‘మౌఖికం’లో మెరవండిలా... | The final step is the most important job interview practice | Sakshi
Sakshi News home page

‘మౌఖికం’లో మెరవండిలా...

Published Sun, Mar 2 2014 11:10 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

‘మౌఖికం’లో మెరవండిలా... - Sakshi

‘మౌఖికం’లో మెరవండిలా...

ఉద్యోగ సాధనలో అత్యంత కీలకమైన అంతిమ దశ మౌఖిక పరీక్ష(ఇంటర్వ్యూ) ను ఎదుర్కోవడం... ఇందులో విజయం సాధిస్తే కొలువు దక్కించుకున్నట్లే. అభ్యర్థిలోని టెక్నికల్, నాన్-టెక్నికల్ సామర్థ్యాలపై ఈ పరీక్షలో సాధారణంగా 15 నుంచి 30 నిమిషాల్లో ఒక అంచనాకు వస్తారు. కాబట్టి అభ్యర్థి అతి తక్కువ సమయంలో ఇంటర్వ్యూ బోర్డును మెప్పించాల్సి ఉంటుంది.
 
ఉద్యోగుల ఎంపికలో భాగంగా రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలుస్తారు. ఇంటర్వ్యూ అంటే.. వ్యక్తులు పరస్పరం భావాలను పంచుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. అభ్యర్థి-సంస్థ ప్రతినిధి మధ్య జరిగే పరస్పర భావ ప్రసారాల సమాహారమే ఇంటర్వ్యూ అని చెప్పుకోవచ్చు. మౌఖిక పరీక్ష అనేది అటు సంస్థకు, ఇటు అభ్యర్థికీ ఎంతో ముఖ్యం. ఎందుకంటే సదరు అభ్యర్థి కంపెనీ భవిష్యత్ అవసరాలకు ఏ మేరకు ఉపయోగపడతాడు అనే కోణంలో సంస్థ  ఆలోచిస్తుంది. అలాగే అభ్యర్థి కూడా తన ఉద్యోగార్హతలను బట్టి సదరు సంస్థలో చేరడంపై ఇంటర్వ్యూ ద్వారానే ఒక నిర్ణయానికి వస్తాడు. కాబట్టి ఇంటర్వ్యూ సంస్థతోపాటు అభ్యర్థికి కూడా ప్రధానమే. ఒక వ్యక్తిని ఉద్యోగంలో చేర్చుకునే ముందు రెండు లక్షణాలను ఇంటర్వ్యూలో పరీక్షిస్తారు. అవి.. టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్.
 
ఇంటర్వ్యూ ఉద్దేశం

ఇంటర్వ్యూ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. అభ్యర్థి నుంచి కావాల్సిన సమాచారం రాబట్టడంతోపాటు సంస్థ గురించి అతడికి తెలియజేయడం. అభ్యర్థిలో సంబంధిత రంగంపై ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మౌఖిక పరీక్షల్లో తెలుసుకుంటారు. అదేసమయంలో మానవ వనరుల(హెచ్‌ఆర్) నిపుణులు అభ్యర్థిలోని సాఫ్ట్‌స్కిల్స్‌ను పరీక్షిస్తారు.
 
 ఇంటర్వ్యూల్లో పలు రకాలున్నాయి

 1.    ఇండివిడ్యువల్/వన్ టు వన్ ఇంటర్వ్యూ, 2. గ్రూప్ ఇంటర్వ్యూ
 3.    ప్యానెల్ ఇంటర్వ్యూ,    4. టెలిఫోన్ ఇంటర్వ్యూ,
 5.    వీడియో కాన్ఫరెన్సింగ్, 6. ఆడిషన్స్.

ఇంటర్వ్యూ విధానం ఏదైనప్పటికీ అందులో విజయం సాధించాలంటే అభ్యర్థులు కొన్ని మర్యాదలను తప్పనిసరిగా పాటించాలి. మౌఖిక పరీక్షల్లో ఇలాంటి మర్యాదలను కచ్చితంగా పరీక్షిస్తారు. అభ్యర్థిలో సరైన నడవడిక, ప్రవర్తన, మాటతీరు ఉన్నాయా? లేదా? అని చూస్తారు. మెరుగైన టెక్నికల్ స్కిల్స్ ఉన్నప్పటికీ ఇవి లేకపోతే ఇంటర్వ్యూలో నెగ్గడం కష్టమే.
 
ఆకట్టుకొనే పలకరింపు

ఇంటర్వ్యూ కోసం వెళ్లేముందు ఫ్రంట్ ఆఫీస్/రిసెప్షన్‌లో నిరీక్షించాల్సి ఉంటుంది. కంపెనీల సీసీ కెమెరాలు అభ్యర్థుల్ని గమ నిస్తుంటాయి. కాబట్టి  తస్మాత్ జాగ్రత్త. వెళ్లే ముందు ఫోన్ స్విచ్చాఫ్ చేయాలి. బోర్డు సభ్యులను సమయానుకూలంగా పలకరించాలి. ఉదయమైతే గుడ్ మార్నింగ్, మధ్యాహ్నమైతే గుడ్ ఆఫ్టర్‌నూన్ అని పలకరించాలి. బోర్డులో మహిళ ఉంటే ‘మేడమ్’ అని, పురుషులు ఉంటే ‘సర్’ అని మర్యాదగా పిలవాలి. చక్కటి చిరునవ్వుతో కూడిన పలకరింపు అభ్యర్థిలోని నడవడికను, మర్యాదను స్పష్టంగా తెలియజేస్తుంది. నేరుగా అవతలి వ్యక్తుల కళ్లలోకి చూస్తూ మాట్లాడాలి. ఆత్మవిశ్వాసం లోపించిన వ్యక్తులు ఇలా నేరుగా కళ్లలోకి చూసి మాట్లాడలేరు. ఎలాంటి సణుగుడు లేకుండా గొంతులోంచి మాట స్వేచ్ఛగా రావాలి. మాట తడబడకూడదు. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేయాలి. డొంకతిరుగుడు మాటలు, సాగతీత వద్దు.
 
శరీర భాష

నోరే కాదు, శరీరం కూడా పరోక్షంగా మాట్లాడుతుంది. అభ్యర్థుల మానసిక స్థితిని ఇంటర్వ్యూ బోర్డుకు తెలియజేస్తుంది. మానవ వనరుల నిపుణులు అభ్యర్థుల శరీర భాష(బాడీ లాంగ్వేజ్)ను నిశితంగా పరిశీలిస్తారు. గదిలోకి ప్రవేశించి, బోర్డు సభ్యులను పలకరించిన తర్వాత అక్కడున్న కుర్చీని విసురుగా లాక్కొని కూర్చోవద్దు. ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు మిమ్మల్ని కూర్చోమనే వరకు కూర్చోవద్దు. వారు అనుమతి ఇచ్చిన తర్వాత చిరునవ్వుతో కృతజ్ఞతలు(థ్యాంక్స్ మేడమ్/సర్) చెప్పాలి. చాలా సహజంగా కుర్చీలో కూర్చోవాలి. ఒకవేళ బోర్డు సభ్యులు కరచాలనం కోసం చేయి చాస్తే మీరు కూడా మర్యాదగా వారితో కరచాలనం చేయాలి.

ఇంటర్వ్యూ జరుగుతున్నంత సేపు చేతులూపడం, కాళ్లు ఆడించడం, పెన్సిల్/పెన్ను వేళ్ల మధ్య తిప్పడం, ఇష్టానుసారంగా తల ఊపడం, కనుబొమ్మలు ఎగరేయడం, ముక్కులో, నోటిలో వేళ్లు పెట్టుకోవడం, సైగలు చేయడం వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇలాంటి చేష్టల వల్ల అభ్యర్థిలో మానసిక సమతౌల్యం లేదనే విషయం తెలిసిపోతుంది. అతి విశ్వాసం ఉన్న వ్యక్తుల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖంలో ప్రతిఫలించే భావాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. అభ్యర్థి మనసులోని కోపం, అసహనం వంటివి ముఖంలో కనిపించకూడదు.
 
డ్రెస్ కోడ్

రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలనే సామెతను గుర్తుంచుకోవాలి. వేసుకున్న బట్టలు అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. సందర్భాన్ని బట్టి డ్రెస్‌కోడ్ ఉండాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు చక్కటి ఫార్మల్ దుస్తులు ధరించి ప్రొఫెషనల్‌గా కనిపించాలి. తెల్లని/క్రీమ్ కలర్ చొక్కా, నావీ బ్లూ/ముదురు రంగు ప్యాంట్ ధరించాలి. అవి శుభ్రంగా ఉతికి, ఇిస్త్రీ చేసి ఉండాలి. అలాగే శరీరానికి సెంట్ కొట్టకపోవడమే మంచిది. ఘాటైన వాసనలు ఎదుటివారికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది.
 
సమయ పాలన

అభ్యర్థుల సమయ పాలనను కూడా బోర్డు సభ్యులు పరీక్షిస్తారు. ఇంటర్వ్యూ సమయానికి 10 నిమిషాలముందే అక్కడికి చేరుకోవాలి. అక్కడికి వెళ్లడానికి పట్టే సమయం, దూరాన్ని ముందుగానే అంచనా వేసుకోవాలి. ఇంటర్వ్యూకు తగిన సమయానికి చేరుకొనేలా ఇంటి నుంచి బయల్దేరాలి. ఆలస్యంగా వెళితే అభ్యర్థిపై ఒత్తిడి పెరిగిపోతుంది. తద్వారా ఇంటర్వ్యూలో తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సమయ పాలన తప్పనిసరిగా పాటించాలి. ఇంటర్వ్యూ గదిలో అభ్యర్థిలో ప్రొఫెషనలిజమ్ ప్రతిఫలించాలి. ఉద్యోగంపై ఉన్న ఆసక్తిని సమయానుకూలంగా బయటపెట్టాలి.  
 
ఆత్మవిశ్వాసంతో ఉండాలి

అభ్యర్థిలో సబ్జెక్టు పరిజ్ఞానంతోపాటు భావ వ్యక్తీకరణ సామర్థ్యం ఉంటే అతడు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తాడు. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఎంతో నమ్మకంగా జవాబులు చెబుతాడు. అది లేని అభ్యర్థి వితండవాదం చేయడం లేదా ఇంటర్వ్యూ బోర్డును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడం వంటివి చేస్తుంటాడు. ఆత్మవిశ్వాసం లేని అభ్యర్థులు ఇంటర్వ్యూ బోర్డుకు సులువుగా దొరికిపోతారు. వారి వ్యక్తిత్వంలోని లోపాలు తెలిసిపోతాయి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఉండాలి. సమాధానం తెలియకపోతే ‘తెలియదు’ అని నిజాయతీగా ఒప్పుకోవాలి.
 
 సమాధానం.. వెంటనే చెప్పొద్దు

బోర్డు సభ్యులు ఏదైనా ప్రశ్న అడిగితే.. మీకు సమాధానం తెలిసినప్పటికీ వెంటనే చెప్పకూడదు. అలా చెబితే.. చాలా సులువైన ప్రశ్న అడిగామనే భావన సభ్యుల్లో కలుగుతుంది. బాగా కష్టమైన ప్రశ్నలు అడగాలనే పట్టుదల వారిలో పెరుగుతుంది. అంతేకాకుండా అభ్య ర్థికి నింపాదిగా వినే, మాట్లాడే అలవాటు లేదనే విషయం తెలుస్తుంది. అందుకే ప్రశ్న అడగిన తర్వాత ఒకటి రెండు క్షణాలు ఆగి బోర్డు సభ్యులందరి వైపు చూస్తూ సమాధానం చెప్పాలి. నేరుగా వారి కళ్లలోకి చూస్తుండాలి. మీరు చెప్పే సమాధానాన్ని వారు ఆసక్తిగా వింటారు. దీనివల్ల మీపై వారికి ఒక సదభిప్రాయం ఏర్పడుతుంది. అంతిమంగా ఇంటర్వ్యూలో మీ విజయావకాశాలు మెరుగవుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement