Business cards
-
చేయకూడని.. కెరీర్ మిస్టేక్స్!
ఉద్యోగ జీవితంలో విజయవంతంగా రాణించడం అనేది నదిపై ప్రయాణం లాంటిది కాదు. మహా సముద్రంపై ప్రయాణం లాంటిది. స్వల్ప కాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటాం. తక్షణ పదోన్నతి కోసం ఆరాటపడతాం. దీర్ఘకాలిక అవసరాలను, ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోం. కానీ, చిన్న చిన్న విషయాలే కెరీర్‌పై ఎనలేని ప్రభావం చూపుతాయి. వాటిని పరిగణనలోకి తీసుకోకపోతే కెరీర్లో ఆశించిన ఎదుగుదల ఉండదు. ఉద్యోగులు సాధారణంగా ఐదు రకాల కెరీర్ మిస్టేక్స్ చేస్తుంటారని నిపుణులు అంటున్నారు. ఆ పొరపాట్లను సరిదిద్దుకుంటే ఉద్యోగ బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు దూసుకుపోవచ్చు. నెట్‌వర్క్‌ను విస్తరించుకోవాలి నెట్వర్కింగ్ విలువ చాలా మందికి తెలియదు. కేవలం బిజినెస్ కార్డులను ఇచ్చిపుచ్చుకునేందుకే సదస్సులు, సమావేశాలకు హాజరవుతుంటారు. కెరీర్లో రాణింపునకు మీ రంగంతోపాటు ఇతర రంగాలకు చెందినవారితో కూడా స్నేహ సంబంధాలను పెంచుకోవాలి. కొత్త పరిచయాలు కొత్త ఆలోచనలకు దారితీస్తాయి. ఈ నెట్వర్కింగ్తో మీ రోజువారి జీవితం మరింత సులభతరంగా మారుతుంది. మీ నెట్‌వర్క్‌లో భిన్న రకాల భాషలు, సంస్కృతులకు చెందిన వ్యక్తులు ఉండేలా చూసుకోండి. ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ పెంచుకోవడం కష్టమే కానీ, అసాధ్యం మాత్రం కాదు. దీనికి సమయం వెచ్చిస్తే.. అది వృథా కాదు. భవిష్యత్తులో తప్పనిసరిగా సానుకూల ఫలితం లభిస్తుంది. డబ్బే ముఖ్యం కాదు ప్రస్తుతం వస్తున్న జీతం కంటే మరో 20 శాతం అదనంగా వస్తే బాగుంటుందన్న ఆలోచన ప్రతి ఉద్యోగికి ఉంటుందంట. మెరుగైన వేతనాల కోసం కంపెనీలను, ఉద్యోగాలను వెంటవెంటనే మార్చేసే వారు ఎందరో ఉన్నారు. మరో కొలువులోకి మారితే బ్యాంకు బ్యాలెన్స్ కొంత పెరగొచ్చు. కానీ, అది కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆదాయం కంటే ముందు పనిలో అనుభవం, నైపుణ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. లాంగ్ రన్లో ఇది మీకు కచ్చితంగా మేలు చేస్తుంది. ఉన్నత హోదాలు, ఎక్కువ జీతభత్యాలు పొందడానికి ఆస్కారం కల్పిస్తుంది. పరాజయం.. సహజమే ఓటమి ఎదురవుతుందన్న భయంతో కొందరు సాహసాలు చేయడానికి వెనుకాడుతుంటారు. అయితే, క్లిష్ట పరిస్థితుల్లోనే ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లాంగ్‌టర్మ్ సక్సెస్ కావాలంటే పరాజయాలకు లొంగొద్దు. ఫలితం తో సంబంధం లేకుండా ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండాలి. ప్రతి ఓటమి ఒక కొత్త పాఠా న్ని నేర్పుతుంది. జీవితం అంటే ఏమిటో తెలి యజేస్తుంది. కాబట్టి పనిలో రిస్క్ తీసుకోవడానికి భయపడకండి. ఫెయిల్యూర్స్.. వృత్తిగత, వ్యక్తిగత జీవితంలో ఎదుగుదలకు తోడ్పడతాయి. కార్యాలయానికి సమీపంలో మీరు పనిచేస్తున్న కార్యాలయానికి సమీపంలో ఉండేలా చూసుకోండి. రాకపోకలకు మీకు ఎలాంటి ప్రతిబంధకాలు ఉండకూడదు. ఆఫీస్‌కు వెళ్లిరావడం సౌలభ్యంగా ఉండేలా జాగ్రత్తపడాలి. ప్రధానంగా కంపెనీలో ఉన్నతస్థాయిలో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణానికే ఎక్కువ సమయం వెచ్చిస్తే విధి నిర్వహణ కుంటుపడుతుంది. ఇతరులకు సహాయం మేలు చేసిన.. మేలు కలుగున్. ఇతరులకు మంచి చేస్తే మీకు కూడా మంచే జరుగుతుంది. అవసరంలో ఉన్నవారికి సహకరిస్తే దాని ప్రతిఫలం భవిష్యత్తులో ఏదో ఒక సందర్భంలో తప్పకుండా కనిపిస్తుంది. ప్రొఫెషనల్ కెరీర్లో అలవరచుకోవాల్సిన ప్రధాన లక్షణం ఇది. కెరీర్లో సక్సెస్‌కు ప్రతిదశలో సహచరుల సహకారం అవసరం. ప్రయోజనం కలగాలనే దురుద్దేశం లేకుండా ఇతరులకు మనస్ఫూర్తిగా సహకరించండి. సహాయం చేయండి. ఇతరుల సహకారం పొందండి. -
క్రియేటీవ్ కార్డ్స్
విజిటింగ్ కార్డేనని తేలికగా తీసిపారేయకండలా.. అంటున్నారు బిజినెస్ పీపుల్. విజిటింగ్ కార్డును.. క్రెడిట్ కార్డంత జాగ్రత్తగా చూసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. కామన్‌మ్యాన్ నాడి పట్టేయాలంటే కాస్త వెరైటీ ఉండాలని ఫిక్సయిన వ్యాపారవేత్తలు.. ఆ విజిటింగ్ కార్డునే తమ వ్యాపారాభివృద్ధికి బ్రహ్మాస్త్రంలా వాడుతున్నారు. కార్డ్‌ను డిఫరెంట్‌గా డిజైన్ చేసి బిజినెస్ కార్డుగా మార్చి నయా ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు. కరాటే మాస్టర్ విజిటింగ్ కార్డ్ ఇది. ఒక్క దెబ్బతో ఇటుకలు విరిచేయడం వీరికి మామూలే. తన కెరీర్‌కు ప్లస్ అయ్యే విధంగా విజిటింగ్ కార్డుకు ఈ రూపాన్నిచ్చాడాయన. ఇటుకలా కనిపిస్తున్న ఈ కార్డ్‌ను మధ్యలోకి విరిచేయవచ్చు. మళ్లీ ఒక్కటిగా చేర్చవచ్చు. ఈ డిఫరెంట్ కార్డ్ చూస్తే ఎవరైనా ఆయనకు శిష్యులుగా మారిపోవాల్సిందే. ఏమంటారు ! బిజినెస్ పీపుల్‌కు పరిచయాలు చాలా అవసరం. అందుకే వినియోగదారులు వచ్చే ఏ దారినీ వాళ్లు వదిలిపెట్టరు. తమ ప్రొఫెషన్ని విజిటింగ్ కార్డుతో పరిచయం చేయడం సహజమే. ఆ కార్డు ఆకారం చూడగానే వాళ్లు చేస్తున్న బిజినెస్ ఏంటో తెలుసుకునేలా డిజైన్ చేయించుకోవడం సిటీలో ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. వీటిని మామూలు కార్డుల్లా అలా చూసి ఇలా పారేయకుండా.. ‘ఎంత వెరైటీగా ఉన్నాయో..!’ అని దాచుకునేలా ఉంటున్నాయి. ఏదైనా పని పడితే సదరు వ్యక్తి వెరైటీ కార్డున్న సంస్థను సంప్రదించే అవకాశమూ బోలెడుంది. ఈ డిఫరెంట్ బిజినెస్ కార్డుల వ్యాపార రహస్యం కూడా అదే. కస్టమర్‌ను దువ్వాలిగా.. ఓ హెయిర్ స్టైలిస్ట్ తన బిజినెస్ కార్డు.. దువ్వెన ఆకారంలో డిజైన్ చేయించాడు. ఆ కార్డును తాకినప్పుడల్లా సంగీతం కూడా వినిపిస్తుంటుంది. కస్టమర్‌ను ఎలా దువ్వాలో తెలిసిన సదరు వ్యాపారి.. తన కార్డుకు ఇలా దువ్వెన రూపమిచ్చాడు. సింకు గొట్టానికి అడ్డుపడిన చెత్తను తొలగించేందుకు ఉపయోగపడే ప్లంబర్ కూడా కార్డే. ప్లంబర్‌తో పని పడినప్పుడు వీటి మీదున్న నంబర్‌కు ఫోన్ చేయొచ్చు. కొబ్బరి, క్యారెట్లు తురుముకోవడానికి అనువుగా ఓ బిజినెస్ కార్డుంది. చీజ్ స్టోర్స్ వ్యాపారి మెటల్‌తో ఈ బిజినెస్ కార్డు తయారు చేయించుకున్నాడు. ఓ ఫ్యాషన్ డిజైనర్ అయితే ఏకంగా డెనిమ్ క్లాత్‌తోనే తన బిజినెస్ కార్డుకు రూపాన్నిచ్చాడు. పానా కమ్ కార్డు ఓ బైక్ మెకానిక్ తన బిజినెస్ కార్డును చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు. తన విజిటింగ్ కార్డు కస్టమర్లకు కనీస అవసరాలు తీర్చేదై ఉండాలనుకున్నాడు. ఈ బిజినెస్ కార్డుతో మెకానిక్ షాప్ అడ్రస్ తెలుసుకోవడమే కాదు.. బైక్ నట్లు కూడా బిగించుకోవచ్చు. మరికొన్ని బిజినెస్ కార్డులను ఆఫీస్ టెబుల్స్‌పై షో ఐటమ్స్‌గా వాడుకోవచ్చు. ఇలాంటి క్రియేటివిటీ ఉన్న బిజినెస్ కార్డులను చూసిన వారు ఎవరైనా వావ్ అనకుండా ఉండలేరు. కాస్త ఖర్చుతో కూడుకున్నా.. తమ వ్యాపారానికి సాయమవుతోందని బిజినెస్ పీపుల్ ఈ కార్డులకే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి వైరైటీ కార్డులు మీరు చేయించుకోవాలనుకుంటే మీ ఆలోచనని గ్రాఫిక్ డిజైనర్కిచెప్పేయండి ఇంకెందుకు ఆలస్యం. - విజయారెడ్డి బిజినెస్‌కి తగ్గట్లు ఎలాంటి కార్డులనయినా మేము తయారు చేస్తాము. మెటల్ కార్డులకయితే ఖరీదు ఎక్కువగా ఉంటుంది. మినిమమ్ 15 రూపాయల నుంచి మొదలై.. డిజైన్, క్వాంటిటీ బట్టి చార్జ్ పెరుగుతూ పోతుంది. బిజినెస్ కార్డుల విషయంలో ఒకప్పటిలా కాకుండా కస్టమర్లు చాలా క్రియేటివిటీ కోరుకుంటున్నారు. కార్డుని ఎవరికైనా ఇస్తే ఒక్కసారి చూసి పడేయకుండా ఉండే విధంగా డిజైన్ చేయించుకుంటున్నారు -జి.వి.రమణ, గ్రాఫిక్ డిజైనర్స్ ఇది కన్స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్న ఓ కంపెనీకి చెందిన విజిటింగ్ కార్డ్. దీన్ని ఓపెన్ చేస్తే చాలు ఇలా కార్డ్‌లోనే వాళ్ల నిర్మాణ శైలి కనిపిస్తుంది. విభిన్న రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తున్న ఏఎంజీ కంపెనీ తన విజిటింగ్ కార్డ్‌ను ఇలా డిఫరెంట్‌గా డిజైన్ చేయించింది. మెటల్‌తో చేసిన ఈ కార్డు చాలా రిచ్‌గా ఉంది కదా ! ఇదో ఫ్యాషన్ డిజైనర్ విజిటింగ్ కార్డు. కొత్తపుంతలు తొక్కుతున్న ఫ్యాషన్ రంగాన్ని ప్రతిబింబించే విధంగా విజిటింగ్ కార్డు ప్రిపేర్ చేశారు. -
ప్యానెల్ ఇంటర్వ్యూలో నెగ్గండిలా..
జాబ్ స్కిల్స్: జాబ్ ఇంటర్వ్యూను ఎదుర్కోవడం అనగానే.. కొంత సంశయం, బెరుకు సహజమే. ముందుగా సన్నద్ధమైతే ఇందులో విజయం సాధించడం సులువే. గతంలో సంస్థలు నియమిం చే ఇంటర్వ్యూ బోర్డులో ఒక్క సభ్యుడే ఉండేవారు. అయితే, ఇటీవలి కాలంలో ప్యానెల్ ఇంటర్వ్యూల సంఖ్య పెరుగుతోంది. అభ్యర్థిని రెండు మూడు సార్లు ఇంటర్వ్యూ చేసే పద్ధతికి కంపెనీలు స్వస్తి పలుకుతున్నాయి. సమయాభావం వల్ల ఈ నిర్ణయానికొచ్చాయి. ప్యానెల్ ఇంటర్వ్యూ బోర్డులో సాధారణంగా మూడు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉంటారు. వీరు తమతమ రంగాల్లో నిష్ణాతులై ఉంటారు. ప్యానెల్ ఇంటర్వ్యూలో ఎక్కువ మంది సభ్యులు ఉంటారు కాబట్టి దీన్ని ఎదుర్కోవడం కష్టమని అభ్యర్థులు భయపడుతుంటారు. వారంతా కలిసికట్టుగా తమపై దాడి చేయబోతున్నట్లు భీతిచెందుతుంటారు. కానీ, కొన్ని చిట్కాలను పాటిస్తే ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ప్యానెల్ ఇంటర్వ్యూ పూర్తిచేయొచ్చు. ప్యానెల్లో ఉండేదెవరు? మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోయే ప్యానెల్లో సభ్యులుగా ఎవరెవరు ఉంటారో ముందుగానే తెలుసుకోవాలి. అవసరమైతే కంపెనీ మానవ వనరుల విభాగాన్ని సంప్రదించాలి. ఫేస్బుక్, లింక్డ్ ఇన్ లాంటి సామాజిక మాధ్యమాల్లో వారి వివరాలను పరిశీలించాలి. కంపెనీలో వారి హోదాలు, ప్రాముఖ్యత తెలుసుకోవాలి. దీనివల్ల మౌఖిక పరీక్షలో ప్యానెల్ సభ్యులతో వారి స్థాయి, హోదాను బట్టి మాట్లాడేందుకు ముందుగానే సిద్ధమవ్వొచ్చు. అందరినీ సమంగా.. ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టిన తర్వాత ప్యానెల్ సభ్యులందరినీ వరుసగా విష్ చేయాలి. నేరుగా వారి కళ్లలోకి చూస్తూ మాట్లాడాలి. కేవలం ఒకే వ్యక్తిని చూస్తూ ఉండిపోవద్దు. ఒకరు ప్రశ్న వేసినా.. అందరి వైపు చూస్తూ సమాధానం చెప్పాలి. దీంతో మీపై సానుకూల ప్రభావం పడుతుంది. ప్యానె ల్తో సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. సమాధానాలు మరోసారి వివరంగా... ప్యానెల్ సభ్యుల నేపథ్యాలు వేర్వేరుగా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో రంగంలో నిపుణులై ఉంటారు. వారు తమ రంగానికి సంబంధించిన ప్రశ్నలు వేస్తుంటారు. అభ్యర్థులు ఒకే సమాధానాన్ని మరోసారి విడమర్చి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక రంగానికి సంబంధించిన సమాధానం ప్యానెల్లో మరొకరికి అర్థం కాకపోవచ్చు. పూర్తిగా వివరించమని వారు కోరే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ముందుగానే ప్రిపేర్ కావాలి. ఇంటర్వ్యూ ప్యానెల్ అప్పుడప్పుడు సరదా ప్రశ్నలు వేసే అవకాశం కూడా ఉంటుంది. వాటికి అలాగే సరదాగానే సమాధానాలు చెప్పాలి. కృతజ్ఞతలు... మర్చిపోవద్దు ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత ప్యానెల్ సభ్యులందరికీ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలపాలి. వారి బిజినెస్ కార్డులను అడిగి తీసుకోవాలి. ఒక కాగితంపై ఇంటర్వ్యూ బోర్డు సభ్యులను ఉద్దేశించి ‘థాంక్యూ’ అని రాసి రిసెప్షన్లో ఇచ్చి వెళ్లాలి. అది వారికి చేరుతుంది. దీనివల్ల మీరు వారికి గుర్తుండిపోతారు. ఉద్యోగ సాధనలో ఇతరుల కంటే ముందంజలో నిలుస్తారు. కొలువులో చేరిన తర్వాత ప్యానెల్ సభ్యులే అక్కడ మీ సహచరులుగా, బాస్‌లుగా కనిపించొచ్చు. కనుక ప్యానెల్ ఇంటర్వ్యూ అంటే మిమ్మల్ని భయపెట్టే భూతం కాదని తెలుసుకోవాలి.