విద్యార్థులకు కొలువు కిటుకులు! | Employee techniques to the students | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు కొలువు కిటుకులు!

Published Wed, Oct 1 2014 12:21 AM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM

విద్యార్థులకు కొలువు కిటుకులు! - Sakshi

విద్యార్థులకు కొలువు కిటుకులు!

నేటి విద్యార్థులే రేపటి ఉద్యోగార్థులు. చదువు పూర్తయిన తర్వాత దృష్టి సారించాల్సిందే.. కొలువుపైనే. నచ్చిన జాబ్ దక్కించుకోవాలంటే.. దరఖాస్తు ప్రక్రియ, మౌఖిక పరీక్షలపై ముందుగానే అవగాహన పెంచుకోవాలి. మన దేశంలో గత కొంతకాలంగా నియామక ప్రక్రియలో చాలా మార్పులొచ్చాయి. టెక్నాలజీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు కొలువుల కోసం పోటీ విపరీతంగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో జాబ్ మార్కెట్‌లో అభ్యర్థులు విజేతగా నిలవాలంటే కొలువు కిటుకులు కొన్ని తెలుసుకోవాల్సిందే!
 
 ఆన్‌లైన్ ప్రొఫైల్: ఉద్యోగానికి దరఖాస్తు చేసేముందు గూగుల్‌లో రంగ ప్రవేశం చేయండి. ప్రస్తుతం 48 శాతం మంది ఎంప్లాయర్స్ తమకు కావాల్సిన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. సమీప భవిష్యత్తులో ఈ సంఖ్య రెట్టింపయినా ఆశ్చర్యం లేదు. కాబట్టి అంతర్జాలంలో మీకంటూ ఒక స్థానాన్ని సృష్టించుకోండి. మీ రెజ్యూమె, ప్రొఫైల్, ఫొటోగ్రాఫ్‌ను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో రిక్రూటర్లు, హైరింగ్ మేనేజర్లకు అందుబాటులో ఉంచండి. వీడియో బయోడేటాను కూడా ఈ సైట్లలో చేర్చండి. ఈ ప్రొఫైల్, ఫొటోలు, వీడియో బయోడేటా అత్యుత్తమ నాణ్యతతో ఉండాలి. క్వాలిటీ తగ్గితే మీ అవకాశాలూ తగ్గిపోతాయి. రిక్రూటర్లు అభ్యర్థుల కోసం నేరుగా లింక్డ్‌ఇన్‌లోకి అడుగుపెడుతున్నారు. మీ అర్హతలు, నైపుణ్యాలను తెలియజేసే పర్సనల్ బ్రాండింగ్ ఫోర్ట్‌పోలియోను ఈ సైట్‌లో తప్పనిసరిగా పొందుపర్చండి. ఇతరుల కంటే మీరు మెరుగైన అభ్యర్థి అని దీనిద్వారా తెలియజేయండి.  
 
 మౌఖిక పరీక్ష: దరఖాస్తు దశలో జరిగే వడపోతలో నెగ్గితే ఇంటర్వ్యూకు పిలుపు వస్తుంది. ఇందులో ప్రతిభ చూపితే కొలువు ఖాయమవుతుంది. జాబ్‌లో ప్రవేశానికి ఇది గేట్‌పాస్ లాంటిది. అభ్యర్థులు ఇంటర్వ్యూ స్కిల్స్ పెంచుకోవాలి. సరైన వస్త్రధారణ, బాడీ లాంగ్వేజ్, సమయస్ఫూర్తితో కూడిన సమాధానాలతో రిక్రూటర్‌ను మెప్పించొచ్చు.  
 
 సిఫార్సులు: మీరు మీ రెజ్యూమెలో, ఆన్‌లైన్ ప్రొఫైల్‌లో పేర్కొన్న అంశాలకు బలం చేకూరాలంటే రికమండేషన్లు అవసరం. మీ గురించి తెలిసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్, ప్రొఫెసర్, విద్యావేత్త లేక ఎవరైనా ప్రముఖులతో రికమండేషన్ చేయించుకోండి. అంటే.. మీ పేరును సూచిస్తూ వారు ఇచ్చిన లెటర్‌ను సామాజిక అనుసంధాన వేదికల్లో రెజ్యూమె, దరఖాస్తులతోపాటు పొందుపర్చండి.
 
 కృతజ్ఞతా పత్రం: ఇప్పుడు సందేశాలు, సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం కంప్యూటర్లలో ఈ-మెయిల్స్ ద్వారానే సాగుతోంది. కానీ, థాంక్యూ లెటర్ విషయంలో మాత్రం హైరింగ్ మేనేజర్లు పాతకాలం పద్ధతినే ఇష్టపడుతున్నారు. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత కంపెనీ యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంటుంది. 58 శాతం ఎంప్లాయర్స్ ఈ కృతజ్ఞతా పత్రాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఒక కాగితంపై థాంక్యూ లెటర్ టైప్ చేసి, కంపెనీకి పోస్టు చేయండి. ఇది నామ్‌కే వాస్తేలా కాకుండా ఆకర్షణీయంగా ఉండాలి. అప్పుడే రిక్రూటర్ల దృష్టిలో మీ విలువ పెరుగుతుంది.
 
 కెరీర్ గురువు: మీలాంటి విద్యార్హతలు, అనుభవం, నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు జాబ్ మార్కెట్‌లో లెక్కలేనంత మంది ఉంటారు. వారితో పోటీపడాలంటే మీకు ఒక గురువు, మార్గదర్శి ఉండాలి. కొంత ఖర్చయినా వెనుకాడకుండా కెరీర్ కోచ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. జాబ్ సెర్చ్ విషయంలో వీరు సహకరిస్తారు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలో మార్గనిర్దేశం చేస్తారు. అవకాశాలు ఎక్కడున్నాయో తెలియజేస్తారు. ఎలా ఒడిసిపట్టుకోవాలో నేర్పిస్తారు.
 
 జాబ్స్, అడ్మిషన్‌‌స అలర్‌‌ట్స
 నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ
 పుణేలోని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  లైబ్రరీ ట్రైనీ
 పోస్టుల సంఖ్య: 2
 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి.
 వయసు: 26 ఏళ్లకు మించకూడదు.
 ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
 దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 8
 వెబ్‌సైట్: www.niapune.com
 
 సెయిల్
 స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  ఆపరేట్ కం టెక్నీషియన్ - ట్రైనీ
 విభాగాలు: మెకానికల్, మెటలర్జీ, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్.
 అర్హతలు: సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా ఉండాలి.
  అటెండెంట్ కం టెక్నీషియన్
 విభాగాలు: వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మోటార్ వెహికల్
 అర్హతలు: పదో తరగతితో పాటు ఐటీఐ ఉండాలి.
 దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 26
 వెబ్‌సైట్: www.sail.co.in

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement