రిజర్‌‘వేషం’ మారెన్! | Reservation 'dress' maren! | Sakshi
Sakshi News home page

రిజర్‌‘వేషం’ మారెన్!

Published Thu, Mar 27 2014 5:00 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Reservation 'dress' maren!

హన్మకొండ, న్యూస్‌లైన్ : ఆ మండలం జెడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు రిజర్వేషన్ అయింది. ఐతే.. ఇంకేం పార్టీల్లో చాలా రోజుల నుంచి తిరుగుతున్న నేతలు తమ సతీమణులను బరిలోకి దింపుతారు. ఇది సాధారణంగా జరిగే సంగతి. అయితే.. మహిళా రిజర్వేషన్ స్థానంలో ఓ ఎస్టీ వ్యక్తి నామినేషన్ వేశాడు.. స్వీకరించిన అధికారులు అన్నీ పరిశీలించి కుల ధ్రువీకరణ పత్రం లేదంటూ జనరల్ వ్యక్తులకు తీసుకునే డిపాజిట్ తీసుకుని చెల్లుబాటు జాబితాలో చేర్చారు. ఆటోరిక్షా గుర్తు సైతం ఇచ్చారు. మహిళా రిజర్వేషన్‌కు పురుషుని నామినేషన్ ఎలా చెల్లుబాటు చేశారంటూ ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో తేరుకుని రాత్రికి రాత్రి హడావుడిగా ఫైనల్ జాబితా నుంచి తొలగించారు.. ఇదీ మన జిల్లా పరిషత్ ఎన్నికల అధికారుల లీల.
 
ఇదీ జరిగింది..
   
కొత్తగూడ జెడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు రిజర్వు చేశారు. ఇక్కడ నుంచి టీడీపీ, కాంగ్రెస్‌తో సహా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు ఫైనల్ జాబితాలో బరిలో నిలిచినట్లు ప్రకటించారు. జనరల్ మహిళ స్థానంలో ఇదే మండలం పూనుగుండ్ల గ్రామానికి చెందిన పెనుక కృష్ణారావు(ఎస్టీ) నామినేషన్ దాఖలు చేశాడు. నామినేషన్ సమయంలో కుల ధ్రువీకరణ పత్రం లేకపోవడంతో అధికారులు జనరల్ అభ్యర్థులకు తీసుకునే డిపాజిట్ *5000 తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీలకు *2500 తీసుకుంటారు. నామినేషన్ల పరిశీలనలో పేజీని నాలుగుసార్లు చూసిన అధికారులు అన్నీ ఒకే చెప్పారు.

ఉపసంహరణల అనంతరం చెల్లుబాటు అయిన నామినేషన్ల జాబితా ప్రకటించారు. ఈ జాబితాలో కొత్తగూడ మండలం నుంచి ఏడుగురు బరిలో ఉన్నారని, వారిలో ఐదుగురు స్వతంత్రులంటూ పేర్కొన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా ప్రకటించే వరకూ ఏడుగురు అభ్యర్థులకు గుర్తులిచ్చారు. కృష్ణారావుకు సైతం ఆటోరిక్షా గుర్తు కేటాయించారు. ఆయన కరపత్రాలు ముద్రించి.. ప్రచారం మొదలుపెట్టారు. అయితే మహిళా జనరల్ స్థానంలో కృష్ణారావు ఎలా పోటీ చేస్తున్నాడనే సందేహాలు వ్యక్తమైన కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తప్పు తెలుసుకున్న అధికారులు ఫైనల్ జాబితాలో ఆరుగురు అభ్యర్థులను పెట్టి.. క్రిష్ణారావు పేరును తొలగించారు.
 
రిజర్వేషన్ల మార్పుతో గందరగోళం
 
పదేపదే రిజర్వేషన్లు మారడం, మూడు ఎన్నికలు ఒకేసారి నిర్వహించాల్సి రావడం తదితర కారణాలతో అధికారులు సైతం తికమక పడుతున్నారు. తొలిసారి రిజర్వేషన్ల జాబితాలో కొత్తగూడ ఎస్టీ జనరల్‌కు వచ్చింది. చివరిసారిగా ఇచ్చిన జాబితాలో జనరల్ మహిళకు రిజర్వేషన్ అయింది. ఇలా రిజర్వేషన్లు మారడంతో అటు పోటీలో ఉండే నేతలు, ఇటు అధికారులు గందరగోళంలో పడ్డారు.
 
పోటీలో ఉండేలా చేయాలి :  కృష్ణారావు, అభ్యర్థి
 
నామినేషన్ ఓకే చేసి నాకు గుర్తు కేటాయించారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్‌లో పోటీలో ఉండరాదంటూ అధికారులు చెబుతున్నారు. నా నామినేషన్‌పై నా భార్యకు అవకాశం కల్పించాలి. దేవరుప్పుల మండలంలో కోలుకొండ ఎంపీటీసీ అభ్యర్థి స్వరూప బలపర్చే అభ్యర్థి పేరు రాయాల్సిన చోట గ్రామం పేరు రాస్తే తిరస్కరించారు. ఇక్కడేమో మహిళా రిజర్వేషన్‌లో నా దరఖాస్తు తీసుకుని చెల్లుబాటు చేశారు. ఇదెక్కడి న్యాయం. నాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి.
 
ఇందుకా.... లెక్క తగ్గింది
 
ఉపసంహరణ అనంతరం జిల్లాలోని 50 జెడ్పీటీసీ స్థానాలకు 338 మంది బరిలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జాబితాను జెడ్పీ కార్యాలయం నోటిస్ బోర్డ్‌పై అతికించారు. మరుసటి రోజు ఈ బరిలో ఉన్న అభ్యర్థులు తమ పేర్లను చూసుకొని ప్రచారంలోకి దిగారు. మహిళ స్థానంలో పురుషునికి ఎలా గుర్తు కేటాయించారని ఒకరు అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు మేల్కొన్నారు. అంతే.. హడావుడిగా జాబితాను సవరించి 337మంది పోటిలో ఉన్నారని మరో ప్రకటన చేశారు. అందుకే పోటీ అభ్యర్థుల సంఖ్య ఒకటి తగ్గింది. జాబితా మార్పుపై అధికారులు ఇప్పటికీ పెదవి విప్పడం లేదు. అడిగితే సమాధానం దాటవేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement