సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏడు జెడ్పీ చైర్మన్ పదవులు, 335 ఎంపీపీ పదవులను ప్రభుత్వం మహిళలకు రిజర్వు చేసింది. ఇందుకు సంబంధించిన రిజర్వేషన్లను 2020 మార్చిలో ఖరారు చేసి, అప్పట్లోనే గెజిట్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. దీంతో ఈ నెల 24, 25 తేదీల్లో జరగనున్న ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులకు ఎన్నికలు ఈ రిజర్వేషన్ల ప్రతిపాదికనే జరగనున్నాయి. ఇక రాష్ట్రంలో మొత్తం 13 జెడ్పీ చైర్మన్లకుగానూ ఎస్టీ, ఎస్సీ మహిళ, ఎస్సీ జనరల్, బీసీ జనరల్‌కు ఒక్కొక్కటి చొప్పున, బీసీ మహిళలకు రెండు, జనరల్ మహిళకు మూడు, జనరల్ కేటగిరికి నాలుగు జెడ్పీ చైర్మన్ల పదవులను రిజర్వు చేశారు. 660 ఎంపీపీ పదవులకు గాను 338 ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించారు.
మైనార్టీలకు 686 కోఆప్టెడ్ పదవులు
ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవుల ఎన్నికలతో పాటు అదే రోజుల్లో మండల, జిల్లా పరిషత్‌లో కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికలు కూడా జరగనున్న విషయం తెలిసిందే. ప్రతి మండలానికి ఒకరు చొప్పున 660 మండల పరిషత్‌లలో, జిల్లాకు ఇద్దరేసి చొప్పున 13 జిల్లా పరిషత్‌లో కోఆప్టెడ్ సభ్యులను ఎన్నుకుంటారు. పంచాయతీరాజ్ నిబంధనల ప్రకారం మైనార్టీ వర్గాలకు చెందిన వారిని మాత్రమే మండల, జిల్లా పరిషత్‌లో కోఆప్టెడ్ సభ్యులుగా ఎన్నుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు తదితరులతో పాటు తెలుగు మినహా మిగిలిన భాషలను మాతృభాషగా గుర్తింపు పొందిన వారు కోఆప్టెడ్ పదవులు పొందేందుకు అర్హులవుతారని వారు తెలిపారు. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మండల పరిషత్‌లలో 660 మంది.. జిల్లా పరిషత్‌లలో 26 మంది కోఆప్టెడ్ సభ్యులుగా ఎన్నికయ్యే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment