‘మౌఖికం’లో మెరిసేందుకు ముచ్చటైన నైపుణ్యాలు..
‘‘నాకు సరైన కొలువులో కుదురుకునేందుకు సరిపడా చదువుంది! అవసరమైన అన్ని అర్హతలూ ఉన్నాయి! అయినా ఇప్పటికీ నిరుద్యోగం వెంటాడుతూనే ఉంది. ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరయ్యాను.. కానీ అన్నింటా ప్రతికూల ఫలితాలే’’- ఇలా నిట్టూర్చే వారు చాలా మంది ఉంటారు. దీనికి కారణం.. ఇంటర్వ్యూలో అభ్యర్థులు తమ సామర్థ్యాలను సరైన పద్ధతిలో ప్రదర్శించలేకపోవడమే!
ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరచాలంటే..
1. సమస్య పరిష్కార సామర్థ్యం: ఇంటర్వ్యూలో తప్పనిసరిగా సమస్య పరిష్కార నైపుణ్యాలను అంచనా వేసేందుకు ప్రశ్నలు అడుగుతారు. వీటికి సరైన సమాధానాలు చెప్పాలంటే తొలుత సమస్యను బాగా అర్థం చేసుకోవాలి. అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి, సమస్య పరిష్కారానికి మార్గాలు చూపించగలగాలి. ఈ సమయంలో సృజనాత్మక దృక్పథాన్ని ప్రదర్శించగలిగితే విజయం మీదే.
2. శ్రద్ధగా వినడం: ఇంటర్వ్యూలో విజయం సాధించడంలో బాగా వినడం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి చెబుతున్న దాన్ని శ్రద్ధగా విని, విశ్లేషించుకోవాలి. అప్పుడే అడిగిన ప్రశ్నకు కచ్చితమైన సమాధానమివ్వగలం. లేదంటే గందరగోళానికి గురై పొంతన లేని సమాధానాలు ఇచ్చే ప్రమాదముంది.
3. క్రిటికల్ థింకింగ్: ఇంటర్వ్యూలో ఒకట్రెండు క్లిష్టమైన ప్రశ్నలు ఎదురవుతాయి. అభ్యర్థి ఆలోచనా సరళిని, ఓ సమస్యకు సత్వర పరిష్కారాలను చూపే సామర్థ్యాన్ని అంచనా వేయడం వీటి లక్ష్యం. ఇలాంటి ప్రశ్నలు ఎదురైన సందర్భంలో తప్పనిసరిగా తార్కికతను ఉపయోగించి, సమాధానాలు చెప్పాలి.
4. నిర్ణయాత్మక శక్తి: ఓ సమస్యకు అందుబాటులో ఉన్న పరిష్కారాల్లో అభ్యర్థి దేన్ని, ఎందుకు ఎంపిక చేసుకున్నాడన్న దాని ఆధారంగా నిర్ణయాత్మక శక్తిని అంచనా వేస్తారు. అభ్యర్థి తన నిర్ణయాన్ని ఎలా సమర్థించుకున్నాడన్నది ప్రధానం.
5. నాయకత్వం: బృందానికి నేతృత్వం వహించగల సామర్థ్యం ఉన్నవారికి కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఓ కొత్త ప్రాజెక్టు గురించి చెప్పి, దాన్ని ఎలా చేపట్టగలవు? అనే ప్రశ్న ద్వారా నాయకత్వ నైపుణ్యాలను అంచనా వేస్తారు. అభ్యర్థి సమాధానాలు ఇదే కోణంలో ఉండాలి. బృంద స్ఫూర్తి, పనిలో నైతికత, ఆత్మగౌరవం వంటివి బయటపడేలా సమాధానాలు ఇవ్వాలి. గతంలో ఏదైనా సంస్థలో పనిచేస్తే అక్కడ ఎలాంటి చొరవ చూపారో చెప్పాలి.
6. సానుకూల దృక్పథం: ఎప్పుడూ నిరాశగా ఉంటూ, చురుగ్గా లేని వ్యక్తితో కలిసి పనిచేయాలని సంస్థలో ఏ ఒక్కరూ కోరుకోరు. ముఖంపై చెరగని చిరునవ్వు, సానుకూల దృక్పథం ఉన్నవారే నలుగురినీ ఆకర్షించగలరు. ఇలాంటి ప్రవర్తనను అంచనా వేసేలా ఇంటర్వ్యూ బోర్డు ప్రశ్నలు అడుగుతుంది.