విజయాలను వివరించే రెజ్యూమె | Resume will convey to recruiter about victories | Sakshi
Sakshi News home page

విజయాలను వివరించే రెజ్యూమె

Published Thu, Oct 9 2014 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM

Resume will convey to recruiter about victories

ఉద్యోగ సాధనలో రెజ్యూమెదే కీలక పాత్ర. ఇది అభ్యర్థి గురించి రిక్రూటర్‌కు తెలియజేసే సాధనం. రెజ్యూమె ప్రభావవంతంగా ఉంటేనే కొలువు వేటలో విజయం సాధ్యమవుతుంది. రెజ్యూమెలో ఏయే అంశాలుండాలో తెలుసుకోవాలి. అప్పుడే జాబ్ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్న కొత్త అభ్యర్థులు, ఇప్పటికే ఉద్యోగానుభవం ఉన్న అభ్యర్థుల రెజ్యూమెలు వేర్వేరుగా ఉంటాయి. కొత్త అభ్యర్థులు తమ విద్యార్హతలు, నైపుణ్యాలను ప్రస్తావిస్తుంటారు. అనుభవజ్ఞులు మాత్రం తాము ఇప్పటిదాకా ఉద్యోగ జీవితంలో సాధించిన విజయాలను, సంపాదించిన అనుభవాన్ని కూడా తప్పనిసరిగా పేర్కొనాలి.
 
  రిక్రూటర్లు కూడా వీటినే ఎక్కువగా పరిశీలిస్తారు. అయితే, చాలామందికి రెజ్యూమెలో ఈ విషయాలను ఎలా పొందుపర్చాలో తెలియదు. అన్ని అంశాలను ఒక క్రమపద్ధతిలో వివరిస్తే రిక్రూటర్‌కు సులువుగా అర్థమవుతాయి. ఏయే పదాలను ఉపయోగించాలి, ఏయే పదాలను వాడకూడదో తెలుసుకోవడం మంచిది. కొందరు పాత సంస్థలో నిర్వర్తించిన బాధ్యతలనే విజయాలుగా పేర్కొంటారు. ఇది సరైంది కాదు. మీ కృషితో ఉత్పత్తుల అమ్మకాలు పెరిగితే, సంస్థకు లాభాలు వస్తే.. వాటినే విజయాలంటారు.
 
 వాడాల్సిన పదాలు
 నేను ఫలానా పనికి బాధ్యత వహించాను(రెస్సాన్సిబుల్ ఫర్) అంటూ రెజ్యూమెలో వాక్యాలను ప్రారంభించొద్దు. మీరు సాధించిన సక్సెస్‌ను నొక్కి చెప్పే పదాలనే ఉపయోగించాలి. ఇందుకోసం.. ఫార్ములేటెడ్, యాక్సిలరేటెడ్, ఇన్‌స్టిట్యూటెడ్, గవర్న్‌డ్, మ్యాక్సిమైజ్డ్, లీవరేజ్డ్, రికగ్నైజ్డ్, నోటెడ్, ప్రెయిజ్డ్, క్రెడిటెడ్.. ఇలాంటి పదాలతోనే వాక్యాలను ప్రారంభించండి. వీటితో మీరు చెప్పాలనుకున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరేం సాధించారో సులువుగా తెలిసిపోతుంది.
 
 వాడకూడని పదాలు
 రెజ్యూమెలో అతిశయోక్తులకు చోటు కల్పించొద్దు. ఇవి రిక్రూటర్‌కు మీపై తేలికభావం కలిగేలా చేస్తాయి. మీ అవకాశాలను దెబ్బతీస్తాయి. కాబట్టి విజనరీ, ఎఫెక్టివ్, ఇన్నోవేటివ్, డైనమిక్ వంటి పదాలను రెజ్యూమెలో రాయకండి. మీరు నిజంగా డైనమిక్ అయితే ఉదాహరణల ద్వారా ఆ విషయం తెలియజేయండి. అంతేతప్ప పదాన్ని ఉపయోగించకండి.
 
 అంకెలతో ఆధారాలు
 మీరు పాత సంస్థలో ఎంతో సాధించి ఉండొచ్చు. భారీగా లాభాలు ఆర్జించి పెట్టొచ్చు. అదే విషయాన్ని బలంగా వివరించాలి. అంటే అంకెలతో ఆధారాలు చూపాలి. నేను సంస్థలో 20 శాతం అమ్మకాలు పెంచాను. వార్షిక సేల్స్ టార్గెట్‌లో 50 శాతం సాధించాను.. ఇలా రెజ్యూమెలో అంకెలను ఉపయోగిస్తే మీ విజయాలపై రిక్రూటర్‌కు నమ్మకం పెరుగుతుంది.
 
 తిరగేసిన పిరమిడ్ పద్ధతి
 తిరగేసిన(ఇన్వర్టెడ్) పిరమిడ్... దీన్ని ఎక్కువగా రచయితలు ఉపయోగిస్తుంటారు. మీరు కూడా రెజ్యూమె రచనలోఈ నిర్మాణాన్ని చేర్చండి. అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని మొదట విపులంగా తెలియజేయాలి. అంటే ప్రాధాన్యత క్రమంలో పై నుంచి కిందికి క్రమపద్ధతిలో వివరించాలి.ఉత్తమమైన రెజ్యూమె రచనా పద్ధతి ఇదేనని నిపుణులు చెబుతున్నారు. రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించాలంటే తిరగేసిన పిరమిడ్ పద్ధతిని ఉపయోగించాలి. రిక్రూటర్లు రెజ్యూమెను కిందిదాకా పూర్తిగా చదవలేరు. ప్రారంభంలోనే ముఖ్యమైన సమాచారం ఉంటే... మీ గురించి వారికి పూర్తిగా తెలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement