బంగారం.. బరిలో నిలువ్! | Reservation of women in local bodies elections, husbands try to his wifes | Sakshi
Sakshi News home page

బంగారం.. బరిలో నిలువ్!

Published Sat, Mar 15 2014 12:40 PM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM

బంగారం.. బరిలో నిలువ్!

బంగారం.. బరిలో నిలువ్!

 ఎన్నికలు మగాళ్లకు చిక్కులు తెచ్చిపెట్టాయి. యాభై శాతం మహిళా రిజర్వేషన్ల పుణ్యమా అని పురుష పుంగవులకు పోటీ చేసే చాన్స్ తగ్గిపోవడంతో తమ భార్యలను పోటీలో ఉంచేందుకు నానా తంటాలు పడుతున్నారు. పోటీకి వారు ఆసక్తి చూపకపోతుండడంతో బతిమాలి మరీ ఒప్పిస్తున్నారు.
 
 స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ప్రజాప్రతినిధులుగా ఈ సారి మహిళల ప్రాతినిథ్యం పెరగనుంది. తామే బరిలో ఉండి రాజకీయం ఏలుదామని కలలుగన్న పలువురికి రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. దీంతో పోటీలో ఉండాలని తమ సతులను బతిమాలుడుతున్నారు. వారు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపించకున్నా.. పార్టీలో, వార్డులో పరువు కాపాడాలంటూ బుజ్జగిస్తున్నారు.

‘నువ్వు రాజకీయాల్లో తిరుగుడే దండగంటే... నీ వెంబడి నేను కూడా తిరగాలా? మాకే పదవీ అక్కర్లేదు’ అని ఖరాఖండిగా చెబుతు న్నా నయా నో... భయానో వారిని ఒప్పిస్తున్నారు. తమ మాట వినే పరిస్థితి లేనప్పుడు వారి పుట్టింటివారితోనూ చెప్పించి చూస్తున్నారు. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతోపాటు జగిత్యాల, సిరి సిల్ల, మెట్‌పల్లి, కోరుట్ల మున్సిపాలిటీలు, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట, వేములవాడ నగర పంచాయతీల్లో ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. కార్పొరేషన్లలో నామినేషన్లకు గురువారంతో గడువు ముగియగా మున్సిపాలిటీ లు, నగరపంచాయతీలకు శుక్రవారంతో గడువు ముగియనుంది.

మహిళలకు 50శాతం రిజర్వేషన్లు ఈ ఎన్నికలతోనే అమలవుతున్నా యి. సిరిసిల్ల, జగిత్యాల, మెట్‌పల్లి, వేములవాడ చైర్‌పర్సన్ పదవులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. డివి జన్లు, వార్డులోనూ 50 శాతం స్థానాలు మహిళలకే రిజర్వ్ చేశారు. దాదాపు అన్ని పార్టీలకు మహిళా అభ్యర్థుల ఎంపిక సవాల్‌గానే మారింది. వార్డుల్లో గెలిచే సత్తా ఉన్న వారిని వెదికి తమ ఆధిపత్యం తగ్గించుకునేకంటే తమ ఇంటివారినే గెలిపించుకుంటే వార్డుల్లో తమ ఆధిపత్యానికి ఎదురుండదనుకుని చాలా మంది నాయకులు తమ సతీమణులనే బరిలో ఉంచేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

కరీంనగరంలో చాలా మంది మాజీ కార్పొరేటర్లు రిజర్వేషన్ అనుకూలించక తమ సతీమణులతో నామినేషన్ వేయించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు... ఆసక్తితో మరికొందరు పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నామినేషన్లు వేస్తున్నారు.  కొన్ని చోట్ల ఆయా వార్డుల ప్రజలే మహిళా అభ్యర్థులను తెరపైకి తీసుకొస్తున్నారు. చదువుకున్న వారు ఉంటే ఎక్కువ ప్రయోజనమని డిగ్రీ చదివిన మహిళలను పోటీలో ఉండాలని కోరుతున్నారు. గెలిపించుకునే బాధ్యత తమదేనని నామినేషన్ వేయాలని కోరుతున్నారు.

కొన్ని చోట్ల భార్యాభర్తలిద్దరూ తమకు రాజకీయాలు అవసరం లేదని చెబుతున్నా... ‘మీ భార్యను కౌన్సిలర్‌గా నిలబెడితే గెలిచే అవకాశం ఉందని పలువురు ఆశలు రేకెత్తిస్తున్నారు. ఎన్నికలకు అవసరమైన డబ్బులు తలా ఇంతా వేసుకుంటామని, పోటీకి వెనకకు రావద్దొంటూ కోరుతుండడంతో పోటీ చేసేందుకు అభ్యర్థులు సైతం పచ్చజెండా ఊపుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement