ఉద్యోగ సాధనకు.. సెల్ఫ్ రిఫరెన్స్! | Self reference to get employment easily | Sakshi
Sakshi News home page

ఉద్యోగ సాధనకు.. సెల్ఫ్ రిఫరెన్స్!

Published Thu, Oct 16 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

ఉద్యోగ సాధనకు.. సెల్ఫ్ రిఫరెన్స్!

ఉద్యోగ సాధనకు.. సెల్ఫ్ రిఫరెన్స్!

దేశ విదేశాల్లో దాదాపు 70 శాతం కొలువులను సిఫార్సుల ద్వారానే భర్తీ చేస్తున్నారని మీకు తెలుసా? అంటే విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన అభ్యర్థులను కంపెనీలు నియమించుకుంటున్నాయి. ఇష్టమైన ఉద్యోగం సాధించాలంటే రిఫరెన్స్ ఉండాలి. మీ పేరును ఎవరైనా సిఫార్సు చేస్తే కంపెనీకి మీపై గురి కుదురుతుంది. జాబ్ ఆఫర్ లెటర్ ఇచ్చేందుకు ముందుకొస్తుంది. వ్యక్తుల ద్వారానే కాదు స్వయంగా కూడా ఇలాంటి రిఫరెన్స్‌లను సృష్టించుకోవచ్చు. జాబ్ మార్కెట్‌లో మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోగలిగితే కొలువు సాధన సులువవుతుంది.
 
 ప్రతిభను బహిర్గతం చేయాలి: మీకు ఉద్యోగం ఇవ్వాలంటే మీ అర్హతలు, నైపుణ్యాలు, మీరేం చేస్తున్నారు, ఏం చేయగలరో కంపెనీకి తెలియాలి. ఇంటర్నెట్ ద్వారా వీటిని తెలియజేయాలి. జాబ్ ప్రొఫైల్‌ను రూపొందించుకొని రిక్రూటర్లు చూసేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలి. మీకు మధురంగా పాట పాడడం వస్తే నిరభ్యంతరంగా పాడండి. దాన్ని వీడియోలో బంధించి, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో, బ్లాగ్‌ల్లో పెట్టండి. మీకు వచ్చిన విద్యలన్నీ రిక్రూటర్లకు తెలియాలి. అప్పుడే వారు మీ పట్ల ఆసక్తి చూపుతారు.
 
 గతంలో చేసిన ఉద్యోగాలు, పూర్తి చేసిన ప్రాజెక్ట్‌లు, పని చేసిన కంపెనీలు, మీ వల్ల కంపెనీకి కలిగిన లాభాలు.. ఇలా మీకు సంబంధించిన వివరాలన్నీ జాబ్ ప్రొఫైల్‌లో ఉండాలి. కొలువు కావాలంటే మిమ్మల్ని మీరు రహస్యంగా దాచుకోకూడదు. మీ ప్రతిభను బహిర్గతం చేయండి. మీరేమిటో మీ ద్వారానే వెల్లడి కావాలి. మీ గురించి మీరే ప్రభావవంతంగా సిఫార్సు చేసుకోండి.
 
 బలమైన రెజ్యూమె: కొలువు వేటలో కీలకమైన సాధనం.. రెజ్యూమె. మీ అర్హతలు, నైపుణ్యాలు, అభిరుచులు, అనుభవాలు వంటివాటిని రిక్రూటర్‌కు క్లుప్తంగా తెలపాలి. రెజ్యూమె కూడా రిఫరెన్స్‌లాంటిదే.
 
 బలమైన రెజ్యూమెను రూపొందించుకొని సామాజిక అనుసంధాన వేదికల్లో పొందుపర్చండి. కంపెనీలు దీన్ని పరిశీలించి, సంతృప్తి చెందితే మీకు సమాచారం పంపుతాయి. వ్యాపారం విజయవంతం కావాలంటే సంబంధిత వినియోగదారులు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. ఉత్పత్తులను వారికి చేరవేయాలి. మిమ్మల్ని వినియోగించుకొనే సంస్థలు కూడా మీకు కస్టమర్లే. మీకు ఉద్యోగమిచ్చే కంపెనీలు ఎక్కడున్నాయో గాలించండి. మీ గురించి రిక్రూటర్లకు తెలియజేయండి.
 
 విద్యార్థినుల కోసం సీబీఎస్‌ఈ ఉడాన్
 దేశంలో ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థినుల శాతాన్ని పెంచడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ).. ఉడాన్ అనే కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. టాప్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు పొందేలా దేశవ్యాప్తంగా ప్రతిఏటా 1000 మంది అమ్మాయిలకు ఉడాన్ ద్వారా శిక్షణనిస్తారు. వీరిలో సగం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లో ఉండేలా చూస్తారు. పదకొండు, పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థినులను జేఈఈలో విజయం దిశగా నడిపించడానికి ఉడాన్ ద్వారా ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో ఉచితంగా కోర్సులు నిర్వహిస్తారు.
 దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 27
 వెబ్‌సైట్: http://cbse.nic.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement