జాబ్ ఇంటర్వ్యూలో నెగ్గే ‘విలువలు’
ఉద్యోగంలో ఉన్నతంగా రాణించాలంటే తగిన అర్హతలు, నైపుణ్యాలు, పరిజ్ఞానం, అనుభవం ఉండగానే సరిపోదు.. అభ్యర్థిలో తగిన విలువలు తప్పనిసరిగా ఉండాలి. నీతి నిజాయతీ, క్రమశిక్షణ, మంచి ప్రవర్తన, నడవడిక చాలా అవసరం. మనుషుల్లో రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. వ్యక్తిత్వంలో లోపాలు ఉంటే మనిషి దెబ్బతింటాడు. ఉద్యోగుల్లో లోపాలు ఉంటే సంస్థ నష్టపోతుంది. కంపెనీ విజయవంతం కావాలంటే నిపుణులైన సిబ్బంది మాత్రమే కాదు, వారిలో నైతిక విలువలూ ఉండాల్సిందే. అందుకే యాజమాన్యాలు తమ సిబ్బందిలో విలువలు కచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాయి. మౌఖిక పరీక్షలో వీటిని కూడా పరిశీలిస్తున్నాయి. రిక్రూటర్లు, హైరింగ్ మేనేజర్లు విలువల ఆధారిత(వాల్యూ బేస్డ్) ఇంటర్వ్యూలపై మొగ్గుచూపుతున్నారు. భిన్న కోణాల్లో ప్రశ్నలు సంధిస్తూ అభ్యర్థుల మనస్తత్వాలను చదువుతున్నారు. వారు తమ సంస్థ సంస్కృతిలో పూర్తిలో ఒదిగిపోవాలని(కల్చరల్ ఫిట్) 100 శాతం ఆశిస్తున్నారు.
స్వార్థం.. నిస్వార్థం
ఉత్తమమైన అభ్యర్థులను ఎంపిక చేసుకొనే విషయంలో రిక్రూటర్లు ప్రస్తుతం మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అవి.. బాధ్యతలను నిర్వర్తించడానికి అవసరమైన నైపుణ్యాలు, అభ్యర్థులు పాటించే విలువలు, వారిలోని ప్రధాన బలాలు. కల్చరల్ ఫిట్‌కు అమిత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉద్యోగుల్లో ఉండకూడని లక్షణం.. స్వార్థం. అందరూ కలిసి ఒక జట్టుగా పనిచేస్తేనే లక్ష్యం నెరవేరుతుంది. ఎవరికి వారే అన్నట్లుగా ఉంటే.. సంస్థ ప్రగతి మందగిస్తుంది.
రిక్రూటర్లు అభ్యర్థుల నుంచి నిస్వార్థాన్ని కోరుకుంటున్నారు. ఒక బృందాన్ని ఉత్తేజపరిచి, ముందుండి నడిపించే సామర్థ్యం వారిలో ఉండాలని ఆశిస్తున్నారు. ఇందుకోసం.. మీకు టీమ్‌ను అప్పగిస్తే ఎలా పని చేయిస్తారు? అందులో మీరు ఎలాంటి పాత్ర పోషిస్తారు? బృందం సాధించిన విజయాన్ని ఎవరికి ఆపాదిస్తారు? ఒకవేళ విఫలమైతే దానికి మీరు బాధ్యత వహిస్తారా? లేక ఇతరులపైకి తోసేస్తారా?.. ఈ తరహా అంశాలను ఇంటర్వ్యూలో పరిశీలిస్తున్నారు. నీతి నిజాయతీని పరీక్షించే ప్రశ్నలేస్తున్నారు. ప్రలోభాలకు లొంగని గుణం ఉందా? లేదా? అని తెలుసుకుంటున్నారు. సంస్థ రహస్యాలను కాపాడతారా? లేక సొంత ప్రయోజనాల కోసం బహిర్గతం చేస్తారా? అనేది గుర్తించడానికి లోతుగా ప్రశ్నిస్తున్నారు.
వ్యక్తిత్వం ముఖ్యం
విలువల ఆధారిత ఇంటర్వ్యూలో నెగ్గాలంటే అభ్యర్థుల సమాధానాలు నిజాయతీగా ఉండాలి. డొంక తిరుగుడు లేకుండా సూటిగా బదులివ్వాలి. ఉన్నవి లేనివి కల్పించి చెబితే రిక్రూటర్‌కు సులువుగా దొరికిపోతారు. మీ నిజాయతీని ఇతరులు శంకించే పరిస్థితి తెచ్చుకోవద్దు. కొన్ని సందర్భాల్లో స్కిల్స్ లేకపోయినా మంచి వ్యక్తిత్వం ఉంటే ఉద్యోగావకాశాలు దక్కుతాయి. మంచి ప్రవర్తన ఉన్న అభ్యర్థులు దొరికితే చాలు.. నైపుణ్యాలను తర్వాత కూడా నేర్పించుకోవచ్చు అని కంపెనీలు భావిస్తున్నాయి. సంస్థ పట్ల పూర్తి అంకితభావంతో, నిబద్ధతతో పనిచేస్తాననే నమ్మకం రిక్రూటర్లలో కలిగించగలిగితే అభ్యర్థికి కొలువు ఖాయమైనట్లే.