విద్యార్థులు కళాశాల/విశ్వవిద్యాలయంలో చదువు పూర్తిచేసుకున్న తర్వాత కొలువు వేట ప్రారంభిస్తారు. అస్త్రశస్త్రాలతో రంగంలోకి దిగుతారు. ఇందులో ప్రధానమైంది.. రెజ్యూమె. ఉద్యోగాల గురించి తెలియగానే కంపెనీకి రెజ్యూమెను పంపించి, ఇంటర్వ్యూ పిలుపు కోసం ఎదురుచూస్తుంటారు. ఈ విషయంలో ఇప్పటికే ఉద్యోగానుభవం ఉన్నవారితో కూడా పోటీ పడాల్సి ఉంటుంది. ఎలాంటి పని అనుభవం లేని మీరు అనుభవజ్ఞులను అధిగమించి మౌఖిక పరీక్ష దాకా వెళ్లాలంటే మీ రెజ్యూమె ప్రభావవంతంగా ఉండాలి. ఫ్రెషర్స్ రెజ్యూమె తయారీపై విద్యార్థులు తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి. ఉద్యోగానికి అవసరమైన అర్హతలు, నైపుణ్యాలను ముందుగా తెలుసుకోండి. మీలో ఉన్న అర్హతలు, స్కిల్స్‌ను వాటితో అనుసంధానిస్తూ రెజ్యూమెను తయారు చేసుకోండి.
కెరీర్ ఆబ్జెక్టివ్
ఫ్రెషర్స్ రెజ్యూమెలో కెరీర్ ఆబ్జెక్టివ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. మీ బలాలను తెలియజేయాలి. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఇంటర్న్‌షిప్‌లో పాల్గొంటే ఆ విషయం తప్పనిసరిగా ప్రస్తావించాలి. మిమ్మల్ని నలుగురిలో ప్రత్యేకంగా నిలిపే లక్షణం మీలో ఉంటే దాన్ని రెజ్యూమెలో హైలైట్ చేయాలి. మీరు ఎక్కువ స్కోర్ చేసిన సబ్జెక్టులను తెలియజేయండి. మీ ప్రతిభకు గుర్తింపుగా లభించిన సర్టిఫికెట్ల గురించి వివరించండి. ఇంటర్న్‌షిప్, కాలేజీ ప్రాజెక్ట్‌లో ఏయే అంశాలను నేర్చుకున్నారు, ఎంత అనుభవం సంపాదించారో తెలపండి. మీరు అందుకున్న ఉపకార వేతనాలు, నగదు బహుమతులను కూడా ప్రస్తావించండి.
కీలకం.. తొలి అర్ధ భాగం
రెజ్యూమె మొదటి అర్ధభాగంలో కెరీర్ ఆబ్జెక్టివ్ ప్రముఖంగా కనిపించాలి. ఎందుకంటే రెజ్యూమెను చదవడం ప్రారంభించిన మొదటి 30 సెకండ్లలోనే దాని భవితవ్యాన్ని రిక్రూటర్ తేల్చేస్తారు. మిగతా భాగం చదవాలో వద్దో మొదటి భాగాన్ని బట్టే నిర్ణయిస్తారు. కెరీర్ ఆబ్జెక్టివ్ సంతృప్తికరంగా ఉంటే రెజ్యూమెను పూర్తిగా చదువుతారు. లేకపోతే పక్కన పడేస్తారు.
ప్రత్యేకమైన లక్షణాలు
నేటి కార్పొరేట్ యుగంలో విజయవంతమైన ఉద్యోగిగా పేరు తెచ్చుకోవాలంటే మీలో ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి. కంపెనీలు ఇలాంటి వాటినే కోరుకుంటున్నాయి. టీమ్ వర్క్, కమ్యూనికేషన్, ప్రజంటేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, వ్యాపారాత్మక ఆలోచనా ధోరణి, సృజనాత్మకత, టెక్నికల్, అనలిటికల్ స్కిల్స్.. వంటివి మీలో ఉంటే రెజ్యూమెలో పేర్కొనండి. మీ ఆధ్వర్యంలో కాలేజీలో ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే దాని గురించి ప్రస్తావించండి. బెస్ట్ స్పీకర్ అవార్డు అందుకొని ఉంటే మీలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయని అర్థం. విద్యార్హతలను, అకడమిక్ ఫెర్ఫార్మెన్స్‌ను ప్రారంభంలోనే తెలియజేయాలి. ఏయే సంస్థల్లో ఇంటర్న్‌షిప్, ప్రాజెక్ట్ వర్క్ పూర్తిచేశారో చెప్పాలి.
అభిరుచులు
మీరేమిటో మీ అభిరుచులను బట్టే చెప్పొచ్చు. రీడింగ్, సింగింగ్, పెయింటింగ్ వంటి హాబీలు ఉంటే.. మీలో మంచి సృజనాత్మకత దాగి ఉందని తెలుస్తుంది. ఈత, నడక వంటి వాటిని హాబీలుగా మార్చుకుంటే ఆరోగ్య పరిరక్షణపై మీలో శ్రద్ధ ఉందని అర్థం చేసుకోవచ్చు. రెజ్యూమెలో మీ హాబీలను తప్పనిసరిగా రాయండి. వీటిని బట్టి రిక్రూటర్లు మీపై ఒక అంచనాకు వస్తారు. రెజ్యూమెను రెండు పేజీలకే పరిమితం చేయండి. తక్కువ పదాలు, వాక్యాల్లో మీ గురించి ఎక్కువ సమాచారం ఇవ్వండి. ఫ్రెషర్స్ రెజ్యూమె అనేది రీడర్ ఫ్రెండ్లీగా ఉండేలా జాగ్రత్త వహించండి.
ఫ్రెషర్స్ రెజ్యూమె రూపొందించేదెలా!
Published Fri, Oct 10 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM
Advertisement
Advertisement