Womens Reservation
-
మహిళకు మకుటం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళను నిర్ణయాత్మక శక్తిగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. అన్నిటా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పుడు సీట్ల కేటాయింపుల్లోనూ పెద్దపీట వేశారు. దేశంలో తొలిసారిగా దిశ బిల్లు తీసుకొచ్చారు. నవరత్నాల ద్వారా అమలు చేస్తున్న ప్రతి పథకం మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిందే. ఐదేళ్లుగా అందిస్తున్న తోడ్పాటుతో మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతను సాధించారు. గత ఎన్నికల్లో మహిళలకు 19 ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించగా ఇప్పుడు 24కు పెంచారు. ప్రధాన విపక్ష అభ్యర్థులపై వైఎస్సార్సీపీ నుంచి మహిళలనే పోటీకి దించారు. మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌పై బీసీ మహిళ మురుగుడు లావణ్యకు పోటీ చేసే అవకాశం కల్పించారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా సీఎం జగన్ ఆమెకు టికెట్ ఇచ్చారు. పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై వైఎస్సార్సీపీ నుంచి వంగా గీతను పోటీకి దించారు. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణపై వైఎస్సార్సీపీ తరపున బీసీ మహిళ టి.నారాయణ దీపికను బరిలోకి దించారు. విశాఖ ఎంపీ సీటుకు గత ఎన్నికల్లో ఓసీ అభ్యర్థులే పోటీ చేయగా సీఎం జగన్ చరిత్రను తిరగరాస్తూ బీసీ మహిళ బొత్స ఝాన్సీలక్ష్మికి వైఎస్సార్సీపీ టికెట్ ఇచ్చారు. చాలాకాలంగా నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి కోటీశ్వరులే పోటీలో నిలవగా సీఎం జగన్ సాధారణ కార్యకర్త, బీసీ మహిళ గూడూరి ఉమాబాలను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఎమ్మిగనూరులో టీడీపీ అగ్రవర్ణాలకు టికెట్ ఇవ్వగా బీసీ మహిళ బుట్టా రేణుక వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మహిళా నేతలకు టికెట్లు.. వైఎస్సార్సీపీ అరకు పార్లమెంట్ పరిధిలో ఎంపీ అభ్యర్థిగా తనూజారాణి, అసెంబ్లీ అభ్యర్థులుగా వి.కళావతి(పాలకొండ), పుష్పశ్రీవాణి (కురుపాం), ఎన్ ధనలక్ష్మి(రంపచోడవరం), విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీలక్ష్మి, కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా వంగా గీత పోటీ చేస్తున్నారు. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని తానేటి వనిత(గోపాలపురం), శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఇచ్ఛాపురం నుంచి పిరియా విజయ, పాతపట్నం నుంచి రెడ్డి శాంతి, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పోలవరం నుంచి తెల్లం రాజ్యలక్ష్మీ బరిలో ఉన్నారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కంగాటి శ్రీదేవి(పత్తికొండ), బుట్టా రేణుక (ఎమ్మిగనూరు), హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా జోలదరాసి శాంతి, హిందూపురం, పెనుగొండ అసెంబ్లీ స్థానాల నుంచి టి.నారాయణ దీపిక, కేవీ ఉషశ్రీచరణ్, గుంటూరు పార్లమెంట్ పరిధిలోని తాడికొండ, మంగళగిరి, గుంటూరు పశి్చ మ, గుంటూరు తూర్పు అసెంబ్లీ స్థానాల నుంచి మేకతోటి సుచరిత, మురుగుడు లావణ్య, విడదల రజని, షేక్ నూరి ఫాతిమా, కడప పార్లమెంట్ పరిధిలోని బద్వేలు అసెంబ్లీ స్థానం నుంచి డాక్టర్ దాసరి సుధ, చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని నగరి, గంగాధర నెల్లూరు అసెంబ్లీ స్థానాల నుంచి ఆర్కే రోజా, కళత్తూరు కృపాలక్ష్మిలు పోటీ చేస్తున్నారు. రాజకీయ సాధికారత.. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకూ పదవుల్లో మహిళలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. దేశ చరిత్రలో తొలిసారి హోంమంత్రిగా ఎస్సీ మహిళ మేకతోటి సుచరితను నియమించారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా ముస్లిం మహిళను ఎంపిక చేశారు. మండలి చరిత్రలో ముస్లిం మహిళను డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా నియమించడం ఇదే తొలిసారి. మంత్రివర్గంలో నలుగురు మహిళలు తానేటి వనిత, కేవీ ఉషాశ్రీచరణ్, విడదల రజిని, ఆర్కే రోజాలకు స్థానం కల్పించారు. హోం, వైద్యారోగ్యం, మహిళా శిశుసంక్షేమం లాంటి కీలక శాఖలు వారికి అప్పగించి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారు. రాష్ట్ర తొలి చీఫ్ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్నికి అవకాశం కల్పించారు. రాష్ట్రంలో 13 జెడ్పీ చైర్పర్సన్ పదవుల్లో ఏడుగురు (54 శాతం) మహిళలకు అవకాశం ఇచ్చారు. 26 జెడ్పీ వై‹స్ చైర్పర్సన్లలో 15 మంది (58 శాతం) మహిళలకు పదవీయోగం కల్పించారు. 12 మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు కలిపి మొత్తంగా 36 పదవుల్లో 18 అంటే 50 శాతం పదవులు మహిళలకే ఇచ్చారు. మొత్తం మునిసిపల్ కార్పొరేషన్లలో 671 మంది కార్పొరేటర్లు ఉంటే అతివలకే 54 శాతం అంటే 361 పదవులు దక్కాయి. 75 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 73 చోట్ల వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వాటిలో 45 మంది అంటే 64 శాతం మహిళలే ఛైర్పర్సన్లుగా ఉన్నారు. ఈ మునిసిపాల్టీల్లోని 2,123 వార్డు మెంబర్లలో 1,161 పదవులు అంటే 55 శాతం మహిళలకే దక్కాయి. సర్పంచి పదవుల్లో 57 శాతం, ఎంపీటీసీల్లో 54 శాతం, మండలాధ్యక్షుల్లో 53 శాతం, జెడ్పీటీసీల్లో 53 శాతం మహిళలకే దక్కడం గమనార్హం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించగా వీరిలో 53 శాతం మహిళలే ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న దాదాపు 1.34 లక్షల మంది ఉద్యోగుల్లో 51 శాతం మంది మహిళలే ఉన్నారు. -
ఉద్యోగాల భర్తీకి తొలగిన న్యాయ చిక్కులు
తెలంగాణ రాష్ట్రం ఏర్ప డినంక నిరుద్యోగుల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడినట్లు అయింది. నీళ్లు, నిధులు, నియామకాలే ఎజెండాగా సాగిన ఉద్య మంలో నిరుద్యోగులకు గత ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలుపై విధానపరమైన నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం వల్ల వేలాది ఉద్యోగాలు, ఉద్యోగ ప్రకటనలకే పరిమి తమై భర్తీకి నోచుకోలేదు. పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌లో 2016లోనే జీవో నెం. 40ని జారీ చేసి ఉద్యోగ నియామకాల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేస్తున్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం క్లిష్టమైనటువంటి మహిళా రిజర్వేషన్ అమలుపై హైకోర్టు ఆదేశానుసారంగా నిర్ణయం తీసుకొని ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన మహిళా కోటాకుసంబంధించిన జీవోలను రద్దు చేస్తూ, 3, 35నంబర్ల జీవోలను జారీ చేసి ఉద్యోగ నియామక ప్రక్రియలు కొనసాగే విధంగా మార్గాన్ని సుగుమం చేసింది. నూతన విధానంలో 100 పాయింట్ల రోస్టర్‌లో మహిళలకు ప్రత్యేక రోస్టర్ పాయింట్లను కేటాయించ కుండా ప్రతీ ఉద్యోగ ప్రకటనలో ఓసీ, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగుల, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలకు కలిపి మొత్తం 33.33 శాతం పోస్టు లను కేటాయించనున్నారు. అనగా ప్రతీ కేటగి రిలో ప్రతీ నాలుగు పోస్టుల్లో ఒక్క పోస్టు మహిళ లకు సమాంతరంగా కేటాయించ బడుతుంది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 1992 నుండి నేటి వరకు ప్రధాన కేసులైన ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ అఫ్‌ఇండియా, రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తదితర తీర్పుల్లో వర్టికల్ రిజర్వేషన్లుగాఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాలను; హారిజాంటల్ రిజ ర్వేషన్లుగా మహిళా, దివ్యాంగులు, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ కోటాలను నిర్ధారించింది. అందులో వర్టికల్/ నిలువు/ సామాజిక మరియు హారిజాంటల్/ సమాంతర/ ప్రత్యేక రిజర్వేష న్లను ఏవిధంగా అమలు చెయ్యాలో స్పష్టం చేసింది. వర్టికల్ రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 15(5), 15(6), 16(4), 16(6) ద్వారా కల్పిస్తున్నవి. కావున ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ ఎస్ అభ్యర్థులు జనరల్ కేటగిరీ పోస్టులకు కూడా పోటీపడి ఎంపిక కావచ్చు. ఫలితంగా వారికి కేటాయించిన రిజర్వేషన్ శాతాన్ని మించి ఎంపిక కావచ్చు. ఆర్టికల్ 15(3)ను అనుసరించి సమాంతర రిజర్వేషన్ పద్ధతిలో మహిళలకు మొత్తం ఉద్యోగాల్లో 33.33 శాతం పోస్టులకు మాత్రమే ఎంపిక అవ్వడానికి ఆస్కారం ఉంది. మహిళలు జనరల్ కేటగిరీ పోస్టులకు ఎన్నికైనా వారిని కూడా ఈ 33.33 శాతం కిందకే తీసుకువస్తారు. అంటే మహిళలు 33.33 శాతానికి మించి ఎంపిక కాకూడదన్నమాట. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2009లో జూనియర్ సివిల్ జడ్జీల నియామకా లకు సంబంధించిన కేసు: కె. వెంకటేష్ వర్సెస్ గవర్నమెంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్, 2020లో తెలంగాణ హైకోర్టు మాచర్ల సురేష్ వర్సెస్ స్టేట్ అఫ్ తెలంగాణ మధ్య జరిగిన కేసుల తీర్పుల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చెయ్యాలని ఆదేశించాయి. దిన పత్రికల్లో 2020 నుండి మహిళా రిజ ర్వేషన్ల సమస్యపై పతాక శీర్షికల్లో వార్తలు వచ్చి నప్పటికీ, గత తెలంగాణ ప్రభుత్వానికి విధాన పరమైన నిర్ణయం తీసుకోవడానికి సమయం లేకపోయింది. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ సమయంలో నిర్ణయం తీసుకొని 3, 35 నంబర్ల జీవోలను జారీ చేయడం స్వాగతించ వలసిన అంశం. - వ్యాసకర్త తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మొబైల్: 94909 59625 - కోడెపాక కుమార స్వామి -
మహిళా రిజర్వేషన్లపై కవిత మరో డిమాండ్.. కేంద్రానికి వార్నింగ్!
సాక్షి, హైదరాబాద్: దేశంలో మహిళా రిజర్వేషన్లపై తెలంగాణ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్లపై మరో పోరాటం చేస్తామని తెలిపారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని 2024 సార్వత్రిక ఎన్నికల నుంచే అమలు చేయాలనే డిమాండ్‌తో మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు కవిత స్పష్టం చేశారు. కాగా, తాజాగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో తాము చేసిన పోరాటానికి దిగి వచ్చిన కేంద్రం.. పార్లమెంట్ లో బిల్లును పాస్ చేసిందని చెప్పారు. చట్టంగా మారిన తర్వాత అమలు వాయిదా వేసే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. లేదంటే తాము కూడా న్యాయపోరాటం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక, ఈ విషయంపై న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే ఈ విషయంపై పలు పార్టీలు, సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయని చెప్పారు. ఆయా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతోందని గుర్తుచేశారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లో భారత్ జాగృతి తరఫున తాము ఇంప్లీడ్ అవుతామని వివరించారు. ఇక, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని 2024 నుంచే అమలు చేయాలనే డిమాండ్‌తో మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు కవిత వివరించారు. ఇది కూడా చదవండి: సీపీఎం అభ్యర్థుల ప్రకటన.. కాంగ్రెస్‌కు షాక్ -
వ్యాక్సిన్ల సామర్థ్యం తెలిసేదెలా?!
‘‘ఎప్పటికప్పుడు కొత్త వ్యాక్సిన్ల సృష్టి జరుగుతూన్న సందర్భంగా సదరు వ్యాక్సిన్లు సరిగ్గా పని చేసేవా, లేదా అని తేల్చుకోవాలంటే – ముందు ఆ వ్యాక్సిన్లను రాజకీయ పాలకులపై ప్రయోగించి చూడాలి. ఎందుకంటే, తీసుకున్న వ్యాక్సిన్ వల్ల ఆ పాలకులు బతికి బట్టకడితే ఆ వ్యాక్సిన్ మంచిదని నిర్ధారణ చేసుకోవచ్చు. కానీ ఆ పాలకులు ఆ వ్యాక్సిన్ వల్ల స్వర్గస్థులయితే, దేశం సుఖంగా ఉన్నట్టు భావించాలి.’’ – ప్రసిద్ధ పోలిష్ తాత్వికులు మోనికా విర్నివా స్కా ఈ బండ ‘జోకు’ వినడానికి కటువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ గత పదేళ్లకు పైగా ప్రజా బాహుళ్యం ఆరోగ్య భాగ్యం కన్నా, వ్యాపార లాభాల కోసం పెక్కు ప్రయివేట్ కంపెనీలు వ్యాక్సిన్ల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వస్తున్నాయి. అవి సృష్టించే వ్యాక్సిన్లు ప్రముఖ శాస్త్రవేత్తల కొలమానాలకు అందకపోయినా, తిరస్కరిస్తున్నా మార్కెట్లోకి పాలక వర్గాల అండతో విడుదలవుతూండటం చూస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యథేచ్ఛగా సాగిన ఈ కుంభకోణాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎండకట్టి అనుక్షణం, ఈ రోజు దాకా ప్రశ్నిస్తూ వస్తున్న ప్రసిద్ధ భారత కరోనా శాస్త్రవేత్త, పరిశోధకురాలు గగన్‌దీప్ కాంగ్! వైరస్ల స్థాయి ఎంత తీవ్రమైనదంటే – భవిష్యత్తులో సోకగల ప్రమాదాలను కూడా ముందుగానే ఊహించి రోగ నిర్ణయానికి అవసరమైన ప్రయివేట్ స్థాయి అవకాశాలను కూడా గణించి, ప్రయివేట్ కంపెనీలను షరతులతో అదుపులో ఉంచుతూ రంగంలోకిదించాలని ఆమె పదేపదే ముందస్తుగానే సూచిస్తూ వచ్చారు. ఈ రోజు కాకపోతే రేపు అయినా పాలకులు అను మతించిన ప్రయివేట్ కంపెనీలను అదుపాజ్ఞల మధ్య వాడుకోవలసి ఉంటుందన్నారు. ప్రపంచ క్లినీషియన్ శాస్త్రవేత్తలలో భారతదేశ ఉద్దండురాలుగా ఆమెను గుర్తిస్తూ లండన్ రాయల్ సొసైటీ ‘ఫెలోషిప్’ ఇచ్చి గౌరవించింది. రాయవెల్లూరు మెడికల్ కాలేజీలో వైద్య శాస్త్ర పరిశోధనా కేంద్రంలో పిల్లల్లో ప్రబలుతున్న వైరల్ వ్యాధులపై ఎనలేని పరిశోధన చేశారు. అంతేకాదు, పిల్లలకు సంబంధించి పటిష్ఠమైన ఆరోగ్య జాగ్రత్తలను ప్రాథమిక దశ నుంచే తీసుకోవడం వల్ల ఉత్తరోత్తరా వాళ్లను ఆస్పత్రుల చుట్టూ తిప్పే అవసరం ఉండదనీ, ఆ జాగ్రత్త తీసుకోకపోవడం వల్లనే కనీసం వంద దేశాల్లో లక్షలాది చిన్నారులు దారుణ పరిస్థితుల్లో చనిపోవలసి వచ్చిందనీ గగన్‌దీప్ కాంగ్ ఆందోళన వెలిబుచ్చారు. మానవాభ్యున్నతి గణింపులో గత పదిహేనేళ్లలో భారత అభి వృద్ధి సూచీ 3 స్థానాలు దిగజారి పోయింది. ఈ గణింపులో చిన్నారుల మరణ శాతం కూడా పరిగణనలోకి తీసుకుంటారనేది మరువరాదు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచవలసిన పాలకులు ఎప్పటికప్పుడు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజాస్వామ్య, లౌకిక వాద సిద్ధాంతాలను తుంగలో తొక్కుతున్నారు. మత రాజకీయాలను పెంచి పోషిస్తూ ‘హిందూ జాతీయవాదాన్ని’ రేకెత్తించి నియంతృత్వ పాలనను స్థాపించడానికి కావల సిన వాతావరణాన్ని సృష్టించుకొంటున్నారు. దీన్ని ఊహించే భారత రాజ్యాంగ నిర్మాత ‘భారత రాజ్యాంగంలో ఆచరణకు పొందుపరచిన ప్రజాస్వామ్య సూత్రాలను ఇతరులు ప్రజాస్వామ్య విరుద్ధంగా మార్చేసే ప్రమాదం లేకపోలేదు, నియంతృత్వాన్ని ప్రవేశపెట్టే ప్రమాదమూ లేక పోలేదు’ అని హెచ్చరించారు. దక్షిణాసియాలో ముఖ్యంగా భారతదేశంలో హిందూ మత రాజకీయాల వల్ల అన్యమతస్థులకు స్థానముండదనీ, ప్రజాస్వామ్య లక్ష్యాలతో పొందుపరిచిన భారత సెక్యులర్ వ్యవస్థను అపహాస్యం చేస్తూ గాంధీజీ హంతకుడు గాడ్సే కాలం నాటి పరిస్థితులను ‘సెక్యులరిజం’ పేరు చాటున తాము కూడా పాలనలో కొనసాగించ దలచినట్లు ‘బీజేపీ – ఆరెస్సెస్’ నాయకుల ప్రస్తుత ధోరణులు కనిపిస్తున్నాయనీ ‘వర్జీనియా యూని వర్సిటీ’ భారతీయ ప్రొఫెసర్ నీతీ నాయర్ ‘గాయపడ్డ మనస్సులు’ (2021) గ్రంథంలో పేర్కొన్నారు. ప్రత్యేక ‘హిందూ రాష్ట్రం’ సెగ ఒక మతాన్ని కాదు – ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, దళితులు, బౌద్ధులు అందర్నీ చుట్టుముడుతుందనీ, అందుకని, మన భారత ప్రజలు ప్రత్యేక ‘హిందూ రాష్ట్ర ప్రతిపత్తి’కీ లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగంలో అక్షర సత్యంగా పొందుపరిచిన ‘సమగ్ర భారతదేశ’ భావనకూ మధ్య వాస్త వాన్ని విధిగా ప్రేమించాలని ప్రొఫెసర్ నీతీ నాయర్ ఆ గ్రంథంలో పేర్కొ న్నారు. ఇటీవల ‘మహిళా రిజర్వేషన్ల’ సమస్యపై బీజేపీ పాలకులు నడిపిన తంతుపై సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు మంజుల్ వేసిన పాకెట్ కార్టూన్ (23.9.2023) వీరి రాజకీయాలను పట్టిస్తుంది. ‘మీ మహిళా రిజర్వేషన్ల కోటా 2039లో వస్తుంది. అయితే దాన్ని పెద్దగా ఆలస్యమైనట్టు మీరు భావించకండి. 2024లోనే మీ కోటాను మీకు కాగితం మీద కల్పిస్తాం. కానీ ఈలోగా, అంటే 2024లోనే మీ ఓటును మాకు ముందస్తు క్రెడిట్‌గా వేయండి’ అని ప్రధాని ముక్తాయించడం అసలు ‘చరుపు’! కానీ, ఆ 2039 నాటికి ఎవరుంటారో, ఎవరు ఊడతారో మాత్రం తెలియకపోవడం అసలు ‘మర్మం’! అందుకే అన్నాడేమో వేమన: ‘‘కులము గలుగువారు, గోత్రంబు గలవారు విద్య చేత విర్రవీగు వారు,పసిడి గల్గు వాని బానిస కొడుకులు!’’ ఏబీకే ప్రసాద్ abkprasad2006@yahoo.co.in సీనియర్ సంపాదకులు -
మహిళా రిజర్వేషన్ ఉద్యమం ఉధృతం: కవిత
సాక్షి, హైదరాబాద్: చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ‘మహిళలకు, దేశానికి సాధికారిత కల్పిద్దాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండి. ఈ బిల్లు ఎందుకు ప్రాధాన్యం కాకూడదు’అంటూ రూపొందించిన పోస్టర్‌ను శుక్రవారం ఆమె విడుదల చేశారు. మిస్డ్‌కాల్ కార్యక్రమంతో పా టు వచ్చే నెలలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చా గోష్టిలు నిర్వహించాలని నిర్ణయించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, మేధావులకు పోస్టు కార్డులు రాయాలని కవిత నిర్ణయించారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టాలనే డిమాండ్‌తో ఇప్పటికే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కవిత నిరాహార దీక్ష చేశారు. 18 రాజకీయ పారీ్టలతో పాటు మహిళా సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. -
మహిళా బిల్లు కోసం ఢిల్లీలో కవిత దీక్ష
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘భారత్ జాగృతి’ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. 2014, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ మహిళా బిల్లుపై ఇచ్చిన హామీని నెరవేర్చాలనే డిమాండ్‌తో దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారమిక్కడ తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మార్చి 13 నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నందున ఈ స మావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించా లని డిమాండ్ చేశారు. ‘తెలంగాణ జాగృతి’కృషి మాదిరిగానే జాతీయస్థాయిలో కార్యక్రమాల నిర్వహణ కోసం ‘భారత్ జాగృతి’ని రూపాందించినట్లు గుర్తుచేశారు. కోటాలో కోటా ఉండాల్సిందే 2010లో మహిళా బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందినప్పుడు కొన్ని పార్టీలు కోటాలో కోటా (ఉపకోటా) ఉండాలని డిమాండ్ చేశాయని, ప్రతి ఒక్కరికి వారి జనాభా ప్రకారం రాజ్యాంగబద్దంగా ఉపకోటా ఉండాలని చెప్పారు. మహిళాబిల్లుకు బీఆర్ఎస్ మద్దతిస్తుందని గతంలోనే సీఎం కేసీఆర్ ప్రకటించడంతోపాటు, పార్లమెంట్ ఎంపీల సంఖ్యను 33 శాతం పెంచి మహిళలకు కేటాయించాలని సూచించారన్నా రు. 1952లో మొదటి లోక్‌సభలో 24 మంది మహిళాఎంపీలుండగా, తాజాగా 78 మంది మహిళా ఎంపీలున్నారని, 75 ఏళ్లలో మహిళల ప్రాతినిథ్యం అనుకున్నంతగా పెరగలేదన్నారు. బీజేపీ చెబితే అరెస్టు చేస్తారా? బీజేపీవారు చెబితే అరెస్టులు చేసేట్టయితే. దర్యాప్తు సంస్థలు ఎందుకని కవిత నిలదీశారు. మోదీ వైఫల్యాలను ఎత్తిచూపితే కేంద్ర దర్యాప్తు సంస్థలను పంపి భయపెట్టడం బీజేపీకి అలవాటేనని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై విచారణ చేయిస్తున్న బీజేపీ ప్రభుత్వం,అదానీ కుంభకోణంపై ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే అదానీపై విచారణ మొదలైందన్నారు. -
‘పరిషత్’ పీఠాలలో మహిళలకు అగ్రాసనం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏడు జెడ్పీ చైర్మన్ పదవులు, 335 ఎంపీపీ పదవులను ప్రభుత్వం మహిళలకు రిజర్వు చేసింది. ఇందుకు సంబంధించిన రిజర్వేషన్లను 2020 మార్చిలో ఖరారు చేసి, అప్పట్లోనే గెజిట్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. దీంతో ఈ నెల 24, 25 తేదీల్లో జరగనున్న ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులకు ఎన్నికలు ఈ రిజర్వేషన్ల ప్రతిపాదికనే జరగనున్నాయి. ఇక రాష్ట్రంలో మొత్తం 13 జెడ్పీ చైర్మన్లకుగానూ ఎస్టీ, ఎస్సీ మహిళ, ఎస్సీ జనరల్, బీసీ జనరల్‌కు ఒక్కొక్కటి చొప్పున, బీసీ మహిళలకు రెండు, జనరల్ మహిళకు మూడు, జనరల్ కేటగిరికి నాలుగు జెడ్పీ చైర్మన్ల పదవులను రిజర్వు చేశారు. 660 ఎంపీపీ పదవులకు గాను 338 ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించారు. మైనార్టీలకు 686 కోఆప్టెడ్ పదవులు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవుల ఎన్నికలతో పాటు అదే రోజుల్లో మండల, జిల్లా పరిషత్‌లో కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికలు కూడా జరగనున్న విషయం తెలిసిందే. ప్రతి మండలానికి ఒకరు చొప్పున 660 మండల పరిషత్‌లలో, జిల్లాకు ఇద్దరేసి చొప్పున 13 జిల్లా పరిషత్‌లో కోఆప్టెడ్ సభ్యులను ఎన్నుకుంటారు. పంచాయతీరాజ్ నిబంధనల ప్రకారం మైనార్టీ వర్గాలకు చెందిన వారిని మాత్రమే మండల, జిల్లా పరిషత్‌లో కోఆప్టెడ్ సభ్యులుగా ఎన్నుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు తదితరులతో పాటు తెలుగు మినహా మిగిలిన భాషలను మాతృభాషగా గుర్తింపు పొందిన వారు కోఆప్టెడ్ పదవులు పొందేందుకు అర్హులవుతారని వారు తెలిపారు. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మండల పరిషత్‌లలో 660 మంది.. జిల్లా పరిషత్‌లలో 26 మంది కోఆప్టెడ్ సభ్యులుగా ఎన్నికయ్యే అవకాశముంది. -
మహిళంటేనే లీడర్షిప్
ఆమెకు చదువుకోవడం ఇష్టం, చదువు చెప్పడం అంతకంటే ఎక్కువ ఇష్టం. ఈ రెండు ఇష్టాలను నెరవేర్చుకోవడంలోనే సాగిపోతోంది ఆమె జీవన ప్రస్థానం. ఎం.ఎ హిస్టరీ, ఎంఈడీ చేశారు. ఎంబీఏ, ఎం.ఎస్ సైకాలజీ, ఎం.ఫిల్... ఇంతవరకు ఇండియాలో. ఆ తర్వాత సాఫ్ట్ స్కిల్స్‌లో ట్రైనర్‌గా ఉండి, యుఎస్, యూకేల్లో పర్సనల్ డెవలప్మెంట్ కోర్సులు చేశారు. అవన్నీ పూర్తయిన తర్వాత ‘ఐ విల్’ అంటూ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద పరిశోధన చేశారు. బెంగళూరు ఐఐఎమ్ ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టిన ‘ఉమెన్ ఇన్ లీడర్షిప్, ఇండియా’ కోర్సును తన పరిశోధన ద్వారా క్షేత్రస్థాయికి తీసుకెళ్లారామె. ఇవన్నీ కూడా మహిళల సమగ్ర వికాసానికి ప్రోత్సాహాన్ని అందించడానికే అంటున్నారు డాక్టర్ అరిమండ విజయ శారదారెడ్డి. గుంటూరు జిల్లా పల్నాడులోని కొదమగుండ్ల.. విజయశారద సొంతూరు. తండ్రి ఉద్యోగ రీత్యా గుంటూరులో పెరిగారామె. అత్తగారిల్లు తెనాలి దగ్గర కొల్లిపర. భర్త వరప్రసాద్ రెడ్డికి మిధానిలో ఉద్యోగం. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో సంతోష్ నగర్లో కాపురం. రోజంతా ఖాళీగా ఉండడం నచ్చని గుణం ఆమె టీచర్‌గా మారడానికి కారణమైంది. ఇంటికి దగ్గరలో ఉన్న స్కూల్లో టీచర్‌గా చేరి చదువు చెప్పడంలో ఉండే సంతోషాన్ని ఆస్వాదించడం మొదలు పెట్టారు. ఆమె విద్యాభ్యాసం అంతా సిస్టర్స్ కాన్వెంట్లో సాగడంతో, ఇంగ్లిష్ మీద సాధించిన పట్టు విజయశారదను మంచి టీచర్‌గా నిలబెట్టింది. క్రమంగా నలంద, హోలీమేరీ విద్యాసంస్థల స్థాపనకు దారి తీసింది కూడా సిస్టర్స్ కాన్వెంట్లో పడిన పునాది, టీచింగ్ మీదున్న ఇష్టమేనన్నారామె. అయితే అంతటితో తన చదువుకు స్వస్తి చెప్పకపోవడమే ఆమెలోని విలక్షణత. మన శక్తిని మనమే గుర్తించాలి నాయకత్వ లక్షణాలు మగవాళ్లకే పరిమితం కాదు, మహిళల్లోనూ పుష్కలంగా ఉంటాయి. పుట్టుకతో స్వతహాగా వచ్చిన నాయకత్వ లక్షణాలు కూడా మన మహిళల్లో అంతర్లీనమైపోతున్నాయి. అవి అంతర్థానమై పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది. ఆ ప్రయత్నంలో భాగమే బెంగళూరు ఐఐఎమ్‌లో విజయశారద చేసిన ‘ఐ విల్’ కోర్సు. ‘‘ఐ విల్ అంటే... ఇండియన్ ఉమెన్ ఇన్ లీడర్షిప్. మహిళల్లో అంతర్లీనంగా ఉండిపోతున్న నాయకత్వ లక్షణాలు వెలికి తీయడానికి రూపొందిన కోర్సు అది. విదేశాల్లో మహిళలకు స్వతంత్ర భావాలు, దృఢమైన వ్యక్తిత్వం స్వతహాగా కనిపిస్తాయి. తాము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మరొకరి ఆమోదం, అంగీకారం కోసం ఎదురు చూడరు. భర్త మద్దతు ఆశించరు. కష్టమైనా, నష్టమైనా తామే భరిస్తారు. అక్కడి సమాజాలు కూడా అందుకు దోహదం చేస్తాయి. మన దగ్గర ఒక మహిళ సొంతంగా నిర్ణయాలు తీసుకుని వ్యాపారరంగంలో ముందడుగు వేసినా సరే, సమాజం నుంచి ఆమోదం పెద్దగా లభించదు. అదే మహిళ భర్త సహకారంతో వ్యాపారం మొదలు పెడితే ప్రభుత్వపరమైన అనుమతులు రావడం కొంత సులువు అవుతుంది. ఒక మహిళ భర్త సహకారం లేకుండా పరిశ్రమను స్థాపించింది.. అంటే చాలా సందర్భాల్లో ఆమెకు బ్యాంకు రుణాలు కూడా కష్టమవుతుంటాయి. ఈ ధోరణిని తుడిచేయడానికి కంకణం కట్టుకోవాల్సింది మహిళలే’’ అన్నారు విజయ శారద. చట్రం నుంచి బయటికి రావాలి మన మహిళలు అనేక బాలారిష్టాలను ఎదుర్కొని పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. అయితే పరిధిని విస్తరించుకోవడంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ‘‘ప్రపంచదేశాల్లో జరిగే ఎంట్రప్రెన్యూర్ మీట్లలో విదేశీ మహిళల్లో ఎక్కువ మంది ఆటోమొబైల్ ఇండస్ట్రీ నడిపేవాళ్లు, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల నిర్వహకులు కనిపిస్తారు. మనవాళ్లు.. ముఖ్యంగా తెలుగు వాళ్లు వంటింటి ఉత్పత్తులు, బ్యూటీ ప్రోడక్ట్స్, ఫ్యాషన్ డిజైనింగ్ దుస్తులు, కుట్లు అల్లికలు, వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలతో వస్తుంటారు. వాటికి అమెరికాలో మంచి మార్కెట్ ఉన్న మాట వాస్తవమే. అవన్నీ క్రియేటివిటీకి ప్రతీకలే. అయితే అవేవీ ఉత్పాదకతను పెంచవు. ఓవరాల్ డెవలప్మెంట్కి దారి తీసే రంగాలు కాదు. అందుకే మనం ఆ చట్రం నుంచి బయటికొచ్చి ఇతర రంగాల్లో నైపుణ్యం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే ప్రపంచంతోపాటు పరుగెత్తగలుగుతాం. మనలో ఉన్న సంప్రదాయమైన స్కిల్స్‌కే పరిమితం కాకుండా సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోవడం చాలా అవసరం. ఈ విషయంలో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు కొంత వరకు ముందడుగులో ఉంటున్నాయి’’ అన్నారామె. పాలనా నైపుణ్యమూ ఉండాలి ‘‘పరిశ్రమల రంగంలోనే కాదు రాజకీయ రంగంలోనూ మహిళల భాగస్వామ్యం మన దగ్గర చాలా తక్కువ. 33 శాతం రిజర్వేషన్ గురించి చైతన్యవంతం చేయడంతోపాటు, రాజకీయ రంగంలో అడుగు పెట్టాలనుకుంటే బూత్ స్థాయి నుంచి కెరీర్‌ని మొదలు పెట్టాలని చెబుతుంది ‘ఐ విల్’ కోర్సు. సింగపూర్‌లో రాజకీయ నాయకులు.. రాజకీయ రంగాన్ని, ఉపాధి రంగాన్ని కలవనివ్వరు. ఉపాధి కోసం ఎవరికి వాళ్లు సొంత వ్యాపారాలు చేసుకుంటూ, సేవాభావంతో రాజకీయ రంగంలోకి వస్తారు. ప్రజలకు సర్వీస్ చేయడానికి మాత్రమే ఉంటుంది రాజకీయరంగం. అందుకే సింగపూర్ పార్లమెంట్... బెస్ట్ పార్లమెంట్‌గా గుర్తింపు పొందింది. కోర్సులో భాగంగా అక్కడికి వెళ్లి అధ్యయనం చేయడం వల్ల నా దృష్టి కోణం విస్తృతమైంది. మన దగ్గర స్థానిక సంస్థల్లో మూడవ వంతు రిజర్వేషన్ కల్పించడం వల్ల కొన్ని తొలి అడుగులు పడుతున్న మాట వాస్తవమే. అయితే అలా ఎన్నికైన మహిళలు చాలామంది ప్రతి చిన్న విషయానికీ భర్త, కుటుంబ సభ్యుల మీద ఆధారపడుతూ, సంతకాలకే పరిమితం అవుతున్నారు. అలా కాకుండా పాలన నైపుణ్యం పెంచుకోవాలి. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ బిల్లుకు మోక్షం వచ్చినప్పుడు మన మహిళ జీవికలో కొత్త కోణాలు బయటకు వస్తాయి. రిజర్వేషన్ ఉంటే ఆ స్థానంలో తప్పకుండా మహిళ మాత్రమే ఎన్నికవుతుంది... కాబట్టి అసెంబ్లీ, పార్లమెంట్లలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. మహిళలు, పిల్లల కోసం చట్టాలు చేయడంలో మగవాళ్ల దృక్పథానికి మహిళ దృష్టికోణం కూడా మమైకమవుతుంది. యుఎన్ఓలో ప్రసంగం విద్యార్థిగా, పారిశ్రామికవేత్తగా ప్రపంచంలో నాలుగు ఖండాల్లో, ముప్పైకి పైగా దేశాల్లో పర్యటించారు విజయ శారద. అన్ని దేశాల్లోనూ మహిళల సామాజిక స్థితిగతులను మనదేశంతో బేరీజు వేసుకుంటూ వచ్చారు. మహిళలకు వేధింపుల విషయంలో ప్రపంచంలోనే ఏ దేశమైనా ఒక్కటేనన్నారామె. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్‌లో భారతీయ సంస్కృతి గొప్పదనం గురించి ప్రసంగించారు. కాలేజ్‌లు నిర్వహణలో ఆమెకొచ్చిన సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి సైకాలజీలో కోర్సు చేశారు. ‘‘వేలాది మంది విద్యార్థులను ఒక తాటి మీదకు తీసుకురావాలంటే చిన్న సంగతి కాదు. వాళ్లకు మనం చెప్పేది మంచి మాటే అయినా, వాళ్లకు నచ్చే రీతిలో చెప్పకపోతే వినరు. అందుకే కౌమారదశలో ఉన్న పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి, వాళ్లకు ఎలా తెలియచెప్పాలనే మెళకువలు నేర్చుకోవడానికి సైకాలజీ చదివాను. ఆ తర్వాత నా నిర్వహణ సామర్థ్యం మెరుగుపడిన సంగతి నాకే తెలిసింది. ఒక సంస్థ నిర్వహణకు అవసరమైనట్లు మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి. కోవె(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్) సదస్సుల్లో కూడా నేను నన్నే ఉదాహరణగా చెబుతుంటాను’’ అన్నారు శారద. ఆమె కోవెలో లైఫ్ మెంబర్ కూడా.మన చుట్టూ ఉన్న వాళ్లలో... ‘అరవై ఏళ్లు నిండాయి, ఇంక చేసేదేముంది’ అని విశ్రాంత జీవనం గడపడానికి సిద్ధమయ్యేవారిని ఎందరినో చూస్తుంటాం. అయితే శారద ఇరవై నాలుగ్గంటలూ ఉపయుక్తమైన వ్యాపకాలతో నిండి ఉంటుంది. అన్ని పనుల నుంచి కొంచెం వెసులుబాటు దొరికి తీరికగా అనిపించినప్పుడు మరేదైనా కోర్సులో చేరదామా అనిపిస్తుందంటారీ నిత్య విద్యార్థి. ఆమె పేరులో సరస్వతీదేవి ఉంది, విజయమూ ఉంది. తన సంకల్పబలంతో వాటిని సార్థకం చేసుకున్నారు. – వాకా మంజులారెడ్డి సాటి మహిళకు సాయం మహిళను రెండవ స్థాయి పౌరురాలిగా అణచి వేసింది సమాజమే, కాబట్టి ప్రోత్సహించాల్సింది కూడా సమాజమే. పిల్లల పెంపకం కూడా సమాజం నిర్దేశించిన చట్రంలోనే సాగుతుంది. కాబట్టి స్త్రీ పురుషుల మధ్య అంతరం తరతరానికి పెరిగిపోతూ వచ్చింది. దాన్ని తగ్గించడానికి కొన్ని తరాల పాటు పడక తప్పదు. ‘ఐ విల్’ కోర్సు ప్రధానాంశాల్లో జీరో ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ కూడా ఒకటి. మా బ్యాచ్‌లో శిక్షణ తీసుకున్న మహిళలు ఢిల్లీ, అస్సాం, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. విద్యాసంస్థల నిర్వహణలో నెలకు ఐదు వందల మందికి జీతాలివ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆ బాధ్యతను పక్కన పెట్టి మరొకటి తలకెత్తుకునే పరిస్థితిలో లేకపోవడంతో నేనటువైపు అడుగు వేయలేదు. క్రియాశీలక రాజకీయాల్లో అడుగు పెట్టకపోయినప్పటికీ నా దృష్టికి వచ్చిన సామాజిక సమస్యల పరిష్కారానికి నా వంతు సహకారం అందిస్తున్నాను. ముఖ్యంగా స్కూళ్లలో ఆడపిల్లలకు టాయిలెట్లు లేవని తెలిసినప్పుడు ఆర్థిక సహాయం చేయడం, మంచినీళ్లు లేని కాలనీలకు ట్యాంకర్లు పంపించడం వంటివి చేస్తున్నాను. ఓ మహిళగా సాటి మహిళలకు చిన్న, మధ్య తరగతి పరిశ్రమల స్థాపనకు సహకారం అందిస్తున్నాను. – డాక్టర్ ఎ. విజయ శారదారెడ్డి, హోలీమేరీ విద్యాసంస్థల సెక్రటరీ -
గెలిస్తే ‘మహిళా బిల్లు’కు మోక్షం
కొచ్చి: 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తెస్తామని స్పష్టం చేశారు.మహిళల్ని నాయకత్వ స్థానాల్లో చూడాలనుకుంటున్నామని ఓ మహిళా కార్యకర్త చేసిన సూచనకు రాహుల్ ఈ మేరకు స్పందించారు. సామాన్య కార్యకర్తలు పార్టీ అధిష్టానంతో మాట్లాడేలా ‘శక్తి’ అనే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కేరళలోని కొచ్చిలో మంగళవారం జరిగిన బూత్ కమిటీల సమావేశంలో 50,000 మంది కార్యకర్తలతో రాహుల్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో సగం మంది మహిళలే ఉన్నారు. దేశమంతటా రుణమాఫీ చేస్తాం.. ఈ సందర్భంగా ప్రధాని మోదీ 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై మాట్లాడుతూ.. ‘ఒకదాని తర్వాత మరో అబద్ధం చెబుతూ ప్రధాని మోదీ దేశానికి చెందిన ఐదేళ్ల విలువైన సమయాన్ని వృథా చేశారు. ప్రతీఏటా 2 కోట్ల కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కేవలం తన 15 మంది స్నేహితులకు కనీస ఆదాయ భద్రతను కల్పించారు. అదే సమయంలో దేశం లోని వేలాది మంది యువతకు మొండిచెయ్యి చూపారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో అధికారంలోకి రాగానే రైతు రుణా లను కాంగ్రెస్ మాఫీ చేసింది. అలాగే కేంద్రం లో అధికారంలోకి వస్తే దేశంలోని రైతుల రుణాలన్నింటిని మాఫీ చేస్తాం’ అని అన్నారు. బీజేపీ, సీపీఎం శైలిపై స్పందిస్తూ.. ‘బీజేపీ, సీపీఎం తీరు ఒక్కటే. వీరి పాలనలో సొంత పార్టీ కార్యకర్తలే ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందారు. బీజేపీ, సీపీఎం రాష్ట్రంలో హింసను రెచ్చగొడుతున్నాయి. మహిళల హక్కులను, కేరళ సంప్రదాయం, ఆచారాలను కాంగ్రెస్ గౌరవిస్తుంది’ అని రాహుల్ అన్నారు. గోవా సీఎం పరీకర్‌తో రాహుల్ భేటీ పణజీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గోవా సీఎం మనోహర్ పరీకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్..పరీకర్ ఆరోగ్యానికి సంబంధించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పరీకర్ క్లోమ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. రఫేల్ ఒప్పందానికి సంబంధించి రహస్య పత్రాలు పరీకర్ దగ్గర ఉన్నందునే ఆయన సీఎం పదవిలో ఉన్నారని రాహుల్ ఆరోపించిన ఒక రోజు తర్వాత ఆయన పరీకర్‌తో భేటీ అవడం గమనార్హం. ‘రాహుల్ మర్యాద పూర్వకంగా కలిశారని విపక్ష నేత చంద్రకాంత్ చెప్పారు. -
జీరో అవర్
తలాక్ బాధితుల్ని ఉద్ధరించడానికి బిల్లే అవసరం లేదు. మహిళలకు ఇన్నని సీట్లిచ్చేస్తే.. మగ పార్లమెంటేరియన్ల ఆడగొంతు డబ్బింగ్‌లతో పని లేకుండా మహిళల సమస్యల్ని మహిళలే పరిష్కరించుకునే ‘ఫిమేల్ వాయిస్ ఆఫ్ ఎమర్జెన్సీ’ మాత్రమే చట్టసభల్లో వినిపిస్తుంది. ఏది తక్షణ అవసరమో తెలియకున్నా నష్టం లేదు. ఏది తక్షణ అనవసరమో పాలకులకు తెలియాలి! జీరో అవర్‌ను లంచ్ అవర్ తర్వాత పెట్టుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో! ఆకలితో ఆలోచించలేరు కదా. ఆకలిగా ఉన్నప్పుడు మాట్లాడలేం. వినలేం. శుక్రవారం పార్లమెంటులో లంచ్ అవర్‌కు ముందు జీరో అవర్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడే అవకాశం కేరళ కన్నూర్ ఎంపీ శ్రీమతి టీచర్‌కు లభించింది. మాట్లాడే అవకాశం మాత్రమే అది. ప్రశ్నించే అవకాశం కాదు. ప్రశ్నించడానికి జీరో అవర్ కంటే ముందు క్వొశ్చన్ అవర్ ఉంటుంది. ఆ అవర్‌లో మాట్లాడ్డం ఉండదు. ప్రశ్నించడం, ప్రశ్నకు సమాధానం వినడం ఉంటుంది. డిసెంబర్ 11న శీతాకాల సమావేశాలు మొదలయ్యాక క్వొశ్చన్ అవర్‌లో ఇంతవరకు ఎవరూ మహిళా బిల్లు ఏమైందని ప్రశ్నించలేదు. జనవరి 8న సమావేశాలు ముగుస్తాయి. ఆలోపు ఎవరైనా ప్రశ్నించినా, ఎవరు లేచి సమాధానం చెబుతారు? ప్రధానమంత్రా, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టరా, న్యాయశాఖ మంత్రా? మహిళా రిజర్వేషన్ బిల్లుపై వెయ్యడానికి చాలా ప్రశ్నలే ఉన్నాయి. ఒక క్వొశ్చన్ అవర్ సరిపోదు. ఎన్ని రోజులు సమావేశాలు జరిగితే అన్ని రోజుల క్వొశ్చన్ అవర్లూ కావాలి. ఎనిమిదేళ్ల క్రితమే రాజ్యసభలో పాస్ అయిన బిల్లు, లోక్‌సభ టేబుల్ మీదకు ఎందుకు రావడం లేదు? పార్లమెంటులో మెజారిటీ ఉండి కూడా బీజేపీ ఈ ఐదేళ్లలో బిల్లు మాటే ఎందుకు ఎత్తలేదు? ఈ పార్లమెంటు సమావేశాలలో మొత్తం 46 బిల్లులు టేబుల్ మీదకు వచ్చాయి. వాటిల్లో తలాక్ బిల్లు ఉంది కానీ, మహిళా రిజర్వేషన్ బిల్లు లేదు! తలాక్ బాధితుల్ని ఉద్ధరించడానికి బిల్లే అవసరం లేదు. మహిళలకు ఇన్నని సీట్లిచ్చేస్తే.. మహిళలే తమ సమస్యల్ని చక్కగా డీల్ చేసుకోగలరు. ఏది తక్షణ అవసరమో తెలియకున్నా నష్టం లేదు. ఏది తక్షణ అనవసరమో పాలకులకు తెలిసి ఉండాలి. జీరో అవర్‌లో మాట్లాడేందుకు శ్రీమతి టీచర్‌కు (ఆమె పేరు అదే) ఐదు నిముషాల సమయం ఇచ్చారు. మహిళా బిల్లును వెంటనే సభలో ప్రవేశపెట్టి, డిస్కషన్‌కి పెట్టండని ఆమె విజ్ఞప్తి చేశారు. మిగతా ఎంపీలు కూడా ఆమెను సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ చేసినవాళ్లలో పాలకపక్షం అయిన ఎన్డీయేవాళ్లు కానీ, ప్రతిపక్షమైన యూపీయే వాళ్లు గానీ లేరు! ఐదు నిముషాలు ముగిశాయి. జీరో అవరూ ముగిసింది. అంతా లంచ్‌కి వెళ్లిపోయారు. శ్రీమతి టీచర్ పార్లమెంటులో రిజర్వేషన్ బిల్లు గురించి అడగడానికి ముందురోజు సాయంత్రం లోక్‌సభ సభ్యులందరికీ ఫోన్లు వెళ్లాయి. కొందరు రాజ్యసభ సభ్యులకు కూడా. అవన్నీ దేశప్రజల నుంచి వెళ్లిన ఫోన్లు! రైతులు, గృహిణులు, ఉద్యోగినులు, విద్యార్థులు, లైంగికదాడి బాధితులు, సఫాయీ పని మాని పునర్వృత్తి పొందినవారు, మీడియా మహిళలు, బ్యాంకర్లు, వివిధ రంగాలలో శిక్షణ లో ఉన్నవారు, పరిశోధకులు, సామాజిక కార్యకర్తలు, ఇంటిపనివారు, వ్యాపార ప్రకటన సంస్థల నిపుణులు, పారిశ్రామికవేత్తలు చేసిన ఫోన్లు. బెంగళూరులోని ‘శక్తి’అనే సంస్థ ‘కాల్ యువర్ ఎంపీ’ అంటూ వీళ్లందరితో ఎంపీలకు ఫోన్ చేయించింది. అందరి చేతా ఆ సంస్థ అడిగించిన ప్రశ్న ఒకటే. ‘మహిళా రిజర్వేషన్ బిల్లుకు మీరు మద్దతు ఇస్తారా?’ అని. ‘ఎస్’ అని 127 మంది ఎంపీలు సమాధానం ఇచ్చారు. మిగతావాళ్లు రెస్పాండ్ కాలేదు. మొత్తం 373 మంది ఎంపీలకు ఈ ఫోన్లు వెళ్లాయి. ఫోన్ చేసినవారు 500 మంది. ఫోన్ కాల్కి సమాధానం ఇచ్చినవాళ్లలో రాజ్యసభ బీజేపీ ఎంపీ సహస్రబుద్ధే కూడా ఉన్నారు. ‘‘బిల్లుకు మేము అనుకూలం అని బీజేపీ ఎప్పుడో స్పష్టంగా చెప్పింది. కానీ కొన్ని పార్టీలు కోటాలో మళ్లీ కోటా అడుగుతున్నాయి. ఏకాభిప్రాయం కుదరక ఆలస్యం అవుతోంది. ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు టేబుల్ మీదకు వస్తుందో లేదో నేను చెప్పలేను. ఎందుకంటే నాకు తెలియదు’’ అని చెప్పారు సహస్రబుద్ధే! తక్కినవాళ్ల సమాధానాలు కూడా ఇలాగే ఉన్నాయి. బిల్లుకు సపోర్ట్ చేస్తామన్నారే కానీ, బిల్లును టేబుల్‌పైకి రప్పించే ఎఫర్ట్ చేస్తామని ఎవరూ చెప్పలేదు! బీజేపీ ఎంపీ సహస్రబుద్ధే ఈ విషయంలో ఏమీ చెయ్యలేకపోవచ్చు. బీజేపీ పీఎం నరేంద్ర మోదీ బుద్ధిశాలే కదా. పైగా స్త్రీమూర్తుల శక్తి సామర్థ్యాలపై ఎన్నో సందర్భాలలో ఆయన తన మాటల్లో అపారమైన విశ్వాసాన్ని ప్రదర్శించారు. ‘స్త్రీలు.. అభివృద్ధి గురించి కాదు, స్త్రీల నాయకత్వంలో జరిగే అభివృద్ధి గురించి ఆలోచించే సమయం ఆసన్నమైంది’ అన్నారు. ‘స్త్రీలకు సాధికారతను ఇచ్చేందుకు పురుషులెవరు?’ అని ప్రశ్నించారు. ‘మిమ్మల్ని మీరు సమర్థంగా తీర్చిదిద్దుకోండి. సాంకేతిక అంశాల్లో సాధికారత సాధించుకోండి’ అని సలహా ఇచ్చారు. ‘‘క్షమ, ఓపిక లాంటివి స్త్రీలకు సహజ గుణాలు. భర్త, పిల్లల కోసం వారెంతో త్యాగం చేస్తారు’’ అని ప్రశంసించారు. ఇన్ని అని, ఇన్ని చెప్పిన మనిషి ఐదేళ్లు పూర్తవుతున్నా బిల్లు గురించి పార్లమెంటు లోపల గానీ, బయట గానీ మాట్లాడలేదు. ఇల్లు, వాకిలి శుభ్రంగా ఉంచుకోడానికి ముప్పైమూడు శాతం రిజర్వేషన్లు ఎందుకని ఆయన అనుకున్నట్లుంది! రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు హమీద్ అన్సారీ, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడారు కానీ, పార్లమెంటు లోపల ఎప్పుడూ మాట్లాడలేదు. తొలిసారి 1996లో మహిళా బిల్లు పార్లమెంటుకు వచ్చింది. ఇరవై రెండేళ్లు గడిచాయి. దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్, ఇప్పుడు నరేంద్ర మోదీ.. ఐదుగురు ప్రధాన మంత్రులు మారారు. వారిలో ఇద్దరు ఐ.కె.గుజ్రాల్, వాజ్‌పేయి కాలధర్మం చెందారు. ఇప్పటికింకా బిల్లు సగం ఉడికిన అన్నంగానే ఉండిపోయింది. న్యూ ఇయర్లోకి వస్తున్నాం. తర్వాత న్యూ గవర్నమెంట్లోకీ వచ్చేస్తాం. ఇంకో వారమే ప్రస్తుత శీతాకాల సమావేశాలు. ఈ వారంలో రోజుల్లో దేనికి ఏదన్నది ఫిక్స్ అయిపోయింది. మహిళా బిల్లుకు చోటు లేదు. లేకపోయినా ఇవ్వొచ్చు. ఏకాభిప్రాయం అవసరం లేకుండా పేటెంటు బిల్లును, పోటా బిల్లును తెచ్చినవాళ్లు మనవాళ్లు! మహిళా బిల్లును తేలేరా? ఆ బిల్లును పక్కన పడేసి మోదీ తెచ్చిన తలాక్ బిల్లు సుప్రీంకోర్టు ఇచ్చిన శబరిమల తీర్పులా ఉంది. దర్శనం కోసం వచ్చే మహిళల్ని అడ్డుకోవద్దని సూచిస్తే సరిపోయేది. అడ్డుకోడానికి వీల్లేదని ఆదేశించడమే అలజడికి కారణం అయింది. తలాక్ చెల్లదనే బిల్లు కూడా అంతే. మహిళలకు చట్టపరమైన భద్రత ఉన్నప్పుడు మహిళల్లోంచి మళ్లీ ముస్లిం మహిళను ప్రత్యేకం చేసి ప్రత్యేక భద్రత కల్పించే తొందర ఏమిటి? ఇదెలా ఉందంటే.. ముప్పై మూడు శాతంలోంచి మళ్లీ కొంత శాతం వేరుగా తీసి రిజర్వేషన్లు ఇవ్వాలని కొన్ని పార్టీలు మహిళా బిల్లుకు అడ్డుపడుతున్నాయి కదా.. అలా ఉంది! -
మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించకుంటే ఉద్యమిస్తామని టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద హెచ్చరించారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడానికి యూపీఏ హయాంలోనే ప్రయత్నించామని, పార్లమెంటులో స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో సాధ్యం కాలేదన్నారు. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉన్నా మహిళా రిజర్వేషన్ల కోసం ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లు కల్పించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్టు శారద వెల్లడించారు. లోక్‌సభలో బీజేపీ ప్రభుత్వం బిల్లు పెడితే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. -
ఆయన కాకపోతే ఆవిడ
► మార్కెట్ కమిటీలపై నేతల కన్ను ► మహిళా రిజర్వేషన్‌తో తారుమారు ► తెరపైకి నాయకుల భార్యల పేర్లు ► సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యేల జాబితాలు ► అధికార పార్టీలో మొదలైన సందడి ఆ పండగ... ఈ పండగ అంటూ నామినేటెడ్ పదవుల పండగను వాయిదా వేస్తూ వచ్చిన ప్రభుత్వం త్వరలో గులాబీ శ్రేణులకు తీపి కబురందించనుంది. నామినేటెడ్ పదవుల విషయంలో రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు కొద్దిరోజుల్లో తెరపడే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ ప్లీనరీ ఈనెల 27న ఉండడంతో... ఆ లోపు కొన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారనే ప్రచారం జరిగింది. కాని సీఎం కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడిన తరువాత మే మొదటివారంలో పదవులను ప్రకటిస్తారని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఈ వరుసలో ముందుగా మార్కెట్ కమిటీలను ప్రకటించే అవకాశముందని పేర్కొంటున్నారు. దీంతో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. కరీంనగర్ సిటీ : మార్కెట్ కమిటీల నియామకం ఎప్పుడు చేసినా తమకే పదవి అని ధీమాతో ఉన్న టీఆర్ఎస్ నాయకుల జాతకాలు తొలిసారి రిజర్వేషన్లను ప్రవేశపెట్టడంతో తారుమారయ్యాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వేషన్లు ఖరారు చేయడంతో పదవులపై ఆశలు పెట్టుకొన్న పలువురు నాయకులకు చుక్కెదురు కాగా... ఊహించని పేర్లు తెరపైకి వచ్చాయి. జిల్లాలో 38 వ్యవసాయ మార్కెట్ క మిటీలు ఉండగా, ఇందులో బీసీలకు 12, ఎస్సీలకు 12, ఎస్టీకి ఒకటి రిజర్వ్ చేయగా, 13 స్థానాలు జనరల్‌కు కేటారుుంచారు. ఇందులో 13 చైర్మన్ స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయడంతో జాబితాలు మారిపోతున్నారుు. కొన్ని స్థానాలను మహిళలకు రిజర్వ్ చేసినప్పటికీ కులాలపరంగా స్థానాలను మాత్రం మార్చలేదు. ఉదాహరణకు సుల్తానాబాద్ ఎస్సీ రిజర్వ్ ఉండగా, ఈసారి ఎస్సీ మహిళకు కేటారుుంచారు. దీంతో ఆ సామాజికవర్గ నేతల స్థానంలో వారి భార్యలు తెరపైకి వచ్చారు. మొన్నటివరకు తమకు గ్యారంటీ అనుకున్న స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయడంతో తమ భార్యలకు అవకాశం ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలను కోరుతున్నారు. ఎమ్మెల్యేల ప్రయత్నాలకు చెక్? అనూహ్యంగా వచ్చిన మహిళా రిజర్వేషన్‌తో జిల్లాలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు అధిష్టానం చెక్ పెట్టిందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్ ఖరారు చేసినట్లు ప్రకటించినా... కొన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన ఏఎంసీలను వ్యూహాత్మకంగా మహిళలకు కేటాయించారనే వాదన వినిపిస్తోంది. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు ఏకపక్షంగా మహిళా ప్రజాప్రతినిధుల భర్తల పేర్లను ఏఎంసీ చైర్మన్లకు పంపించినట్లు సమాచారం. ఇలాంటి జాబితాకు చెక్ పెట్టేందుకు ఆయా స్థానాలను మహిళలకే రిజర్వ్ చేశారని అంటున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు మరొకరికి అవకాశం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. సీఎం కేసీఆర్‌కు జాబితాలు.. ఎమ్మెల్యేలు తమ పరిధిలోని ఏఎంసీల వారిగా చైర్మన్ పదవుల కోసం జాబితాను తయారు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గతంలో ఎమ్మెల్యేలు జాబితాలు అందచేసినా, మహిళా రిజర్వేషన్ కారణం గా జాబితాను తప్పనిసరిగా సవరించాల్సి వచ్చింది. దీంతో మహిళల పేర్లతో మరో జాబితాకు ఎమ్మెల్యేలు ఇప్పటికే తుదిరూపు ఇచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు తయారు చేసిన జాబితాలను జిల్లా మంత్రికి ఇవ్వాలని చెబుతున్నా, చాలా మంది నేరుగా కేసీఆర్‌కు అందచేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నోటిఫై చేయాల్సినవి ఆరు.. కొత్తగా ఏర్పడుతున్న వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో మరో ఆరింటికి తుది నోటిఫికేషన్ రావాల్సి ఉంది. జిల్లాలో గతంలో 25 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా, కొత్తగా 13 ఏఎంసీలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త మార్కెట్లకు సంబంధించి మూడు నోటిఫికేషన్లు రావాల్సి ఉంటుంది. ఇందులో ఏడు ఏఎంసీలకు సంబంధించి నోటిఫికేషన్ల ప్రక్రియ పూర్తయింది. మరో ఆరింటికి మూడో (తుది) నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఆ నోటిఫికేషన్ వస్తేనే సాంకేతికంగా ఏఎంసీ ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుంది. త్వరలోనే మిగిలిన ఏఎంసీల తుది నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశ ం ఉంది. ఆశావాహుల హడావుడి ఏఎంసీల నియామకాలు జరగబోతున్నాయనే ప్రచారంతో ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గతంలో ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితాలో పేర్లు ఉన్న నాయకులు తమ పేర్లను కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. జాబితాలో చోటు లభించని నాయకులు రాష్ట్రస్థాయి నేతలతో తమకున్న పరిచయాలను ఉపయోగించుకుని పైరవీలు మొదలు పెట్టారు. ఇప్పటికే చాలామంది ఆశావాహులు రాజధాని బాటపట్టారు. 2001 నుంచి పార్టీలో ఉన్న నాయకులు మాత్రం అధినేతపైనే భారం వేసి వేచి చూస్తున్నారు. స్థానికంగా ఎమ్మెల్యేల వ్యతిరేక గ్రూప్‌గా ముద్రపడిన ఆశావాహులు కూడా అధినేతతోపాటు మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎంపీ కవిత లను కలిసి తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలంటూ వేడుకొంటున్నారు. ఇంకొంతమంది ఒకడుగు ముందుకేసి పోటీలో ఉన్న నాయకులపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఫలానా ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పోటీచేసి, పార్టీ అభ్యర్థి ఓడిపోవడానికి కారణమయ్యాడు... అతనికెలా పదవి ఇస్తారంటూ ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తున్నారు. జనరల్ కు కేటాయించిన స్థానాలను జనరల్ కేటగిరీ వారికే ఇవ్వాలంటూ ఆ కేటగిరీ ఆశావహులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ కమిటీ పదవుల పందేరంతో అధికార పార్టీలో సందడి నెలకొంది. -
మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33%
♦ మహిళా రిజర్వేషన్లు ♦ ఖరారు చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ల నియామకంలో మహిళా కోటా కింద 33 శాతం స్థానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల నియామకంలో తొలిసారిగా రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం తాజాగా మహిళలకు కూడా కోటా కేటాయించింది. ఈ మేరకు జిల్లాలవారీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్తగా ఏర్పాటవుతున్న మార్కెట్ యార్డులను కూడా పరిగణనలోకి తీసుకుని లాటరీ విధానంలో జిల్లాలవారీగా బుధవారం రిజ ర్వేషన్లు ఖరారు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 179 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గాను పీసా చట్టం-1996 ప్రకారం ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో షెడ్యూల్డ్ ఏరియాలోని 11 కమిటీలను ఎస్టీలకు కేటాయించింది. అవి పోను మిగతా 168 కమిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఎస్టీలకు 6 శాతం, ఎస్సీలకు 15 శాతం, బీసీలకు 29 శాతం చైర్పర్సన్ పదవులు కేటాయిం చింది. మిగతా 84 కమిటీలను ఓసీగా ప్రకటించింది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 13 మార్కెట్ కమిటీలు మహిళలకు దక్కాయి. -
మహిళలకు రిజర్వేషన్లు అవసరం లేదు
కేంద్ర మంత్రి సుజనాచౌదరి వ్యాఖ్య విజయవాడ(లబ్బీపేట)/గుంటూరు రూరల్ : మహిళలకు రిజర్వేషన్లు అవసరం లేదని, రిజర్వేషన్ పేరుతో కుర్చీపై స్టాంప్ వేసి మహిళలను కూర్చోపెట్టడం తప్పని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి వై.సుజనాచౌదరి వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తుంటే రిజర్వేషన్లు ఎందుకని, వాటికి తాను వ్యతిరేకినని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో ఏర్పాటుచేసిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ కార్యాలయాన్ని శనివారం కేంద్ర మంత్రి సుజనాచౌదరి ప్రారంభించారు. -
పోలీసు ఉద్యోగాల్లో స్త్రీలకు 33% కోటా
గుజరాత్ సీఎం ఆనందీబెన్ ప్రకటన స్త్రీలకు పోలీసుశాఖలో 33% కోటా దేశంలో ఇదే తొలిసారి గాంధీనగర్: గుజరాత్ రాష్ట్ర పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం ఆనందీబెన్ పటేల్ ప్రకటించారు. సమాజంలో మహిళల అభ్యున్నతి కోసం వారికి సాధికారతను కట్టబెట్టడం తప్పనిసరి అని ఆమె అన్నారు. మంగళవారం గాంధీనగర్‌లోని గుజరాత్ పోలీసు అకాడమీలో ఆర్మ్డ్ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్స్, ఇంటెలిజెన్స్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. పోలీసుశాఖలో అన్ని కేడర్లలోనూ స్త్రీలకు రిజర్వేషన్ అమలుచేయనున్నట్లు ఆమె తెలిపారు. గుజరాత్లో దేశంలోనే అతితక్కువ నేరాల రేటు ఉందని, అలాంటి సామరస్య వాతావరణాన్ని కల్పించినందుకు పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో గుజరాత్ డీజీపీ పీసీ ఠాకూర్ మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగాల్లో స్త్రీలకు 33 శాతం కోటా కల్పించిన తొలి రాష్ట్రం ఇదేనన్నారు. మహారాష్ట్రలో మహిళా పోలీసులు 10 శాతం మంది ఉన్నారని, ఇది దేశంలోనే అత్యధిక శాతమన్నారు. అలాగే గుజరాత్లో ప్రస్తుతం మహిళా పోలీసులు 5 శాతంలోపే(2,500) ఉన్నారని, 33 శాతం కోటా అమలైతే వారి సంఖ్య 19,800కు పెరగనుందన్నారు. యూపీలోని బదాయూలో ఇద్దరు బాలికలపై అత్యాచారం, హత్యతోపాటు దేశవ్యాప్తంగా స్త్రీలపై లైంగికదాడుల నేపథ్యంలో గుజరాత్ తొలి మహిళా సీఎం నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. -
మహిళా రిజర్వేషన్లలో ఉపకోటా ఉండాల్సిందే!
జేడీ(యూ) డిమాండ్ న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్సీ, ఓబీసీలకు ఉపకోటా కల్పించాలంటున్న బీజేపీ భాగస్వామ్య పక్షం అప్నాదళ్ సరసన జేడీ(యూ) కూడా చేరింది. ఈ అంశంపై అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్ చేసిన డిమాండ్‌కు జేడీ(యూ) పూర్తిగా మద్దతిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి శనివారం తెలిపారు. పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో రూపొందించిన మహిళా బిల్లులో ఓబీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ఉప కోటా ఇవ్వాలన్న అంశానికి తాము సానుకూలమని అనుప్రియా పటేల్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మహిళా బిల్లుకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈనెల 9న పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో అందులో ఉపకోటా కల్పించాలని అనుప్రియ వ్యాఖ్యానించారు. తాజాగా మహిళా కోటాలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉపకోటా కల్పించడం సమర్థనీయమేనని త్యాగి స్పష్టంచేశారు. గతంలో బీజేపీ నేత ఉమాభారతి కూడా ఇదే తరహా డిమాండ్‌ను ప్రస్తావించారని, అలాగే బీజేపీ నేత గోపీనాథ్ ముండే సైతం కోటాలో ఉపకోటా కల్పించాలని డిమాండ్ చేశారని త్యాగి గుర్తుచేశారు. -
ఓటుకు ముందే ఓడిన మహిళ
1935 భారత ప్రభుత్వ చట్టం నాటి నుంచి మన పార్టీలు మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. రాజ్యాంగంలో మహిళా రిజర్వేషన్లన్న మాటే రాకుండా కాంగ్రెస్ తదితర పార్టీలు జాగ్రత్త వహించాయి. నాటి నుంచి నేటి వరకు వాటిది అదే తీరు. ఆ తీరు మారేది కాదు. రిజర్వేషన్లు లేకుండా చట్ట సభల్లో మహిళా ప్రతినిధ్యం పెరగడం అసంభవం. మహిళా సాధికారతను కోరే వారంతా సంబరాలు జరుపుకోవాల్సి న సమయమిది. కొలువుదీరనున్న పదహారవ లోక్‌సభలో మహిళా సభ్యుల సంఖ్య స్వాంతంత్య్రానంతర కాలంలోకెల్లా అత్యధిక స్థాయికి చేరింది. 543 స్థానాలున్న లోక్‌సభలో 61 మంది... 11.2 శాతం మహిళలే! గత లోక్‌సభతో పోలిస్తే ఇద్దరు ఎక్కువ. మహిళా సాధికారత దిశగా మనం సాధించిన ఘన విజయమిది. ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు రెండూ 1997 నుంచి చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లకు పట్టంగడతామని చెప్పుకుంటూనే ఉన్నాయి. 2010లో యూపీఏ ప్రవేశపెట్టిన బిల్లు లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కట్టబెట్టేసినంత పని చేసింది. మహిళా రిజర్వేషన్ల బిల్లు గట్టెక్కక పోవడానికి కారణాలు ‘అంతుపట్టేవి’ కావు. ఆ సంగతి పక్కనబెట్టి, ఈసారి మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామని ఢంకా బజాయించిన కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు వారికి ఏ స్థానం ఇచ్చాయో చూడ్డం తేలిక. అవి మూడూ కలిసి బరిలోకి దించిన మొ త్తం 1,325 మంది అభ్యర్థుల్లో మహిళల సంఖ్య 631...12 శాతం! మొత్తం అభ్యర్థులు 8,251 మంది కాగా వారిలో 668 మంది మాత్రమే మహిళలు! ఓటమికి మారుపేరు మహిళ మహిళల పట్ల ఎంతగా సానుభూతి కట్టలు తెంచుకుంటున్న పార్టీలకైనా టిక్కెట్లిచ్చే సమయానికి వచ్చి పడే ఇబ్బంది ఒక్కటే... గెలవగలగడం. ఓటమి పుట్టుకకు ముందే ఆడాళ్లకు రాసిపెట్టి ఉన్న తలరాత. దాన్ని మార్చడం ఎవరి తరం? ఎలాగూ ఓడేవారికి సీట్లిస్తే మాత్రం ఒరిగేదేమిటి? ఫలితాలు మాత్రం మగ అభ్యర్థులతో పోలిస్తే మహిళలకే గెలుపు అవకాశాలు ఎక్కువని సూచిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం మగ అభ్యర్థుల్లో 6.36 శాతం గెలిస్తే, మహిళల్లో 9.13 శాతం గెలిచారు! ఎన్నికల ప్రక్రియలో మహిళలు పాల్గొనడం తక్కువగా ఉండగా మహిళా ప్రాతినిధ్యం ఎలా పెంచగలుగుతామనేది మరోవాదన. ఇందులో కొంత వాస్తవం ఉన్నా అది కొండంత మార్పు ను కనపించకుండా చేసేదేమీ కాదు. ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో స్త్రీ, పురుషుల మధ్య అంతరం పూడిపోతూ వస్తోంది. 1962లో మహిళల కంటే పురుషులు 16.7 శాతం ఎక్కువగా ఓటు హక్కును వివియోగించుకోగా... 2009 నాటికి అ తేడా 4.4 శాతానికి పడిపోయింది. వీధుల కెక్కి, వేదికలకెక్కి ఎన్నికల ప్రచారంలోనూ, పార్టీ కార్యకాలాపాల్లోనూ పాల్గొనే మహిళల సంఖ్య పెరుగుతోంది. ప్రత్యేకించి 1990ల నుంచి రాజకీయాల్లో, పార్టీల్లో మహిళల భాగస్వామ్యం వేగంగా పెరుగుతోంది. అన్ని వర్గాల మహిళల్లో పెరుగుతున్న ఈ రాజకీయ చైతన్యం ఒక పార్శ్వం మాత్రమే. ఒకప్పటిలాగా నేడు ఇంటి పెద్దగా మగాడిని ఆకట్టుకుంటే ఆడాళ్లందరి ఓట్లు పడతాయనే హామీ లేకుండా పోతోంది. ఇది ఈ పరిణామానికి ఉన్న మరో పార్శ్వం. సగం ఓటర్లుగా ఉన్న మహిళలను ఆకట్టుకోడానికి మహిళా కార్యకర్తలు, నేతలు, ప్రత్యేక వాగ్దానాలు పార్టీలకు తప్పనిసరి అవుతున్నాయి. వెరసి పార్టీల, రాజకీయాల లైంగికపరమైన అమరికలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చట్ట సభల్లో అవి ప్రతిఫలిం చడం లేదు ఎందుకు? మహిళల్లో నాయకత్వ లక్షణాలు కొరవడటం. ఆడ నెత్తురులో లేనిది జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ మహిళలకు అతి తక్కువ సీట్లను కేటాయించడానికి మరో కారణం. పార్టీ నిర్మాణం నిచ్చెన మెట్లు ఎక్కి వ చ్చిన పై స్థాయి నేతలు అతి తక్కువగా ఉండటం. ఎక్కువ మంది దిగువ మెట్ల మీదే చతికిలబడక తప్పడం లేదు. నాయకత్వ లక్షణాలు కొరవడటం వల్లనే వారు ఉన్న త స్థానాలకు ఎదగలేకపోతున్నారనేది తరచుగా వినిపించే వాదన. నాయకత్వ లక్షణాలను మగ పుట్టుకతో సంక్రమించేవిగా చూడటం పార్టీలకు అలవాటుగా మారింది. ఇళ్లల్లో, పని ప్రదేశాల్లో, వీధుల్లో ఎక్కడైనా కనిపించే స్రీల పట్ల వివక్షను అధిగమించినట్టు కమ్యూనిస్టులు సహా అన్ని పార్టీలు నటిస్తుంటాయి. కానీ పార్టీ నిర్మాణం అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయి వరకు అదే కనిపిస్తుంది. అసలు పార్టీ నిచ్చెనే మహిళలు ఎక్కలేని మాయా మెట్ల మయం. ఉట్టికెగర లేని వాళ్లు స్వర్గానికి ఎగరలేరు. చట్టసభలకు ఎగబాకాల ని అంగలార్చరాదు. సోనియాగాంధీ, మమతా బెనర్జీ, జయలలిత, మాయావతి ఎవరూ మాయ నిచ్చెనను మార్చలేకపోయారు. పార్టీల్లో వ్యవస్థీకృతమైనమైన ఈ అదృశ్య వడపోత యంత్రం బారి నుంచి తప్పించుకుని పైకి ఎది గిన వాళ్లు కొద్దిమందే. అత్యధిక శాతం పెద్దగా పోటీలేని దిగువస్థాయి అలంకార ప్రాయమైన పదవులతో సరిపెట్టుకుంటారు. ఇందిరాగాంధీ నుంచి మాయావతి, జయలలిత, మమతా బెనర్జీల వరకు అత్యున్నత స్థానాలకు ఎదిగిన మహిళలంతా ‘మగాడురా’ అనిపించుకుంటారే తప్ప సమర్థవంతమైన మహిళా నేతలకు ఉదాహరణలుగా పార్టీలకు కనిపించరు. మహిళలు మంచి పార్లమెంటేరియన్లు కాలేరనేది మరో వాదన. ఆ అర్హతే నిజమైతే నిన్నటి ఎన్నికల్లో కాంగ్రె స్ తరఫున షీలా దీక్షిత్, మీరా కుమార్‌లు కాకున్నా ప్రియాంకాగాంధీ, బీజేపీ తరఫున సుశ్మాస్వరాజ్ ప్రధాని అభ్యర్థులుగా తలపడాల్సి వచ్చేది. గత వైభవ ఘన కీర్తి మన్మోహన్సింగ్ నేతృత్వంలో మన దేశం ప్రాంతీయ ఆగ్రరాజ్యంగా మారిం దన్నారు. భావి ప్రధాని నరేంద్రమోడీ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రరాజ్య ంగా మారుస్తారంటున్నారు. మహిళా ప్రాతినిధ్యం రికార్డు స్థాయికి (11.2 శాతానికి) చేరిన నేటి మన స్థితిని మోడీ ప్రమాణ స్వీకార ఉత్సవానికి విచ్చేయబోతున్న ‘సార్క్’ దేశాలతో సరిపోల్చడం సందర్భోచితం. సార్క్ దేశాలన్నిటిలోనూ పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యం ప్రపంచ సగటు 20 శాతం కంటే తక్కువగా ఉన్న దేశాలు రెండే రెండు... భారత్, శ్రీలంక (4.89). మహిళా హక్కుల కాలరాచివేతకు మారు పేరుగా చెప్పే అఫ్ఘానిస్థాన్ పార్లమెంటు 27 శాతం మహిళలతో సార్క్ దేశాల్లో ప్రథమ స్థానం లో ఉంది. పాకిస్థాన్ పార్లమెంటులో సైతం 21.35 శాతం మహిళలు. ఇక మన ప్రతిష్టను నిలపగలిగేది ఏది? మనం మరచిన గత వైభవ ఘనకీర్తే. ఈ విషయంలో ఒకప్పుడు ప్రపంచంలోనే మూడవ స్థానంలో నిలిచిన ఘనత మనకుంది. బ్రిటిష్ పాలనలో 1937లో పరిమిత ఓటింగ్ హక్కులతో జరిగిన ఎన్నికల్లో మొత్తం 80 మంది మహిళా సభ్యులు ఉండేవారు. నాడు మన దేశం ప్రపంచంలో అమెరికా, రష్యాల తదుపరి మూడో స్థానంలో నిలిచింది. నాటి మన ఘనత కైనా అప్ఘాన్, పాక్‌ల వంటి దేశాల ఘనతకైనా కార ణం ఒక్కటే.. మహిళలకు రిజర్వేషన్లు. 1935 భారత ప్రభుత్వ చట్టం కాలం నుంచి మన పార్టీలు మహిళా రిజర్వేషన్లును వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. స్వాతంత్య్రానంతరం అమల్లోకి వచ్చిన నూతన రాజ్యాంగం మహిళలు సహా ప్రతి ఒక్కరికీ సార్వత్రిక ఓటింగ్ హక్కును ఇచ్చింది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లన్న మాటే రాకుండా కాంగ్రెస్ తదితర రాజకీయ పక్షాలు జాగ్రత్త వహించాయి. నాటి నుంచి నేటి వరకు మన పార్టీలది అదే తీరు. ఆ తీరు మారేది కాదు. మార్చాల్సింది. కాబట్టే 1997లో పార్లమెంటు కెక్కిన మహిళా రిజర్వేషన్లు నేటికీ దుమ్ముకొట్టుకుపోతున్నాయి. గెలిచిన మహిళలు సైతం పార్టీ వైఖరికే తప్ప మహిళలుగా మహిళా సమస్యల పరిష్కారానికి ఆలోచించడం లేదని, అలాంటప్పుడు రిజర్వేషన్లు వచ్చినా మహిళల పరిస్థితి మారదనే మాట తరచుగా వినవస్తోంది. రిజర్వేషన్లే అన్ని వాదనలకు సమాధానం, రిజర్వేషన్ల బిల్లు చ ట్టమైతే లోక్‌సభలో మహిళా సభ్యుల సంఖ్య 61 నుంటి 179కి పెరిగిపోతుంది. ఆ సంఖ్యే అటు పార్టీల నాయకత్వంలోనూ, విధానాల్లోనూ మహిళలకు ప్రాతినిధ్యాన్నిచ్చే మార్పును తేగలుగుతుంది. చట్టసభల్లో మహిళలు మహిళల కోసం మాట్లాడే రోజులు వస్తాయి. అంతవరకు ఎన్నికల జాతరలు వస్తూ పోతూ ఉంటాయి. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుండక తప్పదు. పిళ్లా వెంకటేశ్వరరావు విశ్లేషణ -
రిజర్‘వేషం’ మారెన్!
హన్మకొండ, న్యూస్‌లైన్ : ఆ మండలం జెడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు రిజర్వేషన్ అయింది. ఐతే.. ఇంకేం పార్టీల్లో చాలా రోజుల నుంచి తిరుగుతున్న నేతలు తమ సతీమణులను బరిలోకి దింపుతారు. ఇది సాధారణంగా జరిగే సంగతి. అయితే.. మహిళా రిజర్వేషన్ స్థానంలో ఓ ఎస్టీ వ్యక్తి నామినేషన్ వేశాడు.. స్వీకరించిన అధికారులు అన్నీ పరిశీలించి కుల ధ్రువీకరణ పత్రం లేదంటూ జనరల్ వ్యక్తులకు తీసుకునే డిపాజిట్ తీసుకుని చెల్లుబాటు జాబితాలో చేర్చారు. ఆటోరిక్షా గుర్తు సైతం ఇచ్చారు. మహిళా రిజర్వేషన్‌కు పురుషుని నామినేషన్ ఎలా చెల్లుబాటు చేశారంటూ ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో తేరుకుని రాత్రికి రాత్రి హడావుడిగా ఫైనల్ జాబితా నుంచి తొలగించారు.. ఇదీ మన జిల్లా పరిషత్ ఎన్నికల అధికారుల లీల. ఇదీ జరిగింది.. కొత్తగూడ జెడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు రిజర్వు చేశారు. ఇక్కడ నుంచి టీడీపీ, కాంగ్రెస్‌తో సహా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు ఫైనల్ జాబితాలో బరిలో నిలిచినట్లు ప్రకటించారు. జనరల్ మహిళ స్థానంలో ఇదే మండలం పూనుగుండ్ల గ్రామానికి చెందిన పెనుక కృష్ణారావు(ఎస్టీ) నామినేషన్ దాఖలు చేశాడు. నామినేషన్ సమయంలో కుల ధ్రువీకరణ పత్రం లేకపోవడంతో అధికారులు జనరల్ అభ్యర్థులకు తీసుకునే డిపాజిట్ *5000 తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీలకు *2500 తీసుకుంటారు. నామినేషన్ల పరిశీలనలో పేజీని నాలుగుసార్లు చూసిన అధికారులు అన్నీ ఒకే చెప్పారు. ఉపసంహరణల అనంతరం చెల్లుబాటు అయిన నామినేషన్ల జాబితా ప్రకటించారు. ఈ జాబితాలో కొత్తగూడ మండలం నుంచి ఏడుగురు బరిలో ఉన్నారని, వారిలో ఐదుగురు స్వతంత్రులంటూ పేర్కొన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా ప్రకటించే వరకూ ఏడుగురు అభ్యర్థులకు గుర్తులిచ్చారు. కృష్ణారావుకు సైతం ఆటోరిక్షా గుర్తు కేటాయించారు. ఆయన కరపత్రాలు ముద్రించి.. ప్రచారం మొదలుపెట్టారు. అయితే మహిళా జనరల్ స్థానంలో కృష్ణారావు ఎలా పోటీ చేస్తున్నాడనే సందేహాలు వ్యక్తమైన కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తప్పు తెలుసుకున్న అధికారులు ఫైనల్ జాబితాలో ఆరుగురు అభ్యర్థులను పెట్టి.. క్రిష్ణారావు పేరును తొలగించారు. రిజర్వేషన్ల మార్పుతో గందరగోళం పదేపదే రిజర్వేషన్లు మారడం, మూడు ఎన్నికలు ఒకేసారి నిర్వహించాల్సి రావడం తదితర కారణాలతో అధికారులు సైతం తికమక పడుతున్నారు. తొలిసారి రిజర్వేషన్ల జాబితాలో కొత్తగూడ ఎస్టీ జనరల్‌కు వచ్చింది. చివరిసారిగా ఇచ్చిన జాబితాలో జనరల్ మహిళకు రిజర్వేషన్ అయింది. ఇలా రిజర్వేషన్లు మారడంతో అటు పోటీలో ఉండే నేతలు, ఇటు అధికారులు గందరగోళంలో పడ్డారు. పోటీలో ఉండేలా చేయాలి : కృష్ణారావు, అభ్యర్థి నామినేషన్ ఓకే చేసి నాకు గుర్తు కేటాయించారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లో పోటీలో ఉండరాదంటూ అధికారులు చెబుతున్నారు. నా నామినేషన్‌పై నా భార్యకు అవకాశం కల్పించాలి. దేవరుప్పుల మండలంలో కోలుకొండ ఎంపీటీసీ అభ్యర్థి స్వరూప బలపర్చే అభ్యర్థి పేరు రాయాల్సిన చోట గ్రామం పేరు రాస్తే తిరస్కరించారు. ఇక్కడేమో మహిళా రిజర్వేషన్లో నా దరఖాస్తు తీసుకుని చెల్లుబాటు చేశారు. ఇదెక్కడి న్యాయం. నాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి. ఇందుకా.... లెక్క తగ్గింది ఉపసంహరణ అనంతరం జిల్లాలోని 50 జెడ్పీటీసీ స్థానాలకు 338 మంది బరిలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జాబితాను జెడ్పీ కార్యాలయం నోటిస్ బోర్డ్‌పై అతికించారు. మరుసటి రోజు ఈ బరిలో ఉన్న అభ్యర్థులు తమ పేర్లను చూసుకొని ప్రచారంలోకి దిగారు. మహిళ స్థానంలో పురుషునికి ఎలా గుర్తు కేటాయించారని ఒకరు అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు మేల్కొన్నారు. అంతే.. హడావుడిగా జాబితాను సవరించి 337మంది పోటిలో ఉన్నారని మరో ప్రకటన చేశారు. అందుకే పోటీ అభ్యర్థుల సంఖ్య ఒకటి తగ్గింది. జాబితా మార్పుపై అధికారులు ఇప్పటికీ పెదవి విప్పడం లేదు. అడిగితే సమాధానం దాటవేస్తున్నారు. -
బంగారం.. బరిలో నిలువ్!
ఎన్నికలు మగాళ్లకు చిక్కులు తెచ్చిపెట్టాయి. యాభై శాతం మహిళా రిజర్వేషన్ల పుణ్యమా అని పురుష పుంగవులకు పోటీ చేసే చాన్స్ తగ్గిపోవడంతో తమ భార్యలను పోటీలో ఉంచేందుకు నానా తంటాలు పడుతున్నారు. పోటీకి వారు ఆసక్తి చూపకపోతుండడంతో బతిమాలి మరీ ఒప్పిస్తున్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ప్రజాప్రతినిధులుగా ఈ సారి మహిళల ప్రాతినిథ్యం పెరగనుంది. తామే బరిలో ఉండి రాజకీయం ఏలుదామని కలలుగన్న పలువురికి రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. దీంతో పోటీలో ఉండాలని తమ సతులను బతిమాలుడుతున్నారు. వారు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపించకున్నా.. పార్టీలో, వార్డులో పరువు కాపాడాలంటూ బుజ్జగిస్తున్నారు. ‘నువ్వు రాజకీయాల్లో తిరుగుడే దండగంటే... నీ వెంబడి నేను కూడా తిరగాలా? మాకే పదవీ అక్కర్లేదు’ అని ఖరాఖండిగా చెబుతు న్నా నయా నో... భయానో వారిని ఒప్పిస్తున్నారు. తమ మాట వినే పరిస్థితి లేనప్పుడు వారి పుట్టింటివారితోనూ చెప్పించి చూస్తున్నారు. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతోపాటు జగిత్యాల, సిరి సిల్ల, మెట్పల్లి, కోరుట్ల మున్సిపాలిటీలు, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట, వేములవాడ నగర పంచాయతీల్లో ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. కార్పొరేషన్లలో నామినేషన్లకు గురువారంతో గడువు ముగియగా మున్సిపాలిటీ లు, నగరపంచాయతీలకు శుక్రవారంతో గడువు ముగియనుంది. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు ఈ ఎన్నికలతోనే అమలవుతున్నా యి. సిరిసిల్ల, జగిత్యాల, మెట్పల్లి, వేములవాడ చైర్పర్సన్ పదవులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. డివి జన్లు, వార్డులోనూ 50 శాతం స్థానాలు మహిళలకే రిజర్వ్ చేశారు. దాదాపు అన్ని పార్టీలకు మహిళా అభ్యర్థుల ఎంపిక సవాల్‌గానే మారింది. వార్డుల్లో గెలిచే సత్తా ఉన్న వారిని వెదికి తమ ఆధిపత్యం తగ్గించుకునేకంటే తమ ఇంటివారినే గెలిపించుకుంటే వార్డుల్లో తమ ఆధిపత్యానికి ఎదురుండదనుకుని చాలా మంది నాయకులు తమ సతీమణులనే బరిలో ఉంచేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కరీంనగరంలో చాలా మంది మాజీ కార్పొరేటర్లు రిజర్వేషన్ అనుకూలించక తమ సతీమణులతో నామినేషన్ వేయించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు... ఆసక్తితో మరికొందరు పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నామినేషన్లు వేస్తున్నారు. కొన్ని చోట్ల ఆయా వార్డుల ప్రజలే మహిళా అభ్యర్థులను తెరపైకి తీసుకొస్తున్నారు. చదువుకున్న వారు ఉంటే ఎక్కువ ప్రయోజనమని డిగ్రీ చదివిన మహిళలను పోటీలో ఉండాలని కోరుతున్నారు. గెలిపించుకునే బాధ్యత తమదేనని నామినేషన్ వేయాలని కోరుతున్నారు. కొన్ని చోట్ల భార్యాభర్తలిద్దరూ తమకు రాజకీయాలు అవసరం లేదని చెబుతున్నా... ‘మీ భార్యను కౌన్సిలర్‌గా నిలబెడితే గెలిచే అవకాశం ఉందని పలువురు ఆశలు రేకెత్తిస్తున్నారు. ఎన్నికలకు అవసరమైన డబ్బులు తలా ఇంతా వేసుకుంటామని, పోటీకి వెనకకు రావద్దొంటూ కోరుతుండడంతో పోటీ చేసేందుకు అభ్యర్థులు సైతం పచ్చజెండా ఊపుతున్నారు. -
మగువలకే నగరాధిపత్యం
సాక్షి, రాజమండ్రి : శరవేగంగా సాగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం నగర పాలక సంస్థల మేయర్లు, మున్సిపాలిటీల చైర్పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేశారు. గతంలో అధికారులు ఖరారు చేసిన డివిజన్ల రిజర్వేషన్లను నోటిఫై చేశారు. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమీర్ శర్మ ఉత్తర్వులు విడుదల చేశారు.ఆ వివరాల ప్రకారం జిల్లాలో కాకినాడ, రాజమండ్రి కార్పొరేషన్లు సహా ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో రిజర్వేషన్ల వివరాలు.... కోర్టుకెక్కనున్న అసంతృప్తులు! రిజర్వేషన్ల కేటాయింపులపై ఆయా వర్గాలు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. డివిజన్ల రిజర్వేషన్లు గత ఏడాది సెప్టెంబర్‌లో అధికారులు ప్రతిపాదించినవి కాగా ఓటర్ల జాబితాలను మాత్రం జనవరి ఒకటవ తేదీ నాటివి ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అలాగే జిల్లాలో సీట్ల కేటాయింపుల్లో బీసీ, ఎస్సీ వర్గాలకు అన్యాయం జరిగిందని ఆయా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మండపేటను జనరల్‌కు కేటాయించడంపై ఆ ప్రాంత బీసీలు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై కొందరు మరోసారి కోర్టుకు ఎక్కే అవకాశాలు లేకపోలేదంటున్నారు. కాగా రాజమండ్రి, కాకినాడ మేయర్ స్థానాలు జనరల్‌కు కేటాయిస్తారని భావించారు. కానీ జనరల్ మహిళకు కేటాయించడంతో వివిధ పార్టీల్లోని ఆశావహులైన నాయకుల్లో నిరుత్సాహం నెలకొంది. మేయర్ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నవారు అప్పుడే తమ ఇల్లాళ్లను బరిలోకి దింపేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. మేయర్ల రిజర్వేషన్లు కార్పొరేషన్ కేటగిరీ రాజమండ్రి జనరల్ మహిళ కాకినాడ జనరల్ మహిళ మున్సిపాలిటీల చైర్ పర్సన్ల రిజర్వేషన్లు మున్సిపాలిటీ కేటగిరీ అమలాపురం జనరల్ తుని జనరల్ సామర్లకోట జనరల్ రామచంద్రపురం జనరల్ పిఠాపురం జనరల్ మండపేట జనరల్ పెద్దాపురం జనరల్ గొల్ల ప్రోలు (నగర పంచాయతీ) బీసీ జనరల్ ముమ్మిడివరం ( ॥) ఎస్సీ మహిళ ఏలేశ్వరం ( ॥) ఎస్సీ మహిళ కార్పొరేషన్లలో డివిజన్ల రిజర్వేషన్లు కార్పొరేషన్ డివిజన్లు ఎస్టీ ఎస్సీ బీసీ జనరల్ జనరల్ మహిళ రాజమండ్రి 50 01 06 17 14 12 కాకినాడ 50 01 06 17 14 12 మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లు అమలాపురం 30 01 04 10 08 07 తుని 30 01 05 10 08 06 సామర్లకోట 30 01 05 10 08 06 రామచంద్రపురం 27 01 04 09 07 06 పిఠాపురం 30 01 05 10 08 06 మండపేట 29 01 03 10 08 07 పెద్దాపురం 28 01 02 09 09 07 గొల్ల ప్రోలు 20 01 03 07 06 03 ముమ్మిడివరం 20 01 05 07 05 02 ఏలేశ్వరం 20 01 05 07 05 02