కెరీర్‌లో విసుగెత్తిపోయారా? | Are you dissatisfied with your job ? | Sakshi
Sakshi News home page

కెరీర్‌లో విసుగెత్తిపోయారా?

Published Wed, Jul 30 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM

కెరీర్‌లో విసుగెత్తిపోయారా?

కెరీర్‌లో విసుగెత్తిపోయారా?

జాబ్ స్కిల్స్: మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం విసుగ్గా ఉందా? కొలువు నిర్జీవంగా, అనాసక్తిగా మారిందా? దీన్ని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలని అనిపిస్తోందా? రొటీన్ లైఫ్ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారా? కొత్తగా ఏదైనా చేయాలని భావిస్తున్నారా?... జీవితంలో చాలామందికి ఏదో ఒక దశలో ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. కెరీర్‌లో విసుగు రావడానికి, ఉద్యోగ జీవితం చప్పగా మారడానికి చాలా కారణాలుంటా యని నిపుణులు చెబుతున్నారు. నిజాయతీ గా ప్రయత్నిస్తే.. జీవితంలో పునరుత్తేజం పొందొచ్చని, హ్యాపీగా ఉద్యోగం చేసుకో వచ్చని పేర్కొంటున్నారు. జాబ్ ఇష్టం లేకపోతే మరో రంగంలో అడుగుపెట్టి సక్సెస్ కావొచ్చని సూచిస్తున్నారు.
 
 మీరే స్థితిలో ఉన్నారు?
 జాబ్‌పట్ల విముఖత తలెత్తడానికి ప్రధానంగా చుట్టూ ఉన్న పరిస్థితులే కారణం. ఆఫీస్‌లో పై అధికారి, సహోద్యోగుల వైఖరి నచ్చక చాలామంది ఉద్యోగం వదిలేయాలని అనుకుంటారు. తమ కెరీర్‌లో డెడ్ ఎండ్‌కు వచ్చేసినట్లు భావిస్తుంటారు. ఆఫీస్‌లో ఎక్కువ సేపు పనిచేయడం, అదనపు బాధ్యతలను మోయాల్సి రావడం, విధి నిర్వహణలో తరచుగా ప్రయాణాలు, సేల్స్ టార్గెట్లు వంటివి ఉద్యోగులను తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తాయి. కొందరు వీటిని భరించలేరు. కెరీర్‌లో ఎదుగుదల లేకపోయినా నీరసానికి గురవుతారు. తమకు ఆనందం కలిగించని కొలువులో ఇంకా ఎందుకు ఉండాలని ఆవేశపడుతుంటారు. తమపై బాస్‌ల పెత్తనం భరించలేని వారు కూడా  కొలువుకు గుడ్‌బై చెప్పాలన్న ఆలోచనలో ఉంటారు. కానీ, మరో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల ఇష్టంలేకపోయినా బలవంతంగా సర్దుకుపోతుంటారు.
 
 కొందరు ఉద్యోగంలో చేరినప్పుడు ఆఫీస్‌లో ఎలాంటి విధులు నిర్వర్తించారో.. ఐదేళ్ల తర్వాత కూడా అవే పనులు చేస్తుంటారు. కొత్త బాధ్యతలను చేపట్టి, కొత్త విషయాలను నేర్చుకొనేందుకు అవకాశం ఉండదు. తమ నైపుణ్యాలు వృథా అవుతున్నాయని వీరు బాధపడుతుంటారు. ఇంకొందరి పరిస్థితి మరోలా ఉంటుంది. ఆఫీస్‌లో చేద్దామంటే చేతినిండా పని ఉండదు. ఖాళీగా కూర్చోవడం వీరికి నచ్చదు. కొత్తకొత్త సవాళ్లను ఎదుర్కోవడం అంటే వీరికి చాలా ఇష్టం. కానీ, చేయడానికి పని లేకపోవడం వల్ల కెరీర్ పట్ల ఆసక్తిని కోల్పోతుంటారు.
 
 జాబ్‌లో అసంతృప్తి, అయిష్టం  
 మరోరకం ఉద్యోగులు కూడా ఉంటారు. వీరికి తెల్లారుతుందంటేనే భయం. ఆఫీస్‌కెళ్లాలంటే బెంబేలెత్తిపోతుంటారు. కుర్చీలో కూర్చోగానే వీరి బుర్ర పనిచేయడం మానేస్తుంది. తాము మానసికంగా, శారీరకంగా బలహీనంగా మారినట్లు భావిస్తుంటారు. రోజు ఎలా గడుస్తుందా? అని క్షణక్షణం ఎదురుచూస్తుంటారు. వీకెండ్ కోసం చకోర పక్షుల్లా నిరీక్షిస్తుంటారు. జాబ్‌లో సంతృప్తి లేకపోవడం, వస్తున్న జీతం సరిపోకపోవడం, ఎన్నాళ్లు పనిచేసినా వేతనం పెరగకపోవడం వంటి కారణాలతోనూ కెరీర్ పట్ల అయిష్టాన్ని చూపేవారు కూడా ఉంటారు.
 
 స్వీయ సమీక్ష తప్పనిసరి

 కెరీర్‌ను, జీవితాన్ని ప్రేమించాలంటే మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి. ఉద్యోగం పట్ల విసుగెత్తిపోయి నప్పుడు ఇలాంటి సమీక్ష తప్పని సరి. మీకున్న అర్హతలు, నైపుణ్యాలు, అనుభవాలు, మీ ఆర్థిక పరిస్థితి తదితర విషయాలను అంచనా వేసు కోండి. మీ లక్ష్యాలేంటి? వాటిని చేరుకొ నేందుకు ఏం చేయాలి? మీరేం చేయాలను కుంటున్నారు? మీరు ఏ విషయంలో నిష్ణాతులు? మీకున్న నైపుణ్యాలకు నిజంగా ఎంత వేతనం వస్తుంది? బయట జాబ్ మార్కెట్ ఎలా ఉంది? ఉద్యోగాలు దొరుకుతున్నాయా? లేదా? అనే విషయాలను తెలుసుకొనేందుకు మిమ్మల్ని మీరు ప్రశ్నించు కోండి. మీ ప్రస్తుత స్థితిని స్నేహితులకు, కుటుంబ సభ్యులకు తెలియజేయండి. పరిస్థితిని మీరు అతిగా ఊహించుకొని భయపడకుండా, వాస్తవాన్ని మీకు తెలిసేలా చేయడంలో వారు సహకరిస్తారు. ఆఫీస్‌లో సహచరులతోనూ మాట్లాడండి. చుట్టూ నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోండి. పరిస్థితిని మీరు తప్పుగా అర్థం చేసుకుంటే వారు సరిచేస్తారు. ఇతర రంగాల్లోని వారిని కూడా సంప్రదించండి. జాబ్ మార్కెట్ ఎలా ఉందో తెలుస్తుంది.
 
 ఆత్మవిశ్వాసం పెంచుకోండి
 లైఫ్ రొటీన్‌గా మారినప్పుడు స్వయంగా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఉదయం యోగా చేయండి. దీనివల్ల మనసు, శరీరం రిలాక్స్ అవుతాయి. మీ రంగానికి సంబంధం లేని మరో ఆఫీస్‌ను సందర్శించండి. దీనివల్ల మీ పరిస్థితిని మరో కోణంలో చూసే అవకాశం లభిస్తుంది.
 
  వీకెండ్‌లో కొత్తగా ఏదైనా చేయండి. వీలుంటే డ్యాన్స్ క్లాస్‌లో చేరండి. లాంగ్ డ్రైవ్‌కు కూడా వెళ్లొచ్చు. కొత్త ప్రదేశాన్ని దర్శించండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటికొచ్చి అప్పటిదాకా పరిచయం లేని కొత్త పనిచేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆఫీస్ పనుల్లోనూ మార్పులు చేసుకోండి. మరో టీమ్‌తో కలిసి పనిచేయండి. కొత్త బాధ్యతలను స్వీకరించండి. వేతనం సరిపోకపోతే ఆ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లండి. కొలువు మారాలని కచ్చితంగా నిర్ణయించుకుంటే.. మీ అర్హతలను పెంచుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement