ఉద్యోగాల భర్తీకి తొలగిన న్యాయ చిక్కులు | Legal entanglements removed for filling jobs | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల భర్తీకి తొలగిన న్యాయ చిక్కులు

Published Sat, Mar 16 2024 2:52 AM | Last Updated on Sat, Mar 16 2024 2:52 AM

Legal entanglements removed for filling jobs - Sakshi

తెలంగాణ రాష్ట్రం ఏర్ప డినంక నిరుద్యోగుల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడినట్లు అయింది. నీళ్లు, నిధులు, నియామకాలే ఎజెండాగా సాగిన ఉద్య మంలో నిరుద్యోగులకు గత ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలుపై విధానపరమైన నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం వల్ల వేలాది ఉద్యోగాలు, ఉద్యోగ ప్రకటనలకే పరిమి తమై భర్తీకి నోచుకోలేదు. పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌లో 2016లోనే జీవో నెం. 40ని జారీ చేసి ఉద్యోగ నియామకాల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేస్తున్నారు. 

నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం క్లిష్టమైనటువంటి మహిళా రిజర్వేషన్‌ అమలుపై హైకోర్టు ఆదేశానుసారంగా నిర్ణయం తీసుకొని ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన మహిళా కోటాకుసంబంధించిన జీవోలను రద్దు చేస్తూ, 3, 35నంబర్ల జీవోలను జారీ చేసి ఉద్యోగ నియామక ప్రక్రియలు కొనసాగే విధంగా మార్గాన్ని సుగుమం చేసింది. నూతన విధానంలో 100 పాయింట్ల రోస్టర్‌లో మహిళలకు ప్రత్యేక రోస్టర్‌ పాయింట్లను కేటాయించ కుండా ప్రతీ ఉద్యోగ ప్రకటనలో ఓసీ, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగుల, స్పోర్ట్స్, ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ కేటగిరీలకు కలిపి మొత్తం 33.33 శాతం పోస్టు లను  కేటాయించనున్నారు. అనగా ప్రతీ కేటగి రిలో ప్రతీ నాలుగు పోస్టుల్లో ఒక్క పోస్టు మహిళ లకు సమాంతరంగా కేటాయించ బడుతుంది.

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 1992 నుండి నేటి వరకు ప్రధాన కేసులైన ఇందిరా సహానీ వర్సెస్‌ యూనియన్‌ అఫ్‌ఇండియా, రాజేష్‌ కుమార్‌ దరియా వర్సెస్‌ రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తదితర తీర్పుల్లో వర్టికల్‌ రిజర్వేషన్లుగాఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కోటాలను; హారిజాంటల్‌ రిజ ర్వేషన్లుగా మహిళా, దివ్యాంగులు, స్పోర్ట్స్, ఎక్స్‌ సర్వీస్‌ మెన్, ఎన్‌సీసీ కోటాలను నిర్ధారించింది. అందులో వర్టికల్‌/ నిలువు/ సామాజిక మరియు హారిజాంటల్‌/ సమాంతర/ ప్రత్యేక  రిజర్వేష న్లను ఏవిధంగా అమలు చెయ్యాలో స్పష్టం చేసింది.

వర్టికల్‌ రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15(4), 15(5), 15(6), 16(4), 16(6) ద్వారా కల్పిస్తున్నవి. కావున ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ ఎస్‌ అభ్యర్థులు జనరల్‌ కేటగిరీ పోస్టులకు కూడా పోటీపడి ఎంపిక కావచ్చు. ఫలితంగా వారికి కేటాయించిన రిజర్వేషన్‌ శాతాన్ని మించి ఎంపిక కావచ్చు. ఆర్టికల్‌ 15(3)ను అనుసరించి సమాంతర రిజర్వేషన్‌ పద్ధతిలో మహిళలకు మొత్తం ఉద్యోగాల్లో 33.33 శాతం పోస్టులకు మాత్రమే ఎంపిక అవ్వడానికి ఆస్కారం ఉంది. మహిళలు జనరల్‌ కేటగిరీ పోస్టులకు ఎన్నికైనా వారిని కూడా ఈ 33.33 శాతం కిందకే తీసుకువస్తారు. అంటే మహిళలు 33.33 శాతానికి మించి ఎంపిక కాకూడదన్నమాట.

అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు 2009లో జూనియర్‌ సివిల్‌ జడ్జీల నియామకా లకు సంబంధించిన కేసు: కె. వెంకటేష్‌ వర్సెస్‌ గవర్నమెంట్‌ అఫ్‌ ఆంధ్రప్రదేశ్, 2020లో తెలంగాణ హైకోర్టు మాచర్ల సురేష్‌ వర్సెస్‌ స్టేట్‌ అఫ్‌ తెలంగాణ మధ్య జరిగిన కేసుల తీర్పుల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చెయ్యాలని ఆదేశించాయి.

దిన పత్రికల్లో 2020 నుండి మహిళా రిజ ర్వేషన్ల సమస్యపై పతాక శీర్షికల్లో వార్తలు వచ్చి నప్పటికీ, గత తెలంగాణ ప్రభుత్వానికి విధాన పరమైన నిర్ణయం తీసుకోవడానికి సమయం లేకపోయింది. నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అతి తక్కువ సమయంలో నిర్ణయం తీసుకొని 3, 35 నంబర్ల జీవోలను జారీ చేయడం స్వాగతించ వలసిన అంశం. 

- వ్యాసకర్త తెలంగాణ విద్యుత్‌ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మొబైల్‌: 94909 59625
- కోడెపాక కుమార స్వామి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement