అనుభవం పెంచుకుంటేనే జాబ్ సొంతం
భారత్‌లో గత కొన్నేళ్లుగా ఉద్యోగ నియామకాల విధానంలో ఎన్నో మార్పులొచ్చాయి. జాబ్ మార్కెట్‌లో పోటీ విపరీతంగా పెరిగింది. షార్ట్‌లిస్ట్‌లో ప్రథమ స్థానంలో నిలిచి నచ్చిన కొలువు దక్కించుకోవాలంటే.. తగిన అర్హతలతోపాటు ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉండాలి. ఆధునిక ధోరణులపై అవగాహన పెంచుకోవాలి. నేటి టెక్నాలజీ యుగంలో హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంది? రిక్రూటర్లు ఏయే మార్గాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారో తెలుసుకోవాలి.
అనుభవజ్ఞులే మేలట: ఉద్యోగస్తులకే ఉద్యోగాలు దక్కుతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజమని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఒక కంపెనీలో కొలువులో కొనసాగుతున్న వారినే నియమించుకొనేందుకు ఇతర కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని చెబుతున్నారు. ఎందుకంటే వారి అనుభవం, నైపుణ్యాలు తమకు తక్షణమే ఉపయోగపడతాయని భావిస్తున్నాయి. ఎలాంటి ఉద్యోగానుభవం లేని కొత్త అభ్యర్థుల కంటే ఇలాంటి వారే మేలని అంచనా వేస్తున్నాయి. కొలువు లేకుండా ఆరు నెలలపాటు ఖాళీగా ఉంటే మళ్లీ ఉద్యోగం దక్కడం కష్టమే.
అడల్ట్ ఇంటర్న్‌షిప్స్: ఎంతో అనుభవం, పరిజ్ఞానం ఉన్నప్పటికీ చాలాకాలం ఖాళీగా ఉన్నవారి కంటే అప్పుడే ఒక కొలువు నుంచి బయటికొచ్చినవారికే కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త అభ్యర్థులు నిరాశ చెందాల్సిన పనిలేదు. అనుభవం పెంచుకుంటే కంపెనీల దృష్టిలో పడొచ్చు. జీతభత్యాలు లేకుండా పనిచేసేందుకు కొన్ని సంస్థలు అనుమతిస్తుంటాయి. వాటిలో చేరి పని నేర్చుకోవచ్చు. స్వచ్ఛంద సంస్థల్లోనూ చేరి, అనుభవం, పనితీరును మెరుగుపర్చుకోవచ్చు. ఇంటర్న్‌షిప్స్ కూడా ఉపయోగపడతాయి. నేడు అడల్ట్ ఇంటర్న్‌షిప్‌లు సర్వసాధారణంగా మారాయి. ఇక్కడ నేర్చుకున్న వృత్తిపరమైన పరిజ్ఞానం ఉద్యోగ సాధనకు తోడ్పడుతుంది. ఇలాంటి వాటివల్ల మీ రెజ్యూమెకు బలం పెరుగుతుంది.
సోషల్ మీడియా: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉన్నవారిని కంపెనీలు ఇష్టపడుతున్నాయి. ఇలాంటి వారికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, నెట్‌వర్క్ ఉంటాయని భావిస్తున్నాయి. సమాన అర్హతలున్న ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు సోషల్ మీడియాలో ఎక్కువ క్రియాశీలకంగా ఉన్నారో చూస్తున్నాయి. అతడినే ఉద్యోగంలో చేర్చుకుంటున్నాయి. కాబట్టి మీరు కూడా సామాజిక మాధ్యమాల్లో భాగస్వామ్యాన్ని పెంచుకోండి. అంతేకాకుండా మిమ్మల్ని అనుసరించేవారిని, అభిమానులను, నెట్‌వర్క్, కాంటాక్ట్స్, ఎండార్స్‌మెంట్స్, రికమండేషన్లను కూడా సంస్థలు పరిశీలిస్తున్నాయి. వెబ్‌సైట్లలో మీ పోస్టులకు ఎక్కువ లైక్‌లు, కామెంట్లు వస్తే రిక్రూటర్ల దృష్టిలో మీరు ఒక మెట్టు పైకి ఎదిగినట్లే లెక్క. అందుకే ఫ్యాన్ క్లబ్‌లో ఎక్కువ మందిని చేర్చుకోండి.
ఆధారాలు: గతంలో అభ్యర్థులు తమ గురించి తాము చెప్పుకోవడానికి ఆధారం.. రెజ్యూమె లేదా కరిక్యులమ్ విటే(సీవీ), రిఫరెన్స్‌ల జాబితా. ఇప్పుడు వీటి స్థానంలో మరికొన్ని చేరాయి. వైట్ పేపర్స్, ఆర్టికల్స్, ప్రజంటేషన్లు, బ్లాగ్‌పోస్టుల రూపంలో రిక్రూటర్లకు అభ్యర్థులు తమ అర్హతలు, నైపుణ్యాలు, పనితీరు గురించి తెలియజేయాల్సి ఉంటుంది. ఆయా ప్రూఫ్స్‌ను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ప్రొఫైల్‌తోపాటు జతచేయాలి.