శరీర భాష నేర్చుకున్నారా?
జాబ్ స్కిల్స్: నోరు కంటే శరీరమే ఎక్కువ మాట్లాడుతుందని మీకు తెలుసా? శరీరం మాట్లాడటమేంటని ఆశ్చర్యపోకండి, ఇది నిజమే. ముఖ్యంగా జాబ్ ఇంటర్వ్యూల్లో ఈ భాషకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. మౌఖిక పరీక్షల్లో జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వగానే సరిపోదు, బాడీ లాంగ్వేజ్ కూడా రిక్రూటర్ మెచ్చేలా ఉండాలి. అప్పుడే కొలువు దక్కే అవకాశాలు మెరుగువుతాయి. మౌఖిక పరీక్ష అనగానే ఎవరికైనా ఆందోళన, కంగారు సహజమే. దీనివల్ల శరీరంలో స్వల్పంగా వణుకు ప్రారంభమవుతుంది. కొందరికి చెమటలు పడుతుంటాయి. గొంతు తడారిపోతుంది.
శరీరం కంపిస్తుంది. అభ్యర్థి తడబాటుకు లోనవుతున్నాడన్న విషయం అతడిని చూడగానే తెలిసిపోతుంది. ఇలాంటి వారిని ఉద్యోగంలో చేర్చుకోవడానికి ఎవరూ ఇష్టపడరు కదా! జాబ్ దక్కాలంటే ఘనమైన రెజ్యుమె, తెలివైన సమాధానాలతోపాటు మంచి శరీర భాష కూడా అవసరమే. కాబట్టి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టాలి. చక్కనైన బాడీ లాంగ్వేజ్, హావభావాలతో బోర్డు సభ్యులను ఆకట్టుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలంటే...
సున్నితమైన కరచాలనం
ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టగానే నిల్చొని, అక్కడి రిక్రూటర్‌తో కుడిచేత్తో సున్నితంగా కర చాలనం చేయాలి. ఫైళ్లు, ఇతర వస్తువులను ఎడమ చేత్తో పట్టుకోవాలి. ఫోన్, తాళాలను కుడిచేత్తో ప ట్టుకొని అలాగే షేక్‌హ్యాండ్ ఇస్తే ఎవరికైనా నచ్చు తుందా? కొందరు కరచాలనం చేసేటప్పుడు ఎదుటివారి చేతిని పట్టుకొని గట్టిగా ఊపేస్తుం టారు. చూసేవాళ్లకి ఆ చేతిని విరిచేస్తాడేమో అని పిస్తుంది. అది అభ్యర్థిపై తప్పుడు అభిప్రాయాన్ని కచ్చితంగా కలిగిస్తుంది. కనుక సున్నితంగా చేతిని ముందుకు చాచి, రిక్రూటర్‌తో నెమ్మదిగా కరచా లనం చేయాలి.
చేతులు స్వేచ్ఛగా..
ఇంటర్వ్యూలో ఎక్కువ మంది ఎదుర్కొనే ఇబ్బంది.. చేతులు ఎక్కడ ఉంచాలో తెలియకపోవడం. వేళ్లను ముక్కులో, నోట్లో, చెవుల్లో పెట్టుకుంటే చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. చేతులను మడిస్తే మీరు ఆత్మరక్షణ ధోరణిలో ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి ఒడిలో పెట్టుకోవడం ఉత్తమం. అలాగే కుర్చీ పక్కలకు స్వేచ్ఛగా వదిలేయడం మంచిది. శరీరం కుంచించుకుపోయినట్లుగా కూర్చోకూడదు. దాచడానికి మీ దగ్గరేం లేదు అని చెప్పడానికి శరీరం నిటారుగా ఉండాలి.
కంటిచూపుతో జాగ్రత్త
ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు పక్క చూపులు చూడకుండా రిక్రూటర్ కంటిలోకి నేరుగా చూడాలి. తాము చెప్పేదానిపై మీరు ఆసక్తి చూపుతున్నారని, శ్రద్ధగా వింటున్నారని రిక్రూటర్ భావిస్తారు. దీనివల్ల ఒకరి నుంచి ఒకరికి సానుకూల శక్తి ప్రసారమవుతుంది. అలాకాకుండా పైకి, కిందికి, పక్కలకు చూస్తే మీలో ఆత్మవిశ్వాసం లేదని నిర్ణయానికొచ్చే ప్రమాదం ఉంది. ఐ కాంటాక్ట్‌ను మెయింటైన్ చేయాలంటే.. రిక్రూటర్ కంటి రంగును పరిశీలిస్తూ ఉండండి.
అరుపులొద్దు.. మాటలు చాలు
కొందరు మాట్లాడుతుంటే బిగ్గరగా అరిచినట్లే ఉంటుంది. ఆందోళన, కంగారులో ఉన్నవారే ఇలా మాట్లాడుతుంటారు. ఇంటర్వ్యూలో స్వరస్థాయి సాధారణంగా ఉండేలా జాగ్రత్తపడండి. ఒకవేళ గొంతు తడారిపోతే మంచినీరు తాగండి. మీరు చెప్పేది రిక్రూటర్‌కు స్పష్టంగా వినిపించాలి.
ఆకట్టుకొనే వస్త్రధారణ
మీరు ఇంటర్వ్యూకు హాజరవుతున్న కంపెనీ, అక్కడి ఉద్యోగాన్ని బట్టి వస్త్రధారణ ఉండాలి. స్పోర్ట్స్ ఆర్గనైజేషన్లు, కార్పొరేట్ కంపెనీలు, ఆసుపత్రులు.. ఇలా వేర్వేరు రంగాలకు వేర్వేరు వస్త్రధారణ ఉంటుంది. కొన్ని సంస్థల్లో డ్రెస్ కోడ్‌ను అమలు చేస్తుంటారు. దానిగురించి ముందుగానే తెలుసుకోవాలి. మీ డ్రెస్‌సెన్‌స ప్రొఫెషనల్‌గా, ఇంటర్వ్యూ బోర్డును ఆకట్టుకొనేలా ఉండాలి. గాఢమైన రంగులున్న దుస్తులు, బరువైన ఆభరణాలు ధరించొద్దు.