పోలీసు ఉద్యోగాల్లో స్త్రీలకు 33% కోటా
గుజరాత్ సీఎం ఆనందీబెన్ ప్రకటన
స్త్రీలకు పోలీసుశాఖలో 33% కోటా
దేశంలో ఇదే తొలిసారి
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్ర పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం ఆనందీబెన్ పటేల్ ప్రకటించారు. సమాజంలో మహిళల అభ్యున్నతి కోసం వారికి సాధికారతను కట్టబెట్టడం తప్పనిసరి అని ఆమె అన్నారు. మంగళవారం గాంధీనగర్‌లోని గుజరాత్ పోలీసు అకాడమీలో ఆర్మ్‌డ్ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్స్, ఇంటెలిజెన్స్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. పోలీసుశాఖలో అన్ని కేడర్లలోనూ స్త్రీలకు రిజర్వేషన్ అమలుచేయనున్నట్లు ఆమె తెలిపారు.
గుజరాత్‌లో దేశంలోనే అతితక్కువ నేరాల రేటు ఉందని, అలాంటి సామరస్య వాతావరణాన్ని కల్పించినందుకు పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో గుజరాత్ డీజీపీ పీసీ ఠాకూర్ మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగాల్లో స్త్రీలకు 33 శాతం కోటా కల్పించిన తొలి రాష్ట్రం ఇదేనన్నారు. మహారాష్ట్రలో మహిళా పోలీసులు 10 శాతం మంది ఉన్నారని, ఇది దేశంలోనే అత్యధిక శాతమన్నారు. అలాగే గుజరాత్‌లో ప్రస్తుతం మహిళా పోలీసులు 5 శాతంలోపే(2,500) ఉన్నారని, 33 శాతం కోటా అమలైతే వారి సంఖ్య 19,800కు పెరగనుందన్నారు. యూపీలోని బదాయూలో ఇద్దరు బాలికలపై అత్యాచారం, హత్యతోపాటు దేశవ్యాప్తంగా స్త్రీలపై లైంగికదాడుల నేపథ్యంలో గుజరాత్ తొలి మహిళా సీఎం నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.