సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘భారత్ జాగృతి’ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. 2014, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ మహిళా బిల్లుపై ఇచ్చిన హామీని నెరవేర్చాలనే డిమాండ్‌తో దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గురువారమిక్కడ తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మార్చి 13 నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నందున ఈ స మావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించా లని డిమాండ్ చేశారు. ‘తెలంగాణ జాగృతి’కృషి మాదిరిగానే జాతీయస్థాయిలో కార్యక్రమాల నిర్వహణ కోసం ‘భారత్ జాగృతి’ని రూపాందించినట్లు గుర్తుచేశారు.
కోటాలో కోటా ఉండాల్సిందే
2010లో మహిళా బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందినప్పుడు కొన్ని పార్టీలు కోటాలో కోటా (ఉపకోటా) ఉండాలని డిమాండ్ చేశాయని, ప్రతి ఒక్కరికి వారి జనాభా ప్రకారం రాజ్యాంగబద్దంగా ఉపకోటా ఉండాలని చెప్పారు. మహిళాబిల్లుకు బీఆర్‌ఎస్ మద్దతిస్తుందని గతంలోనే సీఎం కేసీఆర్ ప్రకటించడంతోపాటు, పార్లమెంట్ ఎంపీల సంఖ్యను 33 శాతం పెంచి మహిళలకు కేటాయించాలని సూచించారన్నా రు. 1952లో మొదటి లోక్‌సభలో 24 మంది మహిళాఎంపీలుండగా, తాజాగా 78 మంది మహిళా ఎంపీలున్నారని, 75 ఏళ్లలో మహిళల ప్రాతినిథ్యం అనుకున్నంతగా పెరగలేదన్నారు.
బీజేపీ చెబితే అరెస్టు చేస్తారా?
బీజేపీవారు చెబితే అరెస్టులు చేసేట్టయితే. దర్యాప్తు సంస్థలు ఎందుకని కవిత నిలదీశారు. మోదీ వైఫల్యాలను ఎత్తిచూపితే కేంద్ర దర్యాప్తు సంస్థలను పంపి భయపెట్టడం బీజేపీకి అలవాటేనని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై విచారణ చేయిస్తున్న బీజేపీ ప్రభుత్వం,అదానీ కుంభకోణంపై ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే అదానీపై విచారణ మొదలైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment