సీఎం జగన్ పాలనలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతతో అడుగులు
మహిళలకు గత ఎన్నికలకు మించి సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళను నిర్ణయాత్మక శక్తిగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుంది. అన్నిటా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పుడు సీట్ల కేటాయింపుల్లోనూ పెద్దపీట వేశారు. దేశంలో తొలిసారిగా దిశ బిల్లు తీసుకొచ్చారు. నవరత్నాల ద్వారా అమలు చేస్తున్న ప్రతి పథకం మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిందే. ఐదేళ్లుగా అందిస్తున్న తోడ్పాటుతో మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతను సాధించారు. గత ఎన్నికల్లో మహిళలకు 19 ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించగా ఇప్పుడు 24కు పెంచారు.
ప్రధాన విపక్ష అభ్యర్థులపై వైఎస్సార్‌సీపీ నుంచి మహిళలనే పోటీకి దించారు. మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌పై బీసీ మహిళ మురుగుడు లావణ్యకు పోటీ చేసే అవకాశం కల్పించారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా సీఎం జగన్ ఆమెకు టికెట్ ఇచ్చారు. పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై వైఎస్సార్‌సీపీ నుంచి వంగా గీతను పోటీకి దించారు. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణపై వైఎస్సార్‌సీపీ తరపున బీసీ మహిళ టి.నారాయణ దీపికను బరిలోకి దించారు.
విశాఖ ఎంపీ సీటుకు గత ఎన్నికల్లో ఓసీ అభ్యర్థులే పోటీ చేయగా సీఎం జగన్ చరిత్రను తిరగరాస్తూ బీసీ మహిళ బొత్స ఝాన్సీలక్ష్మికి వైఎస్సార్‌సీపీ టికెట్ ఇచ్చారు. చాలాకాలంగా నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి కోటీశ్వరులే పోటీలో నిలవగా సీఎం జగన్ సాధారణ కార్యకర్త, బీసీ మహిళ గూడూరి ఉమాబాలను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఎమ్మిగనూరులో టీడీపీ అగ్రవర్ణాలకు టికెట్ ఇవ్వగా బీసీ మహిళ బుట్టా రేణుక వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేస్తున్నారు.
మహిళా నేతలకు టికెట్లు..
వైఎస్సార్‌సీపీ అరకు పార్లమెంట్ పరిధిలో ఎంపీ అభ్యర్థిగా తనూజారాణి, అసెంబ్లీ అభ్యర్థులుగా వి.కళావతి(పాలకొండ), పుష్పశ్రీవాణి (కురుపాం), ఎన్ ధనలక్ష్మి(రంపచోడవరం), విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీలక్ష్మి, కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా వంగా గీత పోటీ చేస్తున్నారు. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని తానేటి వనిత(గోపాలపురం), శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఇచ్ఛాపురం నుంచి పిరియా విజయ, పాతపట్నం నుంచి రెడ్డి శాంతి, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పోలవరం నుంచి తెల్లం రాజ్యలక్ష్మీ బరిలో ఉన్నారు.
కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కంగాటి శ్రీదేవి(పత్తికొండ), బుట్టా రేణుక (ఎమ్మిగనూరు), హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా జోలదరాసి శాంతి, హిందూపురం, పెనుగొండ అసెంబ్లీ స్థానాల నుంచి టి.నారాయణ దీపిక, కేవీ ఉషశ్రీచరణ్, గుంటూరు పార్లమెంట్ పరిధిలోని తాడికొండ, మంగళగిరి, గుంటూరు పశి్చ మ, గుంటూరు తూర్పు అసెంబ్లీ స్థానాల నుంచి మేకతోటి సుచరిత, మురుగుడు లావణ్య, విడదల రజని, షేక్ నూరి ఫాతిమా, కడప పార్లమెంట్ పరిధిలోని బద్వేలు అసెంబ్లీ స్థానం నుంచి డాక్టర్ దాసరి సుధ, చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని నగరి, గంగాధర నెల్లూరు అసెంబ్లీ స్థానాల నుంచి ఆర్కే రోజా, కళత్తూరు కృపాలక్ష్మిలు పోటీ చేస్తున్నారు.
రాజకీయ సాధికారత..
కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకూ పదవుల్లో మహిళలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. దేశ చరిత్రలో తొలిసారి హోంమంత్రిగా ఎస్సీ మహిళ మేకతోటి సుచరితను నియమించారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా ముస్లిం మహిళను ఎంపిక చేశారు. మండలి చరిత్రలో ముస్లిం మహిళను డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా నియమించడం ఇదే తొలిసారి. మంత్రివర్గంలో నలుగురు మహిళలు తానేటి వనిత, కేవీ ఉషాశ్రీచరణ్, విడదల రజిని, ఆర్కే రోజాలకు స్థానం కల్పించారు. హోం, వైద్యారోగ్యం, మహిళా శిశుసంక్షేమం లాంటి కీలక శాఖలు వారికి అప్పగించి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారు. రాష్ట్ర తొలి చీఫ్ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్నికి అవకాశం కల్పించారు.
రాష్ట్రంలో 13 జెడ్పీ చైర్‌పర్సన్ పదవుల్లో ఏడుగురు (54 శాతం) మహిళలకు అవకాశం ఇచ్చారు. 26 జెడ్పీ వై‹స్ చైర్‌పర్సన్‌లలో 15 మంది (58 శాతం) మహిళలకు పదవీయోగం కల్పించారు. 12 మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు కలిపి మొత్తంగా 36 పదవుల్లో 18 అంటే 50 శాతం పదవులు మహిళలకే ఇచ్చారు. మొత్తం మునిసిపల్ కార్పొరేషన్లలో 671 మంది కార్పొరేటర్లు ఉంటే అతివలకే 54 శాతం అంటే 361 పదవులు దక్కాయి. 75 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 73 చోట్ల వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది.
వాటిలో 45 మంది అంటే 64 శాతం మహిళలే ఛైర్‌పర్సన్లుగా ఉన్నారు. ఈ మునిసిపాల్టీల్లోని 2,123 వార్డు మెంబర్లలో 1,161 పదవులు అంటే 55 శాతం మహిళలకే దక్కాయి. సర్పంచి పదవుల్లో 57 శాతం, ఎంపీటీసీల్లో 54 శాతం, మండలాధ్యక్షుల్లో 53 శాతం, జెడ్పీటీసీల్లో 53 శాతం మహిళలకే దక్కడం గమనార్హం. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించగా వీరిలో 53 శాతం మహిళలే ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న దాదాపు 1.34 లక్షల మంది ఉద్యోగుల్లో 51 శాతం మంది మహిళలే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment