ఉద్యోగ సాధనకు.. వినే లక్షణం!
ఇష్టమైన ఉద్యోగంలో చేరాలంటే.. అంతకంటే ముందు ఇంటర్వ్యూలో ప్రతిభ చూపాలి. రిక్రూటర్‌ను మెప్పించే సమాధానాలివ్వాలి. సబ్జెక్టు పరిజ్ఞానం ఉన్నప్పటికీ మౌఖిక పరీక్షలో పొరపాట్లు చేస్తే కొలువు దూరమవుతుంది. ఇంటర్వ్యూలో అభ్యర్థుల వ్యక్తిత్వం, ప్రవర్తన, మాటతీరును పరిశీలిస్తారు. ఇందుకోసం ప్రశ్నలను సంధిస్తారు. వాటిని సరిగ్గా అర్థం చేసుకొని సరైన సమాధానాలు చెప్పాలి. ప్రశ్నను అర్థం చేసుకోవాలంటే అభ్యర్థికి దాన్ని పూర్తిగా వినే లక్షణం ఉండాలి. కొందరు ప్రశ్న పూర్తి కాకుండానే మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. దీనివల్ల తమ చురుకుదనం ఇంటర్వ్యూ బోర్డుకు తెలుస్తుందని భావిస్తుంటారు. కానీ, ఇది నిజం కాదు. ప్రశ్న ఏమిటో తెలియకుండానే తోచిన సమాధానం ఇచ్చేయడం మంచి లక్షణం కాదు. జాబ్ ఇంటర్య్యూలో నెగ్గాలంటే లిజనింగ్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రశ్నను అర్థం చేసుకోవాలి
రిక్రూటర్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అంతరాయం కలిగించడం సభ్యత కాదు. వారు చెప్పే విషయం పూర్తిగా వినాలి. దాన్ని క్షుణ్నంగా అర్థం చేసుకోవాలి. రిక్రూటర్ తమ నుంచి ఏం కోరుకున్నారో గ్రహించాలి. ఆ తర్వాతే ఆన్సర్ చెప్పాలి. రిక్రూటర్ చెప్పేది వినడానికి కేవలం చెవులు తెరిచి ఉంచితే సరిపోదు, బాడీ లాంగ్వేజ్ కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి. కుర్చీలో స్థిరంగా కూర్చొని కొద్దిగా ముందుకు వంగాలి. దీనివల్ల మీరు అప్రమత్తంగా ఉన్నట్లు, ఇంటర్వ్యూపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. అలాకాకుండా నిర్లక్ష్యంగా కనిపిస్తే.. విజయావకాశాలు కచ్చితంగా తగ్గుతాయి.
సందేహాలను తీర్చుకోవాలి
మౌఖిక పరీక్ష అంటే అభ్యర్థి గురించి రిక్రూటర్ తెలుసుకోవడం మాత్రమే కాదు, కంపెనీ, ఉద్యోగం గురించి అభ్యర్థి కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడే వేదిక. కాబట్టి అభ్యర్థులు తమ సందేహాలను రిక్రూటర్ ఎదుట ఉంచాలి. ఉద్యోగం, అందులో లాభనష్టాలు, వర్క్ కల్చర్ గురించి అడిగి తెలుసుకోవాలి. ఇంటర్వ్యూ బోర్డు చెప్పింది సరిగ్గా అర్థం కాకపోతే మరోసారి చెప్పాలని మర్యాదగా విజ్ఞప్తి చేయాలి. మీరు చెప్పే సమాధానాన్ని ఒకసారి మనసులో మననం చేసుకున్న తర్వాత వ్యక్తపర్చడం మంచిది. జాబ్ ఇంటర్వ్యూల్లో సాధారణంగా అడిగే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. వాటికి సమాధానాలను ముందే ప్రిపేర్ చేసుకోవాలి.
వినడం.. విలువైన లక్షణం
రిక్రూటర్ అభ్యంతరకరమైన ప్రశ్న ఏదైనా అడిగితే.. ఆ ప్రశ్న అడగడానికి గల కారణాన్ని అభ్యర్థి తెలుసుకోవచ్చు. ఈ అవకాశం ఉంటుంది. అవసరమైతే రిక్రూటర్ నుంచి అదనపు సమాచారం కోరొచ్చు. ప్రశ్నపై స్పష్టత వచ్చిన తర్వాత సమాధానం ఇచ్చేందుకు ఉపక్రమించాలి. ఇంటర్వ్యూలో ఒకరు చెప్పేది మరొకరు పూర్తిగా వింటే కమ్యూనికేషన్ సక్రమంగా జరుగుతుంది. సహనంతో వినడం అనేది విలువైన లక్షణం. ఇది మీరు కోరుకున్న ఉద్యోగం సాధించిపెట్టడంతోపాటు తర్వాత కెరీర్‌లో ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది.