ఇస్తినమ్మ పుస్తకం తెచ్చుకుంటినమ్మ పుస్తకం
మంచి పుస్తకం దొరకగానే పీఠిక నుంచి సమాప్తం వరకూ చదివేస్తాం. ఆపై బుక్ షెల్ఫ్‌లో పదిలంగా దాచేస్తాం. అపురూప సాహిత్యాన్ని చెదలు చదివేస్తున్నా పట్టించుకోం. చదివిందే కదా అని లైట్‌గా తీసుకునే వారు కొందరు. ఇంట్లో చెత్త తయారవుతోందని అమ్మేసి వదిలించుకునే వారు ఇంకొందరు. అయితే.. తమకు అందిన జ్ఞానం పరులకూ అందాలని భావించేవారు ఎక్కడా తారసపడరు. ఫలానా పుస్తకం బాగుందని చెప్పేవారే తప్ప.. దాన్ని ఓసారి చదివిస్తానంటే మాత్రం ఇవ్వడానికి చేతులు రావు. ఇలాంటి వారిలో చైతన్యం కల్పిస్తూ హైదరాబాద్ లిటరరీ ట్రస్టు ‘స్వాప్ యువర్ బుక్’ పేరుతో వినూత్న ప్రయోగానికి తెరతీసింది.
..:: దార్ల వెంకటేశ్వర రావు
టెక్నాలజీతో పరుగులు తీస్తున్న నగరవాసులకు పుస్తకాలు చదివే ఓపిక ఎక్కడుంది? కాసింత టైమ్ దొరికితే సెల్‌ఫోన్‌లో కబుర్లు.. సోషల్ మీడియాలో చాటింగ్‌లతో సరిపెడుతున్నారు. వీటన్నింటికన్నా పుస్తకాలే ప్రియ నేస్తాలన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. వీరి సంగతి అటుంచితే.. ఇక పుస్తకాలు చదవడం హాబీగా ఉన్న వారికి మరో చిక్కుంది. అనుకున్న పుస్తకం దొరక్క నెలల తరబడి వెతుకుతుంటారు. అదే పుస్తకాన్ని పదిసార్లు చదివేసి అటకెక్కించే వారు కొందరుంటారు. వీరిద్దరినీ కలిపితే ఎక్స్‌చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ అవుతుందని భావించారు హైదరాబాద్ లిటరరీ ట్రస్టు నిర్వాహకులు. స్వాప్ యువర్ బుక్ (పుస్తకాల మార్పిడి) పేరుతో ఓ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం సికింద్రాబాద్ అవర్ సేక్రెడ్ స్పేస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది.
విజ్ఞాన మార్పిడి..
ఈ తరం పిల్లలకు పుస్తకాలను చదివే అలవాటు చేయడానికి, రీడింగ్ హాబీ ఉన్నవారికి కొత్త, పాత పుస్తకాలను పరిచయం చేయడానికి ఈ స్వాప్ యువర్ బుక్ కాన్సెప్ట్ డిజైన్ చేశారు. చదివిన పుస్తకాన్ని ఇచ్చేసి.. వారికి నచ్చిన పుస్తకాన్ని తీసుకెళ్లొచ్చు. స్వాప్ యువర్ బుక్ కార్యక్రమానికి పుస్తక ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాము చదివిన పుస్తకాలు మరింత మంది చదవాలనే ఉద్దేశంతో ఎందరో పాత పుస్తకాలను ఇక్కడకు తీసుకొచ్చారు. తాము చదవాలనుకుంటున్న పుస్తకాలను వెతికి మరీ తీసుకెళ్లారు. కొత్తగా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని తర చూ నిర్వహిస్తాం అంటోంది హైదరాబాద్ లిటరరీ ట్రస్ట్. పుస్తకాల మార్పిడితో విజ్ఞానం, సాహిత్యం పంచుకునే అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నారు అక్కడికి వచ్చిన పుస్తక ప్రియులు.
మంచి ఆలోచన
ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని వాలంటీర్‌గా పని చేసేందుకు వచ్చా. కొత్త ఆలోచనతో చేపట్టిన కార్యక్రమం చాలా బాగుంది. కొత్త పుస్తకాలు కొనాలంటే చాలా ధరలున్నాయి. మన దగ్గరున్న పుస్తకం అమ్మేస్తే అందులో పావలా వంతు కూడా రాదు. అందుకే స్వాప్ యువర్ బుక్స్ ద్వారా ఒకరికొకరు పుస్తకాలు మార్పిడి చేసుకోవడం స్వాగతించదగ్గ విషయం.
- కృష్ణ, వాలంటీర్