విశ్లేషణ
నగర ప్రాంతాలకు తరలి వస్తోన్న లక్షలాదిమంది ప్రధానంగా ఉపాధిని పొందుతోంది, నిర్మాణ రంగంలోనే. సాఫ్ట్‌వేర్ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిణామాలు అక్కడా ఉపాధికి గండికొడుతున్నాయి. ఈ స్థితిలో ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధికి రఘురావ్‌ు రాజన్ వంటి వారు కూడా సేవారంగాన్ని ఎందుకు పరిష్కారంగా చెప్పజూస్తున్నారు? నేటి ప్రపంచ పరిస్థితులలో సరుకు ఉత్పత్తి రంగం గానీ, సేవా రంగం గానీ కోట్లాది మంది నిరుద్యోగులకు బతుకుతెరువును చూపగల స్థితి లేదు. మిగిలిందల్లా, వ్యవసాయ రంగమే. వ్యవసాయం లాభసాటిగా ఉంటే గ్రామీణులు నగరాలకు రారు. అప్పుడు కారుచవకగా కార్పొరేట్లకు కార్మికులు దొరకరు. అందుకే వ్యవసాయం లాభసాటిగా లేకుండా ‘జాగ్రత్తపడటమే’ ఇప్పటి విధానం.
దేశంలోని సుమారు 65% జనాభా 35 ఏళ్ల లోపువారు. వీరికి నిరుద్యోగం, చదువుకు తగిన ఉద్యోగం లేకపోవడం ప్రధాన సమస్యలు. కోవిడ్ అనంతరం సమస్య మరింత జఠిలం అయ్యింది. 2016లో మోదీ తెచ్చిపెట్టిన పెద్ద నోట్ల రద్దు, 2017లో హడావుడిగా ఆరంభమైన జీఎస్టీ వంటివి చిన్న, మధ్యతరహా పరిశ్రమలను దెబ్బతీసి నిరుద్యోగ సమస్యను మరింత పెంచాయి.
దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనే వాగ్దానం ఆసరాగా 2014లో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఇదే నేపథ్యంలో, మోదీ ప్రభుత్వం సరుకు ఉత్పత్తి రంగాన్ని దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక ఉపాధి కల్పనా రంగంగా... దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 25% స్థాయికి చేర్చే పేరిట ‘మేకిన్ ఇండియా’ కార్య క్రమాన్ని ఆరంభించింది. దశాబ్ద కాలం తర్వాత, వెనక్కిచూసుకుంటే స్థూల జాతీయ ఉత్పత్తిలో ఈ రంగం వాటా 15– 17 శాతం మధ్య ఎదుగూ బొదుగూ లేకుండా మిగిలిపోయింది. 2020లో ఆరంభమైన ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల’ పథకం కూడా సాధించింది నామ మాత్రమే.
మేకిన్ ఇండియా కార్యక్రమం విజయవంతం అయ్యే అవకాశాలు లేవంటూ అప్పట్లోనే రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురావ్‌ు రాజన్ చెప్పారు. చైనా ప్రపంచం యావత్తుకూ సరిపోయే స్థాయిలో, చవకగా సరుకులను ఉత్పత్తి చేస్తోంది గనుక ప్రపంచానికి మరో చైనా అవసరం లేదంటూ సున్నితంగా హెచ్చరించారు. ఈ రచయిత కూడా 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం, అంతర్జాతీయంగా డిమాండ్ పతనం వంటి వివిధ కారణాలను పేర్కొంటూ మేకిన్ ఇండియా, దేశ సమస్య లకు పరిష్కారం కాదంటూ ఒక వ్యాసం రాసివున్నారు.
దేశంలో నిరుద్యోగం పరిష్కారానికీ, వృద్ధి రేటు పెంపుదలకూ దారి ఏమిటనే చర్చ ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే, ఈ మధ్య రఘురావ్‌ు రాజన్ ‘బ్రేకింగ్ ద మౌల్డ్: రీ ఇమేజింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్’ పేరిట రోహిత్ లాంబా అనే పెన్సి ల్వేనియా విశ్వవిద్యాలయ ఆచార్యునితో కలిసి ఒక పుస్తకం రాశారు. దీనిలో భాగంగా మేకిన్ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక విధానాలు ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువగా తయారయ్యాయని పేర్కొన్నారు.
ఈ సరుకు ఉత్పత్తి రంగంపై దృష్టిని కాస్తంత తగ్గించు కొని, భారతదేశం ఇప్పటికే ‘బలంగా’ వున్న సేవా రంగంపై దృష్టి పెట్టాలన్నారు. తద్వారా మెరుగైన ఉపాధి కల్పన, వృద్ధి రేటులను సాధించవచ్చనేది వారి వాదన. దీని కోసమై యువజనుల నిపుణతల స్థాయిని పెంచి వారిని సేవా రంగ ఉపాధికి సిద్ధం చేయాలన్నారు.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం కొరియా, జపాన్... అలాగే చైనా వంటి దేశాలు అనుసరించిన ఆర్థిక వృద్ధి నమూనా అయిన మొదటగా వ్యవసాయ రంగం నుంచి సరుకు ఉత్పత్తి రంగం దిశగా సాగడం... అనంతరం మాత్రమే సేవా రంగం వృద్ధి దిశగా పయనించడం అనివార్యం కాదని రాజన్ వాదిస్తున్నారు. అనేక ధనిక దేశాలలో ఇప్పటికే సేవా రంగం వాటా జీడీపీలో 70% మేర ఉందనీ, ఈ రంగంలో జీడీపీ వాటా సుమారు 60% పైన వున్న భారత్ కూడా పాత నమూనాని పక్కన పెట్టి మరింతగా సేవా రంగంలోకి వెళ్ళాలనేది రాజన్ తర్కం.
సేవా రంగం వృద్ధి చెందాలంటే యువజనుల విద్యా నిపుణతల స్థాయి సరుకు ఉత్పత్తి రంగంలో కంటే అధికంగా ఉండాలి. ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా సేవా రంగం తాలూకు సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రవేశించగలగడంలో ఎదుర్కొంటున్న సాఫ్ట్ స్కిల్స్ లోటును చూస్తున్నాం. సేవా రంగంలో ఆంగ్ల భాషా ప్రావీణ్యం అవసరం తెలిసిందే.
దేశంలోని ఎంతమంది యువజనులకు ఈ రంగంలో ప్రవేశించగల స్థాయి ఆంగ్ల భాషా ప్రావీణ్యం ఉంది? దేశంలోని మొత్తం కార్మికులలో 70% మంది మాత్రమే అక్షరాస్యులు. వీరిలో కూడా 25% మంది ప్రాథమిక స్థాయి విద్యలోపే పాఠశాల చదువు మానివేసిన వారు. దేశంలోని 20% సంస్థలు మాత్రమే తమ ఉద్యోగులకు తగిన శిక్షణను ఇచ్చుకునే ఏర్పాట్లను కలిగి వున్నాయి (ప్రపంచ బ్యాంకు పరిశోధన).
ఈ స్థితిలో, గ్రామీణ యువజనులను సేవా రంగం దిశగా ఇప్పటికిప్పుడు తీసుకెళ్ళగలమా? నేడు సాఫ్ట్‌వేర్ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిణామాలు అక్కడా ఉపాధికి గండికొడుతున్నాయి. ఈ స్థితిలో, ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి కోసం రఘురావ్‌ు రాజన్ వంటి వారు కూడా సేవా రంగాన్ని ఎందుకు పరిష్కారంగా చెప్పజూస్తున్నారు?
దీనికి కారణం ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘బీయింగ్ డిటర్మిన్స్ కాన్షియస్‌నెస్’ (మన అస్తిత్వమే మన ఆలోచనలను నిర్ణయిస్తుంది) అనే కార్ల్ మార్క్ ్స ఉద్బోధన. అంతర్జాతీయ ద్రవ్య సంస్థలో 2003 నుంచి 2007 వరకూ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పని చేసిన రాజన్ కూడా దాటుకుని రాలేని నిజం. ఆయన అస్తిత్వం తాలూకు పరిమి తులే, ఆయనను వాస్తవాన్ని చూడనివ్వడం లేదు.
నేటి ప్రపంచ పరిస్థితులలో అటు సరుకు ఉత్పత్తి రంగం గానీ, ఇటు సేవా రంగం గానీ, కోట్లాది మంది నిరుద్యోగ యువతకు బతుకుదెరువును చూప గల స్థితి లేదు. మిగిలిందల్లా, మన వ్యవసాయ రంగమే. ఈ రంగంలో ఇప్పటికే, అవసరాన్ని మించి మానవ వనరులు చిక్కుకు పోయి ఉన్నాయన్నది నిజం.
ప్రస్తుత ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల ‘సంస్కరణల’ యుగంలో వ్యవసాయ రంగంపై చిన్న చూపు పెరిగింది. గ్రామీణ వ్యవసాయ రంగం, నగర ప్రాంత పారిశ్రామిక రంగాల మధ్యన ఉన్న సమీకరణం గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకంగా ఉంది. వ్యవసాయ రంగ సరుకులను కారు చవుకగా, నగర ప్రాంతాలలో అందుబాటులో ఉంచడమనేది పారిశ్రామిక కార్పొరేట్ వర్గాల అవసరం.
గ్రామీణ రైతాంగానికి లాభసాటి ధరలను కల్పిస్తే ఆ సరుకుల ధరలు, నగర ప్రాంత మార్కెట్‌లలో అధికంగా ఉంటాయి. నగర ప్రాంత కార్మికులు, ఉద్యోగులకు అవి ఖరీదైనవి అవుతాయి. అప్పుడు వేతనాల పెంపుదల కోసం యజమానులపై ఒత్తిడి తెస్తారు. ఇది పారిశ్రామిక అశాంతిగా మారవచ్చు. ఒక మోస్తరు వేతనాలతోనే పని చేయించుకోగలగాలంటే రైతాంగ ఉత్పత్తులకు తక్కువ ధరలు ఉండేలా జాగ్రత్తపడడం కార్పొరేట్లకు అవసరం.
గ్రామీణ రైతాంగానికి వ్యవసాయం లాభసాటిగా ఉంటే వారు నగరాలకు రారు. అప్పుడు నగర ప్రాంతాలలో కార్మికుల సరఫరా తగ్గుతుంది. కార్మికులకు డిమాండ్ పెరుగుతుంది. దీని వలన, పారిశ్రామికవేత్తలు అధిక వేతనాలను చెల్లించి పనిలో పెట్టుకోవలసి వస్తుంది. దీనికి కూడా పరిష్కారమే గ్రామీణ వ్యవసాయం లాభ సాటిగా లేకుండా ‘జాగ్రత్తపడడం’. ఈ కథలో సూత్రధారులు ప్రపంచీకరణ వంటి నయా ఉదారవాద విధానాaలను మన మీద రుద్దుతోన్న ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధులు.
ఆ ఆలోచనా విధానం తాలూకు ప్రతినిధిగా రఘురావ్‌ు రాజన్ వ్యవసాయం ఊసు ఎత్తలేరు. దాన్ని దేశానికీ, ఉపాధి కల్పనకూ దారిగా చూపలేరు. రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఉంటే అది అతని కొనుగోలు శక్తిని పెంచి తద్వారా నగర ప్రాంత పారిశ్రామిక సరుకులకు డిమాండ్‌ను కల్పిస్తుంది. దేశ జనాభాలోని 55% పైన ఉన్న రైతాంగం బాగుంటే, విదేశాలలోని డిమాండ్, కొనుగోలు శక్తి, ఎగుమతులతో నిమిత్తం లేకుండా దేశంలోనే డిమాండ్‌ను సృష్టించవచ్చు. ఈ పరిష్కారాన్ని చెప్పలేని మేధా దుర్బలత్వంతో రఘురావ్‌ు రాజన్ వంటివారు మిగిలిపోతున్నారు.
డి. పాపారావు
వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులు
మొబైల్: 98661 79615
Comments
Please login to add a commentAdd a comment