మనం దీనిని తాగడం మానలేదు. ప్రపంచం మొత్తాన్ని ఇంత తీవ్రంగా బానిసలుగా చేసుకున్న ఈ శీతలపానియాన్ని  డాక్టర్ జాన్  పెంబరటన్ అనే ఆయన పెట్టారు. ఈయనది అమెరికాలోని అట్లాంటాలో ఉన్న జార్జియా పట్టణం. ఫార్మాసిస్ట్ అయిన ఆయన రకరకాల పానీయాలను తయారు చేసేవాడు. కోకా ఆకులను ఉపయోగించి ఆయన చేసిన ఫ్రెంచ్ వైన్ ఆ రోజుల్లో  చాలా ఆదరణ పొందింది.

అయితే 1885లో అట్లాంటాలో ఫ్రెంచ్ వైన్ వంటి మత్తు పానీయాలను నిషేధించారు. దాంతో పెంబర్‌టన్ రాబడిపోయింది. అప్పుడతడు మత్తుస్వభావం లేని కొత్త పానీయాన్ని కనిపెట్టాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత ఆయన కోకా ఆకులకు, కోల నట్‌ను కలిపి, దానికి చక్కెర, సిట్రిక్ యాసిడ్ మరికొన్ని సుగంధ ద్రవ్యాలను జతచేసి 1886, మే 8న కోకో కోలాను తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడు. ఈ పానీయాన్ని ఆయన ఫ్రాంక్ రాబిన్‌సన్, డేవిడ్‌రో అనే మిత్రులతో తయారుచేసి అమ్మడం మొదలుపెట్టాడు. ఆ తరువాత తన మిత్రులతో గొడవ రావటంతో జాన్ ఆ ఫార్ములాను వాళ్లకు అమ్మేశాడు. ఇప్పుడు మనం తాగుతున్న కోకో కోలాకు.. పెంబర్‌టన్ అసలు కోకో కోలాకు రుచిలో ఎంతో మార్పు వచ్చింది. కాలానుగుణంగా కోకో కోలా రుచి మార్చుకున్నా దాని ఫార్ములా ఇప్పటికీ సీక్రెట్‌గానే ఉంది.

విజిటింగ్ కార్డ్..
విజిటింగ్ కార్డ్ సంప్రదాయం 15వ శతాబ్దంలో మొదలైందని చరిత్ర చెబుతోంది. ఆ రోజుల్లో జమిందారులు, రాజవంశీయులు తాము ఒక ప్రదేశానికి వెళ్లే ముందు తమ పేరు, హోదా, అడ్రసు...వగైరాలు రాసి ఉన్న పత్రం ఒకటి అక్కడకి దూతకిచ్చి పంపేవారు. అది చూసి అవతలి వారు..వస్తున్న వారి హోదాకి తగిన స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయాల్సి ఉండేది. అంటే ఉన్నత హోదాలో ఉన్నవారు తమ కిందిస్థాయి వారికి తమ రాకగురించి తెలియజెప్పేందుకు పుట్టిందీ కార్డు.

ఎవరైతే వస్తున్నారో వారి సమాచారం తెచ్చే కార్డు కాబట్టే విజిటింగ్ కార్డ్ అన్నారు. తరువాత విజిటింగ్ కార్డ్ అందరికీ సంబంధించిన అవసర వస్తువుగా మారింది. అయితే దీనిని పెద్దలు చిన్నవారికి పంపడం ఆగిపోయి..కిందిస్థాయి వారు పైస్థాయి వారికి తాము వచ్చిన విషయం తెలియజెప్పే సందేశ సమాచార పత్రంగా మారింది. ప్రస్తుతం విజిటింగ్ కార్డు..చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎవరిని ఎవరు సందర్శించినా ఇచ్చి పుచ్చుకునే కాగితం ముక్క అయిపోయింది. అడ్రస్, ఫోన్ నంబర్‌ను ఇచ్చిపుచ్చుకునే కార్డ్ ముక్కయింది. ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది.

ఫౌంటెన్ పెన్..
ఇవాళ మనం క్లాస్‌రూంలో పెన్ను పట్టుకొని టకటకా నోట్స్ రాసుకుంటున్నాంగానీ.. ఇలా పెన్నును ఈ ఆకారంలో చూడటం వెనుక బోలెడంత కథ ఉంది. భారతదేశంలో పెన్ను, పేపరు రానంత వరకూ రాతకోతలన్నీ తాటాకుల మీద, ఘంటంతో సాగేవి. ఆ తర్వాత సిరాలో ముంచి రాసే పెన్నులు వచ్చాయి. అయితే నాలుగు పదాలు రాయగానే మళ్లీ పెన్నును సిరాలో ముంచి రాయాల్సి వచ్చేది. ఈ తలనొప్పిని పరిహరించిన వ్యక్తి ‘లూయిస్ ఇ. వాటర్‌మెన్’. అమెరికాలో ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పనిచేసేవాడు. ఒకసారి పాలసీ తీసుకోవడానికి వచ్చిన పెద్ద మనిషి సంతకం చేయడానికి కలంను సిరాలో ముంచగా అది   కాస్తా ఒలికి పేపర్లు పాడయ్యాయి.

అది అపశకునంగా భావించిన ఆ పెద్దమనిషి పాలసీ చేయకుండానే వెళ్లి పోయాడు. దాంతో కోపం తెచ్చుకున్న వాటర్‌మెన్ అసలు సిరాలో ముంచే అవసరం లేకుండా నిబ్ వెనుక ఇంక్   రిజర్వాయర్ ఉండేలా పెన్ తయారుచేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి ‘ఫౌంటెన్ పెన్’ను 1884లో తయారుచేశాడు. ఇతడిలాగే మరికొందరు కూడా పెన్నులు తయారు చేసినా ప్రపంచానికి ఫౌంటెన్‌పెన్ సృష్టికర్తగా పరిచయమైంది వాటర్‌మెన్ మాత్రమే. పెన్నును జేబులో పెట్టుకునే వీలుగా క్లిప్‌ను తయారుచేసింది కూడా ఇయనే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement