oral examination
-
గురువులకు దిశానిర్దేశం
సమాజానికి దిశానిర్దేశం చేసే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు ఎప్పటికప్పుడు మరింతగా నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉందంటోంది హైదరాబాద్ సహోదయ స్కూళ్ల బృందం. మారుతున్న ప్రపంచానికి తగినట్లుగా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకతను పెంపొందించాల్సిన బాధ్యత గురువులపై ఉందని స్పష్టం చేసింది. శనివారం నగరంలోని పర్యాటకభవన్‌లో సీబీఎస్ఈ పాఠశాలల సంఘం.. హైదరాబాద్ సహోదయ స్కూల్స్ కాంప్లెక్స్ (హెచ్.ఎస్.ఎస్.సి) పాఠశాలలను నడిపించే ప్రిన్సిపాళ్లకు ప్రత్యేకంగా సదస్సు జరిపింది. మీట్, టాక్, స్పీక్, లిజన్, షేర్, డిస్కస్ అంశాలతో మూడు విభాగాలుగా కార్యక్రమాలు నిర్వహించారు. సదస్సులో హెచ్ఎస్ఎస్సీ అధ్యక్షుడు, తక్షశిల పబ్లిక్‌స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్.నవీన్‌రెడ్డి; కార్యదర్శి, సిల్వర్‌ఓక్స్ స్కూల్ ప్రిన్సిపాల్ సీతామూర్తి; ట్రెజరర్, మెరిడియన్ స్కూల్ (బంజారాహిల్స్) ప్రిన్సిపాల్ ప్రతిమాసిన్హా తదితరులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ప్రిన్సిపాళ్లు జ్ఞానాన్ని సముపార్జించినప్పుడే వారు ఉపాధ్యాయులకు మార్గనిర్దేశనం చేయగలరని సీతామూర్తి పేర్కొన్నారు. -
ఫ్రెషర్స్ రెజ్యూమె రూపొందించేదెలా!
విద్యార్థులు కళాశాల/విశ్వవిద్యాలయంలో చదువు పూర్తిచేసుకున్న తర్వాత కొలువు వేట ప్రారంభిస్తారు. అస్త్రశస్త్రాలతో రంగంలోకి దిగుతారు. ఇందులో ప్రధానమైంది.. రెజ్యూమె. ఉద్యోగాల గురించి తెలియగానే కంపెనీకి రెజ్యూమెను పంపించి, ఇంటర్వ్యూ పిలుపు కోసం ఎదురుచూస్తుంటారు. ఈ విషయంలో ఇప్పటికే ఉద్యోగానుభవం ఉన్నవారితో కూడా పోటీ పడాల్సి ఉంటుంది. ఎలాంటి పని అనుభవం లేని మీరు అనుభవజ్ఞులను అధిగమించి మౌఖిక పరీక్ష దాకా వెళ్లాలంటే మీ రెజ్యూమె ప్రభావవంతంగా ఉండాలి. ఫ్రెషర్స్ రెజ్యూమె తయారీపై విద్యార్థులు తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి. ఉద్యోగానికి అవసరమైన అర్హతలు, నైపుణ్యాలను ముందుగా తెలుసుకోండి. మీలో ఉన్న అర్హతలు, స్కిల్స్‌ను వాటితో అనుసంధానిస్తూ రెజ్యూమెను తయారు చేసుకోండి. కెరీర్ ఆబ్జెక్టివ్ ఫ్రెషర్స్ రెజ్యూమెలో కెరీర్ ఆబ్జెక్టివ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. మీ బలాలను తెలియజేయాలి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఇంటర్న్‌షిప్‌లో పాల్గొంటే ఆ విషయం తప్పనిసరిగా ప్రస్తావించాలి. మిమ్మల్ని నలుగురిలో ప్రత్యేకంగా నిలిపే లక్షణం మీలో ఉంటే దాన్ని రెజ్యూమెలో హైలైట్ చేయాలి. మీరు ఎక్కువ స్కోర్ చేసిన సబ్జెక్టులను తెలియజేయండి. మీ ప్రతిభకు గుర్తింపుగా లభించిన సర్టిఫికెట్ల గురించి వివరించండి. ఇంటర్న్‌షిప్, కాలేజీ ప్రాజెక్ట్‌లో ఏయే అంశాలను నేర్చుకున్నారు, ఎంత అనుభవం సంపాదించారో తెలపండి. మీరు అందుకున్న ఉపకార వేతనాలు, నగదు బహుమతులను కూడా ప్రస్తావించండి. కీలకం.. తొలి అర్ధ భాగం రెజ్యూమె మొదటి అర్ధభాగంలో కెరీర్ ఆబ్జెక్టివ్ ప్రముఖంగా కనిపించాలి. ఎందుకంటే రెజ్యూమెను చదవడం ప్రారంభించిన మొదటి 30 సెకండ్లలోనే దాని భవితవ్యాన్ని రిక్రూటర్ తేల్చేస్తారు. మిగతా భాగం చదవాలో వద్దో మొదటి భాగాన్ని బట్టే నిర్ణయిస్తారు. కెరీర్ ఆబ్జెక్టివ్ సంతృప్తికరంగా ఉంటే రెజ్యూమెను పూర్తిగా చదువుతారు. లేకపోతే పక్కన పడేస్తారు. ప్రత్యేకమైన లక్షణాలు నేటి కార్పొరేట్ యుగంలో విజయవంతమైన ఉద్యోగిగా పేరు తెచ్చుకోవాలంటే మీలో ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి. కంపెనీలు ఇలాంటి వాటినే కోరుకుంటున్నాయి. టీమ్ వర్క్, కమ్యూనికేషన్, ప్రజంటేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, వ్యాపారాత్మక ఆలోచనా ధోరణి, సృజనాత్మకత, టెక్నికల్, అనలిటికల్ స్కిల్స్.. వంటివి మీలో ఉంటే రెజ్యూమెలో పేర్కొనండి. మీ ఆధ్వర్యంలో కాలేజీలో ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే దాని గురించి ప్రస్తావించండి. బెస్ట్ స్పీకర్ అవార్డు అందుకొని ఉంటే మీలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయని అర్థం. విద్యార్హతలను, అకడమిక్ ఫెర్ఫార్మెన్స్‌ను ప్రారంభంలోనే తెలియజేయాలి. ఏయే సంస్థల్లో ఇంటర్న్‌షిప్, ప్రాజెక్ట్ వర్క్ పూర్తిచేశారో చెప్పాలి. అభిరుచులు మీరేమిటో మీ అభిరుచులను బట్టే చెప్పొచ్చు. రీడింగ్, సింగింగ్, పెయింటింగ్ వంటి హాబీలు ఉంటే.. మీలో మంచి సృజనాత్మకత దాగి ఉందని తెలుస్తుంది. ఈత, నడక వంటి వాటిని హాబీలుగా మార్చుకుంటే ఆరోగ్య పరిరక్షణపై మీలో శ్రద్ధ ఉందని అర్థం చేసుకోవచ్చు. రెజ్యూమెలో మీ హాబీలను తప్పనిసరిగా రాయండి. వీటిని బట్టి రిక్రూటర్లు మీపై ఒక అంచనాకు వస్తారు. రెజ్యూమెను రెండు పేజీలకే పరిమితం చేయండి. తక్కువ పదాలు, వాక్యాల్లో మీ గురించి ఎక్కువ సమాచారం ఇవ్వండి. ఫ్రెషర్స్ రెజ్యూమె అనేది రీడర్ ఫ్రెండ్లీగా ఉండేలా జాగ్రత్త వహించండి. -
జాబ్ ఇంటర్వ్యూలో నెగ్గే ‘విలువలు’
ఉద్యోగంలో ఉన్నతంగా రాణించాలంటే తగిన అర్హతలు, నైపుణ్యాలు, పరిజ్ఞానం, అనుభవం ఉండగానే సరిపోదు.. అభ్యర్థిలో తగిన విలువలు తప్పనిసరిగా ఉండాలి. నీతి నిజాయతీ, క్రమశిక్షణ, మంచి ప్రవర్తన, నడవడిక చాలా అవసరం. మనుషుల్లో రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. వ్యక్తిత్వంలో లోపాలు ఉంటే మనిషి దెబ్బతింటాడు. ఉద్యోగుల్లో లోపాలు ఉంటే సంస్థ నష్టపోతుంది. కంపెనీ విజయవంతం కావాలంటే నిపుణులైన సిబ్బంది మాత్రమే కాదు, వారిలో నైతిక విలువలూ ఉండాల్సిందే. అందుకే యాజమాన్యాలు తమ సిబ్బందిలో విలువలు కచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాయి. మౌఖిక పరీక్షలో వీటిని కూడా పరిశీలిస్తున్నాయి. రిక్రూటర్లు, హైరింగ్ మేనేజర్లు విలువల ఆధారిత(వాల్యూ బేస్డ్) ఇంటర్వ్యూలపై మొగ్గుచూపుతున్నారు. భిన్న కోణాల్లో ప్రశ్నలు సంధిస్తూ అభ్యర్థుల మనస్తత్వాలను చదువుతున్నారు. వారు తమ సంస్థ సంస్కృతిలో పూర్తిలో ఒదిగిపోవాలని(కల్చరల్ ఫిట్) 100 శాతం ఆశిస్తున్నారు. స్వార్థం.. నిస్వార్థం ఉత్తమమైన అభ్యర్థులను ఎంపిక చేసుకొనే విషయంలో రిక్రూటర్లు ప్రస్తుతం మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అవి.. బాధ్యతలను నిర్వర్తించడానికి అవసరమైన నైపుణ్యాలు, అభ్యర్థులు పాటించే విలువలు, వారిలోని ప్రధాన బలాలు. కల్చరల్ ఫిట్‌కు అమిత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉద్యోగుల్లో ఉండకూడని లక్షణం.. స్వార్థం. అందరూ కలిసి ఒక జట్టుగా పనిచేస్తేనే లక్ష్యం నెరవేరుతుంది. ఎవరికి వారే అన్నట్లుగా ఉంటే.. సంస్థ ప్రగతి మందగిస్తుంది. రిక్రూటర్లు అభ్యర్థుల నుంచి నిస్వార్థాన్ని కోరుకుంటున్నారు. ఒక బృందాన్ని ఉత్తేజపరిచి, ముందుండి నడిపించే సామర్థ్యం వారిలో ఉండాలని ఆశిస్తున్నారు. ఇందుకోసం.. మీకు టీమ్‌ను అప్పగిస్తే ఎలా పని చేయిస్తారు? అందులో మీరు ఎలాంటి పాత్ర పోషిస్తారు? బృందం సాధించిన విజయాన్ని ఎవరికి ఆపాదిస్తారు? ఒకవేళ విఫలమైతే దానికి మీరు బాధ్యత వహిస్తారా? లేక ఇతరులపైకి తోసేస్తారా?.. ఈ తరహా అంశాలను ఇంటర్వ్యూలో పరిశీలిస్తున్నారు. నీతి నిజాయతీని పరీక్షించే ప్రశ్నలేస్తున్నారు. ప్రలోభాలకు లొంగని గుణం ఉందా? లేదా? అని తెలుసుకుంటున్నారు. సంస్థ రహస్యాలను కాపాడతారా? లేక సొంత ప్రయోజనాల కోసం బహిర్గతం చేస్తారా? అనేది గుర్తించడానికి లోతుగా ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిత్వం ముఖ్యం విలువల ఆధారిత ఇంటర్వ్యూలో నెగ్గాలంటే అభ్యర్థుల సమాధానాలు నిజాయతీగా ఉండాలి. డొంక తిరుగుడు లేకుండా సూటిగా బదులివ్వాలి. ఉన్నవి లేనివి కల్పించి చెబితే రిక్రూటర్‌కు సులువుగా దొరికిపోతారు. మీ నిజాయతీని ఇతరులు శంకించే పరిస్థితి తెచ్చుకోవద్దు. కొన్ని సందర్భాల్లో స్కిల్స్ లేకపోయినా మంచి వ్యక్తిత్వం ఉంటే ఉద్యోగావకాశాలు దక్కుతాయి. మంచి ప్రవర్తన ఉన్న అభ్యర్థులు దొరికితే చాలు.. నైపుణ్యాలను తర్వాత కూడా నేర్పించుకోవచ్చు అని కంపెనీలు భావిస్తున్నాయి. సంస్థ పట్ల పూర్తి అంకితభావంతో, నిబద్ధతతో పనిచేస్తాననే నమ్మకం రిక్రూటర్లలో కలిగించగలిగితే అభ్యర్థికి కొలువు ఖాయమైనట్లే. -
విద్యార్థులకు కొలువు కిటుకులు!
నేటి విద్యార్థులే రేపటి ఉద్యోగార్థులు. చదువు పూర్తయిన తర్వాత దృష్టి సారించాల్సిందే.. కొలువుపైనే. నచ్చిన జాబ్ దక్కించుకోవాలంటే.. దరఖాస్తు ప్రక్రియ, మౌఖిక పరీక్షలపై ముందుగానే అవగాహన పెంచుకోవాలి. మన దేశంలో గత కొంతకాలంగా నియామక ప్రక్రియలో చాలా మార్పులొచ్చాయి. టెక్నాలజీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు కొలువుల కోసం పోటీ విపరీతంగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో జాబ్ మార్కెట్లో అభ్యర్థులు విజేతగా నిలవాలంటే కొలువు కిటుకులు కొన్ని తెలుసుకోవాల్సిందే! ఆన్లైన్ ప్రొఫైల్: ఉద్యోగానికి దరఖాస్తు చేసేముందు గూగుల్‌లో రంగ ప్రవేశం చేయండి. ప్రస్తుతం 48 శాతం మంది ఎంప్లాయర్స్ తమకు కావాల్సిన అభ్యర్థుల కోసం ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. సమీప భవిష్యత్తులో ఈ సంఖ్య రెట్టింపయినా ఆశ్చర్యం లేదు. కాబట్టి అంతర్జాలంలో మీకంటూ ఒక స్థానాన్ని సృష్టించుకోండి. మీ రెజ్యూమె, ప్రొఫైల్, ఫొటోగ్రాఫ్‌ను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో రిక్రూటర్లు, హైరింగ్ మేనేజర్లకు అందుబాటులో ఉంచండి. వీడియో బయోడేటాను కూడా ఈ సైట్లలో చేర్చండి. ఈ ప్రొఫైల్, ఫొటోలు, వీడియో బయోడేటా అత్యుత్తమ నాణ్యతతో ఉండాలి. క్వాలిటీ తగ్గితే మీ అవకాశాలూ తగ్గిపోతాయి. రిక్రూటర్లు అభ్యర్థుల కోసం నేరుగా లింక్డ్‌ఇన్‌లోకి అడుగుపెడుతున్నారు. మీ అర్హతలు, నైపుణ్యాలను తెలియజేసే పర్సనల్ బ్రాండింగ్ ఫోర్ట్‌పోలియోను ఈ సైట్లో తప్పనిసరిగా పొందుపర్చండి. ఇతరుల కంటే మీరు మెరుగైన అభ్యర్థి అని దీనిద్వారా తెలియజేయండి. మౌఖిక పరీక్ష: దరఖాస్తు దశలో జరిగే వడపోతలో నెగ్గితే ఇంటర్వ్యూకు పిలుపు వస్తుంది. ఇందులో ప్రతిభ చూపితే కొలువు ఖాయమవుతుంది. జాబ్‌లో ప్రవేశానికి ఇది గేట్పాస్ లాంటిది. అభ్యర్థులు ఇంటర్వ్యూ స్కిల్స్ పెంచుకోవాలి. సరైన వస్త్రధారణ, బాడీ లాంగ్వేజ్, సమయస్ఫూర్తితో కూడిన సమాధానాలతో రిక్రూటర్‌ను మెప్పించొచ్చు. సిఫార్సులు: మీరు మీ రెజ్యూమెలో, ఆన్లైన్ ప్రొఫైల్‌లో పేర్కొన్న అంశాలకు బలం చేకూరాలంటే రికమండేషన్లు అవసరం. మీ గురించి తెలిసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్, ప్రొఫెసర్, విద్యావేత్త లేక ఎవరైనా ప్రముఖులతో రికమండేషన్ చేయించుకోండి. అంటే.. మీ పేరును సూచిస్తూ వారు ఇచ్చిన లెటర్‌ను సామాజిక అనుసంధాన వేదికల్లో రెజ్యూమె, దరఖాస్తులతోపాటు పొందుపర్చండి. కృతజ్ఞతా పత్రం: ఇప్పుడు సందేశాలు, సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం కంప్యూటర్లలో ఈ-మెయిల్స్ ద్వారానే సాగుతోంది. కానీ, థాంక్యూ లెటర్ విషయంలో మాత్రం హైరింగ్ మేనేజర్లు పాతకాలం పద్ధతినే ఇష్టపడుతున్నారు. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత కంపెనీ యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంటుంది. 58 శాతం ఎంప్లాయర్స్ ఈ కృతజ్ఞతా పత్రాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఒక కాగితంపై థాంక్యూ లెటర్ టైప్ చేసి, కంపెనీకి పోస్టు చేయండి. ఇది నామ్‌కే వాస్తేలా కాకుండా ఆకర్షణీయంగా ఉండాలి. అప్పుడే రిక్రూటర్ల దృష్టిలో మీ విలువ పెరుగుతుంది. కెరీర్ గురువు: మీలాంటి విద్యార్హతలు, అనుభవం, నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు జాబ్ మార్కెట్లో లెక్కలేనంత మంది ఉంటారు. వారితో పోటీపడాలంటే మీకు ఒక గురువు, మార్గదర్శి ఉండాలి. కొంత ఖర్చయినా వెనుకాడకుండా కెరీర్ కోచ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. జాబ్ సెర్చ్ విషయంలో వీరు సహకరిస్తారు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలో మార్గనిర్దేశం చేస్తారు. అవకాశాలు ఎక్కడున్నాయో తెలియజేస్తారు. ఎలా ఒడిసిపట్టుకోవాలో నేర్పిస్తారు. జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ పుణేలోని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. లైబ్రరీ ట్రైనీ పోస్టుల సంఖ్య: 2 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి. వయసు: 26 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 8 వెబ్సైట్: www.niapune.com సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆపరేట్ కం టెక్నీషియన్ - ట్రైనీ విభాగాలు: మెకానికల్, మెటలర్జీ, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్. అర్హతలు: సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా ఉండాలి. అటెండెంట్ కం టెక్నీషియన్ విభాగాలు: వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మోటార్ వెహికల్ అర్హతలు: పదో తరగతితో పాటు ఐటీఐ ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 26 వెబ్సైట్: www.sail.co.in -
గిరాకీ ఉన్న ఉద్యోగ నైపుణ్యాలు
జాబ్ మార్కెట్లో ఎలాంటి నైపుణ్యాలకు ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకుంటే.. అభ్యర్థులు ఆయా స్కిల్స్‌ను పెంచుకునేందుకు వీలుంటుంది. తమలో ఉన్న నైపుణ్యాలకు ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయో కూడా తెలుస్తుంది. భవిష్యత్తులో మంచి ఉద్యోగావకాశాలను దక్కించుకోవాలంటే పట్టు సాధించాల్సిన స్కిల్స్‌పై అవగాహన వస్తుంది. కొలువుకు దరఖాస్తు చేసేటప్పుడు అభ్యర్థులు రెజ్యూమెలో తమ విద్యార్హతలు, నైపుణ్యాలను ప్రస్తావించాలి. మౌఖిక పరీక్షలోనూ ఈ స్కిల్స్‌పై ప్రశ్నలు సంధిస్తారు. విశ్లేషణ్మాతక ఆలోచనా విధానం, ఇతరులు చెప్పేది ఓపిగ్గా వినే లక్షణం.. ఇవి కూడా అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే నైపుణ్యాలే. రిక్రూటర్లు ఇలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రస్తుతం గిరాకీ ఉన్న 10 జాబ్ స్కిల్స్ గురించి తెలుసుకుందాం. క్రిటికల్ థింకింగ్: ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పరిస్థితిని విశ్లేషించి, ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించడానికి అభ్యర్థుల్లో లాజికల్, రీజనింగ్ స్కిల్స్ ఉండాలి. ప్రత్యామ్నాయంలోని లాభ నష్టాలను వివరించే సామర్థ్యం కూడా అవసరం. ప్రాబ్లమ్ సాల్వింగ్: సమస్యలను సరిగ్గా గుర్తించి, వాటి ప్రభావాన్ని అంచనా వేసి, గడువులోగా పరిష్కరించేందుకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. సమస్యలు సాంకేతికమైనా, సాధారణమైనా.. అవి మళ్లీ తలెత్తకుండా శాశ్వత పరిష్కార మార్గం చూపాలి. డెసిషన్ మేకింగ్: సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగల నేర్పు ఉన్న వ్యక్తులు వృత్తి, ఉద్యోగాల్లో అత్యున్నతంగా రాణిస్తారు. అందుకే రిక్రూటర్లు ఈ నైపుణ్యం గల అభ్యర్థులకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు. యాక్టివ్ లిజనింగ్: ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినడం మంచి లక్షణం. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. ఉద్యోగులకు ఈ స్కిల్ తప్పనిసరిగా ఉండాలని కంపెనీలు ఆశిస్తున్నాయి. కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్: ఇప్పుడు అన్ని పనులు కంప్యూటర్లలోనే జరుగుతున్నాయి. కాబట్టి అభ్యర్థులకు కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్‌పై పరిజ్ఞానం తప్పనిసరి. కంప్యూటర్ అప్లికేషన్లపై పట్టు పెంచుకోవాలి. మ్యాథమెటిక్స్: గణితంలో అర్థమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, కాలిక్యులస్, స్టాటిస్టిక్స్, వాటి అప్లై వంటివాటిపై స్కిల్స్ పెంచుకోవాలి. ఉత్పత్తి పెంపు: వ్యవస్థ ఎలా పనిచేయాలో స్వయంగా నిర్దేశించగలగాలి. ఉత్పత్తిని పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించాలి. మానిటరింగ్: అభ్యర్థులు తమ పనితీరును ఎప్పటికప్పుడు స్వయంగా అంచనా వేసుకోవాలి. అవసరాలకు తగ్గట్లు పనితీరును మెరుగుపర్చుకొనే లక్షణం చాలా ముఖ్యం. ప్రోగ్రామింగ్: వివిధ అవసరాలకు సొంతంగా కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను రాసే నైపుణ్యం ఉండాలి. సేల్స్ అండ్ మార్కెటింగ్: నేటి మార్కెటింగ్ యుగంలో ఉత్పత్తులను, సేవలను వినియోగదారులకు పరిచయం చేసే నైపుణ్యానికి కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. ప్రభావవంతమైన మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించి, అమ్మకాలను, లాభాలను పెంచే అభ్యర్థుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. కాబట్టి జాబ్ మార్కెట్లో ముందంజలో నిలవాలంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్ కచ్చితంగా ఉండాలి. జాబ్స్ అలర్ట్స: ఫీల్డ్ సూపర్వైజర్స్ రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. కాంట్రాక్ట్ పద్ధతిలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఫీల్డ్ సూపర్వైజర్స్పోస్టుల సంఖ్య: 50 అర్హతలు: ఎలక్ట్రానిక్స్/టెలి కమ్యూనికేషన్/కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం తప్పనిసరి. నిర్దేశిత వయోపరిమితి ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.. దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తిచేసి, పోస్టు ద్వారా పంపాలి. చివరి తేది: అక్టోబర్ 14 వెబ్సైట్: www.railtelindia.com ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్స్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ)... కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హెడ్ కానిస్టేబుల్(టెలి కమ్యూనికేషన్) పోస్టులు: 229 వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత. ఎంపిక: పరుగు పందెం, ఫిజికల్ టెస్టులు, రాత పరీక్ష, మెడికల్ టెస్టుల ద్వారా... దరఖాస్తు: ఆఫ్‌లైన్ విధానం ద్వారా.. చివరి తేది: అక్టోబర్ 24 వెబ్సైట్: http://itbpolice.nic.in/ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన బాబ్కార్డ్స్ లిమిటెడ్ (బీఓబీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఆఫీసర్: 70 అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య.. ఎంపిక: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: అక్టోబరు 9 ఆన్లైన్ టెస్టు తేది: డిసెంబరు 10 వెబ్సైట్: http://ibpsregistration.nic.in -
ఇంటర్వ్యూలో గెలుపునకు.. సన్నద్ధత, ఆత్మవిశ్వాసం!
జాబ్ ఇంటర్వ్యూ అనగానే అభ్యర్థుల్లో ఏదో తెలియని బెరుకు మొదలవుతుంది. అదో భయపెట్టే భూతంలాగా భావిస్తుంటారు. కానీ, ముందుగా సన్నద్ధమై, ఆత్మవిశ్వాసం పెంచుకుంటే మౌఖిక పరీక్షను ఎదుర్కోవడం సులభమే. ఇంటర్వ్యూలో ఉభయపక్షాల భాగస్వామ్యం ఉంటుంది. ఈ పరీక్ష మీకే కాదు కంపెనీకీ కూడా అవసరమే. మీకు ఉద్యోగం కావాలి, సంస్థకు మంచి ఉద్యోగి కావాలి. కాబట్టి మీరు భయపడడం అన వసరం. ముందస్తు సన్నద్ధత, ఆత్మవిశ్వాసం.. ఈ రెండింటితో ఎలాంటి ఇంటర్వ్యూలోనైనా జయకేతనం ఎగరేయొచ్చు. కామన్ ప్రశ్నలు: ఇంటర్వ్యూలో అడగబోయే అన్ని ప్రశ్నలను ఎవరూ ఊహించలేరు. కానీ, సాధారణంగా అన్ని మౌఖిక పరీక్షల్లో అడిగే కొన్ని కామన్ ప్రశ్నలు ఉంటాయి. వాటికి సరైన సమాధా నాలను సిద్ధం చేసుకుంటే యుద్ధంలో సగం గెలుపు ఖాయమైనట్లే. తెలిసిన విషయాలను ఇంటర్వ్యూ లో పూర్తిఆత్మవిశ్వాసంతో చెబితే సానుకూలమైన ఫలితం కచ్చితంగా ఉంటుంది. కరిక్యులమ్ విటే (సీవీ)లో రాసిన అన్ని అంశాలపై మీకు పట్టు ఉండాలి. సీవీని ఎక్కువసార్లు చదువుకోవాలి. అందులో ప్రస్తావించిన అంశాలపై ఇంటర్వ్యూలో ప్రశ్నలను సంధిస్తారు. విద్యాభ్యాసం, పాత యాజ మాన్యం గురించి అడుగుతారు. సీవీకి సంబంధించి ఎలాంటి ప్రశ్న అడిగినా బదులిచ్చేలా ఉండాలి. కనీసం నటించండి: మీలో ఆత్మవిశ్వాసం తగుపాళ్లలో లేకపోవచ్చు. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు ఇంటర్వ్యూలో నటించండి. మీ శరీరభాష దానికి తగ్గట్లుగా ఉండాలి. దీనివల్ల రిక్రూటర్పై సానుకూల ప్రభావం కలిగించొచ్చు. వంగిపోయినట్లుగా కాకుండా కుర్చీలో నిటారుగా కూర్చోండి. రిక్రూటర్ కళ్లలోకి నేరుగా చూస్తూ ధైర్యంగా మాట్లాడండి. ‘ఈ ఇంటర్వ్యూలో విఫలమైతే నాకు నష్టమేం లేదు’ అనే మైండ్‌సెట్‌ను అలవర్చుకుంటే ఒత్తిడి తగ్గిపోతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కంటినిండా నిద్ర: ఉదయాన్నే శరీరం, మనసు తాజాగా ఉండాలంటే రాత్రి కంటినిండా నిద్రపోవాలి. ఇంటర్వ్యూ కోసం ఆఖరి క్షణంలో ప్రిపరేషన్ ప్రారంభిస్తే కంగారు తప్పదు. విశ్రాంతి కూడా దొరకదు. కాబట్టి ముందుగానే అన్ని ఏర్పాట్లను పూర్తిచేసుకొని ఇంటర్వ్యూ ముందురోజు రాత్రి హాయిగా నిద్రించండి. ఆలస్యంగా భోజనం చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇంటర్వ్యూలో ధరించాల్సిన దుస్తులు, బూట్లను ముందురోజే సిద్ధం చేసి పెట్టుకోవాలి. మహిళలైతే తమ గోళ్ల రంగు(నెయిల్ పెయింట్)ను, ఎబ్బెట్టుగా ఉండే అలంకరణను తొలగించుకోవాలి. సమయానికి చేరుకొనేలా: కారణాలు ఏవైనా కానివ్వండి.. మౌఖిక పరీక్షకు ఆలస్యంగా హాజరుకావడం ఎంతమాత్రం సరికాదు. ఇంటి నుంచి ఇంటర్వ్యూ కార్యాలయం వరకు ప్రయాణించడం ప్రయాసతో కూడుకున్నదే. దూర ప్రయాణమైతే అలసిపోతారు. ఇంటి నుంచి కార్యాలయం ఎంత దూరంలో ఉంది? అక్కడికి చేరడానికి ఎంత సమయం పడుతుంది? ఎప్పుడు బయల్దేరాలి? వంటి విషయాలను ముందుగానే తెలుసుకోవాలి. వీలైతే ఒకసారి అక్కడికి వెళ్లిరావడం మంచిది. దాని ప్రకారం ప్రణాళికను తయారు చేసుకోవచ్చు. ఆఖరి నిమిషంలో హడావుడిగా పరుగులు పెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఉదయం వేళ మేలు:ఇంటర్వ్యూ కార్యాలయానికి చేరుకున్న తర్వాత మీ వంతు కోసం నిరీక్షించాల్సి ఉంటుంది. అప్పుడు ఒక గ్లాస్ నీరు తాగండి. బిగ్గరగా ఊపిరి పీల్చుకోండి. విశ్రాంతి స్థితిలోకి రండి. గొంతులో గరగర లేకుండా చూసుకోండి. ఇంటర్వ్యూలో చెప్పబోయే సమాధానాలను మనసులో ఒకసారి మననం చేసుకోండి. మీ గురించి మీరు మనసులో చెప్పుకోండి. దీనివల్ల ఒత్తిడి మాయమవుతుంది. ఇంటర్వ్యూ ఏ సమయంలో నిర్వహించాలనేది కంపెనీ నిర్ణయమే. ఒక్కోసారి ఈ అవకాశం అభ్యర్థికే ఇస్తుంటారు. అలాంటప్పుడు ఉదయం వేళనే ఎంచుకోండి. ఎందుకంటే అప్పుడు వాతావరణం నిర్మలంగా ఉంటుంది. శరీరం, మనసు రిలాక్స్డ్గా ఉంటాయి. ఆ సమయంలో విజయావకాశాలు అధికం. ఒకవేళ మధ్యాహ్నం లేదా సాయంత్రమైతే అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి. -
ఊహించని ప్రశ్నలు.. ప్రవర్తనా ఆధారిత ఇంటర్వ్యూ!
కంపెనీ విజయం.. అందులో పనిచేసే సిబ్బందిపైనే ఆధారపడి ఉంటుంది. సంస్థకు వీరు పునాదిరాయిలాంటివారు. పునాది బలంగా ఉంటే భవనం ఎక్కువకాలం నిలిచి ఉంటుంది. సిబ్బంది సమర్థులైతే సంస్థ లాభాల బాటలో సాగుతుంది. కాబట్టి వర్క్‌ఫోర్స్‌ను ఎంపిక చేసుకొనే విషయంలో యాజమాన్యాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. రకరకాల పరీక్షలను, ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంటాయి. వడపోతల అనంతరం అర్హులుగా తేలినవారినే సంస్థలో చేర్చుకుంటాయి. అభ్యర్థులను పరీక్షించేందుకు ఇంటర్వ్యూలను జరుపుతారు. వారి గుణగణాలను, మాటతీరును, శరీర భాషను, ప్రవర్తనను ఇందులో అంచనా వేస్తుంటారు. మౌఖిక పరీక్షలో సాధారణంగా అడిగే ప్రశ్నలు తెలుసు కాబట్టి అభ్యర్థులు తదనుగుణంగా ముందుగానే సమాధానాలతో సిద్ధమైపోతుంటారు. అసలు ఏమాత్రం ఊహించలేని ప్రశ్నలు అడిగితే అభ్యర్థులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరం. ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడే వారి నిజమైన వ్యక్తిత్వం బయటపడుతుంది. వారిలోంచి అసలు మనిషి వెలుపలికి వస్తాడు. దీంతో వారు తగిన అభ్యర్థులా? కాదా? అనే విషయం తెలుసుకోవచ్చు. ఇలా తెలుసుకొనేందుకు వీలైన విధానమే.. బిహేవియరల్ స్టైల్ ఇంటర్వ్యూ. ఇలాంటి ఇంటర్వ్యూల పట్ల ఇటీవలి కాలంలో రిక్రూటర్లు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఊహించలేని ప్రశ్నలు వేసి, అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కనుక ఈ తరహా మౌఖిక పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో తెలుసుకుంటే విజయం సులభసాధ్యం అవుతుంది. సమయస్ఫూర్తి.. ప్రధానం బిహేవియరల్ బేస్డ్ ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడే మనసులో సమాధానాలను సిద్ధం చేసుకొని చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఐదేళ్ల తర్వాత ఎక్కడ, ఎలా ఉండాలనుకుంటున్నారు? అని అడుగుతారు. దీనికి సమాధానం చాలామంది దగ్గర ఉండదు. కనుక ఈ ఇంటర్వ్యూల క్లిష్టత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మీరు ఇటీవలి కాలంలో సాధించిన విజయాలు, పొందిన పరాజయాలను వివరించండి అని అడిగే అవకాశం ఉంటుంది. ప్రవర్తన ఆధారిత మౌఖిక పరీక్షల్లో సమయస్ఫూర్తి చాలా ముఖ్యం. కష్టమే అయినా అసాధ్యం కాదు వీటిలో అడిగే ప్రశ్నలను ఊహించడం కష్టమే అయినా అసాధ్యం మాత్రం కాదని నిపుణులు అంటున్నారు. ప్రధానంగా సమస్య పరిష్కార నైపుణ్యాలు, సొంతంగా నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం వంటి కోర్ కాంపిటెన్సీలపైప్రశ్నలుంటాయి. అవి మీలో ఉన్నాయో లేదో అంచనా వేస్తారు. ఇంకా మీ రంగానికి సంబంధించినవి కూడా అడుగుతారు. మీ రంగంపై పూర్తి పరిజ్ఞానం పెంచుకుంటే ఎలాంటి ప్రశ్న వేసినా సమాధానం చెప్పడం కష్టమేమీ కాదు. ఇంటర్వ్యూ అంటే అర్థం కాని మిస్టరీగా భావించొద్దు. ఏయే ఉద్యోగాల భర్తీ కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారో తెలుసుకోవాలి. ఉదాహరణకు టీమ్ ప్లేయర్ పో స్టుకు ఇంటర్వ్యూ నిర్వహిస్తే దానికి సంబంధిం చిన ప్రశ్నను సంధిస్తారు. కాబట్టి సదరు ఉద్యోగానికి సంబంధించిన సమాచారం సేకరించి పెట్టుకోవాలి. కంపెనీతోపాటు దానికి పోటీగా నిలిచిన కం పెనీల గురించి కూడా పరిశోధించాలి. సేకరించిన వివరాలను బట్టి ఇంటర్వ్యూకు ప్రిపేర్ కావాలి. వివరణాత్మక సమాధానాలు ప్రవర్తన ఆధారిత మౌఖిక పరీక్షలో అభ్యర్థులు సమాధానాలను వివరణాత్మకంగా చెప్పాల్సి ఉంటుంది. మీరు చెప్పే ప్రతి అంశానికి ఆధారం ఉండాలి. ఇందులో ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ అనే ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు రిక్రూటర్‌కు లభించాలి. అభ్యర్థిని సరిగ్గా అంచనా వేసేందుకు, అతడు భవిష్యత్తులో విజయాలు సాధించగలడా? లేదా? అనే విషయాన్ని గుర్తించేందుకు రిక్రూటర్లు బిహేవియరల్ స్టైల్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. వీటికి ప్రాముఖ్యత నానాటికీ పెరుగుతోంది. -
ఉద్యోగ సాధనకు.. వినే లక్షణం!
ఇష్టమైన ఉద్యోగంలో చేరాలంటే.. అంతకంటే ముందు ఇంటర్వ్యూలో ప్రతిభ చూపాలి. రిక్రూటర్‌ను మెప్పించే సమాధానాలివ్వాలి. సబ్జెక్టు పరిజ్ఞానం ఉన్నప్పటికీ మౌఖిక పరీక్షలో పొరపాట్లు చేస్తే కొలువు దూరమవుతుంది. ఇంటర్వ్యూలో అభ్యర్థుల వ్యక్తిత్వం, ప్రవర్తన, మాటతీరును పరిశీలిస్తారు. ఇందుకోసం ప్రశ్నలను సంధిస్తారు. వాటిని సరిగ్గా అర్థం చేసుకొని సరైన సమాధానాలు చెప్పాలి. ప్రశ్నను అర్థం చేసుకోవాలంటే అభ్యర్థికి దాన్ని పూర్తిగా వినే లక్షణం ఉండాలి. కొందరు ప్రశ్న పూర్తి కాకుండానే మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. దీనివల్ల తమ చురుకుదనం ఇంటర్వ్యూ బోర్డుకు తెలుస్తుందని భావిస్తుంటారు. కానీ, ఇది నిజం కాదు. ప్రశ్న ఏమిటో తెలియకుండానే తోచిన సమాధానం ఇచ్చేయడం మంచి లక్షణం కాదు. జాబ్ ఇంటర్య్యూలో నెగ్గాలంటే లిజనింగ్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రశ్నను అర్థం చేసుకోవాలి రిక్రూటర్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అంతరాయం కలిగించడం సభ్యత కాదు. వారు చెప్పే విషయం పూర్తిగా వినాలి. దాన్ని క్షుణ్నంగా అర్థం చేసుకోవాలి. రిక్రూటర్ తమ నుంచి ఏం కోరుకున్నారో గ్రహించాలి. ఆ తర్వాతే ఆన్సర్ చెప్పాలి. రిక్రూటర్ చెప్పేది వినడానికి కేవలం చెవులు తెరిచి ఉంచితే సరిపోదు, బాడీ లాంగ్వేజ్ కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి. కుర్చీలో స్థిరంగా కూర్చొని కొద్దిగా ముందుకు వంగాలి. దీనివల్ల మీరు అప్రమత్తంగా ఉన్నట్లు, ఇంటర్వ్యూపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. అలాకాకుండా నిర్లక్ష్యంగా కనిపిస్తే.. విజయావకాశాలు కచ్చితంగా తగ్గుతాయి. సందేహాలను తీర్చుకోవాలి మౌఖిక పరీక్ష అంటే అభ్యర్థి గురించి రిక్రూటర్ తెలుసుకోవడం మాత్రమే కాదు, కంపెనీ, ఉద్యోగం గురించి అభ్యర్థి కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడే వేదిక. కాబట్టి అభ్యర్థులు తమ సందేహాలను రిక్రూటర్ ఎదుట ఉంచాలి. ఉద్యోగం, అందులో లాభనష్టాలు, వర్క్ కల్చర్ గురించి అడిగి తెలుసుకోవాలి. ఇంటర్వ్యూ బోర్డు చెప్పింది సరిగ్గా అర్థం కాకపోతే మరోసారి చెప్పాలని మర్యాదగా విజ్ఞప్తి చేయాలి. మీరు చెప్పే సమాధానాన్ని ఒకసారి మనసులో మననం చేసుకున్న తర్వాత వ్యక్తపర్చడం మంచిది. జాబ్ ఇంటర్వ్యూల్లో సాధారణంగా అడిగే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. వాటికి సమాధానాలను ముందే ప్రిపేర్ చేసుకోవాలి. వినడం.. విలువైన లక్షణం రిక్రూటర్ అభ్యంతరకరమైన ప్రశ్న ఏదైనా అడిగితే.. ఆ ప్రశ్న అడగడానికి గల కారణాన్ని అభ్యర్థి తెలుసుకోవచ్చు. ఈ అవకాశం ఉంటుంది. అవసరమైతే రిక్రూటర్ నుంచి అదనపు సమాచారం కోరొచ్చు. ప్రశ్నపై స్పష్టత వచ్చిన తర్వాత సమాధానం ఇచ్చేందుకు ఉపక్రమించాలి. ఇంటర్వ్యూలో ఒకరు చెప్పేది మరొకరు పూర్తిగా వింటే కమ్యూనికేషన్ సక్రమంగా జరుగుతుంది. సహనంతో వినడం అనేది విలువైన లక్షణం. ఇది మీరు కోరుకున్న ఉద్యోగం సాధించిపెట్టడంతోపాటు తర్వాత కెరీర్లో ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. -
శరీర భాష నేర్చుకున్నారా?
జాబ్ స్కిల్స్: నోరు కంటే శరీరమే ఎక్కువ మాట్లాడుతుందని మీకు తెలుసా? శరీరం మాట్లాడటమేంటని ఆశ్చర్యపోకండి, ఇది నిజమే. ముఖ్యంగా జాబ్ ఇంటర్వ్యూల్లో ఈ భాషకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. మౌఖిక పరీక్షల్లో జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వగానే సరిపోదు, బాడీ లాంగ్వేజ్ కూడా రిక్రూటర్ మెచ్చేలా ఉండాలి. అప్పుడే కొలువు దక్కే అవకాశాలు మెరుగువుతాయి. మౌఖిక పరీక్ష అనగానే ఎవరికైనా ఆందోళన, కంగారు సహజమే. దీనివల్ల శరీరంలో స్వల్పంగా వణుకు ప్రారంభమవుతుంది. కొందరికి చెమటలు పడుతుంటాయి. గొంతు తడారిపోతుంది. శరీరం కంపిస్తుంది. అభ్యర్థి తడబాటుకు లోనవుతున్నాడన్న విషయం అతడిని చూడగానే తెలిసిపోతుంది. ఇలాంటి వారిని ఉద్యోగంలో చేర్చుకోవడానికి ఎవరూ ఇష్టపడరు కదా! జాబ్ దక్కాలంటే ఘనమైన రెజ్యుమె, తెలివైన సమాధానాలతోపాటు మంచి శరీర భాష కూడా అవసరమే. కాబట్టి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టాలి. చక్కనైన బాడీ లాంగ్వేజ్, హావభావాలతో బోర్డు సభ్యులను ఆకట్టుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలంటే... సున్నితమైన కరచాలనం ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టగానే నిల్చొని, అక్కడి రిక్రూటర్‌తో కుడిచేత్తో సున్నితంగా కర చాలనం చేయాలి. ఫైళ్లు, ఇతర వస్తువులను ఎడమ చేత్తో పట్టుకోవాలి. ఫోన్, తాళాలను కుడిచేత్తో ప ట్టుకొని అలాగే షేక్‌హ్యాండ్ ఇస్తే ఎవరికైనా నచ్చు తుందా? కొందరు కరచాలనం చేసేటప్పుడు ఎదుటివారి చేతిని పట్టుకొని గట్టిగా ఊపేస్తుం టారు. చూసేవాళ్లకి ఆ చేతిని విరిచేస్తాడేమో అని పిస్తుంది. అది అభ్యర్థిపై తప్పుడు అభిప్రాయాన్ని కచ్చితంగా కలిగిస్తుంది. కనుక సున్నితంగా చేతిని ముందుకు చాచి, రిక్రూటర్‌తో నెమ్మదిగా కరచా లనం చేయాలి. చేతులు స్వేచ్ఛగా.. ఇంటర్వ్యూలో ఎక్కువ మంది ఎదుర్కొనే ఇబ్బంది.. చేతులు ఎక్కడ ఉంచాలో తెలియకపోవడం. వేళ్లను ముక్కులో, నోట్లో, చెవుల్లో పెట్టుకుంటే చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. చేతులను మడిస్తే మీరు ఆత్మరక్షణ ధోరణిలో ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి ఒడిలో పెట్టుకోవడం ఉత్తమం. అలాగే కుర్చీ పక్కలకు స్వేచ్ఛగా వదిలేయడం మంచిది. శరీరం కుంచించుకుపోయినట్లుగా కూర్చోకూడదు. దాచడానికి మీ దగ్గరేం లేదు అని చెప్పడానికి శరీరం నిటారుగా ఉండాలి. కంటిచూపుతో జాగ్రత్త ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు పక్క చూపులు చూడకుండా రిక్రూటర్ కంటిలోకి నేరుగా చూడాలి. తాము చెప్పేదానిపై మీరు ఆసక్తి చూపుతున్నారని, శ్రద్ధగా వింటున్నారని రిక్రూటర్ భావిస్తారు. దీనివల్ల ఒకరి నుంచి ఒకరికి సానుకూల శక్తి ప్రసారమవుతుంది. అలాకాకుండా పైకి, కిందికి, పక్కలకు చూస్తే మీలో ఆత్మవిశ్వాసం లేదని నిర్ణయానికొచ్చే ప్రమాదం ఉంది. ఐ కాంటాక్ట్‌ను మెయింటైన్ చేయాలంటే.. రిక్రూటర్ కంటి రంగును పరిశీలిస్తూ ఉండండి. అరుపులొద్దు.. మాటలు చాలు కొందరు మాట్లాడుతుంటే బిగ్గరగా అరిచినట్లే ఉంటుంది. ఆందోళన, కంగారులో ఉన్నవారే ఇలా మాట్లాడుతుంటారు. ఇంటర్వ్యూలో స్వరస్థాయి సాధారణంగా ఉండేలా జాగ్రత్తపడండి. ఒకవేళ గొంతు తడారిపోతే మంచినీరు తాగండి. మీరు చెప్పేది రిక్రూటర్‌కు స్పష్టంగా వినిపించాలి. ఆకట్టుకొనే వస్త్రధారణ మీరు ఇంటర్వ్యూకు హాజరవుతున్న కంపెనీ, అక్కడి ఉద్యోగాన్ని బట్టి వస్త్రధారణ ఉండాలి. స్పోర్ట్స్ ఆర్గనైజేషన్లు, కార్పొరేట్ కంపెనీలు, ఆసుపత్రులు.. ఇలా వేర్వేరు రంగాలకు వేర్వేరు వస్త్రధారణ ఉంటుంది. కొన్ని సంస్థల్లో డ్రెస్ కోడ్‌ను అమలు చేస్తుంటారు. దానిగురించి ముందుగానే తెలుసుకోవాలి. మీ డ్రెస్సెన్స ప్రొఫెషనల్‌గా, ఇంటర్వ్యూ బోర్డును ఆకట్టుకొనేలా ఉండాలి. గాఢమైన రంగులున్న దుస్తులు, బరువైన ఆభరణాలు ధరించొద్దు. -
‘మౌఖికం’లో మెరవండిలా...
ఉద్యోగ సాధనలో అత్యంత కీలకమైన అంతిమ దశ మౌఖిక పరీక్ష(ఇంటర్వ్యూ) ను ఎదుర్కోవడం... ఇందులో విజయం సాధిస్తే కొలువు దక్కించుకున్నట్లే. అభ్యర్థిలోని టెక్నికల్, నాన్-టెక్నికల్ సామర్థ్యాలపై ఈ పరీక్షలో సాధారణంగా 15 నుంచి 30 నిమిషాల్లో ఒక అంచనాకు వస్తారు. కాబట్టి అభ్యర్థి అతి తక్కువ సమయంలో ఇంటర్వ్యూ బోర్డును మెప్పించాల్సి ఉంటుంది. ఉద్యోగుల ఎంపికలో భాగంగా రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలుస్తారు. ఇంటర్వ్యూ అంటే.. వ్యక్తులు పరస్పరం భావాలను పంచుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. అభ్యర్థి-సంస్థ ప్రతినిధి మధ్య జరిగే పరస్పర భావ ప్రసారాల సమాహారమే ఇంటర్వ్యూ అని చెప్పుకోవచ్చు. మౌఖిక పరీక్ష అనేది అటు సంస్థకు, ఇటు అభ్యర్థికీ ఎంతో ముఖ్యం. ఎందుకంటే సదరు అభ్యర్థి కంపెనీ భవిష్యత్ అవసరాలకు ఏ మేరకు ఉపయోగపడతాడు అనే కోణంలో సంస్థ ఆలోచిస్తుంది. అలాగే అభ్యర్థి కూడా తన ఉద్యోగార్హతలను బట్టి సదరు సంస్థలో చేరడంపై ఇంటర్వ్యూ ద్వారానే ఒక నిర్ణయానికి వస్తాడు. కాబట్టి ఇంటర్వ్యూ సంస్థతోపాటు అభ్యర్థికి కూడా ప్రధానమే. ఒక వ్యక్తిని ఉద్యోగంలో చేర్చుకునే ముందు రెండు లక్షణాలను ఇంటర్వ్యూలో పరీక్షిస్తారు. అవి.. టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్. ఇంటర్వ్యూ ఉద్దేశం ఇంటర్వ్యూ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. అభ్యర్థి నుంచి కావాల్సిన సమాచారం రాబట్టడంతోపాటు సంస్థ గురించి అతడికి తెలియజేయడం. అభ్యర్థిలో సంబంధిత రంగంపై ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మౌఖిక పరీక్షల్లో తెలుసుకుంటారు. అదేసమయంలో మానవ వనరుల(హెచ్ఆర్) నిపుణులు అభ్యర్థిలోని సాఫ్ట్‌స్కిల్స్‌ను పరీక్షిస్తారు. ఇంటర్వ్యూల్లో పలు రకాలున్నాయి 1. ఇండివిడ్యువల్/వన్ టు వన్ ఇంటర్వ్యూ, 2. గ్రూప్ ఇంటర్వ్యూ 3. ప్యానెల్ ఇంటర్వ్యూ, 4. టెలిఫోన్ ఇంటర్వ్యూ, 5. వీడియో కాన్ఫరెన్సింగ్, 6. ఆడిషన్స్. ఇంటర్వ్యూ విధానం ఏదైనప్పటికీ అందులో విజయం సాధించాలంటే అభ్యర్థులు కొన్ని మర్యాదలను తప్పనిసరిగా పాటించాలి. మౌఖిక పరీక్షల్లో ఇలాంటి మర్యాదలను కచ్చితంగా పరీక్షిస్తారు. అభ్యర్థిలో సరైన నడవడిక, ప్రవర్తన, మాటతీరు ఉన్నాయా? లేదా? అని చూస్తారు. మెరుగైన టెక్నికల్ స్కిల్స్ ఉన్నప్పటికీ ఇవి లేకపోతే ఇంటర్వ్యూలో నెగ్గడం కష్టమే. ఆకట్టుకొనే పలకరింపు ఇంటర్వ్యూ కోసం వెళ్లేముందు ఫ్రంట్ ఆఫీస్/రిసెప్షన్లో నిరీక్షించాల్సి ఉంటుంది. కంపెనీల సీసీ కెమెరాలు అభ్యర్థుల్ని గమ నిస్తుంటాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. వెళ్లే ముందు ఫోన్ స్విచ్చాఫ్ చేయాలి. బోర్డు సభ్యులను సమయానుకూలంగా పలకరించాలి. ఉదయమైతే గుడ్ మార్నింగ్, మధ్యాహ్నమైతే గుడ్ ఆఫ్టర్నూన్ అని పలకరించాలి. బోర్డులో మహిళ ఉంటే ‘మేడమ్’ అని, పురుషులు ఉంటే ‘సర్’ అని మర్యాదగా పిలవాలి. చక్కటి చిరునవ్వుతో కూడిన పలకరింపు అభ్యర్థిలోని నడవడికను, మర్యాదను స్పష్టంగా తెలియజేస్తుంది. నేరుగా అవతలి వ్యక్తుల కళ్లలోకి చూస్తూ మాట్లాడాలి. ఆత్మవిశ్వాసం లోపించిన వ్యక్తులు ఇలా నేరుగా కళ్లలోకి చూసి మాట్లాడలేరు. ఎలాంటి సణుగుడు లేకుండా గొంతులోంచి మాట స్వేచ్ఛగా రావాలి. మాట తడబడకూడదు. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేయాలి. డొంకతిరుగుడు మాటలు, సాగతీత వద్దు. శరీర భాష నోరే కాదు, శరీరం కూడా పరోక్షంగా మాట్లాడుతుంది. అభ్యర్థుల మానసిక స్థితిని ఇంటర్వ్యూ బోర్డుకు తెలియజేస్తుంది. మానవ వనరుల నిపుణులు అభ్యర్థుల శరీర భాష(బాడీ లాంగ్వేజ్)ను నిశితంగా పరిశీలిస్తారు. గదిలోకి ప్రవేశించి, బోర్డు సభ్యులను పలకరించిన తర్వాత అక్కడున్న కుర్చీని విసురుగా లాక్కొని కూర్చోవద్దు. ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు మిమ్మల్ని కూర్చోమనే వరకు కూర్చోవద్దు. వారు అనుమతి ఇచ్చిన తర్వాత చిరునవ్వుతో కృతజ్ఞతలు(థ్యాంక్స్ మేడమ్/సర్) చెప్పాలి. చాలా సహజంగా కుర్చీలో కూర్చోవాలి. ఒకవేళ బోర్డు సభ్యులు కరచాలనం కోసం చేయి చాస్తే మీరు కూడా మర్యాదగా వారితో కరచాలనం చేయాలి. ఇంటర్వ్యూ జరుగుతున్నంత సేపు చేతులూపడం, కాళ్లు ఆడించడం, పెన్సిల్/పెన్ను వేళ్ల మధ్య తిప్పడం, ఇష్టానుసారంగా తల ఊపడం, కనుబొమ్మలు ఎగరేయడం, ముక్కులో, నోటిలో వేళ్లు పెట్టుకోవడం, సైగలు చేయడం వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇలాంటి చేష్టల వల్ల అభ్యర్థిలో మానసిక సమతౌల్యం లేదనే విషయం తెలిసిపోతుంది. అతి విశ్వాసం ఉన్న వ్యక్తుల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖంలో ప్రతిఫలించే భావాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. అభ్యర్థి మనసులోని కోపం, అసహనం వంటివి ముఖంలో కనిపించకూడదు. డ్రెస్ కోడ్ రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలనే సామెతను గుర్తుంచుకోవాలి. వేసుకున్న బట్టలు అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. సందర్భాన్ని బట్టి డ్రెస్‌కోడ్ ఉండాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు చక్కటి ఫార్మల్ దుస్తులు ధరించి ప్రొఫెషనల్‌గా కనిపించాలి. తెల్లని/క్రీమ్ కలర్ చొక్కా, నావీ బ్లూ/ముదురు రంగు ప్యాంట్ ధరించాలి. అవి శుభ్రంగా ఉతికి, ఇిస్త్రీ చేసి ఉండాలి. అలాగే శరీరానికి సెంట్ కొట్టకపోవడమే మంచిది. ఘాటైన వాసనలు ఎదుటివారికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. సమయ పాలన అభ్యర్థుల సమయ పాలనను కూడా బోర్డు సభ్యులు పరీక్షిస్తారు. ఇంటర్వ్యూ సమయానికి 10 నిమిషాలముందే అక్కడికి చేరుకోవాలి. అక్కడికి వెళ్లడానికి పట్టే సమయం, దూరాన్ని ముందుగానే అంచనా వేసుకోవాలి. ఇంటర్వ్యూకు తగిన సమయానికి చేరుకొనేలా ఇంటి నుంచి బయల్దేరాలి. ఆలస్యంగా వెళితే అభ్యర్థిపై ఒత్తిడి పెరిగిపోతుంది. తద్వారా ఇంటర్వ్యూలో తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సమయ పాలన తప్పనిసరిగా పాటించాలి. ఇంటర్వ్యూ గదిలో అభ్యర్థిలో ప్రొఫెషనలిజమ్ ప్రతిఫలించాలి. ఉద్యోగంపై ఉన్న ఆసక్తిని సమయానుకూలంగా బయటపెట్టాలి. ఆత్మవిశ్వాసంతో ఉండాలి అభ్యర్థిలో సబ్జెక్టు పరిజ్ఞానంతోపాటు భావ వ్యక్తీకరణ సామర్థ్యం ఉంటే అతడు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తాడు. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఎంతో నమ్మకంగా జవాబులు చెబుతాడు. అది లేని అభ్యర్థి వితండవాదం చేయడం లేదా ఇంటర్వ్యూ బోర్డును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడం వంటివి చేస్తుంటాడు. ఆత్మవిశ్వాసం లేని అభ్యర్థులు ఇంటర్వ్యూ బోర్డుకు సులువుగా దొరికిపోతారు. వారి వ్యక్తిత్వంలోని లోపాలు తెలిసిపోతాయి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఉండాలి. సమాధానం తెలియకపోతే ‘తెలియదు’ అని నిజాయతీగా ఒప్పుకోవాలి. సమాధానం.. వెంటనే చెప్పొద్దు బోర్డు సభ్యులు ఏదైనా ప్రశ్న అడిగితే.. మీకు సమాధానం తెలిసినప్పటికీ వెంటనే చెప్పకూడదు. అలా చెబితే.. చాలా సులువైన ప్రశ్న అడిగామనే భావన సభ్యుల్లో కలుగుతుంది. బాగా కష్టమైన ప్రశ్నలు అడగాలనే పట్టుదల వారిలో పెరుగుతుంది. అంతేకాకుండా అభ్య ర్థికి నింపాదిగా వినే, మాట్లాడే అలవాటు లేదనే విషయం తెలుస్తుంది. అందుకే ప్రశ్న అడగిన తర్వాత ఒకటి రెండు క్షణాలు ఆగి బోర్డు సభ్యులందరి వైపు చూస్తూ సమాధానం చెప్పాలి. నేరుగా వారి కళ్లలోకి చూస్తుండాలి. మీరు చెప్పే సమాధానాన్ని వారు ఆసక్తిగా వింటారు. దీనివల్ల మీపై వారికి ఒక సదభిప్రాయం ఏర్పడుతుంది. అంతిమంగా ఇంటర్వ్యూలో మీ విజయావకాశాలు మెరుగవుతాయి.