కొచ్చి: 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తెస్తామని స్పష్టం చేశారు.మహిళల్ని నాయకత్వ స్థానాల్లో చూడాలనుకుంటున్నామని ఓ మహిళా కార్యకర్త చేసిన సూచనకు రాహుల్ ఈ మేరకు స్పందించారు. సామాన్య కార్యకర్తలు పార్టీ అధిష్టానంతో మాట్లాడేలా ‘శక్తి’ అనే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కేరళలోని కొచ్చిలో మంగళవారం జరిగిన బూత్ కమిటీల సమావేశంలో 50,000 మంది కార్యకర్తలతో రాహుల్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో సగం మంది మహిళలే ఉన్నారు.
దేశమంతటా రుణమాఫీ చేస్తాం..
ఈ సందర్భంగా ప్రధాని మోదీ 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై మాట్లాడుతూ.. ‘ఒకదాని తర్వాత మరో అబద్ధం చెబుతూ ప్రధాని మోదీ దేశానికి చెందిన ఐదేళ్ల విలువైన సమయాన్ని వృథా చేశారు. ప్రతీఏటా 2 కోట్ల కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కేవలం తన 15 మంది స్నేహితులకు కనీస ఆదాయ భద్రతను కల్పించారు. అదే సమయంలో దేశం లోని వేలాది మంది యువతకు మొండిచెయ్యి చూపారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో అధికారంలోకి రాగానే రైతు రుణా లను కాంగ్రెస్ మాఫీ చేసింది. అలాగే కేంద్రం లో అధికారంలోకి వస్తే దేశంలోని రైతుల రుణాలన్నింటిని మాఫీ చేస్తాం’ అని అన్నారు. బీజేపీ, సీపీఎం శైలిపై స్పందిస్తూ.. ‘బీజేపీ, సీపీఎం తీరు ఒక్కటే. వీరి పాలనలో సొంత పార్టీ కార్యకర్తలే ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందారు. బీజేపీ, సీపీఎం రాష్ట్రంలో హింసను రెచ్చగొడుతున్నాయి. మహిళల హక్కులను, కేరళ సంప్రదాయం, ఆచారాలను కాంగ్రెస్ గౌరవిస్తుంది’ అని రాహుల్ అన్నారు.
గోవా సీఎం పరీకర్‌తో రాహుల్ భేటీ
పణజీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గోవా సీఎం మనోహర్ పరీకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్..పరీకర్ ఆరోగ్యానికి సంబంధించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పరీకర్ క్లోమ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. రఫేల్ ఒప్పందానికి సంబంధించి రహస్య పత్రాలు పరీకర్ దగ్గర ఉన్నందునే ఆయన సీఎం పదవిలో ఉన్నారని రాహుల్ ఆరోపించిన ఒక రోజు తర్వాత ఆయన పరీకర్‌తో భేటీ అవడం గమనార్హం. ‘రాహుల్ మర్యాద పూర్వకంగా కలిశారని విపక్ష నేత చంద్రకాంత్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment