చేయకూడని.. కెరీర్ మిస్టేక్స్!
ఉద్యోగ జీవితంలో విజయవంతంగా రాణించడం అనేది నదిపై ప్రయాణం లాంటిది కాదు. మహా సముద్రంపై ప్రయాణం లాంటిది. స్వల్ప కాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటాం. తక్షణ పదోన్నతి కోసం ఆరాటపడతాం. దీర్ఘకాలిక అవసరాలను, ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోం. కానీ, చిన్న చిన్న విషయాలే కెరీర్‌పై ఎనలేని ప్రభావం చూపుతాయి. వాటిని పరిగణనలోకి తీసుకోకపోతే కెరీర్‌లో ఆశించిన ఎదుగుదల ఉండదు. ఉద్యోగులు సాధారణంగా ఐదు రకాల కెరీర్ మిస్టేక్స్ చేస్తుంటారని నిపుణులు అంటున్నారు. ఆ పొరపాట్లను సరిదిద్దుకుంటే ఉద్యోగ బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు దూసుకుపోవచ్చు.
నెట్‌వర్క్‌ను విస్తరించుకోవాలి
నెట్‌వర్కింగ్ విలువ చాలా మందికి తెలియదు. కేవలం బిజినెస్ కార్డులను ఇచ్చిపుచ్చుకునేందుకే సదస్సులు, సమావేశాలకు హాజరవుతుంటారు. కెరీర్‌లో రాణింపునకు మీ రంగంతోపాటు ఇతర రంగాలకు చెందినవారితో కూడా స్నేహ సంబంధాలను పెంచుకోవాలి. కొత్త పరిచయాలు కొత్త ఆలోచనలకు దారితీస్తాయి. ఈ నెట్‌వర్కింగ్‌తో మీ రోజువారి జీవితం మరింత సులభతరంగా మారుతుంది. మీ నెట్‌వర్క్‌లో భిన్న రకాల భాషలు, సంస్కృతులకు చెందిన వ్యక్తులు ఉండేలా చూసుకోండి. ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్స్ పెంచుకోవడం కష్టమే కానీ, అసాధ్యం మాత్రం కాదు. దీనికి సమయం వెచ్చిస్తే.. అది వృథా కాదు. భవిష్యత్తులో తప్పనిసరిగా సానుకూల ఫలితం లభిస్తుంది.
డబ్బే ముఖ్యం కాదు
ప్రస్తుతం వస్తున్న జీతం కంటే మరో 20 శాతం అదనంగా వస్తే బాగుంటుందన్న ఆలోచన ప్రతి ఉద్యోగికి ఉంటుందంట. మెరుగైన వేతనాల కోసం కంపెనీలను, ఉద్యోగాలను వెంటవెంటనే మార్చేసే వారు ఎందరో ఉన్నారు. మరో కొలువులోకి మారితే బ్యాంకు బ్యాలెన్స్ కొంత పెరగొచ్చు. కానీ, అది కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆదాయం కంటే ముందు పనిలో అనుభవం, నైపుణ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. లాంగ్ రన్‌లో ఇది మీకు కచ్చితంగా మేలు చేస్తుంది. ఉన్నత హోదాలు, ఎక్కువ జీతభత్యాలు పొందడానికి ఆస్కారం కల్పిస్తుంది.
పరాజయం.. సహజమే
ఓటమి ఎదురవుతుందన్న భయంతో కొందరు సాహసాలు చేయడానికి వెనుకాడుతుంటారు. అయితే, క్లిష్ట పరిస్థితుల్లోనే ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లాంగ్‌టర్మ్ సక్సెస్ కావాలంటే పరాజయాలకు లొంగొద్దు. ఫలితం తో సంబంధం లేకుండా ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండాలి. ప్రతి ఓటమి ఒక కొత్త పాఠా న్ని నేర్పుతుంది. జీవితం అంటే ఏమిటో తెలి యజేస్తుంది. కాబట్టి పనిలో రిస్క్ తీసుకోవడానికి భయపడకండి. ఫెయిల్యూర్స్.. వృత్తిగత, వ్యక్తిగత జీవితంలో ఎదుగుదలకు తోడ్పడతాయి.
కార్యాలయానికి సమీపంలో
మీరు పనిచేస్తున్న కార్యాలయానికి సమీపంలో ఉండేలా చూసుకోండి. రాకపోకలకు మీకు ఎలాంటి ప్రతిబంధకాలు ఉండకూడదు. ఆఫీస్‌కు వెళ్లిరావడం సౌలభ్యంగా ఉండేలా జాగ్రత్తపడాలి. ప్రధానంగా కంపెనీలో ఉన్నతస్థాయిలో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణానికే ఎక్కువ సమయం వెచ్చిస్తే విధి నిర్వహణ కుంటుపడుతుంది.
ఇతరులకు సహాయం
మేలు చేసిన.. మేలు కలుగున్. ఇతరులకు మంచి చేస్తే మీకు కూడా మంచే జరుగుతుంది. అవసరంలో ఉన్నవారికి సహకరిస్తే దాని ప్రతిఫలం భవిష్యత్తులో ఏదో ఒక సందర్భంలో తప్పకుండా కనిపిస్తుంది. ప్రొఫెషనల్ కెరీర్‌లో అలవరచుకోవాల్సిన ప్రధాన లక్షణం ఇది. కెరీర్‌లో సక్సెస్‌కు ప్రతిదశలో సహచరుల సహకారం అవసరం. ప్రయోజనం కలగాలనే దురుద్దేశం లేకుండా ఇతరులకు మనస్ఫూర్తిగా సహకరించండి. సహాయం చేయండి. ఇతరుల సహకారం పొందండి.