► మార్కెట్ కమిటీలపై నేతల కన్ను
► మహిళా రిజర్వేషన్‌తో తారుమారు
► తెరపైకి నాయకుల భార్యల పేర్లు
► సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యేల జాబితాలు
► అధికార పార్టీలో మొదలైన సందడి
ఆ పండగ... ఈ పండగ అంటూ నామినేటెడ్ పదవుల పండగను వాయిదా వేస్తూ వచ్చిన ప్రభుత్వం త్వరలో గులాబీ శ్రేణులకు తీపి కబురందించనుంది. నామినేటెడ్ పదవుల విషయంలో రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు కొద్దిరోజుల్లో తెరపడే అవకాశం కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ ప్లీనరీ ఈనెల 27న ఉండడంతో... ఆ లోపు కొన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారనే ప్రచారం జరిగింది. కాని సీఎం కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడిన తరువాత మే మొదటివారంలో పదవులను ప్రకటిస్తారని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఈ వరుసలో ముందుగా మార్కెట్ కమిటీలను ప్రకటించే అవకాశముందని పేర్కొంటున్నారు. దీంతో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
కరీంనగర్ సిటీ : మార్కెట్ కమిటీల నియామకం ఎప్పుడు చేసినా తమకే పదవి అని ధీమాతో ఉన్న టీఆర్‌ఎస్ నాయకుల జాతకాలు తొలిసారి రిజర్వేషన్‌లను ప్రవేశపెట్టడంతో తారుమారయ్యాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వేషన్లు ఖరారు చేయడంతో పదవులపై ఆశలు పెట్టుకొన్న పలువురు నాయకులకు చుక్కెదురు కాగా... ఊహించని పేర్లు తెరపైకి వచ్చాయి. జిల్లాలో 38 వ్యవసాయ మార్కెట్ క మిటీలు ఉండగా, ఇందులో బీసీలకు 12, ఎస్సీలకు 12, ఎస్టీకి ఒకటి రిజర్వ్ చేయగా, 13 స్థానాలు జనరల్‌కు కేటారుుంచారు. ఇందులో 13 చైర్మన్ స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయడంతో జాబితాలు మారిపోతున్నారుు. కొన్ని స్థానాలను మహిళలకు రిజర్వ్ చేసినప్పటికీ కులాలపరంగా స్థానాలను మాత్రం మార్చలేదు. ఉదాహరణకు సుల్తానాబాద్ ఎస్సీ రిజర్వ్ ఉండగా, ఈసారి ఎస్సీ మహిళకు కేటారుుంచారు. దీంతో ఆ సామాజికవర్గ నేతల స్థానంలో వారి భార్యలు తెరపైకి వచ్చారు. మొన్నటివరకు తమకు గ్యారంటీ అనుకున్న స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయడంతో తమ భార్యలకు అవకాశం ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలను కోరుతున్నారు.
ఎమ్మెల్యేల ప్రయత్నాలకు చెక్?
అనూహ్యంగా వచ్చిన మహిళా రిజర్వేషన్‌తో జిల్లాలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు అధిష్టానం చెక్ పెట్టిందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్ ఖరారు చేసినట్లు ప్రకటించినా... కొన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన ఏఎంసీలను వ్యూహాత్మకంగా మహిళలకు కేటాయించారనే వాదన వినిపిస్తోంది. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు ఏకపక్షంగా మహిళా ప్రజాప్రతినిధుల భర్తల పేర్లను ఏఎంసీ చైర్మన్‌లకు పంపించినట్లు సమాచారం. ఇలాంటి జాబితాకు చెక్ పెట్టేందుకు ఆయా స్థానాలను మహిళలకే రిజర్వ్ చేశారని అంటున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు మరొకరికి అవకాశం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది.
సీఎం కేసీఆర్‌కు జాబితాలు..
ఎమ్మెల్యేలు తమ పరిధిలోని ఏఎంసీల వారిగా చైర్మన్ పదవుల కోసం జాబితాను తయారు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గతంలో ఎమ్మెల్యేలు జాబితాలు అందచేసినా, మహిళా రిజర్వేషన్ కారణం గా జాబితాను తప్పనిసరిగా సవరించాల్సి వచ్చింది. దీంతో మహిళల పేర్లతో మరో జాబితాకు ఎమ్మెల్యేలు ఇప్పటికే తుదిరూపు ఇచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు తయారు చేసిన జాబితాలను జిల్లా మంత్రికి ఇవ్వాలని చెబుతున్నా, చాలా మంది నేరుగా కేసీఆర్‌కు అందచేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
నోటిఫై చేయాల్సినవి ఆరు..
కొత్తగా ఏర్పడుతున్న వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో మరో ఆరింటికి తుది నోటిఫికేషన్ రావాల్సి ఉంది. జిల్లాలో గతంలో 25 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా, కొత్తగా 13 ఏఎంసీలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త మార్కెట్‌లకు సంబంధించి మూడు నోటిఫికేషన్‌లు రావాల్సి ఉంటుంది. ఇందులో ఏడు ఏఎంసీలకు సంబంధించి నోటిఫికేషన్‌ల ప్రక్రియ పూర్తయింది. మరో ఆరింటికి మూడో (తుది) నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఆ నోటిఫికేషన్ వస్తేనే సాంకేతికంగా ఏఎంసీ ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుంది. త్వరలోనే మిగిలిన ఏఎంసీల తుది నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశ ం ఉంది.
ఆశావాహుల హడావుడి
ఏఎంసీల నియామకాలు జరగబోతున్నాయనే ప్రచారంతో ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గతంలో ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితాలో పేర్లు ఉన్న నాయకులు తమ పేర్లను కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. జాబితాలో చోటు లభించని నాయకులు రాష్ట్రస్థాయి నేతలతో తమకున్న పరిచయాలను ఉపయోగించుకుని పైరవీలు మొదలు పెట్టారు. ఇప్పటికే చాలామంది ఆశావాహులు రాజధాని బాటపట్టారు. 2001 నుంచి పార్టీలో ఉన్న నాయకులు మాత్రం అధినేతపైనే భారం వేసి వేచి చూస్తున్నారు. స్థానికంగా ఎమ్మెల్యేల వ్యతిరేక గ్రూప్‌గా ముద్రపడిన ఆశావాహులు కూడా అధినేతతోపాటు మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎంపీ కవిత లను కలిసి తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలంటూ వేడుకొంటున్నారు. ఇంకొంతమంది ఒకడుగు ముందుకేసి పోటీలో ఉన్న నాయకులపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఫలానా ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పోటీచేసి, పార్టీ అభ్యర్థి ఓడిపోవడానికి కారణమయ్యాడు... అతనికెలా పదవి ఇస్తారంటూ ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తున్నారు. జనరల్ కు కేటాయించిన స్థానాలను జనరల్ కేటగిరీ వారికే ఇవ్వాలంటూ ఆ కేటగిరీ ఆశావహులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ కమిటీ పదవుల పందేరంతో అధికార పార్టీలో సందడి నెలకొంది.