కొలువు సాధనకు.. మూడు లక్షణాలు
జాబ్ స్కిల్స్
ఆధునిక ప్రపంచంలో పోటీ నానాటికీ పెరిగిపోతోంది. అభ్యర్థులు తమకు ఇష్టమైన కోర్సులో ప్రవేశించాలన్నా, నచ్చిన కొలువులో చేరాలన్నా ఇతరుల నుంచి పోటీని ఎదుర్కోవాల్సిందే. చదువు పూర్తయిన తర్వాత సంతృప్తికరమైన వేతనం లభించే ఉద్యోగంలో చేరాలనేది అందరి కల. అయితే, ఇంటర్వ్యూలో ఇతర అభ్యర్థుల కంటే మిన్నగా రిక్రూటర్‌ను మెప్పిస్తేనే ఉద్యోగం సొంతమవు తుంది. కాబట్టి ఇంటర్వ్యూలో విజయానికి కావాల్సిన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి.
రిక్రూటర్ ఆశించేదేమిటి?
సంస్థ యాజమాన్యం ఎదుట అభ్యర్థి తన సామర్థ్యాలను, ప్రతిభను ప్రదర్శించేందుకు వీలుకల్పించే వేదిక.. ఇంటర్వ్యూ. మౌఖిక పరీక్ష ద్వారా అభ్యర్థి నుంచి రిక్రూటర్ ఏం కోరుకుంటు న్నారో తెలుసుకోవాలి. ఏ ప్రాతిపదికన అభ్యర్థిని అంచనా వేస్తున్నారో గుర్తించాలి. ఎలాంటి లక్షణాలు అభ్యర్థుల్లో ఉండాలని ఆశిస్తున్నారో.. వాటిని పెంపొందించుకుంటే గెలుపు ఖాయం. సాధారణంగా మూడు లక్షణాలను రిక్రూటర్ కోరుకుంటారు. అవి ఇంటెలిజెన్స్, లీడర్‌షిప్, ఇంటిగ్రిటీ.
తెలివితేటలు: అభ్యర్థిలో రిక్రూటర్ ప్రధానంగా ఆశించే లక్షణం.. మంచి తెలివితేటలు. దీంతోపాటు ఉద్యోగానికి అవసరమైన సమయస్ఫూర్తి, సమస్యలను పరిష్కరించే ప్రాక్టికల్ సామర్థ్యం ఉండాలని కోరుకుంటారు. ఈ లక్షణాలు మీలో ఉన్నట్లు ఇంటర్వ్యూలో రిక్రూటర్‌కు తెలియాలంటే.. కొలువుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు సంధించాలి. రిక్రూటర్ చెప్పే సమాధానాలను కుతూహలంతో వినాలి. వారు ఏవైనా సమస్యలను ప్రస్తావిస్తే మీరు వాటికి పరిష్కార మార్గాలను సూచించాలి. సదరు ఉద్యోగంపై మీలో ఆసక్తి ఉన్నట్లు రిక్రూటర్ గుర్తిస్తారు.
నాయకత్వం
లీడర్‌షిప్ అంటే కొత్త బాధ్యతలను స్వీకరిం చేందుకు సర్వసన్నద్ధంగా ఉండడం. ఉద్యోగం లో జవాబుదారీతనంతో వ్యవహరించడం. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడాన్ని, ఊహించని సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడాన్ని, సాకులు చూపకపోవడాన్ని కూడా నాయకత్వ లక్షణంగా భావిస్తారు.
నిజాయతీ
అభ్యర్థులు సంస్థకు విధేయులుగా ఉండడాన్ని, తమ బలాలతోపాటు బలహీనతలనూ ఉన్నవి ఉన్నట్లుగా అంగీకరించడాన్ని నిజాయతీగా చెప్పుకోవచ్చు. కార్యాలయంలో సహచరులను, బృంద సభ్యులను విమర్శించకపోవడం, పాత యాజమాన్యాన్ని తప్పుపట్టకపోవడం వంటి లక్షణాలు అభ్యర్థుల్లో ఉండాలి. అందుకే ఇంటర్వ్యూలో అభ్యర్థి మనస్తత్వాన్ని తెలుసుకునేందుకు ప్రశ్నలు వేస్తుంటారు. పాత యాజమాన్యం గురించి ప్రస్తావిస్తుంటారు. అభ్యర్థులు తగిన సమాధానం ఇవ్వాలి.